వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 8

డా. నాగసూరి వేణుగోపాల్ 

మిత్రా అనగానే మనకు రేడియో ఫిజిక్సుకు ఆద్యుడయిన శిశిర్ కుమార్ మిత్రా (ఎస్.కె. మిత్రా) గుర్తుకు రావచ్చు. ఈ మిత్రా గారి శిష్యుడే మరో మిత్రా ఉన్నారు. ఆయనే ఏ.పి. మిత్రా, ఇరువురూ రేడియో ఫిజిక్స్ లోనే గొప్ప కృషి చేశారు. మిత్రుడంటే సూర్యుడనే అర్ధం కూడా వుంది. ఏ కారణమో ఏమో గానీ వీరిద్దరూ ఉపరితలాల వాతావరణం సంబంధించి గొప్ప ప్రయోగాలు చేశారు,‌ మంచి ఫలితాలు సాధించారు. ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లాబరేటరీ డైరెక్టర్ గా అలాగే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా వారు చేసిన పరిశోధన కృషి తక్కువ కాదు.

1970-80 కాలంలో ఏ.పి. మిత్రా పర్యావరణం, ఓజోను తగ్గిపోవడం, వాతావరణం వేడెక్కడం, గ్రీన్ హౌస్ వాయువుల, నగరాలు విపరీతంగా పెరగడం, అంతకుమించి మానవ ప్రమేయంతో కలిగే పర్యావరణ మార్పులు, ఈ పర్యావరణ మార్పుల ఫలితంగా ఈ జీవప్రపంచంలో వచ్చే పరిణామాల గురించీ మిత్రా ఎంతో పరిశోధన చేశారు. ఇలా ఒకవైపు పరిశోధనా, మరోవైపు పరిపాలనా రంగంలో మిత్రా చేసిన కృషి అమోఘమైంది.

అశేష్ ప్రాసాద్ (Ashesh Prosad) మిత్రా 1927 ఫిబ్రవరి 21న కలకత్తాలో జన్మించారు. తండ్రి అంబికా చరణ్ మిత్రా ఉపాధ్యాయుడు. తల్లి సువర్ణ ప్రభమిత్రా. అశేష్ ఈ దంపతులకు ఎనిమిదో సంతానం. ఆయనను గోపాల్ అని ముద్దుగా పిలిచేవారు. అమోఘమైన ప్రతిభగల అశేష్ చదువులో గొప్పగా రాణించారు. అప్పట్లో కలకత్తా లో బోర్డు మెట్రిక్యులేషన్ పరీక్షల్లో సరాసరి 80 శాతం మార్కులు రావడమే కాక, బెంగాలీ భాషలో 92 శాతం సాధించారు. నిజానికి అశేష్ మిత్రాకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. తొలిదశలో ఆయన బెంగాలీలో కవితలు అల్లడం విశేషం. 

తర్వాత బంగబాసి కళాశాలలోను, కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలోను ఆయన చదువు సాగింది. 1946లో బి.ఎస్సి. (ఆనర్స్) పూర్తి అయ్యాక ఉన్నత విద్య కోసం కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాధ్ సాహా, శిశిర్ కుమార్ మిత్రా వంటి వారు అధ్యాపకులు, శిశిర్ కుమార్ మిత్రా రాసిన ‘అప్పర్ అట్మాస్పియర్’ (Upper Atmosphere) పుస్తకం చిన్న మిత్రాను ఎంతగానో ఆకర్షించింది. నిజానికి ఈ పుస్తక రచనలో శిశిర్ కుమార్ మిత్రాకు సహాయకుడిగా తోడ్పడ్డారు. అందులో రెండు అధ్యాయాలు రాశారు కూడా! ఈ పుస్తకం అతనిని ఆ దిశలో పురిగొల్పింది.

కేవలం ఒక సంవత్సరంలో డి-ఫిల్ పట్టా పొందడం అత్యంత గణనీయమైన అంశం. సరిగ్గా అదే సమయంలో శిశిర్ కుమార్ మిత్రా ‘ఇన్స్టిట్యూట్ అఫ్ రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్’ (IRPE) అనే శాఖను ప్రారంభించారు. ఈ శాఖ రాకముందే శిశిర్ కుమార్ మిత్రాకు అశేష్ మిత్రా సహాయకుడుగా ఉన్నారు. కనుక, సహజంగా ఈ విభాగంలో చేరిపోయాడు. 1951లో కొలంబో ప్రణాళిక క్రింద ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో రేడియో ఆస్ట్రానమిలో పని చేశారు.

అక్కడ ఆయన రూపొందించిన కాస్మిక్ రేడియో నాయిస్ టెక్నిక్ తర్వాత Riometer గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయనోస్ఫియర్ (Ionosphere) ఊర్ధ్వ భాగాల్లో పెల్లుబికే ప్రోటాన్ల ఆచూకీని ఈ టెక్నిక్ పసిగట్టగలదు. ఈ పరిశోధనలు ఎంతో మందిని ఆకర్షించాయి. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అశేష్ మిత్రాను ఆహ్వానించింది. అక్కడే ‘అయనోస్ఫీయరిక్ కెమిస్ట్రీ’ అనే భావనను ఏ.పి. మిత్రా ప్రతిపాదించడమేకాక, దాని ఫలితాలను వివరించారు.

ఏ.పి. మిత్రా పరిశోధనను గమనించిన కె.ఎస్. కృష్ణన్ మహాశయుడు ఏ.పి. మిత్రాను నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో చేరమని ఆహ్వానిస్తే చేరారు. రేడియో రీసర్చి కమిటీలో సెక్రెటరీగా చేరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో ఆలిండియా, ఓవర్సీస్ కమ్యూనికేషన్ సర్వీస్, రక్షణశాఖ వంటి విభాగాలు రేడియో కమ్యూనికేషన్ గురించి ఇంగ్లాండు, ఆస్ట్రేలియా దేశాల పరిశోధనల మీద ఆధారపడి వుండేవి. ఈ రంగంలో మిత్రా చేసిన కృషి చాలా ప్రశంసనీయం. అలాగే అయనోస్ఫియర్ మీద సౌర ప్రభావం గురించి అధ్యయనం చేశారు. ఫలితంగా అయనోస్ఫియర్ అడుగు పొరల గురించి మరింత అవగాహన పెరిగింది. ఈ ఫలితాలకు మంచి గుర్తింపు వచ్చింది.

మిత్రా ప్రతిపాదించిన అయనోస్ఫియరిక్ లెక్కింపు విధానం తర్వాత HF (హైఫ్రీక్వెన్సీ), MF (మీడియం ఫ్రీక్వెన్సీ) గణింపులకు దోహదపడింది. ట్రాటోస్ఫియర్ సంబంధించి ఒక విభాగం ప్రారంభించాడు. అలాగే ఇంటర్నేషనల్ రేడియో అండ్ జియోఫిజికల్ వార్నింగ్ సెంటర్ ను ప్రారంభించారు. భారతదేశం ఇంకా మధ్య,‌తూర్పు ఆగ్నేయాసియా దేశాల కోసం ఈ ప్రయత్నం జరిగింది. దెబ్బయ్యవ దశకంలో SODAR (Sonic Detecting And Ranging) ప్రవేశపెట్టారు. ఇలా మెరుగైన సామర్థ్యంతో SROSS-C, SROSS-C2 ఉపగ్రహాలు ప్రయోగించ బడ్డాయి. అతని నేతృత్వంలోనే ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చి ఇన్స్టిట్యూట్లో FACE ఏర్పడింది. FACE అంటే ఫ్రీ ఎయిర్ కార్బన్ డై ఆక్సైడ్ ఎన్రిచ్మెంట్. ఇది ఆగ్రేయాసియా దేశాలలోనే మొదటిది. అంతేకాదు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దగ్గర ఉన్న గాదంకిలో ‘ఇండియన్ ఎమ్. ఎస్. టి. రాడార్’ రావడానికి మిత్రా కృషి చాలానే ఉంది. అలాగే అంటార్కిటికా పరిశోధనలు అంత విజయవంతం కావడానికి కూడా ఆయన తోడ్పాటు చాలా ఉంది. 

మనదేశపు వరి పంట కారణంగా వాతావరణంలోకి మిథేన్ వాయువు ఎక్కువ విడుదలవుతోందనీ అమెరికా ప్రచారాన్ని మిత్రా తన ప్రయోగాల ఫలితాలతో త్రిప్పికొట్టారు. నిజానికి వారు ప్రచారం చేసిన దానిలో పదోవంతు మాత్రమే అని మిత్రా ఋజువు చేశారు. ఇలా డా. ఏ.పి. మిత్రా పలురంగాలలో కృషి చేశారు. పరిశోధనతో పాటు శాస్త్రపరమైన పరిపాలనా అంశాలలో కూడా గొప్పగా విజయం సాధించారు. ఆయన నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ డైరెక్టర్ గా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చి (CSIR) డైరెక్టర్ జనరల్ గా ఆయన కలకాలం గుర్తుండిపోతారు.

ఆయన పరిశోధనా పత్రాలతో పాటు, ఆయన రాసిన Ionospheric Effects Of Solar Flares, Advances In Space Exploration, Human Influences In Atmospheric Environment వంటి పుస్తకాలు కూడా ప్రసిద్ధం. అయనకు పద్మభూషణ్ తో సహా చాలా అవార్డులు వచ్చాయి. మంచి హృదయం గల మిత్రా ఎంత పని అయినా ఇట్టే స్వీకరించేవారు. 80 ఏళ్ల వయసులో 2007 సెప్టెంబరు 3న మరణించిన అశేష్ ప్రసాద్ మిత్రా చిరకాలం గుర్తుండిపోయే శాస్త్రవేత్త. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకోవాలంటే 1956 ఆగస్టు 12న సునందతో వివాహమైంది, ఇద్దరు కుమార్తెలు. చివరిగా చెప్పుకోవాలంటే మన దేశ పర్యావరణ విధానాన్ని, వాతావరణ అధ్యయనం తీరుని ఆయన ప్రభావితం చేస్తూనే ఉంటారు. అలాగే దేశవాళీ పరిశోధన ముందుకెళ్లాలనీ, మౌలిక శాస్త్రాల పరిశోధన అనేది సామాజిక అవసరాలతో ముడిపడాలనీ, అలాగే క్లైమేట్ చేంజ్ (Climate change)వంటి ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కొనే గుండెదిటువును భారతీయ శాస్త్రవేత్తలకు కలిగించడంలోనూ ఆయన నిరంతర స్ఫూర్తిగా కొనసాగుతారు.

డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు, మొబైల్: 9440732392

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *