డాక్టర్. డి బాలసుబ్రమణియన్,  మాజీ డైరక్టరు, సిసియంబి

“రాగం రానివాడు, రోగం లేని వాడు లేడు” అనేది సామెత. రోగం సరే జీవపదార్థం అంటూ ఒకటి వున్నంతకాలం “నేను వున్నాను” అంటూ వెంటపడుతూనే వుంటుంది. మరి రాగమో? ఇది ఎప్పటినుండి మనిషితో మమైకమైనట్టు?

సైన్సు లేని చోటు లేదు!

సంగీతాలు, సరాగాలు సాంస్కృతికాంశాలు. శాస్త్రానికీ వీటికీ సంబంధం ఏమిటి?  అని సవాలు చేస్తారేమో మీరు.  శాస్త్రం (సైన్సు) వేలు పెట్టని చోటంటూ వుండదు. సైన్సు లేకుంటే ఇన్ని సంగీత సాధనాలెక్కడివి?  క్యాసెట్లు, మైక్ సెట్లు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్లు ఒకటేమిటి? సైన్సు చంకనెక్కే గదా సంగీతం స్వైర విహార ధీరగా ఇన్ని వయ్యారాలు పోతోంది! అదలా వుంచండి.

ఈ మధ్య పాత రాతి యుగావశేషాలు కుప్పలు తెప్పలుగా దొరికే ఎల్లో రివర్ లోయలోని జైహూలో(చైనా) కొన్ని ఎముకల అవశేషాలు శాస్త్రజ్ఞులకు చిక్కాయి. ఈ లోయ నీ, షా (ఈ పేరులోనే సంగీతం తొణికిసలాడుతోంది కదూ)  నదుల ఒడ్డున ఉంది. ఉల్లిపాయ పొరలు వొలిచినట్టు పురాతత్వ శాస్త్రజ్ఞులు ఇక్కడ ఒక్కోపొర తవ్వేకొద్దీ పరికరాలు, ఆయుధాలు, కుండలు, జంతువుల మొక్కల గింజల అవశేషాలు కుప్పలు తెప్పలుగా దొరికాయి రేడియో కార్బన్ పరీక్షల్లో ఇవి అక్షరాలా సా.శ పూర్వం 9000- 7700 సంవత్సరాల నాటివని తేలింది. అంటే ఈజిప్టు మోసపోటోమియా  నాగరికతల కంటే రెండు రెట్లు ప్రాచీనమైనవన్న మాట.

పిల్లనగోవుల అవశేషాలు

ఈ అవశేషాలన్నిటిలోనూ అద్భుతమైనవేమంటే ఆరు చెక్కుచెదరని పిల్లనగోవులు. ఒంటె ఎముకతో చేసిన ఈ పిల్లనగోవులకు ఏడురంధ్రాలు వున్నాయి. ఏడో రంద్రానికి దగ్గరగా, తోడుగా మరో చిన్న రంధ్రం వుంది .దీన్ని నిలువునా నోట్లో పెట్టుకొని రంధ్రాలపై వేళ్ళు ఆడిస్తూ పాడేవారని (అచ్చం మన సన్నాయి లానే) శాస్త్రజ్ఞులు గుర్తించడమే కాదు వాటిలో ఒక దానితో ఒక చైనా ప్రాచీన జానపద గేయాన్ని ఆలపించారు కూడా! ఈ పాట ఇంటర్నెట్లో ఇటు శాస్త్రజ్ఞులకూ, అటు సంగీతాభిమానులకూ వొళ్ళు పులకరింపజేసింది.

ఈ పిల్లనగోవుల ఏడు రంద్రాల నుంచి ఏడు ధ్వనుల్ని (స్వరాల్ని) ఆలకించవచ్చు. ఎనిమిదవ రంధ్రం ఉచ్చై స్వరాన్ని సరిచేసుకునేందుకు ఉద్దేశించింది. శాస్త్రజ్ఞులు ఆలపించిన ఆ గేయం మన హార్మోనియం లోని బ్లాక్-2 కంటే హై పిచ్ లో వుంది. మన “రాగదుర్గ”, “శుద్ధ సావేరి” రాగాలకు సరిపోలుతోంది. అంటే జైహూ మానవులకు తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వమే సప్త స్వరాలు తెలుసన్నమాట!

ఇక మన సంప్రదాయ సంగీతానికీ వీటికి పోలిక వుండటం ఆశ్చర్యకరం! మన సన్నాయికి ఈ పిల్లనగోవులే మాతృకలనిపించడం మరీ ఆశ్చర్యకరం!

సుమేరియా  (సా.శ పూర్వం 3000 ), సింధు (సా.శ. పూర్వం 3000- 1750 ) నాగరికతలకు సైతం ఇదే రాగాలు, స్వరాలు సంక్రమించి వుండొచ్చు. ఆదిమ మానవజాతి ఎముకల అవశిష్టాల ఆధారంగా జరుగుతున్న పరిశోధన మరింత ముందుకు సాగినప్పుడు ఈ సాంస్కృతిక వారసత్వం ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఎలా పయనించిందో మరింత స్పష్టంగా తెలుస్తుంది. జైహూ మానవుల ఎముకలతో పోల్చి డావెంకో నాగరికతా (సా.శ పూర్వం 4300- 2600)  శల్యావశేషాలను పరిశీలించినప్పుడు జై హూలు, డావెంకోకు తరలి వచ్చారని తేలింది.

మరి సా.శ పూర్వం 9000 సంవత్సరాల సంగీత సాధనాలలో సైన్సు సరిపెట్టుకోవడం లేదు.  డి.యన్.ఏ  పరిశీలన ఆధారంగా మానవజాతి ఆఫ్రికా బయటనుంచి భూమిని అంతా పాకిందని రుజువు చేస్తున్న శాస్త్రజ్ఞులు ఈ సంగీత మూలాలను కూడా వెతుకుతున్నారు (పాపం సంగీతానికి డీఎన్ఏ లేదే!). 1995 జూలైలో డాక్టర్ ఐవన్ టర్క్ అనే శాస్త్రజ్ఞుడికి దొరికిన ఓ ఎముక ముక్క ఈ క్రమంలో ఓ పెద్ద సంచలనంగా చెప్పవచ్చు.

సంగీతం మానవ సహజాతమా?

 ఈ ఎముక వయస్సు 43 వేల సంవత్సరాలు! దీన్ని ఆయన స్లోవేనియాలోని నియాండర్తల్ మానవుల క్యాంపులో సంపాదించాడు. దీనికి నాలుగు రంధ్రాలు వున్నాయి. రెండు రంధ్రాలు ఎముక చివర విరిగిపోయి సగం కనిపిస్తుండగా మిగిలిన రెండూ మధ్య వున్నాయి. ఇది విరిగిపోయిన పిల్లనుగోవి ముక్క అని శాస్త్రజ్ఞుల విశ్వాసం. ఇందులో 2-3  రంధ్రాల మధ్య దూరం 3 -4 రంధ్రాల మధ్య దూరం కంటే సరిగ్గా రెండింతలు ఎక్కువగా వుంది. ఈ ఎముక కూడా సంగీత సాధనమే అనేందుకు ఇదో రుజువు. అంటే మనం హోమో సెపియన్లం భూమి మీద పుట్టకముందే నియాండర్తల్ మానవుడు సంగీత సాధన చేశాడన్నమాట! మనకు తెలిసినంతవరకు ఈ నియాండర్తల్ మానవుడి స్వరపేటిక అభివృద్ధి చెందింది కాదు. స్పష్టమైన ధ్వనులు, మాటలుపలికేందుకు అనువైంది కాదు. ఇక పాడడం ఎక్కడ?

అంటే స్వరం పెగలకున్నా నియండల్తల్ మానవులకు సంగీత తృష్ణ వుండేదా? దాన్ని ఇలాంటి పరికరాలతో ధ్వనులు పుట్టించి తీర్చుకునేవాడా? సంగీతం మానవ సహజాతమా? సహజాతమే కాదు దాని ప్రాథమిక లక్షణాలు విశ్వజనీనాలు కూడానా?  

(ది హిందూ, ‘స్పీకింగ్ సైన్సు’ నుంచి, అనువాదం: విబియస్) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *