సంపాదకీయం

అబద్ధాలు మూడు రకాలంటారు పండితులు!
ఒకటి అలవోకగా చెప్పేవి !
రెండు ఆచి తూచి చెప్పేవి!!
మూడు అంకెలతో చెప్పేవి !!!

ఇంగ్లీషులో “ఫాక్ట్స్అండ్ ఫిగర్స్” అంటారు గాని దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే “అబద్ధాలు అంకెలు” అనాలి. “సత్యమేవ జయతే” అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మన చట్టసభల్లో “అబద్ధం” అనడం దాదాపు నిషేధం. పొరపాటున ఏ సభ్యుడైనా అంటే అర్జెంటుగా సభాపతి దాన్ని “సత్య దూరం” అని సరిదిద్దుకోమంటాడు. బహుశా భవిష్యత్ నాయకుల్ని, ప్రభుత్వాలను, చట్ట సభల్ని దృష్టిలో వుంచుకొనే కాబోలు నన్నయ శకుంతల చేత “నూరు కొడుకుల కన్నా ఒక సత్య వాక్యం గొప్పద” ని నిండు సభలో దుష్యంతుడికి సుద్దులు చెప్పిస్తాడు.

ఇలా ఎంత చెప్పుకున్నా ఏం లాభం ఆధునిక అబద్ధం మాత్రం అంకెల్ని ఆయుధాలుగా మార్చుకొని, సామాజిక మాధ్యమాల స్వారి గుర్రాలెక్కి వీరవిహారం చేస్తూనే వుంది. పండితుల చేతిలో పడ్డ గణాంకాలు కోరిన రూపంలోకి మారి సత్యాలను సమాధి చేస్తూనే వున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు. ప్రభుత్వాలది ఒక ఎత్తు. అంకెల గారడీ కోసమే దాని యంత్రాంగమంతా అహోరాత్రాలు శ్రమిస్తూ వుంటుంది. ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తూనే వుంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అవే గణాంకాలు రూపాంతరం చెందుతాయి. ఎదురు దాడికి శాస్త్రాస్త్రాలుగా మారుతాయి.

సున్న, స్థాన విలువ లాంటి అసాధారణ గణితావిష్కరణలు చేసిన భారతదేశంలో ఆమాత్రం గణాంక మాయాజాల కళా వైదుష్యం వుండదా అని సరిపెట్టుకుంటే (గర్వపడితేనో!) అది వేరే సంగతి. దీనివల్ల సత్యం ఎంత సమాధి అవుతోందనుకుంటే మాత్రం గుండె గుభిల్లుమంటుంది.

ఈ అబద్ధాలకు అంకెలకు మన దేశంలో వున్న గాఢాతిగాడ స్నేహబంధాన్ని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక కరోనా మరణాల లెక్కలతో మన కళ్ళ ముందుంచింది. దీని ప్రకారం గుజరాత్ ప్రభుత్వం 2021లో కేవలం 5812 కరోనా మరణాలు జరిగాయని పేర్కొంటే నిజంగా జరిగినవి దీనికి 44 రెట్లు ఎక్కువ! అంటే రెండు లక్షలు. ఇలా చూస్తే అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అబద్ధాల్లో మాత్రం గుజరాత్ ను మించిన రాష్ట్రం దేశంలోనే లేదు.

ఉత్తరప్రదేశ్ కేవలం 14,551 మరణాల్ని లెక్కల్లో చూపిస్తే నిజానికి దీనికి 19.5 రెట్ల మరణాలు జరిగాయి. అంటే 2.6 లక్షల మరణాల్ని ఈ రాష్ట్రం మాయం చేసేసింది! మధ్యప్రదేశ్ లో కూడా లెక్కల్లోకి వచ్చిన మరణాలకు వాస్తవ మరణాలకు తేడా దాదాపు 20 రెట్లు వుంది. ఇక తెలంగాణలో 18 రెట్లు బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో 13 రెట్లు ప్రకటించిన మరణాల కంటే ఎక్కువ మరణాలు జరిగాయి. తమిళనాడు కూడా తక్కువేం తినలేదు. రెండు లక్షల మరణాలు తక్కువ చేసి చూపించింది. కేరళ, కర్ణాటకల్లో మాత్రం ఈ తప్పుడు లెక్కలు బాగా తక్కువగా ఉండడం విశేషం.

అన్నీ కలిపి చూస్తే మన కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన కరోనా మరణాలు 3.30లక్షలు. కానీ వాస్తవంగా జరిగినవి 25.5 లక్షలు. అంటే 6.5 రెట్లు ఎక్కువ !

ఇంత నిగ్గు తేల్చడానికి ఆ ఆంగ్ల పత్రిక మొదట కరోనా పూర్వపు 2015- 2019 కాలంలో జరిగిన మరణాల వివరాలు సేకరించింది. వీటి ఆధారంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎన్ని సాధారణ మరణాలు జరిగే అవకాశం వుందో లెక్కించింది. రిజిస్టర్ జనరల్, జనాభా కమిషనర్ కార్యాలయాలు ఈ రెండు సంవత్సరాల్లో ప్రకటించిన మరణాలకు వీటికి మధ్య ఎంత తేడా వుందో లెక్క తీసి కరోనా మరణాల అసలు సంఖ్యను కూపీ లాగింది. ఇక దీనికి ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన మరణాలకీ తేడా ఎంతో రాష్ట్రల వారీ లెక్క గట్టి వాస్తవాలను బయటపెట్టింది. ఇప్పుడు ఊహించండి అంకెలు ఎంతెంత అబద్ధాలు చెప్పగలవో, ఇలాంటి అబద్ధాల్ని ప్రభుత్వాలే ఎలా వండి విరుస్తున్నాయో, “సత్యమేవ జయతే” నినాదం సత్యంగా మారాలంటే ఎంతకాలమూ, ఎంత శ్రమా, ఎంత నిష్టా అవసరం అవుతాయో!

3 thoughts on “అంకెలూ – అబద్ధాలూ!

  1. అంకెల గారడీ మన ప్రభుత్వాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు ఏమో

Leave a Reply to BATCHU VENKATA NAGESWARA RAO Cancel reply

Your email address will not be published. Required fields are marked *