డా. నాగసూరి వేణుగోపాల్

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-13

1981లో నైరోబీ నగరంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా, కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసుకుని సమావేశమందిరంలోకి ప్రవేశించడం ఎందరినో ఆకర్షించింది! అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్​లాల్ బహుగుణ ప్రయత్నం!!

1927 జనవరి 9న టెహ్రి (ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రపు జిల్లా) ప్రాంతం మరోడ గ్రామంలో సుందర్​లాల్ బహుగుణ జన్మించారు. నిజానికి వారి పూర్వీకులు బెంగాలీ బందోపాధ్యాయ తెగవారు. పొట్టకూటి కోసం వారు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి (గర్వాల్) వచ్చారు. అక్కడ వారి ఆయుర్వేద పరిజ్ఞానంతో రాజు ఆనారోగ్యాన్ని నయం చేశారు. దానికారాజు సంతోషపడి ‘బహుగుణ’ ప్రాంతాన్ని వారికి దానంగా ఇచ్చారు. ఆ కుటుంబం అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని క్రమంగా ఇంటిపేరు మారిపోయేంతగా కలసిపోయారు. అంటే చెట్లు, ఆకులు, మూలికలు విలువ తెలిసిన కుటుంబం నుంచి వచ్చినవాడు సుందర్ లాల్. 

ఇక ఆ టెహ్రీ ప్రాంతం అంటారా? లాభం కోసం అడవులను నరికిన చరిత్ర ఆ సంస్థానాధీశులది. 1930ల్లో ఇలాంటి ఘటనల్లో 17 మంది చంపబడ్డారు, 80 మంది జైలు పాలయ్యారు. ఈ సంఘటనలో సుందర్​లాల్ పాల్గొనకపోయినా, ఆయనకు ఆ ప్రాంతపు చరిత్ర బాగా తెలుసు. ఎందుకంటే 13 సంవత్సరాల వయసు నుంచే రాజకీయంగా చురుకుగా ఉన్నారు. గాంధీజీ శిష్యుడు శ్రీదేవ్ సుమన్ ఇతనికి మార్గదర్శి. స్వాతంత్ర్యోద్యమం, సర్వోదయోద్యమం మాత్రమే కాక; మీరాబెన్ పర్యావరణ కార్యక్రమాలు సుందర్​లాల్ కు స్ఫూర్తి. సుందర్​లాల్ భార్య విమలాబెన్ సరళాబెన్ శిష్యురాలు. మీరాబెన్, సరళాబెన్ ఇద్దరూ గాంధీజీ స్ఫూర్తితో మనదేశం వచ్చి, ఉద్యమంలో గొప్పగా పాల్గొన్న మహిళామణులు. ఇటువంటి వాతావరణంలో సుందర్​లాల్ సమగ్రమైన పర్యావరణ దృష్టితో కృషి చేసి ఫలితాలు పొందారు. 

ఒక్క పర్యావరణ విషయమే కాదు దళితులు ముఖ్యంగా దళిత స్త్రీలకోసం పోరాడి 1950 దశకంలో బుదకేదార్ దేవాలయంలో (టెహ్రీ ప్రాంతంలో తొలిసారి) హరిజన ప్రవేశం సాధించిన ఘనత సుందర్​లాల్ ది. పర్వత ప్రాంతాల మద్యపాన సమస్య గురించి, మూఢనమ్మకాల నిర్మూలన గురించి కూడా కృషి చేశారు. 

స్త్రీలకూ, ప్రకృతికీ చాలా అవ్యాజానుబంధం ఉంది. స్త్రీలోకం సాయంతో విజయాలు సాధించవచ్చునని, భావించడమే కాదు ఫలితాలు సాధించిన సమన్వయపు జంట సుందర్​లాల్ దంపతులు. 1974 మార్చి 26న అనుకోకుండా గౌరదేవి తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి దారి చూపింది. అలకానంద నది పై భాగాన ఉన్న 2500 చెట్లను అక్కడి రాష్ట్రప్రభుత్వం వేలం వేసింది. ఆ చెట్లు కొట్టుకోవడానికి కాంట్రాక్టర్లు రైని (Raini) గ్రామానికి వచ్చారు.

దీనిని చూసిన గౌరదేవి మిగతా గ్రామస్తులకు చెప్పింది. అలా ముగ్గురు మహిళలు – గౌరదేవి, సుదేశదేవి, బిచ్నిదేవి ఒక రాత్రి అంతా చెట్లను కౌగలించు (చిప్కో) కొని రక్షించడంతో మిగతావారు మరుసటి రోజు నుంచి చెట్లను కావులించుకోవడం ప్రారంభించారు. ఇలా మొదలైంది ‘చిప్కో ఉద్యమం’. ఈ విషయం తెలుసుకున్న విమలాబెన్ భర్తకు చెప్పి, ఈ ఉద్యమంలోకి ప్రవేశించింది. అలా సుందర్​లాల్ బహుగుణ ఈ చిప్కో ఉద్యమం కొనసాగడానికి, ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి దోహదపడ్డారు. దీనికోసం టెహ్రీ ప్రాంతంలో పాదయాత్ర చేసి యువకులను, మహిళలను ఈ ఉద్యమంలోకి భాగస్వాములను చేశారు. 

ఈ చిప్కో ఉద్యమానికి స్ఫూర్తి అయిన ఒక చారిత్రక దృష్టాంతం గురించి చెప్పుకోవాలి. రాజస్థాన్ ప్రాంతం మార్వార్ లోని ఖజారిలో 1700 ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతపు సంస్థానాధీశుడు చెట్లు కొట్టమని ఆదేశాలిచ్చాడు. పచ్చని చెట్లు నేలకొరగడం, పూల వనాలు నాశనం కావడం సహించలేక అమృతాదేవి అనే మహిళ చెట్టును కావలించుకుని, రాజ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆమెతో మరింతమంది తోడయ్యారు. అలా 360 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని ‘బిష్ణోయ్ సంప్రదాయం’ అంటారు. ఈ సాంప్రదాయం 1485లో మొదలైంది. ఒకసారి ఇంతమంది మరణించడం తెలిసి నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. అది రక్షిత ప్రాంతమైంది. 

పూర్తిగా స్థానిక అవసరాల రీత్యా, స్థానిక దృష్టితో చిప్కో ఉద్యమం రూపుదాల్చింది. కనుక ఈ ఉద్యమాన్ని పూర్తి స్వదేశీగా పరిగణిస్తారు. ఎమర్జెన్సీ రావడంతో చిప్కో ఉద్యమం కూడా మందగించింది. అయితే 1978లో పోలీసులు చిప్కో ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై చేసిన దురాగతాలు మళ్ళీ దృష్టినాకర్షించాయి. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హెచ్.ఎన్.బహగుణ ఈ విషయం మీద కమిటీ వేశారు. ఈ సందర్భంలో 4,800 కిలోమీటర్ల పాదయాత్రను సుందర్​లాల్ చేశారు. చివరలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఒక 15 సంవత్సరాలు చెట్లు కొట్టకుండానే నిషేధం విధించేలా చేశారు. 

అప్పటికి ప్రపంచ స్థాయి చిప్కో ఉద్యమంగా జర్మనీ, అమెరికా, ఇంగ్లాండు, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలకు స్ఫూర్తిగా మారుతోంది. ఎంతోమంది విదేశీయులు ఈ ఉద్యమం గురించి ఇండియా రావడం పెరిగింది. రిచర్డ్ సెయింట్ బెర్బ్ బేకర్ (Richard St. Berb Beker) రాసిన విషయాలు 108 దేశాలకు వెళ్ళాయని అంచనా. చిప్కో ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా అధ్యయన అంశంగా మారింది. 

నేటికీ ఇలాంటి ఉద్యమాలు అవసరమనే వాదం బలంగా ఉంది. ఇలాంటి ఉద్యమం కర్ణాటకలోని ఉత్తర కన్నడ, షిమోగా జిల్లాల్లో తర్వాత జరిగింది. 1978లో కేరళలో సైలెంట్ వ్యాలీలో జరిగిన ఉద్యమం విజయం సాధించింది. సహజమైన చెట్లు నరికి టేకు మొక్కలు పెట్టాలనే ప్రయత్నం బీహార్ లో పెద్ద ఎత్తున మొదలైనపుడు 1981లో జరిగిన జంగల్ బచావ్ ఉద్యమం కూడా ముఖ్యమైందే. 1985లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ముంపుకు వ్యతిరేకంగా జరిగిన నర్మదా బచావ్ ఆందోళన కూడా కీలకమైందే. సుగతా కుమారి, బాబా ఆమ్టే, మేథా పాట్కర్ వంటి ఎంతోమందికి చిప్కో ఉద్యమం స్ఫూర్తి. 

టెహ్రీ డ్యామ్ నిర్మాణ విషయంలో కూడా సుందర్​లాల్ బహుగుణ చేసిన పోరాటం పెద్దదే! 1978లో స్వాతంత్ర్య సమరయోధులు వి.డి. సక్లాని (Saklani) నేతృత్వంలో మొదలైన ఈ ఉద్యమం 1989లో వారు అనారోగ్యం పాలు కావడంతో బహుగుణ నాయకత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా 74 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు. పివినరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, తర్వాత దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మరోరెండుసార్లు నిరాహారదీక్ష చేశారు. అయినా డ్యామ్ ఆగలేదు. చివరికి 2004 జూలై 31న బహుగుణ ఉన్న (పూర్వీకుల) ఇల్లుతోపాటు టెహ్రీ పట్టణం మునిగిపోతే ఆయన డెహ్రాడూన్ లో కూతురు ఇంటికి వచ్చేశారు. 

సుందర్​లాల్ బహుగుణ 2021 మే 21న రిషీకేశ్ లోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. వీరి గురించి బోలెడు విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన సాధించిన చరిత్ర చాలా విలువైంది! 94 ఏళ్ల పండు వయసులో కనుమూసిన సుందర్​లాల్ బహుగుణ నిత్యపోరాటయోధుడు. అయితే ఆ పోరాటానికి స్ఫూర్తి గాంధీజీ సత్యాగ్రహం, అది అహింసామార్గంలోనే సాగింది. తర్వాత మన దేశంలో పర్యావరణ ఉద్యమాల భాగస్వాములకు వేర్వేరు రాజకీయాభిప్రాయాలున్నా పోరాట విధానం మాత్రం శాంతియుతమే. సుందర్​లాల్ బహుగుణ ఘన విజయం వెనుక మహిళల పాత్ర విశేషమైంది. టెహ్రీ సంస్థానాధీశులకి వ్యతిరేకంగా కూడా పోరాడిన బహుగుణ భార్య విమల కోరికపై 1956లో రాజకీయాలు త్యజించి పూర్తిగా సామాజిక కార్యక్రమాలలో దిగిపోయారు. మృదువుగా, చిన్న గొంతుకతో మట్లాడిన స్థిరచిత్తుడాయన. ఆయన కాశ్మీరు నుంచి కోహిమా వరకు పాదయాత్ర చేసినపుడు దాదాపు 30 కిలోల బరువు మోసుకుని తిరగడం వారి శారీరక ఆరోగ్యాన్ని చెబుతుంది. 

ఏ ప్రాంతపు అడవులు, నదులు, పర్వతాలు ఆ ప్రాంతం వారివే. వాటిని చంపే హక్కు ఎవరికీ లేదు. వాటిని మనం నాశనం కాకుండా చూసుకుంటే మన సంక్షేమాన్ని అవి చూసుకుంటాయి. అందుకే సుందర్​లాల్ బహుగుణ ‘ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ’ (నాశనం కాని జీవావరణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని పదే పదే చెప్పేవారు! మరి మనకు వినేస్థాయి వివేకం ఉందా?

డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మొబైల్: 9440732392

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *