వి. రాహుల్జీ

నూతన సంవత్సర శుభాకాంక్షలు! కొత్త సంవత్సరం వచ్చింది. సంవత్సరంలో ఏది మారినా మారకపోయినా క్యాలెండర్ మారుతుంది. కొత్త క్యాలెండర్ వస్తుంది. ఇప్పుడు మనం అందరం వాడుతున్న క్యాలెండర్  గ్రిగేరియన్ క్యాలెండర్ 1582 లో పోప్ గ్రెగొరీ తయారు చేశాడు. అంతకు ముందున్న జూలియస్ క్యాలెండర్ కి కొన్ని మార్పులు చేసి దీన్ని ప్రవేశపెట్టాడు.

స్వాతంత్రం వచ్చాక ప్రముఖ శాస్త్రవేత్త మేఘనాథ్ సారధ్యంలో ఓ కమిటీని అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించింది. దాని పని భారతీయ క్యాలెండర్లు అన్నిటినీ పరిశీలించి భారతదేశానికి ఒక క్యాలెండర్ సూచించడం. వాళ్లు ఆనాటికి ఉన్నదాదాపు 30 భారతీయ క్యాలెండర్లను పరిశీలించారు.

ఒకే దేశంలో ఇన్ని రకాల క్యాలెండర్లు ఉండటం అనేది ఆ దేశం లేదా ఆ సమాజంలో సహజీవనం చేసే వివిధ వర్గాల ప్రత్యేక ప్రాధాన్యతలను, అవసరాలను సూచిస్తుంది

ఈ కమిటీ గుర్తించిన భారతీయ క్యాలెండర్లలో గ్రెగోరియన్ సంవత్సరం 2026 CE అనేది ఇలా ఉంటుంది:

  • కలియుగ క్యాలెండర్: 6027వ సంవత్సరం
  • బుద్ధ నిర్వాణ క్యాలెండర్: 2570వ సంవత్సరం
  • విక్రమ్ సావన్: 2083వ సంవత్సరం
  • శాలివాహన శకం (Saka Era): 1948వ సంవత్సరం. ఇదే భారత ప్రభుత్వపు అధికారిక కేలండర్.
  • బెంగాలీ సాన్ (Bengali San): 1433వ సంవత్సరం
  • కొల్లాం క్యాలెండర్: 1202వ సంవత్సరం

మహావీర నిర్వాణ క్యాలెండర్ జైనులది. అలాగే హిజ్రీ కేలండర్ ఇస్లాం మతానిది. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన కాలాన్ని ఆరభంగా తీసుకుని చేసిన కేలండర్ ఇది. 16 శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అక్బర్ అన్ని మతాల సారంతో దిన్ – ఇ -ఇలాహి అనే మతాన్ని ముందుకు తెచ్చినట్టే తారీఖ్ -ఇ – ఇలాహి అనే ఒక క్యాలెండర్ని కూడా ప్రతిపాదించాడు. అయితే అక్బర్ ప్రతిపాదించిన మతం లాగానే దీనికి కూడా పెద్ద ప్రచారం రాలేదు.

ఆరంభ సంవత్సరం (Zero year) ప్రకారం చూస్తే కలియుగ క్యాలెండర్ ప్రాచీనమైనది. 499CE లో ఆర్యభట్ట కలియుగ క్యాలెండర్ ఆరంభ సంవత్సరం 3102BCE గా నిర్ణయించాడు. ఆర్యభట్ట ప్రకారం కలియుగం 3102BCE లో మొదలైంది. అయితే ఈ కలియుగ క్యాలెండర్ వాడకం ఎప్పుడు మొదలైంది? అంటే దీనికి మన ప్రాచీన గ్రంథాలైన వేదాల్లో లేదా పురాణాల్లో ఆధారం దొరకదు. ఋగ్వేదంలో సౌర సంవత్సరాన్ని 90 రోజులు ఒక ఒక రుతువుగా లెక్కించడం ఉంది. అధర్వణ వేదంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికమాసాన్ని లెక్కించడం గురించి ఉంది. అయితే ప్రత్యేకించి కలియుగ కేలండర్ గురించి మాత్రం లేదు.

మరొక భారతీయ క్యాలెండర్ విక్రమ్ సావన్ ఇది ఉత్తర భారతదేశంలో, గుజరాత్ లో వాడతారు. విక్రమాదిత్య చక్రవర్తి కాలానికి చెందింది. ఆయన పరిపాలనా కాలాన్ని రెఫెరెన్సు తీసుకొని  రూపొందించబడినది. దీని ఆరంభ సంవత్సరంCE 57.

శాలివాహన శకం అనేది ఇంకొక భారతీయ క్యాలెండర్. ఇదే భారత ప్రభుత్వపు అధికారిక కేలండర్ .దీని ఆరంభ సంవత్సరం CE 78. నిజానికి ఆర్యభట్ట కూడా కలియుగాన్ని ఈ క్యాలెండర్ సంవత్సరాలలోనే గణించాడు. ఈ క్యాలెండర్ ప్రస్తావన మనకు CE 543 నాటి బాదామి శిలాఫలకాల్లో కనిపిస్తుంది.బౌద్ధ నిర్వాణ. జైనుల మహా నిర్వాణ క్యాలెండర్లు కూడా అంతే ప్రాచీనమైనవి. బుద్ధ నిర్వాణ క్యాలెండర్ గురించి BCE ఒకటో శతాబ్దం నాటి శ్రీలంకలోని శిలాఫలకాల్లో కనిపిస్తుంది.

ఇలాంటి సాక్ష్యాల ప్రకారం ఇదే భారతదేశంలో వాడుకలో ప్రాచీన క్యాలెండర్. దీని శూన్య సంవత్సరం లేదా ఆరంభ సంవత్సరం BCE 544. జైన క్యాలెండర్ ఆరంభ సంవత్సరం  BCE 527 . ఈ భారతీయ క్యాలెండర్లలో ఏది ఎంత ప్రాచీనమైనదనే  వాదన కన్నా ఇక్కడ గమనించాల్సింది భారతదేశానికి ముస్లింలు రాకముందే  ఇక్కడ జైనం, యూదు, పారసీ వంటి హిందూయేతర మతాలు ప్రముఖంగానే ఉన్నాయని. ఇది ముస్లిములు రాకముందు భారతదేశం హిందూ దేశం అనేవాదన సరైనది కాదు అని నిరూపిస్తుంది.

ఇలా వివిధ క్యాలెండర్లు భారతదేశంలో  అభివృద్ధి చెందడం అనేది ఈ దేశపు సాంస్కృతిక ప్రాంతీయ వైవిధ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే వీటి మధ్య ఉన్న సామ్యాలను గమనిస్తే భారతదేశం ఒకటే. కేవలం చిన్న రాజ్యాలుగా విడిపోయి కాదు అనేది కూడా చూడొచ్చు. ఉదాహరణకి అన్ని భారతీయ క్యాలెండర్లలో సంవత్సరాది ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది.

భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశాన్ని అర్థం చేసుకోవడానికి క్యాలెండర్ ఒక గొప్ప మార్గం. భారతీయ నాగరికత బౌద్ధ జైన మతాలకు పుట్టిల్లు మాత్రమే కాదు. ఇక్కడ యూరప్ కంటే ముందు నుంచే యూదులు ఉన్నారు. నిజానికి బ్రిటన్ కంటే ముందు నుంచి కొద్ది మాత్రం లోనే అయినా క్రిస్టియానిటీ కూడా ఉంది . పారసీలు కూడా ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. తర్వాత వచ్చిన ఇస్లాం తన హిజ్రీ క్యాలెండర్లతో భారతదేశ మతవైవిధ్యంతోపాటు క్యాలెండర్ వైవిధ్యాన్ని ఇంకొంచెం పెంచింది. అక్బర్ ప్రవేశపెట్టిన ‘తారీఖ్-ఇ-ఇలాహి’ ఎక్కువ కాలం నిలవకపోయినా, దాని ప్రభావంతో ఏర్పడిన బెంగాలీ సన్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇది హిందూ ముస్లిం సంప్రదాయాల కలయికకు ఒక గొప్ప ఉదాహరణ. భారతదేశంలోని ఈ క్యాలెండర్ల చరిత్ర మన దేశంలోని వైవిధ్యాన్ని, సహనాన్ని, విభిన్న సంస్కృతులను ఇముడ్చుకునే సంప్రదాయాన్ని చాటిచెబుతుంది.

ఆధారం: ‘ ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ ‘ అమర్త్య సేన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *