పాశ్చాత్య దేశాల్లో ఈ రోజుకీ అగ్గిలా మండుతున్న శాస్త్ర సంబంధమైన అంశం ఏదైనా వుందంటే అది డార్విన్ పరిణామవాదం మాత్రమే. ఆయన ఎప్పుడో 1859 లో రాసిన The Origin of Species గ్రంథం ప్రచురితమైనప్పటి నుండి ఇప్పటికీ సైన్స్ కు మతానికీ మధ్య వివాదాలు రేపుతూనే వుంది. బైబిల్ సృష్టి వాదానికి దీనికీ మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత వైరం సాగుతూనే ఉంది. మరీ ప్రస్తుత అమెరికన్ మత రాజకీయాల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే రిపబ్లికన్లు క్రిస్టియన్ మతప్రాతిపదికన సృష్టి వాదాన్ని అమెరికా స్కూళ్ళలో బోధించాలని పట్టుబడుతున్నారు. పరిణామ వాదాన్ని సిలబస్ నుంచి తొలగించాలన్న డిమాండ్ కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోంది. అటు యూరపు దేశాల్లో పరిణామవాదానికి మద్దతు బలంగా వున్నా ఈ మధ్య క్రిస్టియన్ మతవాదసంస్థలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పడుతున్నాయి.

సమస్య తాత్వికం.

తాత్వికంగా డార్విన్ Theory of Evolution by Natural Selection కి వ్యతిరేకత వచ్చేది బైబిల్ సృష్టి వాదం నుంచి. సృష్టి వాదం ప్రకారం ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఆరువేల సంవత్సరాల క్రింద కేవలం ఏడు రోజుల్లో సృష్టించాడు. పరిణామ వాదంలో భగవంతుడికి సృష్టిలో తావే లేదు. అది లక్షల సంవత్సరాలు సాగిన సహజ ప్రక్రియ. అందువల్ల సృష్టి వాదులు చాలా స్పష్టంగా వుంటారు. వాళ్లు బైబిల్లో చెప్పినట్టు కాకుండా మరే విధంగా సృష్టిని నిర్వచించినా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. వాళ్ళ జీవితాలంతా మతంతో మత సూక్తులతో నిండి వుంటాయి. వాళ్లకి బైబిల్ సర్వస్వం. సైన్సులో వస్తున్న నూతన ఆవిష్కరణల గురించి గానీ, సిద్ధాంతాల గురించి గానీ వారికేమాత్రం స్పృహ వుండదు. వారికిదంతా అనవసరం. శాస్త్రీయ సమాచారాన్ని అంతిమ నిర్ణాయకంగా వారు అంగీకరించరు. జీవపరిణామం జరిగిందనడానికి ఎన్నో ఆధారాలున్నాయంటాం మనం. సైన్సు ఇంకా బైబిల్ చెప్పిన భగవద్ సృష్టి దాకా చేరుకోలేదని అలవోకగా అంటారు వారు. అంటే బైబిల్లోని అద్భుత విషయాలను అందుకోవడానికి శాస్త్రానికి ఇంకా చాలా సమయం పడుతుందన్నమాట!

డార్వినిజం అంతిమంగా నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తుందనీ, తద్వారా సమాజంలో పాపాలు, అశాంతి పెరిగిపోతాయనీ, అది దైవ వ్యతిరేకతకు దారి తీస్తుందనీ వారి అవగాహన.

వృథాప్రయాస

మనం గమనించి చూస్తే సామాజికంగా వైజ్ఞానికంగా వీరు లోకం నుంచి విడిపోయిన వారు. తమ బోధనలతో సృష్టివాదాన్ని ప్రచారం చేస్తూ, దేవుడిని ఘన కీర్తనలతో స్తుతిస్తుండే వారు. అయినా శాస్త్రవేత్తలు దశాబ్దాల తరబడి వీరితో వాదోపవాదాలు జరిపారు. వీరిని ఒప్పించడానికి నానా తంటాలు పడ్డారు. ఏం చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. సృష్టి వాదానికి “సృష్టి వాద శాస్త్రం” అనే కొత్త నామధేయాన్ని తగిలించడం మినహా వీరు చేయగలిగిందేమీ లేకపోయింది. ఈమధ్య దీనికి “ఇంటలిజెంట్ డిజైన్ (ఐడి)” అనే కొత్త పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలాంటి వారితో వాదించడం, పరిణామవాదమే సత్యమని నిరూపించే ప్రయత్నం చేయడం వృధా ప్రయాస.

బైబిలు దాని చుట్టూ ఉన్న మత నమ్మకాలే కాదు, దానితో ముడిపడ్డ రాజకీయాలు అధికారకాంక్షలు కూడా ఈ ధోరణికి కారణాలు. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఇది ఎలాంటి గుడ్డి ఛాందసమో, ఏం చేసినా వారెందుకు లొంగరో, వారితో చర్చించడం ఎంత అణుమాత్రం కూడా పసలేని వృధా ప్రయాసో మనకు తెలిసొస్తుంది. అయితే మనం ఎవరితో చర్చించాలి? సగం సగం తెలిసి మత భావనల విషకౌగిట్లోకి జారిపోతున్న సైన్సు విద్యార్థులతో చర్చించాలి.

మనకెందుకు వ్యతిరేకత?

అయితే మనదేశంలో బైబిల్ ప్రమాదం లేదు కదా. డార్విన్ సిద్ధాంతం పట్ల వ్యతిరేకత ఎందుకుంది ? అనేది చాలా ఆసక్తికర విషయం. సృష్టి వాదులు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమాల ప్రభావం మన దేశంపై పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికాలోని సృష్టి వాద తాత్విక వివాద ప్రభావం యూరపుపై వుంటే వుండొచ్చు. ఇండియా మీద వుండే అవకాశం లేదు. ఇంటర్నెట్లో అక్కడక్కడా కనిపించే సృష్టి వాదుల రాతల ప్రభావంతో పరిణామ వాదాన్ని మనం వ్యతిరేకిస్తున్నామన్నది కూడా వాస్తవం కాదు. సైన్సుకు మతానికీ మధ్య పాశ్చాత్యదేశాల్లో జరుగుతున్న తాత్విక యుద్ధంలో అధికార రాజకీయాలు కూడా మిళితమై వున్నాయి. అందువల్లే అది ఇంతకాలం మనుగడ సాధించగల్గుతోందని మనం మరిచి పోకూడదు.

మనం అలా కాదు. అధికార వర్గాల తాత్వికతకు వ్యతిరేకంగా ప్రజల్లోంచి పెద్ద ఎత్తున చైతన్యం పుట్టుకొచ్చిన సంప్రదాయం మనది. తాత్వికంగా చార్వాక లోకాయుత సాంఖ్యం లాంటి నాస్తిక వాదాల అవైదిక తాత్విక స్రవంతులతో, శక్తివంతమైన విజ్ఞానంతో పరిపుష్టమైన వాళ్ళం మనం. ఇలాంటి దేశంలో డార్విన్ పరిణామ వాదంపై వ్యతిరేకత వ్యక్తం కావడం ఎంతైనా వింతైన విషయం. ఈ మధ్య ఈ వ్యాధి బాగా ముదురుతోంది కూడా .

దీనికి మనం ఏళ్ల తరబడి విదేశీ పాలనలో మగ్గిపోవడం ఒక కారణమైతే మనలోని వలసవాదానంతరాలోచనా ధోరణి సైన్సు మొత్తాన్ని పాశ్చాత్య సృష్టిగా జమ కట్టడం ప్రధాన కారణం. డార్విన్ అనేవాడు క్రైస్తవ తాత్వికతను బద్దలు కొట్టింది నిజమే. కానీ అది జీవుల పుట్టుకు శాస్త్రీయ వివరణనిచ్చిన సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతం భారతీయులకు కేవలం క్రిస్టియన్ సైన్సుగా అన్పించింది. ఇదో విడ్డూరం. ఇలాంటి దృక్పథం ఉన్నవారికి డార్విన్ కేవలం విదేశీయుడు, క్రిస్టియన్. పైగా బ్రిటిష్ వాడు. కాబట్టి ఆయన చెప్పిందాన్ని గుడ్డిగా వ్యతిరేకించాల్సిందే అనే భావం మనది. అదే ఒక భారతీయుడే పరిణామ వాదాన్ని ప్రతిపాదించి వుంటే బహుశా ఇబ్బంది వుండేది కాదేమో!

అంతా మన వేదాల్లోనే వున్నాయిష !

డార్విన్ భారతీయుడు కాదు కాబట్టి అతని పరిణామ వాదాన్ని ఖండిస్తూ మా వేదాల్లో ఇంతకు మించిన సైన్సు వుందని మనం డిఫెన్స్ లో మాట్లాడటం మొదలుపెడతాం. ఇలా పాశ్చాత్య సంస్కృతి పట్ల వున్న వ్యతిరేకతే అక్కడ అభివృద్ధి చెందిన సైన్సు పట్ల కూడా మనలో నిలిచిపోయింది. అంతేకాదు భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో నిగూఢంగా మన పూర్వీకులు సైన్సును దాచి వుంచారని మన నమ్మకం. ఈ గ్రంథాల్లో లేనిదంటూ ఏదీ లేదనే ధోరణి కూడా మనలో బాగా పెరిగింది. అంతే కాదు డార్విన్ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా ఎదుర్కొని దాన్ని తప్పని నిరూపించగలగాలి అనే భావన కూడా భారతీయుల్లో లేదు. క్లిష్టమైన శాస్త్రపర అంశాలకూ, అవి లేవదీసే ప్రశ్నలకూ సులువైన సమాధానాలుగా మన మత సూక్తాలు భారతీయులకు కనిపిస్తాయి. కర్మ, కర్మఫలం, పునర్జన్మ, దైవలీల వంటివి అన్ని ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇచ్చేవిగా మనకు తోస్తాయి. దీంతో జీవ అస్థిత్వం, మనుగడా లాంటి వాటికి సంబంధించిన లోతైన ప్రశ్నలు వేసుకోవల్సిన అవసరమే మనకు దాదాపు లేకుండా పోయింది.

అంతేకాకుండా మన దేశంలో ఆధునిక విద్య లభిస్తున్నప్పటికీ శాస్త్రీయ సమాచారం మన పిల్లలకు చాలా బలహీనంగా మాత్రమే అందుతోంది. కేవలం ఉద్యోగ సంపాదనే లక్ష్యం గావడంతో భట్టీ చదువులు మాత్రమే మనకు మిగిలాయి. ఒక డార్విన్ సిద్ధాంతమే కాదు మిగిలిన అన్ని రకాల శాస్త్రీయ అవగాహనలు మనకు ప్రాథమిక దశను దాటి లభించడం లేదు.

సైన్సు అంటే ఒక ఆలోచనా విధానం

అమెరికాలో 2001లో చేసిన గ్యాలప్ సర్వే ప్రకారం 66 శాతం అమెరికన్లకు పరిణామవాదం అంటే ఏమిటో తెలియదని తేలింది. సైన్సు పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే శాస్త్ర సమాచార విస్తరణలో దారుణంగా విఫలమైన భారతీయ సమాజం గురించి చెప్పేదేముంటుంది? విజ్ఞానమంటే ఏదో గని గాదు, అదొక ఆలోచన విధానం. మనకీ స్పష్టత వుండాలి. Science is a way of thinking much more than a body of knowledge అంటాడు కార్ల్ సైగన్. కచ్చితంగా సైన్సు ఒక ఆలోచన విధానం. దీన్ని జన సామాన్యంలోకి ఎలా తీసుకెళ్లగలమనేది మన ముందున్న ప్రశ్న

ఇలాంటి పరిస్థితుల్లోనే మన దేశంలో మత రాజకీయాలు కూడా పెరగడంతో డార్విన్ సిద్ధాంత మనుగడకు మరింత జటిలమైన పరిస్థితులేర్పడ్డాయి. అందుకే సైన్సు ప్రచారాన్ని సరైన దిశలో ముందుకు తీసుకుపోవడం మన ప్రధాన కర్తవ్యం. డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకోని విద్యావంతులైన వ్యక్తుల్ని మనం గుర్తించాలి. వారి మానసిక స్థితి పాశ్చాత్య సృష్టి వాదుల స్థితి కంటే భిన్నమైనదన్న అవగాహన మనకుండాలి. అప్పుడు మాత్రమే శాస్త్ర ప్రచారకులుగా మన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మనిషి కోతి నుంచి పుట్టాడా?

అంతేకాకుండా పరిణామవాదం సృష్టి వాదం చుట్టూ పాశ్చాత్య దేశాల్లో జరిగిన చర్చల్ని కూడా మన పాఠశాలల కళాశాలల సిలబసులో చేర్చడం అవసరం. “నా జీవితంలో ఏ కోతి కూడా మనిషిగా మారడం నేను చూడలేదు. అలాంటప్పుడు డార్విన్ సిద్ధాంతం ఎలా సరైనదవుతుంది” అని ఈమధ్య ఒక రాజకీయ నాయకుడు అనడం మనం చూసాం. ఈ ప్రశ్నను చాలామంది అడుగుతుంటారు కూడా.

అయితే నిజం ఏమంటే డార్వినిజం మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పదు. మనిషి కోతి ఒకే పూర్వ జంతువు నుంచి వచ్చాడని మాత్రమే చెబుతుంది. చాలామందికిది అర్థం కాకపోవడంతో మనిషి కోతి నుంచి వచ్చాడని డార్వినే చెప్పినట్లు వాదిస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ పరిణామం ఒక సరళరేఖలో జరుగుతుందన్న అపోహలో వుంటారు. కానీ నిజానికి పరిణామం చెట్టు లాగా, దాని వివిధ శాఖలు వృద్ధి చెందుతున్నట్లుగా జరుగుతుంటుంది. మన కుటుంబానికి సంబంధించిన వంశవృక్షాన్ని తీసుకొని దీనికి సమాధానం చెప్పవచ్చు. మనకు ముత్తాత వుంటే ఆయనకు ఇద్దరు కుమారులున్నట్టు ఊహించండి. ఒకరు పెద్ద తాతా మరొకరు చిన్న తాతా. ఇప్పుడు పెద్ద తాతకు ఒక కుమారుడు, చిన్న తాతకు ఒక కుమారుడు పుట్టారు. వీరిద్దరూ ఒకే ముత్తాతకు మనవళ్ళు. అయినా ఒకరు ఇంకొకరుగా మారరు. అంటే చిన్న తాత కుమారుడు పెద్ద తాత కుమారుడిగా పరిణామం చెందడం అసాధ్యం. వారు వేర్వేరు శాఖలు. కానీ మూలం ఒకటే. అదే ముత్తాత.

ఇదే సూత్రాన్ని మనిషి కోతి మధ్య కూడా ఉపయోగించవచ్చు. మనిషి కోతి నుంచి వచ్చాడనుకోడం తప్పు. నిజానికి మనిషికి కోతికి ఒకటే పూర్వజంతువు. దాన్నుంచి రెండు వేర్వేరు శాఖలు ఎదిగాయి. ఒకటి మనిషిగా మరొకటి కోతిగా. కోతి మనిషిగా మారలేదనడానికిదే అర్థం.

పరిణామం సరళరేఖలా సాగేది కాదు. ఇది ఒక వృక్షం లాగా విస్తరించేది. ఇది అర్థం కాకపోతే మనిషి కోతి నుండి వచ్చాడనే సరళరేఖ సిద్ధాంతమే వచ్చి కూర్చుంటుంది. వంశవృక్షాన్ని ఎలా చూస్తామో పరిణామ వృక్షాన్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ఒకే మూలం నుంచి అనేక శాఖలు పుట్టవచ్చు. కానీ ఒక శాఖ మరొక శాఖగా మారదు. నాలుగు కాళ్ల కోతి నుండి నాలుగు కాళ్ళ మనిషిగా, అటు నుండి రెండు కాళ్ళ మనిషిగా పరిణామం చెందిన ప్రైమేట్స్ యొక్క ప్రోగ్రెస్సివ్ మోడిఫికేషన్ చిత్రాన్ని కూడా డార్విన్ పరిణామ సిద్ధాంతంగా చెబుతూండడం ఈ అపోహకు కారణం. పరిణామాన్ని వివరించేటప్పుడు వృక్ష శాఖల నమూనాను విస్మరించకూడదు.

 డార్విన్ కాలపు పరిమితి

మరికొందరు డార్విన్ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలే తప్పని నిర్ధారించారని వాదిస్తుంటారు. ఇటువంటి వారు వాట్సాప్ సందేశాలపై ఆధారపడ్డ వారు. నిజానికి శిలాజాల విజ్ఞానం, జెనెటిక్స్, ఆర్కియో జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ వంటి ఎన్నో ఆధునిక సైంటిఫిక్ ఆవిష్కరణలన్నీ డార్విన్ సిద్ధాంతాన్ని పదేపదే నిరూపిస్తూ వున్నాయన్నది వీరికి ఓపికగా తెలియజెప్పాల్సి వుంటుంది. అప్పటికి శిలాజాల శాస్త్రం చాలా ప్రాథమిక దశలో వుండేది. కానీ నేటి టెక్నాలజీ వల్ల అది ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇక మిగిలిన మూడు శాస్త్రాలు డార్విన్ కాలంలో లేనే లేవు. శిలాజ శాస్త్రం కూడా డార్విన్ కాలంలో ప్రాథమిక దశలోనే వుండేది. అయినా నేడివన్నీ డార్విన్ సిద్ధాంతాన్ని ముక్తకంఠంతో బలపరుస్తున్నాయి.

ఒకవేళ పరిణామాన్ని సైంటిస్టులు తప్పని నిరూపించినా అది కొనసాగుతూనే వుంటుంది. జీవం పరిణామం చెందుతూనే వుంటుంది. ఈ సత్యాన్ని ఎవ్వరూ తుడిచిపెట్టలేరు. ఉదాహరణకి భూమ్యాకర్షణ సిద్ధాంతం తప్పని ఎవరైనా రుజువు చేశారనుకోండి. అంతమాత్రాన పైకి విసిరేసిన రాయి కిందకి పడకుండా ఆగిపోదు. పైకేమీ ఎగరదు. జీవపరిణామం అనేది ఒక సత్యం అయితే దాన్ని డార్విన్ నాచురల్ సెలెక్షన్ ద్వారా జరుగుతుంది అని ప్రతిపాదించి నిరూపించాడు. డార్విన్ కి దేవుడితో గానీ, దేవుడి సహాయంతో గాని ఎలాంటి అవసరమూ పడలేదు. ఆధునిక విజ్ఞానం జీవపరిణామ క్రమంలో నాచురల్ సెలక్షన్ కూడా ఒకటని గుర్తించింది.

పరిణామం కొనసాగుతోందా?

మరో ముఖ్యమైన ప్రశ్న జీవపరిణామం నేటికీ జరుగుతోందా అనేది. మనిషి నేటికీ పరిణామం చెందుతున్నాడనేది నిజమైతే అది మనకెందుకు కనపడదు? అనే వాదనలు చేసే వారే ఆధునిక జీవనశైలి వల్ల ఊబకాయం పెరుగుతోందని, క్యాన్సర్లు ముదురుతున్నాయని, షుగర్ జబ్బు ప్రబలుతోందని వాపోతుంటారు. డార్విన్ పించెస్ (పిచుక లాంటి చిన్న పక్షులు)నీ, మాత్ (రెక్కల పురుగులు) లనూ ఉదాహరణగా చెబితే మాత్రం అదంతా అబద్ధం అనేస్తున్నారు. వీరే సెల్ ఫోన్ వాడటం వల్ల చిన్న పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువయ్యాయనీ, మీడియా పెరగడం వల్ల ఆడపిల్లలు త్వరగా రజస్వలలై పోతున్నారనీ వాపోతుంటారు. ఇవన్నీ మానవ పరిణామంలో భాగాలనీ, జీవనశైలిలో మార్పులకనుగుణంగా శరీరం ‘అడాప్టివ్ లాగ్ లో’ వుండిపోతోందని మాత్రం అంగీకరించరు.

అంతేకాదు బ్యాక్టీరియా, వైరస్ లు పరిస్థితులకనుగుణంగా జన్యుమార్పిడికి లోనై వాటిపై మందులు పనిచేయని విధంగా డ్రగ్ రెసిస్టెంట్లుగా తయారవుతున్నాయని వారికీ తెలుసు. కానీ పరిణామవాదాన్ని మాత్రం ఒప్పుకోరు.

దీనిపై ఒక జోక్ కూడా వుంది. టిబితో బాధపడే ఒక వ్యక్తిని డాక్టరు “మీరు క్రియేషన్ వాదులా” అని అడుగుతాడట. ఆ రోగి “అవును” అంటాడు. అయితే “మీరూ, మీ శరీరంలోని టిబి బాక్టీరియా మీ సిద్ధాంతం ప్రకారం భగవంతుని చేత ఒకే రూపంలోనే సృష్టింపబడ్డారు. వాటిలో ఏ మార్పులు జరగలేదు. కనుక మీకు మామూలు మందులు ఇస్తాము. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ గా బ్యాక్టీరియాగా పరిణామం చెందిన విషయాన్ని మీరు ఒప్పుకోరు కాబట్టి వాటికిచ్చే మందులు మీ కివ్వము” అంటాడట.

ఇది జోక్ అయినప్పటికీ మన కంటిముందు కనబడుతున్న మరో సత్యం కరోనా వైరస్ వుండనే వుంది. ఆ సమయంలో వైరస్ పరిణామం చెందుతూ కొత్త strain లుగా ఎంత పాండమిక్ కలిగించిందో మనం చూశాం.

వైఫల్యం ఎవరిది?

అయితే జీవజాతులు ఎన్ని ఉన్నాయో, ఎంత విస్తృతంగా జీవావరణం తమ చుట్టూ పరుచుకొని వుందో లేశ మాత్రం కూడా తెలుసుకోకుండా, కనీసం వాటిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేకుండా, పోనీ నాచురల్ జాగ్రఫీ, డిస్కవరీ చానల్స్ ని కూడా చూడకుండా తమ కంటి ముందు పరిణామం కనిపిస్తే కానీ నమ్మము అనే వారికి నేటికీ జీవపరిణామం జరుగుతోందని చెప్పాలనుకోవడం ఖచ్చితంగా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి మన జీవశాస్త్రం ఎంత విస్తృతమైందో ,వివిధరకాల జీవులతో ఎంత వైవిధ్యంగా ఎన్ని అద్భుతాలతో నిండి వుందో, ఎంత విరాట్రూపంలో పరచుకొని వుందో తెలిస్తే తప్ప జీవ పరిణామం అర్థం కాదు. అందుకే సైన్సు విద్యార్థులకు సరైన రీతిలో డార్విన్ సిద్ధాంతాన్ని చెప్పే దిశగా ఆలోచించడం సైన్సు ప్రచారకుల మొట్టమొదటి బాధ్యత అవుతుంది. ఎవరైనా ఒక విద్యార్థి సైన్సును మొదటి సబ్జెక్టుగా చదివి, ఆ తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని వదిలేసి సృష్టి వాదులతో పాట అందుకుంటే అది తప్పనిసరిగా సైన్సు బోధకుల, సైన్సు ప్రబోధకుల వైఫల్యం గానే గుర్తించక తప్పదు. అటువంటి విద్యార్థులను పర్సనల్ గా ట్రోల్ చేయడం వల్ల ఏ లాభం ఉండదు. కాబట్టి సైన్సు టీచర్లు, సైన్సు ప్రచారకులు ఈ దిశలో కృషి చేస్తారని ఆశిద్దాం.

డా|| విరించి విరివింటి

One thought on “పరిణామ వాదానికి పాతా కొత్తా సవాళ్లు

  1. I think Religion should fade away and humans should start evolving from it. If God love us so much why did he create all the miseries and death? Every creature has an expiry date and science has clearly explained how. We have come a long way in understanding the nature, human body and could also avoid death in circumstances impossible before, only with the help of science. We are progressing in the field with leaps and bounds, only in those countries who believe science can make it happen. Those countries who still regress will change their minds in coming generations with obvious reasons. Let’s hope that day is sooner.

Leave a Reply to Anand Cancel reply

Your email address will not be published. Required fields are marked *