స్వేచ్ఛానువాదం: దేవి పోలిన

(ఇరవయ్యో శతాబ్దపు  అత్యంత ప్రసిద్ధ మేధావులలో ఇద్దరైన తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ మరియు భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955 జూలై 9న లండన్‌లో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. అణు యుద్ధం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం వారి లక్ష్యం. “సార్వత్రిక మరణం”ను నివారించేందుకు అంతర్జాతీయ విభేదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుత యుద్ధ కాలంలో ఆ ప్రకటనను గుర్తుచేసుకోవడం సముచితమని భావిస్తూ దాని తెలుగు అనువాదాన్ని ప్రచురిస్తున్నాం)

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న విషాదకర పరిస్థితిలో, భారీవిధ్వంసక ఆయుధాల అభివృద్ధివల్ల తలెత్తిన ప్రమాదాలను సమీక్షించేందుకు శాస్త్రవేత్తలు సమావేశమవ్వాలని మేము భావిస్తున్నాము. అలాగే, ఈ పత్రానికి జతచేసిన ముసాయిదా ఇచ్చే స్ఫూర్తితో చర్చించి ఒక తీర్మానానికి రావాలని కోరుతున్నాము.

ఈ సందర్భంలో మేము ఏ దేశానికి, ఖండానికి లేదా మతానికి చెందినవారిగా మాట్లాడటం లేదు; మనుగడకే ముప్పు ఏర్పడిన ‘మానవ జాతి’కి చెందిన సభ్యులుగా మాట్లాడుతున్నాము. ప్రపంచం అనేక సంఘర్షణలతో నిండి ఉంది. ఆ చిన్న చిన్న విభేదాలన్నింటిని కప్పి పుచ్చుతూ కమ్యూనిజానికీ, దానిని వ్యతిరేకించే కూటమికీ మధ్య అతి పెద్ద సంఘర్షణ నెలకొని ఉంది. రాజకీయ స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకటో రెండో ఈ అంశాలపై బలమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ, మీరు సాధ్యమైనంత వరకు అటువంటి భావాలను పక్కన పెట్టి, ఘనమైన చరిత్ర కలిగిన, సొంత వినాశనాన్ని కోరుకోని ఒక ‘జీవ జాతి’ (biological species)కి చెందిన సభ్యులుగా మాత్రమే మిమ్మల్ని మీరు భావించుకోవాలని మేము కోరుకుంటున్నాము.

మేము ఏ ఒక్క వర్గానికో అనుకూలంగా ఉండేలా ఒక్క మాట కూడా చెప్పడానికి ప్రయత్నించము. ఈ ప్రమాదం అందరికీ సమంగా పొంచి ఉందనే విషయం సరిగ్గా అర్థం చేసుకుంటే, అందరూ కలిసికట్టుగా

దానిని నివారించగలరనే ఆశ ఉంది. మనం కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. మనకు నచ్చిన వర్గానికి

సైనిక విజయం సాధించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి అనే ప్రశ్న ఇక నిరర్థకమైంది. కాబట్టి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే… అన్ని పక్షాలకు వినాశకరంగా పరిణమించే సైనిక పోరాటాన్ని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు?

అణు యుద్ధంవల్ల కలిగే పర్యవసానాలను సామాన్య ప్రజలే కాక చాలామంది అధికారులు కూడా ఇంకా అర్థం చేసుకోలేదు. అవి నగరాలను తుడిచిపెట్టేస్తాయి అనే సామాన్య ప్రజలు ఇంకా భావిస్తున్నారు. పాత బాంబుల కంటే కొత్త బాంబులు ఎంతో శక్తివంతమైనవనీ, ఒక అణు బాంబు (A-bomb) హిరోషిమాను తుడిచిపెట్టగలిగితే, ఒక హైడ్రోజన్ బాంబు (H-bomb) లండన్, న్యూయార్క్, మాస్కో వంటి అతిపెద్ద నగరాలను సైతం నామరూపాలు లేకుండా చేయగలదని మాత్రమే అర్థమైంది.

హైడ్రోజన్-బాంబు (H-bomb) వల్ల యుద్దంలో పెద్ద నగరాలు నామరూపాలు లేకుండా పోతాయన్నది నిస్సందేహం. కానీ ఇది ఎదుర్కోవాల్సిన విపత్తులలో ఒక చిన్న విపత్తు మాత్రమే. ఒకవేళ లండన్, న్యూయార్క్, మాస్కోలోని ప్రజలందరూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా (ex-terminated), ప్రపంచం కొన్ని శతాబ్దాల కాలంలో ఆ దెబ్బ నుండి కోలుకోవచ్చు. కానీ, ముఖ్యంగా బికినీ పరీక్ష (Bikini test) తర్వాత మనకు తెలిసిన విషయం ఏమిటంటే అణుబాంబులు మనం ఊహించిన దాని కంటే చాలా విస్తృతమైన ప్రాంతానికి క్రమంగా విధ్వంసాన్ని విస్తరించగలవు. హిరోషిమాను ధ్వంసం చేసిన బాంబు కంటే 2,500 రెట్లు శక్తివంతమైన బాంబును ఇప్పుడు తయారు చేయవచ్చని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇలాంటి బాంబు భూమికి దగ్గరగా గానీ, సముద్రంలో గానీ పేలితే, రేడియో థార్మిక కణాలు పై వాతావరణంలోకి ఎగసి వెళ్తాయి. తరువాత అవి క్రమంగా కిందికి దిగుతూ, ప్రాణాంతక ధూళి లేదా వర్షం రూపంలో భూ ఉపరితలాన్ని చేరుతాయి. జపాన్ మత్స్యకారులను, వారు పట్టిన చేపలను ప్రభావితం చేసింది ఈ దుమ్మే. ఇలాంటి ప్రాణాంతక రేడియో థార్మిక కణాలు ఎంతగా వ్యాపిస్తాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ హైడ్రోజన్ బాంబులతో జరిగే యుద్ధం మానవ జాతికే ముగింపు కావచ్చని నిపుణులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనేక హైడ్రోజన్ బాంబులు ప్రయోగించబడితే, సర్వత్రా మరణం సంభవించవచ్చని భయం వ్యక్తమవుతోంది. కొద్దిమంది వెంటనే మరణించవచ్చు కానీ ఎక్కువమంది మాత్రం వ్యాధులు, శరీర క్షీణతతో యాతన అనుభవిస్తూ మరణించే దుస్థితి ఏర్పడవచ్చు.

ప్రముఖ శాస్త్రవేత్తలు, సైనిక వ్యూహకర్తలూ ఈ విషయంపై ఇప్పటికే అనేక హెచ్చరికలు చేశారు. అయితే వారిలో ఎవరూ అత్యంత దారుణ ఫలితాలు తప్పకుండా జరుగుతాయని చెప్పడం లేదు. కానీ అవి జరిగే అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు. అవి జరగవని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు వారి రాజకీయ భావజాలం లేదా వ్యక్తిగత పక్షపాతం మీద ఆధారపడడం లేదని మేమిప్పటి దాకా గమనించాము. మా పరిశీలనల ప్రకారం, అవి పూర్తిగా వారి జ్ఞాన పరిమితిపై ఆధారపడి ఉంటాయి. నిజానికి ఎవరికైతే ఈ విషయం గురించి ఎక్కువగా తెలుసో, వారే అత్యంత నిరాశలో ఉన్నారని మేము కనుగొన్నాము. కాబట్టి మేము మీ ముందుంచుతున్న ప్రశ్న స్పష్టమైనదీ, భయంకరమైనదీ, తప్పించుకోలేనిదీ; మనం మానవ జాతికి ముగింపు పలకాలా? లేక మానవాళి యుద్ధాన్ని త్యజించాలా? యుద్ధాన్ని పూర్తిగా నిర్మూలించడం చాలా కష్టం కాబట్టి, ఈ ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కోవడానికే చాలామంది వెనుకాడుతున్నారు.

యుద్దాన్ని పూర్తిగా నిర్మూలించడం అంటే దేశాల సార్వభౌమాధికారంపై కొన్ని ఇష్టంలేని పరిమితులను అంగీకరించటమే. కానీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రధాన అడ్డంకి ఏమిటంటే “మానవజాతి” అనే పదం చాలా అస్పష్టంగా, అమూర్తంగా అనిపించడం. ఈ ప్రమాదం తమకే, తమ పిల్లలకే, తమ మనవలకే సంబంధించినదని ప్రజలు స్పష్టంగా ఊహించలేకపోతున్నారు. అది కేవలం ఎక్కడో ఉన్న మానవాళికి సంబంధించిన సమస్యగా మాత్రమే భావిస్తారు. తమకూ, తమకు ప్రియమైన వారికీ కూడా ఇంతటి భయంకరమైన ప్రమాదం సమీపంలోనే ఉందని వారు పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. అందుకే, ఆధునిక ఆయుధాలను మాత్రమే నిషేధించి, యుద్ధం కొనసాగినా పర్లేదేమో అనే భావనలో ఉండిపోతున్నారు. ఈ ఆశ ఒక భ్రమ మాత్రమే. శాంతికాలంలో హైడ్రోజన్ బాంబు లను ఉపయోగించకూడదని ఎలాంటి ఒప్పందాలు కుదిరినా, యుద్ధం ప్రారంభమైన తరువాత ఆ కట్టుబాట్లు నిలబడవు. యుద్ధం మొదలైన వెంటనే ఇరుపక్షాలు కూడా హైడ్రోజన్ బాంబుల తయారీలో పడిపోతాయి.

ఎందుకంటే ఒకవైపు మాత్రమే బాంబులు తయారుచేసి, మరొకవైపు చేయకపోతే, తయారుచేసిన వర్గమే గెలుస్తుంది.

సర్వసాధారణంగా ఆయుధాలను తగ్గించే చర్యల్లో భాగంగా అణ్వాయుధాలను త్యజించేందుకు ఒక ఒప్పందం కుదిరినా, అది తుది పరిష్కారాన్ని ఇవ్వదు. అయినప్పటికీ, అది కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది.

మొదటగా, తూర్పు-పశ్చిమ దేశాల మధ్య ఏ ఒప్పందమైనా ఉద్రిక్తతను తగ్గించే దిశగా సహాయపడుతుంది. రెండవది, థర్మోన్యూక్లియర్ ఆయుధాలను పూర్తిగా రద్దుచేసినట్లు ఇరుపక్షాలు నిజాయితీగా నమ్మితే, పెర్ల్ హార్బర్ తరహాలో ఆకస్మిక దాడి జరుగుతుందనే భయం కొంత తగ్గుతుంది. ప్రస్తుతం ఆ భయమే ఇరుపక్షాలను ఎప్పుడూ ఆందోళనలో ఉంచుతోంది. అందుకే, అలాంటి ఒప్పందాన్ని మనం స్వాగతించాలి; అయితే అది మొదటి అడుగుగా మాత్రమే భావించాలి. మనలో చాలా మందిమి భావోద్వేగాల పరంగా తటస్థంగా లేము, కానీ మానవులుగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి; తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉన్న సమస్యలు సాధ్యమైనంత సంతృప్తిని ఇచ్చే విధంగా పరిష్కరించబడాలంటే వారు కమ్యూనిస్ట్ అయినా, కమ్యూనిజానికి వ్యతిరేకులు అయినా, ఆసియా, ఐరోపా లేదా అమెరికావాసులైనా, నల్లజాతి లేదా తెల్లజాతి వారైనా, ఆ సమస్యలను యుద్ధం ద్వారా పరిష్కరించకూడదు. ఈ విషయాన్ని తూర్పు మరియు పశ్చిమ దేశాలు రెండూ అర్థం చేసుకోవాలని మనం కోరుకోవాలి. మనం కోరుకుంటే, మన ముందు ఆనందం, జ్ఞానం, వివేకంతో కూడిన నిరంతర పురోగతి ఉంది. అలా కాకుండా, మన విభేదాలను మరచిపోలేక మరణాన్ని ఎంచుకుందామా? మేము తోటి మానవులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము: మీలోని మానవత్వాన్ని గుర్తుంచుకోండి, మిగిలినవన్నీ మరచిపోండి. మీరు అలా చేయగలిగితే, ఒక కొత్త స్వర్గానికి దారి తెరుచుకుంటుంది; చేయలేకపోతే, మీ ముందున్నది సర్వత్రా నాశనమే.

తీర్మానం :
మేము ఈ కాంగ్రెస్ (సమావేశం) ద్వారా, ప్రపంచంలోని శాస్త్రవేత్త లను, సామాన్య ప్రజలను ఈ క్రింది తీర్మానానికి మద్దతు తెలపవలసిం దిగా కోరుతున్నాము :

“భవిష్యత్తులో జరిగే ఏ ప్రపంచ యుద్ధంలోనైనా అణ్వాయుధాలు కచ్చితంగా ఉపయోగించబడతాయని, అటువంటి ఆయుధాలు మానవ జాతి మనుగడకే ముప్పు కలిగిస్తాయని తెలిసిన నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు తమ లక్ష్యాలను ప్రపంచ యుద్ధం ద్వారా సాధించుకోలేమన్న విషయాన్ని గుర్తించి, దానిని బహిరంగంగా అంగీకరించాలని మేము కోరుతున్నాము.  తదనుగుణంగా, తమ మధ్య ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి శాంతియుత మార్గాలను అన్వేషించాలని మేము వారిని కోరుతున్నాము.”

సంతకదారులు :

మాక్స్ బోర్న్ (Max Born)

పెర్సీ డబ్ల్యూ. బ్రిడ్జ్‌మన్ (Percy W. Bridgman)

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein)

లియోపోల్డ్ ఇన్ఫెల్డ్ (Leopold Infeld)

ఫ్రెడరిక్ జోలియట్-క్యూరీ (Frederic Joliot-Curie)

హెర్మన్ జే. ముల్లర్ (Herman J. Muller)

లైనస్ పాలింగ్ (Linus Pauling)

సిసిల్ ఎఫ్. పావెల్ (Cecil F. Powell)

జోసెఫ్ రోటాబ్లాట్ (Joseph Rotblat)

బెర్ట్రాండ్ రస్సెల్ (Bertrand Russell)

హిడేకి యుకావా (Hideki Yukawa)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *