సంపాదకీయం

మనిషికి యుద్ధాల పిచ్చి ఎప్పటినుంచి పట్టుకుంది? కొంపదీసి అది అతని సహజాతమా? శత్రు నిర్మూలనాలు, జీవ విధ్వంసాలు లేకుండా అతని పురోగమనమే సాగలేదా? సాగడం వీలు కాదా ?ఇప్పటి మన ముందున్న నాగరికతా, అభివృద్ధీ అంతా యుద్ధ పర్యవసానాలేనా? ఇప్పటి పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఎదురవుతాయి. ఈ వైపు వ్యాఖ్యానాలకూ కొదువేమీ లేదు.

“సేపియన్లలో సహనం చాలా తక్కువ. వర్తమాన కాలంలో ఒంటి రంగు, మాట్లాడే మాండలికం లేదా మతం అనే చిన్న చిన్న తేడాలు కూడా ఒకరినొకరు మట్టుపెట్టుకోవడానికి కారణాలవుతున్నాయి. మరి ప్రాచీన కాలంలో తమకు భిన్నమైన మానవజాతుల్ని వారు సహించగల్గే వారా? బహుశా సేపియన్లు నియాండర్తల్ మానవవుల్ని ఎదుర్కొన్నప్పుడు చరిత్రలో మొదటిసారి ఒక జాతిని పూర్తిగా తుడిచిపెట్టడం అనేది జరిగి వుంటుందేమో” అంటాడు యువల్ నోవా హరారే.

దీనికి సేపియన్లను తప్పుపట్టాలో లేదో తెలియదు గానీ వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతానికి చేరుకోగానే అక్కడ అంతవరకు నివసించిన జాతి మొత్తం నశించి అంతరించిపోయేదన్నది మాత్రం కాదనలేని సత్యమని కూడా ఆయన అంటాడు. భాష, ఆయుధ సాంకేతికతా పరిజ్ఞానం తోడై ఇలా సేపియన్లకు ధరాధిపత్యం కట్టబెట్టి వుండొచ్చుననీ, దీనికి సాక్ష్యంగా తొలి ఆఫ్రికా మానవుడి రాకతో ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో మనం చూడొచ్చుననీ, ఒక్కసారిగా అక్కడ జీవ జాలమంతా సర్వనాశమైపోయిందనీ కూడా ఆయన తన “సేపియన్స్ ” గ్రంథంలో వివరిస్తాడు.

ఆశ్చర్యం ఏమంటే ఆధునిక మానవ చరిత్రలో జరిగింది కూడా అదే. యూరోపియన్లు రాకముందు అమెరికా ఖండంలో అయిదారు కోట్ల మంది జనం వుండేవారు. కానీ 17వ శతాబ్దం నాటికి వీళ్ళలో తొంబై శాతం కనుమరుగైపోయారు. ఇదో పర్యావరణ సామ్రాజ్యవాదం. దీని దుర్మార్గానికి ఒక జీవకాలం అంతమై పోయింది!

అంత దాకా ఎందుకు? మనం ఏ ప్రాచీన సమాధి తవ్వినా దొరికే రాగి పరికరాలన్నీ ఆయుధాలే. కర్ర పరికరాల్ని అయితే అర్థం చేసుకోవచ్చు. ఆహార సేకరణ కోసమో, ఆత్మరక్షణ కోసమో తయారు చేసుకున్నారనుకోవచ్చు. కత్తుల్ని గొడ్డళ్ళని, బల్లేల్ని ఎలా అర్థం చేసుకోవాలి ? వాటిని కూడా వేట కోసమే వాడారని బుకాయించలేము.ఇలా చూస్తే లోహవిజ్ఞానంతో ప్రారంభించి సైన్సు ప్రయాణమే ఆయుధాలతో ముడివడివుందా అని కూడా అన్పిస్తుంది!

ఇక యుద్ధాలది ఒక ఎత్తయితే వాటితో అంటుకొన్న రోగాలది మరో ఎత్తు. బయట నుంచి తెచ్చిన రోగాలను తట్టుకోగల రోగ నిరోధకశక్తి స్థానికులకు వుండేది కాదు. దీంతో వాళ్లు పిట్టల్లా రాలిపోయేవారు. ఇలా తమ చేతులకు మట్టి తగలకుండానే ఆక్రమణదారులు కాగలకార్యం గంధర్వుల చేత చేయించారు. ఖండాలకు ఖండాలనే ఖాళీ చేయించారు.

ఆ తర్వాత చరిత్ర కూడా మనకు తెలిసిందే. భూములన్నీ కబ్జా చేసారు. బానిసల్ని పట్టుకొచ్చారు.బంగారం పండించారు. ఎక్కడి గనులూ తవ్వించారు. సంపదలు తరలించారు. ఇవన్నీ జరక్కపోతే పాశ్చాత్య దేశాల్లోనే పారిశ్రామిక విప్లవం ఎలా పుట్టుకొచ్చేది? ఇలా చూస్తే మానవ నాగరికతా వికాసాన్ని చూసి గర్వపడాల్సిందేమీ లేదని కూడా అన్పిస్తుంటుంది.

ఈ క్రమంలో మనిషిలో తన నరనరాన హింసోన్మాదం నింపడానికి చేసిన ప్రయత్నాలూ ఆశ్చర్యం కల్గిస్తాయి. యుద్ధనైపుణ్యాన్నీ, హననోత్సాహాన్నీ నాయక లక్షణాలుగా మార్చారు. విజయాన్ని, వీరస్వర్గాన్ని త్రాసులో పెట్టి సమానం చేసారు.అందుకోసమే కాబోలు మన పురాణాల్లో, కావ్యాల్లో ఎంత వీరారాధనలు కనిపిస్తాయో అంత హింసావర్ణనలూ కన్పిస్తాయి. వాల్మీకి సుందరకాండలో లంకాదహనాన్ని వర్ణించిన తీరు చూస్తే శరీరం జలదరిస్తుంది. లంకలోని వనాలూ, పక్లులూ, జంతువులూ, భవనాలూ సర్వం క్షణాల్లో భస్మీపటలం కావడాన్ని ఆయన మాటల్లో చదివితే (సుందరకాండను మనవాళ్లు పారాయణం చేస్తుంటారు!) హిరోషిమానే గుర్తుకొస్తుంది! మహాభారతంలో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం, గుర్రాలూ, ఏనుగులూ హతమై రక్తం ఏరులు గట్టి, విషాదబీభత్సమయమయ్యాకే కురుక్షేత్రం ధర్మక్షేత్రమవుతుంది! పురాణాల్లోనే గాదు సమీప చరిత్రలోనూ ఇంతే. కృష్ణదేవరాయల క్రౌర్యానికి కళింగరాజధాని కటకం మంటల్లో మాడిమసైపోడం పెద్దన గార్కి వొళ్ళు తెలియని కవితావేశం తెప్పిస్తుంది!

ఇదేమీ ఒక గడ్డకో, ఒక కాలానికో సంబంధించింది కాదు. ప్రపంచంమంతా ఇంతే! చరిత్ర పొడవునా ఇంతే!

ఇక్కడితో ఆగలేదు. యుద్ధాలు పవిత్ర క్రతువులయ్యాయి.సాక్షాత్తు దేవుళ్లే అవతారాలెత్తి వచ్చి అయాయక మానవుల్ని సోదరసంహారానికి సైతం పురమాయించారు. ఇంకొంత దూరం వెళ్ళాక ఈ కిరాతక చక్రవర్తులే అందనంత ఎత్తుకెదిగి దైవాంశసంభూతులయ్యారు.రాజ్యం పేర, ధర్మం పేర, ప్రాభవం పేర, చివరకు శాంతి పేర కూడా భూమండలాన్ని రక్తంతోనూ, కన్నీళ్ళతోనూ నింపేసారు.ఈ దుర్మార్గంలోని చాణక్యం ఏమంటే జనం చేత కూడా దీన్ని వొప్పించడం.

మానవ మస్తిష్కంలో ఇంత క్రౌర్యారాధన వుందన్న భరోసానే లేకపోతే మొన్నటికి మొన్న ఒక అగ్రదేశాధినేత “ఇరాన్ తో యుద్ధం ఒక స్వల్పకాలిక విహార యాత్ర” అనగలడా? “మేము వారిని తిరిగిరాని యుగానికి పంపుతాం. రేపటితో వారి నాగరికత అంతం. అదే వారి అసలు స్థానం” లాంటి మాటలు రాగలవా? తెల్లారితే మరో జపాన్ గా ఇరాన్ మారుతుందేమోనని లోకమంతా గుండెలరచేత పెట్టుకునేలా చెయ్యగలడా? ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో కూడా ఇంత అహంకారం, ఇంత ఉన్మాదం, ఇంత తెగింపూ ఎలా సాధ్యమవుతున్నాయి?

ఇప్పుడు మనం ఏమీ నియండల్ మానవులతో తలపడుతున్న వాళ్ళం కాదు. అనాగరిక బర్బర యుగంలో ఏమీ మనం లేము. రాజ్యాలు, రాచరికాలు మట్టి గలిసి చాలా రోజులయింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ఒక అణుబాంబు ప్రయోగం మనకు నేర్పాల్సినన్ని పాఠాల్ని నేర్పాయి. శతాబ్దాల తరబడి చెమటోడ్చి సాధించుకొన్న విజ్ఞానంతో, విచక్షణతో, విలువలతో మనల్ని మనమెంతో మానవీకరించుకున్నామనుకుంటున్నాం. సగటు మనిషి చైతన్యం చరిత్రలో ఎప్పుడు ఎదగని స్థాయికి చేరిందని కూడా గర్వపడుతున్నాం. శాంతీ, సుహృద్భావం తప్ప మన ముందు మరో ప్రత్యామ్నాయం లేదనీ మనకు తెలుసు. అయినా ఒకే ఒక్క అధినేత ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపొయ్యేలా చెయ్యగల్గాడన్నదీ వాస్తవం. ఇంతకన్నా విషాదం, దుర్మార్గం ఏముంటాయి?

ఈ దుస్థితికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ఇప్పటికీ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సామ్రాజ్యవాద అధిపత్యం. సైన్సూ, సంపదలూ, ఆయుధాలూ, వనరులూ మొత్తం దాని చేతిలో కేంద్రీకృతం కావడం. ఏ మాత్రం పట్టు సడలుతుందన్నా అది పడే తాపత్రయం, చేసే తెగింపూ. దీనికి ముగింపు లేనంతవరకు భూమండలం ఎన్నిసార్లయినా యుద్ధాలతో సతమతమవుతూనే వుంటుంది. ఒక్కోసారి ఒక్కో దేశం వంతు.ఒక్కోసారి ఒక్కోసాకు.అంతే!

రెండోది జడలు విప్పుతున్న జాత్యహంకారం. ఆశ్చర్యంగా ప్రపంచం మనం చూస్తుండగానే మితవాదంలోకి కూరుకు పోతోంది. ఈ ప్రపంచం లెక్కలేనన్ని విస్తరణలతో, వలసలతో, ఇచ్చిపుచ్చుకోడాలతో, సాంకర్యాలతో ఈ రూపంలోకి వచ్చిందన్న స్పృహను మనం కోల్పోతున్నాం.  సంకుచిత జాతి మత దురహంకారాల్లోకి కూరుకు పోతున్నాం. మనకు తెలియకుండానే మనల్ని ఒక విద్వేషభూతం ఆవహిస్తోంది. బౌద్ధం లాంటి ధర్మం, సత్యాగ్రహం లాంటి వారసత్వం కలిగిన మనదేశంలోనే శాంతి, సామరస్యం లాంటి మాటలు కాలం చెల్లినవన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వీటిలో మొదటిది స్పష్టం. అది బహిరంగంగా కనిపిస్తూనే వుంటుంది. దీన్నిఏవగించుకోడం సులభం. ఎదిరించడమూ కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. అనివార్యంగా దానికి ప్రతిఘటన వుంటుంది. ఇందుకోసం బలిదానాలకూ మనం సిద్ధమవుతాం. చరిత్ర నిండా దీనికి బోలెడు సాక్ష్యాలున్నాయి. అనుభవాలున్నాయి వాటినుంచి మనకు కావలసినంత స్ఫూర్తి కూడా ఉంది.

రెండోదే అంతు పట్టకుండా అల్లుకుపోతుండేది. తెలియకుండానే నరనారాలకు పాకి పోతుండేది. మానవుడి సునితత్వాన్నంతా సర్వనాశం చేస్తుండేది. విజ్ఞతకు, విచక్షణకు సమాధి గట్టి మనిషిని మూర్ఖుడిగా మారుస్తుండేది. తనకు తెలియకుండానే తన్నుతాను మనిషిని కాకుండా చేస్తుండేది.

ఇప్పుడు మనం భయపడాల్సింది దీన్ని గురించి. మేల్కొనాల్సింది దీన్నుంచి బయటబడ్డం గురించి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *