సంపాదకీయం
జాత్యభిమానమూ, భాషాభిమానమూ రెండు అక్కాచెల్లెళ్ళు. ఒకదాని వెంట ఒకటి మనల్ని ఆవహిస్తుంటాయి. ఆవేశపరుస్తుంటాయి. తమ భాష ఎంతో సుందరమైందనీ, తియ్యనిదనీ ఎవరికి వారికి మమకారం వుంటుంది. ఇది హద్దులు దాటి ఇతర భాషలను కించపరిచే దాకా వెళ్లడంతో పాటు తమ భాష ఒక్కటే కలకాలం భూమిపై నిలబడాలన్న కోరికా, నిలబడుతుందన్న భ్రమా కూడా మనల్ని వెంటాడుతుంటాయి. సహజంగా తమ తమ భాష చుట్టూ దీనికి తగ్గట్టు కథనాలు, పండిత చర్చలూ కూడా నడుస్తుంటాయి.
భాష కేంద్రంగా జాతి నిర్మాణం, జాతి సమీకరణ ప్రయత్నాలు కూడా ఇటీవల మొదలయ్యాయి. దీంతో అంతరించిన భాషల్ని పునరుద్ధరించే ప్రయత్నాలు సాగుతున్నాయి. భాషతో జాతికి, సంస్కృతికి, నాగరికతకు మధ్య ఉన్న విడదీయరాన్ని సంబంధం దీనికి శక్తివంతమైన ప్రేరణగా నిలుస్తోంది.
కానీ మనకెంత భావావేశం వున్నా భాషలేమీ స్వతంత్రమైనవి గావు.వాటికవే మనుగడ సాధించలేవు, విస్తరించలేవు, అభివృద్ధి చెందలేవు. అందువల్ల చరిత్ర, సాంకేతిక విజ్ఞానం సమాజంలో మార్పులు తెచ్చే కొద్దీ భాషలూ మారిపోతుంటాయి. ఒక్కోసారి రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతుంటాయి. అంతరిస్తుంటాయి కూడా.
మరి ప్రస్తుత శాస్త్ర సాంకేతికత పరిణామాలు భవిష్యత్ భాషా ప్రపంచానికి ఏ రూపాన్నివ్వబోతున్నాయి? ఏ భాషకు ఏ స్థానాన్ని కట్టబెట్టబోతున్నాయి? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ రంగంలో అపారమైన కృషి చేసిన వాడు డేవిడ్ క్రిస్టల్. ఆయన గొప్ప అంతర్జాతీయ భాషతత్వవేత్త. ఆయన గ్రంథం “The Language Revolution- The Glossary of Netspeak and Textspeak” ఆధునిక యుగ భాషా పరిణామాలపై సాధికార గ్రంథం.
క్రిస్టల్ స్వయంగా దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం అంతరించిపోయిన వేల్ష్ భాషను పునరుద్ధరించినవాడు. ఇప్పుడా యన కృషి ఒక మోడల్ ! క్రమంగా వేల్ష్ నిలదొక్కుకుంది. ప్రజలు దీన్ని హత్తుకోవడం మొదలుపెట్టారు. అయితే దీనికి తనను ప్రశంసించడం కన్నా వేల్ష్ దుస్థితి తమ భాషలకు రాకుండా చూసుకోవాలని ఆయన హితవు చెబుతుంటాడు.
ఈ పునరుద్ధరణ యత్నాల్లో హిబ్రూది మరో కథ. వాస్తవానికిది క్రీస్తు శకం 200 -400 మధ్యలోనే అంతరించిపోయింది. యూదులు ప్రపంచమంతా చెల్లాచెదరు కావడంతో ఎక్కడి వారికి అక్కడి భాష మాతృభాషగా మారిపోయింది. ఈ దుస్థితిని మార్చి యూదు జాతిని ఏకీకృతం చెయ్యడం కోసం బెన్ యషూదా ( Ben Yashoda) 1880 లో పెద్ద ఉద్యమమే లేవదీశాడు. అతని లక్ష్యం ఒక కొత్త జాతిని ఉత్పత్తి ( Manufacture of new people) చేయడం. దీంతో ఒక హైబ్రిడ్ హిబ్రూ తయారైంది. కొత్త ఉచ్చారణ, కొత్త పదజాలం, కొత్త వాఖ్యవిన్యాసం (syntax), కొత్త లిపి అంతా కొత్తగా, కృత్రిమంగా ఎవ్వరూ మాట్లాడని ఒక భాష రూపుదిద్దుకొంది! పాత బైబిల్ హిబ్రూకు దీనికి సంబంధమే లేదు. కాకుంటే దీని పేరు హిబ్రూ అంతే ! ఇజ్రాయిల్ ఏర్పడ్డాక 1948 నుంచి అది అధికారభాషగా మారి యూదులందరినీ ఏకం చేసి, ఎక్కడెక్కడి వారినీ ఇజ్రాయిల్ కి రప్పించి చివరికి ఒక ఉన్మాద జాతి నిర్మాణానికి దోహదపడింది! ఒక కొత్త భాష ఒక పాత జాతిని ఏకం చేసి ఇంత శక్తివంతంగా మార్చడం చరిత్రలో ఇదే మొదటిసారి.
దీన్ని ఆదర్శంగా తీసుకొని యూరోపియన్ సెటిలర్స్ ఆఫ్రికాలో కూడా డచ్ భాష నుంచి విడగొట్టుకొని ఆఫ్రికనా భాషను నిర్మించుకున్నారు. ఇది వారి అస్తిత్వ పోరాట ఫలితం.
ఒకవైపు పునరుద్ధరణ, పునర్నిర్మాణ ప్రయత్నాలు ఇలా జరుగుతుండగా మరోవైపు రెండు వారాలకు ఒక భాష అంతరిస్తోంది. ఈ శతాబ్ది చివరికి ప్రపంచంలోని సగం భాషలు అంతరిస్తాయని ఒక అంచనా. నిజానికి ప్రస్తుతం కేవలం నాలుగు శాతం భాషల్ని 50 శాతం ప్రజలు మాట్లాడుతున్నారు. మిగిలిన 96 శాతం భాషల్ని 50శాతం జనం మాట్లాడుతున్నారు.
వలసాధిపత్యం కారణంగా ఇంగ్లీషు రెండో భాషగా ప్రపంచాన్ని ఏలుతోంది. అందునా అమెరికన్ ఇంగ్లీషుది ఆధిపత్యం. మూల ఇంగ్లీషు (బ్రిటిష్) కాస్తా వెనక్కి పోయింది. ఇప్పుడు మనం మాట్లాడే ఇంగ్లీషులోని 80 శాతం పదాలు దానివి కావు. గత వెయ్యేళ్లలో 350 భాషల నుంచి దానిలోకి ఒక ప్రవాహంలా వచ్చి చేరినవి. ఇదే ఇంగ్లీషు గొప్పదనం కూడా. ఈరోజు కూడా అత్యున్నత స్థాయి సైన్సు జర్నల్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉన్న మాట నిజం. అయిదు కోట్ల మంది పరాయి భాషల పిల్లలు దేశం బయట ఇంగ్లీష్ విద్యను అభ్యసిస్తున్న మాట కూడా నిజం. దాదాపు అన్ని దేశాలు ఇంగ్లీషును పాఠశాల స్థాయి నుంచే అకడమిక్ భాషగా ఆమోదించాల్సి వస్తోంది. ఇంగ్లీషుతో పాటు ఒక పరాయి సంస్కృతి కూడా విస్తరిస్తోందని చాలా దేశాలు కలవర పడుతున్నాయి. జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు ప్రతిఘటనకు సిద్ధమయ్యాయి కూడా. కారణం భాషంటే కేవలం పదాలు వాక్యాలు మాత్రమే కాదు. ఒక సంస్కృతిని కూడా అది మోసుకొస్తుంది.
ఇప్పుడు ఒకవైపు ప్రపంచీకరణ మరోవైపు డిజిటల్ యుగం ఒకదానికొకటి తోడుగా దూసుకొస్తున్నాయి. మరోవైపు ఆర్థిక రాజకీయ సాంకేతికాల్లో ప్రపంచ దేశాల మధ్య తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. దీంతో పాత ఆధిపత్యాలకు గండిపడి కొత్త శక్తులు పోటీ పడుతున్నాయి. మరి ఇప్పటిదాకా విస్తృతిలోనూ, అధిపత్యంలోనూ ఎంతో ముందున్న ఇంగ్లీషు లాంటి భాషల భవిష్యత్తు ఏమిటి? అంతరించిపోవడానికి సిద్ధంగా వున్నాయనుకుంటున్న చిన్నచిన్న భాషలు ఏమైపోతాయి? అసలు ఈ కొత్త యుగంలో భవిష్త్యత్ భాషా ప్రపంచం ఎలా వుండబోతోంది? ఈ ప్రశ్నల్ని డేవిడ్ క్రిష్ క్రిస్టల్ లేవదీస్తున్నాడు.
రాబోయే కాలంలో ఒక భాషావిప్లవం రానున్నదని, దీన్ని డిజిటల్ విస్తరణా, కృత్రిమ మేధా, ప్రపంచీకరణా నిర్ణయిస్తాయని ఆయన అంటాడు. ఆయన నిర్ధారణ ప్రకారం స్థానిక చిన్న చిన్న భాషలు కూడా సొంత ప్లాట్ ఫారాలు ఏర్పరచుకుంటాయి. డ్యుయోలింగో (Duolingo) లాంటి లెర్నింగ్ యాప్స్, LLM (Language Learning Models) లాంటివీ వచ్చి భాషల మధ్య హద్దుల్ని చెరిపేస్తాయి. అనువాదంలో కృత్రిమ మేధ రాజ్యమేలుతుంది. అంతర్జాలం (Internet ) స్థానికీకరణ చెందుతుంది. ఇప్పటిదాకా కంప్యూటర్లభాష ఇంగ్లీషు కావడంతో దాని ప్రాబల్యానికి కొత్త రెక్కలొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారిపోతుంది. కీబోర్డులు లేని వాయిస్ ఇంపాక్ట్ కంప్యూటర్లు వచ్చేసాయి. దీంతో స్థానిక భాషలకు కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ భాషాధిపత్యం ఇంగ్లీషుకి ఇక సాధ్యం కాని స్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా ప్రపంచంలోని 40 శాతం ప్రజలు మాత్రమే ఒకే భాషపై ఆధార పడ్డవారు. భారత్ లో ట్విట్టర్ భాషగా ఇంగ్లీషు 2019 నాటికే సగానికి తక్కువగా వుందని ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి అంటున్నారు. అలా తమ ప్రొడక్ట్స్ లో మార్పులు ఇప్పటికైతే తెచ్చినట్టు ఆయన ప్రకటించాడు.
దాదాపు 100 భాషల్లో ఏ భాష నుంచి ఏ భాష కైనా అనువాదం ఇంగ్లీషుతో నిమిత్తం లేకుండా ఇప్పటికే అందుబాటులో ఉంది. వాస్కో పెడ్రో CEO -UNBABEL ప్రకారం 1998 నాటికి 85 శాతంగా ఉన్న ఇంగ్లీషు కంటెంట్ 2018 కల్లా ఇరవై శాతానికి పడిపోయింది. ఆంగ్లేతర టూల్స్ వచ్చేసాయి. ఇక మన భాష చాలు, ఇతరుల భాష అవసరం లేదు అనే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మూలభాషలోని సౌందర్యం, ఉచ్చారణప్రత్యేకత, మాండలికాలు, వాఖ్య విన్యాసాలు లాంటివి ఏమవుతాయి అనే వాళ్ళు లేకపోలేదు. ప్రపంచ సాహిత్యమంతా మన భాషలోనే వస్తే ఇక సారస్వం ఏముంటుందని, బహుళత్వం ఏమైపోతుందని భయపడే వాళ్ళూ లేకపోలేదు. కానీ సామాన్యుడు భాషా హద్దుల్ని చెరిపేసుకోగలడం కన్నా పెద్ద ప్రయోజనం ఏముంటుంది ? ఇప్పుడు కూడా మనం రెండు మూడు భాషల్నే గదా నేర్చుకుంటున్నాం. అప్పుడూ అలానే నేర్చుకోవచ్చు. తమకిష్టమైన భాషలోని తియ్యందనాన్ని ఆస్వాదించవచ్చు.
ఇప్పుడు భాషలు నేర్పడం పెద్ద పరిశ్రమ, పెద్ద వ్యాపారం. దాని లావాదేవీలు 2022 నాటికి 3.69 ట్రిలియన్ల డాలర్లు. ఏడాదికి 15.9 శాతం అభివృద్ధితో ఇది 2028 కల్లా 8.9 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందని ఒక అంచనా. డిజిటల్ విప్లవలం దీనికి అడ్డుకట్ట వేయడం ఖాయమన్పిస్తోంది. అలానే భాషలు నేర్చుకోవడం మార్కెట్ తో కూడా ముడిపడి వుంది. ఈ కోణం నుంచి చూస్తే ఇప్పటికే మాండారిన్ సవాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లీషును కాదని మాండారిన్ ముందుకొచ్చేనా? ఏమో దాన్నీ కొట్టి పారేయలేము. ఇప్పటికే మాండారిన్ ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ మంది నేర్చుకునే భాష. డాలర్ బలహీనపడి చైనా కరెన్సీ ప్రత్యామ్నాయంగా మారితే ఇంగ్లీషుకు మరిన్ని కష్టాలు తప్పవు.
కానీ ప్రస్తుతానికి ఇంగ్లీషు ప్రాబల్యం అది శాస్త్ర సాంకేతికాల భాషగా చలామణి కావడంలో ఉంది. అందువల్ల ఇంగ్లీషు బలహీన పడటం కన్నా ఇతర భాషలు దానికి సమ ఉజ్జీలుగా మారుతాయనుకోడం మంచిది. ఇప్పటికే కనీసం రెండు భాషల్ని విద్యావంతులందరూ నేర్చుకునే రోజు వచ్చేసింది. ఆ భాషలు ఇంగ్లీషు, మాండారిన్ కావడం స్పష్టంగా కనపిస్తోంది. ఒక్క మృండారిన్ మాత్రమే గాదు ఫ్రెంచి, జర్మనీ, స్పానిష్, హిందీ లాంటి భాషలు కూడా రెండవ భాషలుగా పోటీ పడే అవకాశాలున్నాయి. ఫలితం ఇంగ్లీషు వాటి సరసన ఒకానొక ద్వితీయభాషగా మిగిలిపోవడం.
ఏది ఏమైనా ఈ ధోరణి వల్ల ప్రపంచంలోని 6000 భాషలు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటాయి. ఇప్పటికే వంద భాషల్లో పరస్పర అనువాదం సుసాధ్యమైపోయిందని చెప్పుకున్నాం. ఇది వేగంగా విస్తరిస్తుంది. మనలాంటి బహుళ భాష దేశాలకిది వరంగా మారుతుంది. భాషా బాహుళ్యమంటే సంస్కృతుల బాహుళ్యమే. ఒక భాష మరణించడమంటే ఒక సంస్కృతి అంతరించటమే. ఈ డిజిటల్ విప్లవ ఆలంబన చిన్న చిన్న భాషలను కూడా రక్షించుకునే వైపు ఆయా భాషల్ని పురికొల్పవచ్చు. దీంతో వేల్ష్, హాబ్రూల దుస్థితి ప్రపంచంలో ఏ భాషకూ రాకపోవచ్చు.
ఇలా చూస్తే శాస్త్ర సాంకేతిక విప్లవం భవిష్యత్ భాషా ప్రపంచపు రూపురేఖల్ని మార్చేస్తుందన్నమాట. బహుళ భాషా ప్రపంచానికి బాసటగా నిలబడబోతుందన్నమాట. ఇంగ్లీషు భాషాప్రాబల్యానికే గాదు ఏదో గుప్పెడు భాషల ఆధిక్యానికి, తద్వారా ఆ జాతుల సాంస్కృతిక ఆధిపత్యానికి గండికొట్టబోతుందన్నమాట. భాషా ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వబోతోందన్న మాట!



