చాలామంది సైన్సు పుట్టుక విశ్వజనీన సత్యశోధన కోసమే అనుకొంటారు. దాని కృషి అంతా మానవాళి శ్రేయస్సు కోసమే అని భ్రమ పడుతుంటారు. అదే నిజమైతే సైన్సు యుద్ధాల కోసం, నిఘావ్యవస్థల కోసం ఎందుకు ఉపయోగపడుతోంది? అసమానతల్ని మరింత సుస్థిరం చేసేందుకు ఎందుకు దోహదపడుతోంది ? ఎందుకు బిలియన్ల కొద్దీ డాలర్లు కొన్ని జబ్బుల మీద పరిశోధన చేసేందుకే ఖర్చు చేస్తున్నారు? కొన్నిటిని గురించి ఎందుకు పట్టించుకోడం లేదు? అసలు సైన్సు లేవనెత్తాల్సిన ప్రశ్నలు ఏమిటి? ఇచ్చే సమాధానాలుఏమిటి ? ఈ ప్రశ్నల వెనుక వున్నదెవరు ? ఈ సమాధానాలు ఎవరి ప్రయోజనాల కోసం?

వీటిని డీగో కాజ్లోవ్ స్కీ, నస్తోమీ షోకిడా, కరోలినా ప్రాడియార్ చాలా ప్రతిభావంతంగా లేవనెత్తి చర్చిస్తారు. సైన్సుకీ సమాజానికీ మధ్య గల సంబంధాన్ని విశ్లేషిస్తారు.

దీని సారాంశం ఏమంటే సైన్సుకూ, చరిత్రకూ సంబంధం లేదనుకోవడం తప్పని. రాజకీయాల్ని, ఆర్థిక అంశాల్ని సైన్సు నుంచి విడదీసి చూడరాదని. సైన్సు తానున్న సమాజం నుంచే పుట్టుకొచ్చి మార్పులకు లోనవుతుందని. మళ్లీ ఆ సమాజాన్ని మార్చడానికి ఉపకరిస్తుందని.

సైన్సుకూ సమాజానికి మధ్య గాఢానుబంధం వుందనుకున్నాక మనకు ఎదురయ్యే మొదటి సమస్య కార్పొరేట్ కంపెనీలకు, ప్రభుత్వాలకు, ధనవంతులకు సైన్సు కోసం భారీ పెట్టబడులు పెట్టాల్సిన అవసరం దేనికొచ్చిందని.

దీనికి కారణం పోటీ! పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థలో పోటీదారుల కంటే తక్కువ రేటుతో, ఎక్కువ సమర్ధవంతంగా వస్తూత్పత్తి చేయాలి. వ్యాపారుల మధ్య పోటీలో ఇది అనివార్యం. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో, యంత్రాలతో, పద్ధతులతో, సామగ్రితో మాత్రమే ఇది సాధ్యం. సాంకేతిక ఆవిష్కరణలు శాస్త్ర జ్ఞానం లేకుండా సాధ్యం కావు. దీంతో వ్యవస్థాగతంగానే పెట్టుబడిదారీ సమాజంలో సైన్సుకి ఒక డిమాండ్ వుండి తీరుతుంది. ఇదేదో ఒక కంపెనీ, ఒక ప్రభుత్వం సైన్సుకు ప్రాధాన్యత నివ్వడం వల్ల కాదు. మొత్తం ఆర్థిక పోటీనే శాస్త్ర జ్ఞానపు నిరంతరాభివృద్ధికి చోదక శక్తిగా వుంటుంది. మార్క్సు మాటల్లో చెప్పాలంటే “సైన్సు ఒక ప్రత్యక్ష ఉత్పత్తిశక్తి, ఆర్థిక విలువ సృష్టికి కీలకం”

ఈ పోటీ పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. సైన్సు అవసరాల్ని, నిధులు లభించే రంగాలని, పరిష్కారం కావలసిన వాటి ప్రాధాన్యతలను ధనవంతుల ఆర్థిక ప్రయోజనాలే ప్రభావితం చేస్తాయి.

అట్లని సైన్సులోని ప్రతిదీ వ్యాపార పోటీ కోసమే అనలేము. సైన్సు ప్రాథమిక సైన్సు (Basic Science), అనువర్తిత సైన్సు(Applied Science) అని రెండు రకాలు. మొదటిది మూల సూత్రాలకు సంబంధించిన అన్వేషణ చేస్తుంది. దీనివల్ల తక్షణ ప్రయోజనం ఉండదు.రెండోది తక్షణ సమస్యల్ని పరిష్కరించేది. నిర్దిష్ట అవసరాలని తీర్చేది. దీనిలో వెంటనే లాభాలు ఉంటాయి.

ఈ విభజన కూడా రాజకీయ కోణాన్నించి మనం చూడాలి. ప్రాథమిక సైన్సు రిస్కుతో కూడింది. దశాబ్దాల తరబడి ప్రత్యక్షంగా ఉపయోగపడేది దీనివల్ల ఏమీ ఉండదు. ఏ ఒక్క కంపెనీ తానుగా దీనిలో పెట్టుబడి పెట్టలేదు. కారణం పెట్టుబడీ దారులకు తక్షణ లాభాలు కావాలి. పేటెంట్లు, వ్యాపార రహస్యాలు వారికి ముఖ్యమైనవి.

ఫలితం ఏమిటి? ప్రజల సొమ్ముతో పునాది జ్ఞానాన్ని సంపాదించాలి. దీన్ని వాడుకొని కంపెనీలు తక్షణ లాభాలు సంపాదించుకుంటాయి. ప్రభుత్వాలు,విశ్వవిద్యాలయాలు శాస్త్రవేత్తలకు తర్ఫీదునిస్తాయి. జనం సొమ్ముతో నూతన శాస్త్రావిష్కరణలు జరుగుతాయి. ప్రైవేటు కంపెనీలు దీన్ని వ్యాపారీకరించి, ఉత్పత్తులు చేసి మళ్లీ అదే ప్రజలకు అమ్ముతాయి. లాభాలు గడిస్తాయి
మనమేమో యంత్రాల రూపంలో, సాంకేతిక రూపంలో, కంప్యూటర్లు, ఎరువులు, వైద్య పరికరాల రూపంలో సైన్సు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందనుకుంటాం. కానీ సైన్సు మనకు తెలియకుండానే పెట్టుబడి పోగుబడ్డానికి దోహదపడుతుంది.

మేనేజిమెంట్ సైన్సు, సరుకుల నిర్వహణ, మనోవిజ్ఞానం, మానవ వనరులకు సంబంధించిన అధ్యయనాలు ఇవన్నీ వాస్తవానికి కార్మికులనుంచి మరింత శ్రమ పిండడానికే ఉపయోగపడతాయి. ఒక ఫ్యాక్టరీని ఎలా నడిపించాలి? ప్రపంచ వస్తురవాణా గొలుసును ఎలా నిర్మించాలి ? కార్మికుల్ని ఎలా సర్దుబాటు చెయ్యాలి? వీటన్నిటికీ సైన్సు దోహదపడుతుంది. ఇదంతా ఒకరకంగా చెప్పాలంటే సైన్సు యొక్క ఆర్థిక కార్యాచరణ.

అలాగే వైద్యం, విద్యా కూడా. వీటి కోసమూ ప్రభుత్వం పెట్టుబడిదారులు అంతో ఇంతో వెచ్చిస్తారు. కారణం వారికి ఆరోగ్యవంతులైన, విద్యావంతులైన శ్రామికులు కావాలి.

దీనర్థం వైద్యమూ విద్యా అనర్ధదాయకమైనవని గాదు. నిజానికి వాటి వల్ల మంచి మానవులు రూపొందుతారు. కానీ మనకు వుండవల్సింది సైన్సుకు బహుళ ప్రయోజనాలుంటాయన్న స్పష్టత. యజమానుల, కార్మికుల ప్రయోజనాలు రెండూ ఒకటే కావన్న స్పష్టత.

మనం గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమంటే సైన్సు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే అందివ్వదు. అదొక దృక్పథాన్ని కూడా మనకు అందిస్తుంది. కొన్ని నమ్మకాలు, ఊహలు, స్థిరాభిప్రాయాలు కూడా సైన్సు వల్ల లభిస్తాయి.ఈ సమాజాన్ని అర్థం చేసుకునేందుకివన్నీ భూమికగా పనిచేస్తాయి మన సామాజిక వ్యవస్థ సహజమైందనీ, అది అనివార్యమైందనీ గతంలో మతం మనకు నూరిపోసేది. ఒప్పించేది. ఆధునిక యుగంలో ఈ పని సైన్సు చేస్తోంది. ఆర్థిక అసమానతలకు, స్త్రీ పురుషుల తేడాలకు, జాతి పరమైన న్యూనతాధిక్యాలకు శాస్త్రపరమైన సమర్థనల్ని సైన్సు అందిస్తోంది. ఈ సమస్యలు రాజకీయపరమైనవని గానీ, వ్యవస్థాగతమైనవని గానీ భావించకుండా సహజమైనవని నమ్మించే బాధ్యతను నెత్తికెత్తుకొంటోంది.

గతంలోనే కాదు ఇప్పుడు కూడా జీవ శాస్త్రాన్ని, వైద్యశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని స్త్రీ పురుష సమానత్వం పై అడ్డగోలు చర్చలు జరుపుతూనే వున్నారు. జన్యు శాస్త్రాన్ని, జనాభా శాస్త్రాన్ని వలసల్ని వ్యతిరేకించడానికి వాడుకుంటూనే వున్నారు. సామాజిక శాస్త్రాలు రాజకీయాల్ని విశ్లేషించడంలో పోషిస్తున్న పాత్ర కూడా ఏమీ తక్కువ దుర్మార్గమైంది కాదు.

 దీనర్థం శాస్త్ర నిర్ధారణలన్నీ పనికిరానివని కాదు. సైన్సు చెప్పే వాస్తవాలు అసలు వాస్తవాలే కాదని కాదు. సైన్సు ఆవిష్కరణల్ని ఒకానొక సామాజిక స్థితిని నిలబెట్టుకునేందుకు వాడుకుంటున్నప్పుడు మనం దీనివల్ల ఎవరు లాభపడుతున్నారని ప్రశ్నించాల్సి వుంటుంది. ఎవరి ప్రయోజనాల కోసం ఈ పరిశోధనలు జరుగుతున్నాయో, ఎవరిని దూరంగా పెడుతున్నారో గమనించాల్సి వుంటుంది.


నిధులు కేటాయించడాన్ని బట్టి సైన్సును ఎలా రాజకీయాలు తమకనుకూలంగా మలుచుకొంటున్నాయో మనం పసిగట్టువచ్చు. రాజకీయ ప్రయోజనాలు మారితే పరిశోధనారంగాలు కూడా మారిపోతాయి. దీనికి మంచి ఉదాహరణ ట్రంప్ అధికారంలోకి రాగానే చాలా సైన్సు పరిశోధనలకు ఫెడరల్ నిధుల్ని నిలిపివేయడం. దీంతో వైవిధ్యం, సమానత్వం, ప్రజలందరి అవసరాలు లాంటివన్నీ వెనక్కి పోయాయి. పర్యావరణ శాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. తమక దృక్పథానికి ఇబ్బందికరంగా ఉన్న రంగాలన్నింటి పరిశోధనలకు కత్తెర వేశారు. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటి? సైన్సు ఏ ఇతర కారణాలతోనో చెడిపోదు. ప్రభుత్వాలు దానికి కేటాయించే నిధుల తీరును బట్టి వక్రమార్గం పడుతుంది.

 శాస్త్రవేత్తలు కూడా తమకంటూ ఏ దృక్పథమూ లేని పరిశుద్ధాత్ములు గారు. వాళ్ళు దేన్ని పరిశోధించడానికి ఇష్టపడేది, ఏ ఉద్దేశాలతో ఆ రంగాన్ని ఎంచుకొనేది, ఏ వ్యాఖ్యానాలు విశ్లేషణలు వారు చేసేది ఇవి వారి సామాజిక స్థానాన్ని బట్టి, నేపథ్యాన్ని బట్టి, ప్రాపంచిక దృక్పథాన్ని బట్టి వుంటాయి. ఒకే లైంగికతకూ, ఒకే నేపథ్యానికీ, ఒకే వర్గానికీ, ఒకే జాతికీ చెందిన శాస్త్రవేత్తలున్నప్పుడు వారికి కొన్ని లోపాలు వుండి తీరతాయి. ఇదేదో ఉద్దేశపూర్వకమైంది కాదు. వ్యవస్థాగతమైంది.

అట్లని సైన్సును మనం కించపరచగూడదు. అడ్డుకోకూడదు. శాస్త్ర జ్ఞానాన్ని తోసిరాజన గూడదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మానవాళి రూపొందించుకున్న శాస్త్రీయ పద్ధతి, రుజువుకు ప్రాధాన్యత నివ్వడం లాంటి సాధనాలు చాలా శక్తివంతమైనవి. సమస్య సైన్సులో లేదు. దాని సామాజిక సంబంధాలతో ముడివడి వుంది. ఏ సైన్సు విద్యార్థులైనా బాధ్యతాయుతమైన పరిశోధకులు కావాలంటే తన వృత్తి జీవితంలో ఈ ప్రశ్నల్ని మాటిమాటికీ వేసుకుంటూ వుండాలి.

 – ఎవరు మన పరిశోధనకు నిధులు ఇస్తున్నారు? ఏ ప్రయోజనం కోసం ఇస్తున్నారు?

 – ఎవరి సమస్యలను తీర్చడానికి మన సైన్సు దోహదపడుతోంది? ఎవరిని వదిలేస్తోంది ?

 – ఏ ఉద్దేశాలు మన పరిశోధనా పద్ధతిని నిర్ణయిస్తున్నాయి? ఎవరి అనుభవాల నుంచి అవి వస్తున్నాయి?

 – మన అన్వేషణా ఫలితాలని ఎంత సద్వినియోగ పరుచుకొంటున్నారు? ఎంత దుర్వినియోగం చేస్తున్నారు? దీన్నిబట్టి తేలేదేమిటి సైన్సు ఎప్పుడూ నిష్పక్షపాత కార్యక్రమం కాదు. అదిరాజకీయాలతో ముడిపడి వుంది. సైన్సును ఆర్థిక డిమాండ్లు, రాజకీయనిర్ణయాలు, తాత్వికతధోరణులు నిర్ణయిస్తాయి. సైన్సు కూడా వీటిని అలానే ప్రభావితం చేస్తుంది. ఇలా సైన్సు భిన్న ప్రయోజనాల, విలువల,దృక్పథాల యుద్ధభూమిని సృష్టిస్తుంది.

 ఈ పరిస్థితిని చూసి విచారిస్తే ఫలితం లేదు. దీన్ని ఎదుర్కోవాలి. శాస్త్రవేత్తలు పూనుకుంటే తమ పరిశోధనల్ని ప్రజల కోసం ముందుకు సాగించగలరు. వద్దనుకుంటే దూరంగా ఉండిపోనూగలరు. వారు కొద్దిమందికి ఉపయోగపడాలో, జనబాహుళ్యానికి ఉపకరించాలో నిర్ణయించుకోగలరు. శాస్త్రవేత్తలు కార్మిక వర్గానికి చెందినవారు. వారొక గౌరవ స్థానంలోనే కాదు బాధ్యతాయుత స్థానంలోనూ వున్నవారు.

మరి తాము ఎలాంటి సైంటిస్టులు కావాలో మన విద్యార్థులే నిర్ణయించుకోవాలి!


(Kozlovski, Shokida & Pradier- “Science as a Battlefield: Knowledge, Capital Accumulation and Class Struggle” – Science for Peoples Magazine, Volume 27, No 2 ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *