గాంధీజీ సైన్సుబాట-2
–  డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు.

తెలిసిన విషయాల నుంచి మిగతా అంశాల్లోకి వెళ్లడం అనేది చాలా సులువైన, ఆరోగ్యకరమైన పద్ధతి. గాంధీజీ అనగానే అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం ఆయన రాసుకున్న స్వీయ చరిత్ర (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్). ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం కూడా! ఇందులో పేర్కొన్న విషయాలను, ఆయన చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకొని “గాంధీజీ సైన్స్ బాట” ఏమిటో పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం.

పరిశీలన, అధ్యయనం, ఇంగితం, స్పృహ, కామన్ సెన్సు, రాగద్వేష రాహిత్యం, హేతుత్వం, కార్య కారణ సంబంధాన్ని  గుర్తించడం మొదలైన గుణాలను విజ్ఞాన పరమైన శాస్త్ర దృష్టికి ఆనవాళ్లుగా మనం పరిగణిస్తాం. ఆధార రహితమైన అభిప్రాయాలను తిరస్కరించి, రాగద్వేషాలు లేకుండా పరిశీలించడం శాస్త్రీయ అభినివేశానికి చాలా కీలకం. గాంధీజీ “ఎక్స్పరిమెంట్స్” (ప్రయోగం) అనే పదాన్ని ఆషామాషీగా కాకుండా కచ్చితంగా వాడారు. ఆయన ఆలోచనల్లోని, ప్రవర్తనలలోని శాస్త్ర దృష్టి గురించి కొన్ని సంవత్సరాలు పరిశీలించి నేను కొన్ని వ్యాసాలు రాస్తూ వచ్చాను. అదే దిశలో ఈ వ్యాసంలో వారి స్వీయ చరిత్రను ప్రత్యేకంగా  విశ్లేషించడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాను.

అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే మొత్తం ప్రపంచమే గాంధీకి ప్రయోగశాల. తన జీవితమే ఒక ప్రయోగాల వరుస. దీన్నిలా పరిగణించడంలో మనం గందరగోళానికి లోను గావచ్చు. కానీ ఆయనకు మాత్రం ఇందులో చాలా స్పష్టత ఉంది. “తర్కానికి లోబడే ఏ సబ్జెక్టు కూడా కష్టం కాదని నాకు అర్థమైంది. అప్పటి నుంచి క్షేత్రగణితం నాకు సులభంగానే గాక ఆసక్తికరంగా కూడా వుండేది” అంటాడాయన. ఇంకా ఇంగ్లాండు చదువు గురించి చెబుతూ “ఇండియాలో నేను కెమిస్ట్రీ ఇష్టంగా చదివాను. కెమిస్ట్రీ చాలా ఆసక్తికరమైన సబ్జెక్టు. అందుకే మొదటిసారి కెమిస్ట్రీని ఎన్నుకున్నాను. కానీ ఇక్కడ కెమిస్ట్రీలో ప్రయోగాలు చేసే వెసులుబాటు లేదు. అందువల్ల కెమిస్ట్రీ మీద మోజు తగ్గింది. ఫలితంగా రెండోసారి కెమిస్ట్రీ కాదని ఫిజిక్స్ సబ్జెక్టు తీసుకున్నాను. త్వరలోనే అది కూడా సులభమేనని అనుభవమైనది” అంటారు. కెమిస్ట్రీ ఇష్టమైనా కూడా అదే రీతిలో అభ్యసించే అవకాశం లేనందున ఫిజిక్స్ ను తన రెండవ బెస్ట్ సబ్జెక్టుగా ఆయన చేసుకున్నారు. ఇందులో గాంధీజీ లోని ప్రాక్టికల్ దృష్టిని మనం గమనించాలి.

పరిశీలన తార్కికతలతో పాటు వాటిని జీవితంలో అన్వయించుకోవడంలో గాంధీజీ ముందుంటారు. నాన్న కావా గాంధీ  మరణ సమయంలో తన ప్రవర్తన గురించి చెబుతూ “మతం, ఆరోగ్య శాస్త్రం,లోకజ్ఞానం కలగలిపి లైంగిక సంపర్క నిషిద్ధం” అంటూ వ్యాఖ్యానిస్తారు. మరోచోట గాంధీజీ చేసిన పరిశీలన దాని ఆధారంగా చేసిన ప్రతిపాదన అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. “నిమ్న జంతువులపై మనిషి ఆధిక్యతకు అర్థం మనిషి జంతువులను చంపి భుజించాలని కాదు. మనిషి వాటి రక్షణకు కూడా తోడ్పడాలి” అంటూ అప్పటికి జరిగిన అధ్యయనాలు చివరి మాటగా మనకు చెబుతారు.  ఇది చాలా ఉత్కృష్టమైన సార్వత్రికమైన ఆలోచన సరళి. అలాగే మరొక చోట “పరిశుభ్రతకు భంగం వాటిల్లకుండా,  రోగికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా, పడకకు మరక పడకుండా స్నానంతో సహా అన్ని కార్యక్రమాలు పడకపైనే చేసుకోవచ్చని పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు నేర్పింది. అలాంటి శుభ్రత వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా ఉందని నా అభిప్రాయం” అని కూడా అంటారు. ఉపయోగపడే అలవాట్లను ఎక్కడ నుంచైనా అందుకోవడానికి ఆయన సదా సిద్ధం అని దీన్ని బట్టి గమనించవచ్చు విదేశాలకు వెళ్లడంలో కులం జోక్యం అనవసరమని తన అభిప్రాయంగా గాంధీజీ   అంటారు. దీనిపై చాలా రాడికల్ గా, విస్పష్టంగా ఆయన ఎలా చెప్పడో మనం గమనించాలి. పరిశీలనను జాగ్రత్తగా చేయడం, లోతుగా ఆలోచించడంతో ఆగకుండా మంచి బుద్ధితో దీర్ఘకాలికంగా సమాజానికి ఎక్కువ మేలు జరగగల నిర్ణయం తీసుకోవడం గాంధీజీ నైజం. ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన తొలి రోజుల్లో తాను చేయాల్సిన పని గురించి గుమాస్తా చెప్పింది అర్థం కాక బుక్ కీపింగ్ పుస్తకం కొని చదివి అర్థం చేసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికా వెళ్లిన వారంలోనే పీటరారిడ్జ్ బర్గ్ స్టేషన్ లో మొదటి తరగతి నుంచి ఆయన్ని తోసివేసినప్పుడు కూడా. ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసే ముందే రైల్వే నియమావళిని తెప్పించుకొని అధ్యయనం చేసి ఫస్ట్ క్లాస్ భోగీ ఎక్కాలని నిర్ణయించుకున్నారు.

అలాగే శాస్త్రవేత్త ప్రఫుల్లచంద్ర రే గారిని గోపాలకృష్ణ గోఖలే తనకు ఎలా పరిచయం చేశారో కూడా ఆత్మ కథలో గాంధీజీ వివరిస్తారు. రే తన జీతం ఎనిమిది వందల రూపాయలలో నలభై రూపాయలు తన వద్ద వుంచుకొని మిగిలిన 760 రూపాయలు ప్రజా సంక్షేమ కార్యక్రమానికి వినియోగిస్తారని తెలుసుకున్న తర్వాత ఆయన గాంధీజీకి జీవిత కాలపు మిత్రుడుగా మారిపోయారు. అదే అధ్యాయంలో గోపాలకృష్ణ గోఖలే గురించి రాస్తూ “అసత్యం కపటం ఆయన జీవితంలో మచ్చుకు కూడా కానరాదు” అంటారు. “ఆయన సాంగత్యం నాకు వరం, అది నా బుద్ధివికాసానికెంతో  తోడ్పడింది” అంటాడు.

తన జీవితాన్ని మార్చిన పుస్తకాన్ని గురించి చెబుతూ జాన్ రస్కిన్ రాసిన “Unto the last” (తెలుగులో చెప్పాలంటే సర్వోదయ) ప్రభావం గురించి వివరిస్తూ మిత్రుడు పోలక్ ఇచ్చిన పుస్తకాన్ని రైల్లో నిద్రపోకుండా 24 గంటల వ్యవధిలో చదివేశానంటాడు గాంధీజీ. సర్వోదయ సిద్ధాంతాలు ఇవి అంటూ ఇలా రాస్తారు.

  1. ఒక వ్యక్తి హితం సర్వజనుల హితంలో  ఇమిడి ఉంటుంది.
  2. వకీలు పనికి ఎంత విలువ ఉందో క్షురకుడి పనికి కూడా అంతే విలువ ఉంది. ఎందుకంటే జీవనోపాధి హక్కు అందరికీ సమానమే.
  3. శ్రమ జీవనం అంటే భూమిని దున్నేవాడి జీవితం, చేతులతో పని చేసే వారి జీవితం శ్రేష్ఠ మైన, సరైన జీవితాలు. ఈ మూడు అంశాలలో రెండవది మూడవది కలిసి మొదటిదానిలో ఉన్నాయని తనకు తేటతెల్లమైందని గాంధీజీ అంటారు

బుద్ధినైశిత్యం, తీవ్రమైన పట్టుదల, లోతైన ఎరుక, మెరుగైన రీతి, బోధపడగానే స్వీకరించే విజ్ఞత, రాగద్వేషాలు ఎరుగని హృదయం ఈ స్థాయిలో గాంధీజీ లో ఉంటాయి. ఇండియన్ ఒపీనియన్ పత్రికను గురించి రాసిన సందర్భంలో “విశృంఖలంగా సాగే ప్రతిదీ వినాశానికే దారితీస్తుంది” అని చెప్పగలిగే వివేకం ఆయన సొంతం.

చివరి మాటగాతన స్వీయ చరిత్ర రచన ప్రయోజనం గురి చెపుతూ ఆయన ఇలా అంటారు “సత్యాగ్రహం అనే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలను వివరించడమే ఈ రచన యొక్క లక్ష్యం. అంతే గానీ నేను ఎంత ఉత్తముడినో చెప్పడానికి మాత్రం కానే కాదు” అంటారు. మనం తెలుసుకోవలసింది ఏమంటే గాంధీజీ అత్యుత్తమమైన మానవుడు. దానికి కారణం ఆయనలోని రాగద్వేష రహితమైన వివేకం గల విజ్ఞానవంతమైన దృష్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *