– యుగంధర్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్….
అన్నారు గురజాడ వారు. కానీ మనుషులందరినీ మనం ఒకటిగా చూస్తున్నామా? అంత పెద్ద మాటలు ఎందుకు గానీ… మహిళలందరినీ ఒకే విధంగా చూస్తున్నామా?… ఒకే విధంగా గౌరవిస్తున్నామా?
“విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసి
సతిపతులను గూర్చి సమ్మతమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసేరా
విశ్వదాభిరామ వినురవేమ.”
అని వేమన గారు సూటిగా ప్రశ్నించారు….. అసలు “ముండమోయడం” అంటే ఏంటి ? అంటే భర్త చనిపోవడమా?. ఒకవేళ వేమన గారి ఉద్దేశం భార్య లేదా భర్త చనిపోవడం అయి ఉండాలి. కానీ సమాజం లో ఈ రెండింటిపై ఒకే విధమైన అవగాహన లేదు.
గతంలో సతి సహగమనం ఉండేది. భర్త చనిపోతే ఆయన చితి మంటల్లో భార్యను కూడా బలవంతంగా తోసి కాల్చి చేసేవారు. అట్ల కొన్ని లక్షల మంది మహిళలు చనిపోయిన తర్వాత రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్లు జరిపిన పోరాటం వల్ల సతిని నిషేధించారు, నిరోధించారు. (కానీ ఆ సాంప్రదాయం తిరగ తోడే ప్రయత్నం కోసం మళ్లీ రూప్ కన్వర్ ఉదంతం లాంటివి జరుగుతున్నాయి). కానీ వితంతు మహిళపై వివక్ష అక్కడితో ఆగిపోలేదు.
“పతి వియోగమగునె పడతికి శాపము
మదిని నుగ్గ బెట్టి మనగ గలుగు
తలలు బోడులైన తలపులు బోడులా
కందుకూరి పోరే నందుకొరకు.”… (అంతర్జాలంలో విజయభాస్కర్)
వితంతు మహిళలకు మరల వివాహం కోసం కందుకూరి లాంటి వాళ్ళు ప్రయత్నించారు. ఇప్పుడు సమాజంలో కొంతవరకు అవి జరుగుతున్నాయి. కానీ పునర్వివాహం జరక్కుండా మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
భర్త చనిపోతే ముఖం మీద “విధవరాలు” అని ముద్ర వేసి ఆమె జీవితాన్ని ఎండిపోయిన చెట్టులా మార్చేస్తారు. ఆమె తిరిగి చిగురించడానికి చిన్న ప్రయత్నం చేసినా కుటుంబం, సమాజము, “అరిష్టం, అనర్థం, అశుభం” పేరుతో చిదిమి పారేస్తారు.
భార్య చనిపోతే నెల తిరగకుండా పెళ్లి చేసుకునే మగవాడు వైధవ్యం ముద్ర లేకుండా కాలరెత్తుకొని తిరగగలడు. అది అరిష్టం కాదు. అది అశుభం కాదు. అది అనర్థం కాదు.
“మగవాడి పారిభాషిక నిఘంటువులో పెళ్ళాం చనిపోవడానికి అర్థం మళ్లీ పెళ్లికొడుకు కావడమే కదా” అంటారు మదురాంతకం రాజారాం గారు పునర్నవం కథలో.
అదే భర్త చనిపోతే మహిళను చీకట్లో తీసుకుపోయి గాజులు పగల గొట్టడం, చివరిసారిగా తల నిండుగా పూలు పెట్టి, ముఖమంతా పసుపు పూసి, ఇతర ముత్తెదువలు వెళ్లి చూడడం…. మళ్ళీ అవన్నీ తీసేసి ఆమె మీద వైధవ్యం ముద్ర వేస్తున్నారు. కానీ ఒక విషయం ఆలోచించండి. మహిళకు పూలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ భర్త వలన రాలేదు. చిన్నప్పుడు అమ్మ పెట్టినవే కదా. తాళి మాత్రమే భర్త కడతాడు. అతను పోతే ఇవన్నీ ఎందుకు దూరం కావాలి?
భర్త జీవించే ఉన్న పెద్ద మహిళను “పెద్ద ముత్తయిదువ” అని అన్ని శుభకార్యాల్లో పెద్ద హోదా ఇచ్చి అన్ని కార్యాలు ఆమె చేతనే చేయిస్తారు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. భర్త చనిపోగానే ఆమె దేనికీ పనికి రాకుండా పోతుంది. ఇక ఆమె వైపు ఎవరూ చూడరు. ఆమె మానసిక పరిస్థితి ఊహించండి.
నా స్నేహితుడు ఒకడు తన పెళ్లి గుర్తు చేసుకుంటూ “మా అమ్మ నా పెళ్లి చూడలేకపోయింది” అని బాధపడ్డాడు. ఎందుకంటే ఆమె వితంతువు. ఆమె వస్తే పెళ్లికూతురికి అరిష్టం కాబట్టి పెళ్లి సత్రం వైపు రాకుండా ఇంట్లో మూల కూర్చునింది. అన్ని కుటుంబాల్లో మనం కూడా వీటిని ఆచారాలుగా, కట్టుబాట్లుగా అంగీకరించి ఆమోదిస్తున్నాం. అసలు ఈ విషయం గురించి మనము సీరియస్ గా ఆలోచించడం లేదని అనుకుంటున్నాను. ఆ మధ్య ముఖ పుస్తకం (ఫేస్ బుక్)లో శ్రీదేవి గారు “తగులు పెట్టండి ఈ ఆచారాలను” అని చాలా ఆవేదనపడుతూ నిజాలను రాసారు.
“భర్త ఉన్న వారిని ఒకలాగా, భర్త చనిపోయిన వారిని ఒకలాగా చూసే అసమానతలు లేక వెనుకపాటుతనం ఎందుకు ఉంది. మన చుట్టూ అన్నీ మారుతున్నప్పుడు ఇవెందుకు మారవు?” అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె వేసిన ప్రశ్న మనందరికీ సూటి ప్రశ్న. ఆలోచిస్తామా? మన ఆలోచనలు మార్చుకుందామా??!
“వోల్గా సె గంగా”లో రాహుల్ సాంకృత్యాయన్ గారు ఆదిమ మానవుడి సమాజాన్ని చక్కగా వివరించారు. ఆ సమాజంలో మహిళే కుటుంబానికి, తెగకు పెద్ద. ఆమె కనుసన్నల్లోనే వ్యవహారమంతా నడిచేది. వేట ఆమె ఆధ్వర్యంలో జరిగేది. (ఈనాటికి కేరళ సమాజంలో మహిళ కుటుంబ పెద్దగా చూస్తూ ఉంటాం). తరువాత వ్యవసాయం అందుబాటులోకి వచ్చినప్పుడు మహిళ ఇంటికి పరిమితమైంది. మగవాడు పొలం పనుల్లో బయట వ్యవహారాలు చూసేవాడు. రాను రాను పురుషుడి ఆధిపత్యం పెరిగి పురుషాధిక్య సమాజం ఏర్పడింది. ఆస్తి పురుషుడి సొంతమయింది. స్త్రీ (భార్య) కూడా ఆ ఆస్తిలో ఒక భాగమే. అందుకే పురుషుడు చనిపోతే అతని ఆస్తి అయిన ఆ స్త్రీ ఎవరికీ దక్కకూడదు అని సతి సహగమనం పేరుతో ఆమెను చంపేసే వాళ్ళు. సతీసహగమనం నిషేధం తర్వాత భర్త చనిపోయిన స్త్రీ కి గుండు కొట్టించి, తెల్ల చీర కట్టించి, కఠిక పత్యం పాటించి బందీఖానా లో ఉంచేవారు. జీవచ్ఛవంలా చేసేవారు. ఆనాటి ఆ పురుషాధిక్య సమాజ భావజాలమే ఈనాడు పాటిస్తున్న ఈ వితంతు కట్టుబాట్లు.
ఈ ఆధునిక సమాజంలో మన ఆలోచనలు ఎంతో మారి అన్ని విషయాల్లో ముందడుగు వేస్తున్నా మనం ఈ పురాతన పురుషాధిక్య భావజాలాన్ని అలాగే కొన సాగిస్తామా? మారాలని ప్రయత్నిస్తామా?