ప్రొఫెసర్ వి. శ్రీనివాసచక్రవర్తి

రీల్స్‌, డోపమైన్‌, మన మెదడు చేసే చిన్న లెక్కలు

“ఒక్క రీల్ మాత్రమే చూస్తాను!”

ఫోన్ తీసుకున్నప్పుడు మనలో చాలామంది ఇలా అనుకునే ఉంటాం. ఒక రీల్ అయిపోతుంది. వేళ్లు వాటంతట అవే పైకి జరుపుతాయి. ఇంకో వీడియో వస్తుంది. అది అంతగా నచ్చకపోతే వెంటనే మరో స్వైప్. ఈసారి మాత్రం అదిరిపోయే వీడియో! దాని తర్వాత ఇంకోటి. “ఇదే చివరిది” అనుకునేలోపే అరగంట గడిచిపోయి ఉంటుంది.

అసలు ఈ చిన్న చిన్న వీడియోలకు అంత శక్తి ఎక్కడిది? మనలో సంకల్పబలం లేదా? లేక మన మెదడులోనే వాటికి అనుకూలంగా పనిచేసే ఏదైనా వ్యవస్థ ఉందా?

ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మన మెదడులోని ఒక ప్రముఖ రసాయన దూతను కలవాలి.

దాని పేరు డోపమైన్.

ఆనందం వచ్చినప్పుడు మెదడులో ఏమవుతుంది?
డోపమైన్‌ను చాలాసార్లు మెదడులోని “pleasure chemical” — ఆనంద రసాయనం అని పిలుస్తారు. మనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు, క్రికెట్ మ్యాచ్‌లో మన జట్టు గెలిచినప్పుడు, పరీక్షలో మంచి మార్కులు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు మెదడులోని డోపమైన్‌ వ్యవస్థ చురుకవుతుంది.

అయితే డోపమైన్ పని కేవలం “బాగుంది!” అని చెప్పడమే కాదు. అది మన మెదడుకు మరో ముఖ్యమైన సందేశం ఇస్తుంది:

“ఇది ముఖ్యమైనది. దీన్ని గుర్తుపెట్టుకో. మళ్లీ దీనిని పొందడానికి ప్రయత్నించు.”

అందుకే డోపమైన్‌ ఆనందంతో పాటు నేర్చుకోవడం, ప్రేరణ, ఏది విలువైనదో అంచనా వేయడం వంటి పనుల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇక్కడి నుంచే మన రీల్స్( Reels) కథ మొదలవుతుంది.

బహుమతి ద్వారా నేర్చుకునే మెదడు

ఒక చిన్న ఆట ఊహించండి. మీ ముందు రెండు బటన్లు ఉన్నాయి. ఎరుపు బటన్ నొక్కితే ఏమీ జరగదు. ఆకుపచ్చ బటన్ నొక్కితే మీకు పది పాయింట్లు వస్తాయి.

మొదట మీకు ఏది మంచిదో తెలియదు. ఒకటి నొక్కుతారు. తర్వాత ఇంకొకటి నొక్కుతారు. కొన్ని ప్రయత్నాల తర్వాత ఆకుపచ్చ బటన్ మంచిదని నేర్చుకుంటారు. ఇక దానినే ఎక్కువగా నొక్కుతారు.

ఇలాంటి నేర్చుకోవడాన్ని శాస్త్రవేత్తలు Reinforcement Learning, అంటే బహుమతి ద్వారా నేర్చుకోవడం, అంటారు.

ఇది కంప్యూటర్ గేమ్‌లలో మాత్రమే కాదు. మన జీవితం అంతటా జరుగుతుంది. ఒక పని చేస్తాం. మంచి ఫలితం వస్తే దాన్ని మళ్లీ చేయాలని మెదడు నేర్చుకుంటుంది. చెడు ఫలితం వస్తే దాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తుంది.

కానీ మెదడు ప్రతి అనుభవాన్ని ఒక విడివిడిగా ఉన్న జ్ఞాపకంలా మాత్రమే దాచదు. అది ఒక ప్రశ్న కూడా అడుగుతుంది:

“ఈ విషయం నాకు ఎంత విలువైనది?”

ఈ అంచనాను న్యూరోసైన్స్ లో విలువ (Value) అంటారు.

ఇక్కడ విలువ అంటే మార్కెట్ ధర కాదు. “ఇది చేస్తే నాకు ఎంత మంచి ఫలితం రావచ్చు?” అనే మెదడు లెక్క.

ఐస్‌క్రీమ్‌కు ఒక విలువ ఉంటుంది. స్నేహితుడి ఫోన్ కాల్ కు ఒక విలువ ఉంటుంది. గేమ్‌లో లెవెల్ పూర్తి చేయడానికి ఒక విలువ ఉంటుంది. అలాగే ఫోన్‌లో నోటిఫికేషన్ కనిపించినప్పుడు దానికీ ఒక విలువ ఉంటుంది.

మెదడు చేసే ఒక ఆసక్తికరమైన పొరపాటు

ఇప్పుడు ఒక పని చేస్తే మీకు ప్రతిసారీ 10 పాయింట్లు వస్తున్నాయని అనుకుందాం. మీ మెదడు దానికి అలవాటు పడుతుంది. “ఇది చేస్తే 10 పాయింట్లు వస్తాయి” అని ముందే ఊహిస్తుంది.

ఒక రోజు అకస్మాత్తుగా 100 పాయింట్లు వచ్చాయి!

అప్పుడు మెదడు అంటుంది:

“అరే! నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది!”

ఇలాంటి తేడాను శాస్త్రవేత్తలు రివార్డ్ ప్రిడిక్షన్ ఎర్రర్ (Reward Prediction Error-RPE) అంటారు.

సరళంగా చెప్పాలంటే:

నిజంగా వచ్చిన బహుమతి – ముందుగా ఊహించిన బహుమతి.

ఊహించిన దానికంటే మంచి ఫలితం వస్తే డోపమైన్ న్యూరాన్స్ (dopamine neurons) బలంగా స్పందిస్తాయి. “ఈ పని నేను అనుకున్నదానికంటే మంచి పని” అని మెదడు తన విలువ అంచనాను మార్చుకుంటుంది.

ఇలా మన మెదడు ప్రతి రోజు కొన్ని లక్షల చిన్న చిన్న లెక్కలు చేస్తూ ఉంటుంది.

బహుమతి విధానం (Reward System) అంటే ఏమిటి?

మన మెదడులో “ఆనందం” కోసం ఒకటే బటన్ ఉండదు. అనేక ప్రాంతాలు కలిసి పనిచేసే ఒక బహుమతి విధానం ఉంటుంది.

దానిలో ముఖ్యమైన ప్రాంతం వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (Ventral Tegmental Area), సంక్షిప్తంగా VTA. ఇది మెదడులో లోతుగా ఉండే చిన్న ప్రాంతం. ఇక్కడ డోపమైన్ తయారు చేసే చాలా న్యూరాన్స్ ఉంటాయి.

VTA నుంచి డోపమైన్ సంకేతాలు న్యూక్లియస్ అకంబెన్స్ (Nucleus Accumbens), లేదా విస్తృతంగా చెప్పాలంటే వెంట్రల్ స్ట్రైయటమ్ (Ventral Striatum), అనే ప్రాంతాలకు వెళ్తాయి. ఏదైనా పొందాలనే కోరిక, దాని కోసం ప్రయత్నించడం, బహుమతి (reward) ఆశించడం వంటి విషయాల్లో ఈ వ్యవస్థ ముఖ్యమైనది.

ఇంకో ముఖ్యమైన ప్రాంతం ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ (Orbitofrontal Cortex) — OFC. ఇది నుదుటి వెనుక భాగంలో ఉంటుంది. “ఈ అనుభవం ఎంత విలువైనది?”, “ఇది మంచిదా, ఇంకేదైనా మంచిదా?” వంటి పోలికలలో OFC పాత్ర వహిస్తుంది.

అలాగే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (Prefrontal Cortex) మన నిర్ణయాలు, లక్ష్యాలు, మనల్ని మనం నిగ్రహించుకోవడం (self-control) లో సహాయపడుతుంది. అమిగ్డాలా (Amygdala) భావోద్వేగాలను, హిప్పోకాంపస్ (Hippocampus) జ్ఞాపకాలను బహుమతి (reward) తో కలుపుతాయి.

అందుకే “ఇంకో రీల్ చూడాలా? లేక ఫోన్ మూసి పని చేయాలా?” అనేది బయటికి చిన్న నిర్ణయంలా కనిపించినా, లోపల అనేక మెదడు వ్యవస్థల మధ్య జరిగే పోటీ.

ఇప్పుడు రీల్స్ దగ్గరకు వద్దాం

ఒక రీల్ చూసిన తర్వాత వచ్చే వీడియో ఎలా ఉంటుందో మీకు తెలియదు.

బోరింగ్‌గా ఉండొచ్చు.

చాలా తమాషాగా ఉండొచ్చు.

మీకు ఇష్టమైన పాట వచ్చి ఉండొచ్చు.

మీ ఇష్టమైన క్రికెటర్ సిక్స్ కొట్టిన చిన్న వీడియో క్లిప్ కావొచ్చు.

ఒక అందమైన బుజ్జి కుక్కపిల్ల వీడియో కావొచ్చు.

లేదా మీకు తెలియనిఅద్భుతమైన విజ్ఞాన శాస్త్ర అద్భుతం (science fact) కావొచ్చు.

అంటే ప్రతి స్వైప్ లో ఒక చిన్న ఉత్కంఠ (suspense) ఉంది:

“తర్వాత ఏమొస్తుంది?”

ఈ reward-learning మెదడుకు చాలా ఆసక్తికరమైన పరిస్థితి. బహుమతి (reward) ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి చాలా మంచి వీడియో వస్తుంది. అందుకే మన మెదడు మరోసారి స్వైప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

ఇంతటితో కథ ముగియదు.

Instagram, TikTok, YouTube Shorts వంటి సామాజిక వేదికలు (platforms) మీరు ఏ వీడియో దగ్గర ఎంతసేపు ఆగారు, ఏది వెంటనే స్వైప్ చేశారు, దేనిని లైక్ చేశారు, దేనిని మళ్లీ చూశారు—ఇలాంటి సమాచారాన్ని గమనిస్తాయి. దాని ఆధారంగా తర్వాత మీకు నచ్చే అవకాశం ఉన్న వీడియోలను ఎంపిక చేస్తాయి.

అంటే ఒక విచిత్రమైన ఆట జరుగుతోంది.

మీరు కంప్యూటర్ అల్గోరిథం (algorithm) కు మీ ఇష్టాలు నేర్పుతున్నారు.
అల్గోరిథం మీకు ఏ వీడియోలు నచ్చుతాయో నేర్చుకుంటోంది.

TikTok చూస్తున్నప్పుడు VTA ఏమి చేస్తుంది?

2021లోNeuroImage journal లో వచ్చిన ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో పరిశోధకులు టిక్ టాక్ (TikTok) వీడియోలు చూస్తున్నప్పుడు మనుషుల మెదడు పనితీరుని (brain activity) ని fMRI తో పరిశీలించారు.

వారికి సాధారణ వీడియోలు ఒకసారి, టిక్ టాక్ అల్గోరిథం ప్రత్యేకంగా ఆ వ్యక్తి కోసం సిఫార్సుచేసిన వ్యక్తిగతీకరించిన (personalized) వీడియోలు మరోసారి చూపించారు.

వ్యక్తిగతీకరించిన (personalized) వీడియోలు చూసినప్పుడు కొన్ని brain regions మరింత చురుకయ్యాయి. వాటిలో ఒకటి మనకు ఇప్పుడు పరిచయమైన VTA.

అదే dopamine reward systemలోని ముఖ్యమైన ప్రాంతం.

అంటే recommendation algorithm కేవలం “మీకు నచ్చే videos”ను మాత్రమే ఎంపిక చేయడం కాదు. అవి మన reward systemను బలంగా ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది.

Short-video addiction ఉన్నవారి మెదడు ఎలా కనిపిస్తుంది?

2025 లోNeuroImage లో వచ్చిన మరో అధ్యయనం short-video addiction symptoms ఎక్కువగా ఉన్నవారి brain scans ను పరిశీలించింది.

వారిలో Orbitofrontal Cortex నిర్మాణంలోని కొన్ని తేడాలు addiction symptoms తీవ్రతతో సంబంధం చూపించాయి. OFC గురించి మనం ముందే చూశాం: rewardకు Value కేటాయించడంలో ఇది భాగస్వామిగా పని చేస్తుంది.

అలాగే dorsolateral prefrontal cortex, posterior cingulate cortex, temporal ప్రాంతాలు, cerebellum వంటి brain regions లో activity కూడా addiction symptoms తో సంబంధం చూపించింది.

ఇది చాలా ఆసక్తికరమైన finding. కానీ ఇక్కడ సైన్స్ లో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం.

ఈ అధ్యయనం వల్ల:

“ రీల్ చూడటం వల్ల మీ మెదడు తప్పకుండా ఇలా మారిపోతుంది” అని చెప్పలేం.

రెండింటి మధ్య సంబంధం కనిపించింది అంతే.

కొన్ని లక్షణాలు ముందే ఉండి, వాటివల్ల కొందరు short videos కు ఎక్కువగా ఆకర్షితులై ఉండవచ్చు. లేదా ఎక్కువ usage వల్ల మెదడులో మార్పులు రావచ్చు. లేదా రెండూ ఒకదానిని ఒకటి ప్రభావితం చేస్తూ ఉండవచ్చు.

సైన్స్ లో సహసంబంధం (correlation) కనిపిస్తే వెంటనే అదే కారణం (causation) అని చెప్పకూడదు.

“ఏదైనా మిస్ అవుతున్నానేమో!”

2025 లో వచ్చిన మరో longitudinal study లో 280 మందిని కొంతకాలం పాటు పరిశీలించారు.

అందులో ఒక ఆసక్తికరమైన psychological factor బయటపడింది:

FoMO — Fear of Missing Out.

“నా ఫ్రెండ్ ఏదో చూస్తున్నారు.”

“ఏదో జరుగుతోంది.”

“నేను ఫోన్ చూడకపోతే ఏదైనా కోల్పోతానేమో!”

ఇలాంటి భావన ఎక్కువగా ఉన్నవారిలో తర్వాత short-video addiction symptoms ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.

Negative emotions కూడా ఇందులో పాత్ర పోషించాయి.

అంటే రీల్స్ సమస్య కేవలం డోపమైన్ కథ కాదు. ఇందులో reward, attention, emotion, habit, curiosity, social information అన్నీ కలుస్తాయి.

మరి apps మన మెదడును “hack” చేస్తున్నాయా?

“రీల్స్ డోపమైన్ ను హైజాక్ చేస్తాయి” అని సోషల్ మీడియా లో తరచుగా వింటాం.

అది కొంచెం అతిశయోక్తి.

డోపమైన్ మన శత్రువు కాదు. డోపమైన్ లేకపోతే మనం కొత్త విషయాలు నేర్చుకోవడం, లక్ష్యాల కోసం ప్రయత్నించడం, ఆహారం కోసం వెతకడం, కొత్త అవకాశాలను అన్వేషించడం కూడా కష్టమవుతుంది.

మన reward system జీవించడానికి అవసరమైన అద్భుతమైన వ్యవస్థ.

కానీ short-video platforms ఒకేసారి కొన్ని శక్తివంతమైన అంశాలను కలిపాయి:

కొత్తదనం.
ఆశ్చర్యం.
బహుమతి (Reward).
సామాజిక సమాచారం (Social information).
తర్వాత ఏమొస్తుందో తెలియని అనిశ్చితి.

మన ఇష్టాలను నేర్చుకునే personalized algorithm.

అందుకే “ఇంకొక్కటి…” అనే చిన్న కోరిక మళ్లీ మళ్లీ పుడుతుంది.

రీల్స్ చూడటం తప్పా?

కాదు.

చిట్టి వీడియోల్లో(Short video) మంచి సైన్సు ఉంటుంది. మంచి సంగీతం ఉంటుంది. కళ ఉంటుంది. హాస్యం ఉంటుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ప్రపంచం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అసలు ప్రశ్న “రీల్స్ మంచివా? చెడ్డవా?” కాదు.

ప్రశ్న:

వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు?

మీరు ఫోన్‌ను ఎప్పుడు తెరవాలో మీరు నిర్ణయిస్తున్నారా?

లేక notification కనిపించగానే మీ చెయ్యి ఫోన్ వైపు వెళ్తుందా?

ఐదు నిమిషాలు చూడాలని అనుకుని యాభై నిమిషాలు చూస్తున్నారా?

అక్కడే reward-learning కథ మన జీవితంలోకి వస్తుంది.

మన మెదడు పదే పదే reward పొందే పనులకు విలువ పెంచుతుంది. కాబట్టి ఒక అలవాటును ఎంత ఎక్కువ practice చేస్తే, అది మెదడులో అంతగా నాటుకుపోతుంది.

అందుకే కొన్నిసార్లు ఫోన్ ను తెరవకుండా ఉండటం కూడా ఒక చిన్న brain-training exercise.

తర్వాత మీరు ఒక రీల్ స్వైప్ చేసినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి:

“నేను ఈ video- ను చూస్తున్నానా?

లేక నా మెదడు ‘తర్వాత ఏమొస్తుందో చూద్దాం’ అని నన్ను మరో స్వైప్ చేయిస్తున్నదా?”

ఎందుకంటే ప్రతి స్వైప్ తో రెండు వ్యవస్థలు మీ గురించి నేర్చుకుంటున్నాయి.

ఒకటి మీ మెదడు.
మరొకటి మీ ఫోన్లో ని అల్గోరిథం.

ఇవిరెండింటిలో చివరకు ఎవరు ఎవరిని ఎక్కువగా అర్థం చేసుకుంటారో — అదే అసలు కథ!

One thought on “ఒక్క రీల్ మాత్రమే… అన్నాక గంట ఎలా గడిచిపోతుంది?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *