వి.రాహుల్జీ

వేల ఏళ్ల నాటి ఎముకల నుంచి ఆధునిక మధుమేహం, గుండెజబ్బులు, అరుదైన వ్యాధుల వరకు… మన DNA చెబుతున్న ఆరోగ్య చరిత్ర

గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చి శిథిలాల్లో పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు కొన్ని మానవ అస్థికలు బయటపడ్డాయి. వందల సంవత్సరాలుగా మట్టిలో పడి ఉన్న ఆ ఎముకలు ఎవరివి? వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలంలో జీవించారు? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం చారిత్రక రికార్డులు, పురావస్తు ఆధారాల మీదే ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఆధునిక జన్యుశాస్త్రం ఆ పరిస్థితిని మార్చేసింది. ఎముకలు, దంతాల్లో మిగిలిపోయిన అతి సూక్ష్మమైన DNA ఆనవాళ్లను వెలికితీసి చదివే Ancient DNA (aDNA) సాంకేతికతతో వందల, వేల సంవత్సరాల క్రితం జీవించిన మనుషుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమైంది. భారతదేశంలాంటి వేడి, తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో పురాతన DNA త్వరగా దెబ్బతింటుంది. అయినప్పటికీ మెరుగైన పరిశోధనాపద్ధతులు, జీనోమ్ సీక్వెన్సింగ్(genome sequencing) పద్ధతులు అందుబాటులోకి రావడంతో గతంలో అసాధ్యమనుకున్న పరిశోధనలు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి.

మొదట ఈ పరిశోధనల దృష్టి ప్రధానంగా గతం మీదే ఉండేది. మన పూర్వీకులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, జనాభాలు ఎలా కలిశాయి, వేల సంవత్సరాల క్రితం ప్రజలు ఎలా జీవించారు వంటి ప్రశ్నలకు DNA ద్వారా సమాధానాలు వెతికారు. ఆ అన్వేషణలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. పురాతన మనుషుల DNA ను నేటి జనాభాల జన్యుపటంతో పోల్చడం మొదలుపెట్టినప్పుడు, మనం గతం నుంచి కేవలం రూపురేఖలనే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జన్యు లక్షణాలను కూడా వారసత్వంగా పొందుతున్నామనే విషయం మరింత స్పష్టమైంది. అక్కడితో Ancient DNA(aDNA) కథ చరిత్ర నుంచి వైద్యశాస్త్రంలోకి ప్రవేశించింది.

మన ఆరోగ్యాన్ని మనం సాధారణంగా నేటి జీవనశైలితో ముడిపెడతాం. ఏం తింటున్నాం, ఎంత వ్యాయామం చేస్తున్నాం, బరువు ఎంత ఉంది, నిద్ర ఎలా ఉంది, పొగతాగుతున్నామా, మద్యం తీసుకుంటున్నామా వంటి అంశాలనే ప్రధానంగా చూస్తాం. అవన్నీ ముఖ్యమైనవే. కానీ మన శరీరం ఈరోజు కొత్తగా తయారైనది కాదు. వేల తరాల పరిణామక్రమంలో రూపొందిన ఒక జీవ వ్యవస్థ (biological system) అది. మన పూర్వీకులు ఎదుర్కొన్న ఆహార కొరతలు, వాతావరణ పరిస్థితులు, అంటువ్యాధులు, వలసలు, జనాభా మార్పులు—వీటన్నింటి ప్రభావం మన జన్యు వారసత్వం (genetic inheritance) లో ఏదో రూపంలో కొనసాగుతోంది. అందువల్ల నేటి భారతీయుల్లో కనిపిస్తున్న కొన్ని ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవాలంటే ఆసుపత్రి రికార్డులను మాత్రమే కాదు, కొన్నిసార్లు వేల సంవత్సరాల వెనక్కి కూడా చూడాలి.

గుండెలో దాగిన పురాతన జన్యు ముద్ర

ఈ నేపథ్యంలో భారతీయుల గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఒక జన్యురూపం (genetic variant) ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. MYBPC3 అనే జన్యువులో కనిపించే మార్పు (25-base-pair deletion) దక్షిణాసియా జనాభాలో దాదాపు నాలుగు శాతం మందిలో ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. ప్రపంచంలోని అనేక ఇతర జనాభాల్లో ఇది చాలా అరుదు. ఈ మార్పు కార్డియోమయోపతి (cardiomyopathy) అనే గుండె కండరాల వ్యాధితో సంబంధం కలిగి ఉంది. గుండె కండరాల నిర్మాణం లేదా పనితీరు దెబ్బతిన్నప్పుడు గుండె శరీరానికి అవసరమైన రక్తాన్ని సమర్థంగా పంప్ చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో అది గుండె పోటుకు కూడా దారితీయవచ్చు.

అయితే ఇలాంటి పరిశోధనలను అర్థం చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. ఒక వ్యక్తిలో వ్యాధితో సంబంధం ఉన్న జన్యు రూపం (disease-associated genetic variant) ఉందంటే అతనికి ఆ వ్యాధి తప్పకుండా వస్తుందని అర్థం కాదు. వ్యాధి కారక జన్యువు ఉండటం వ్యాధి తప్పనిసరిగా రావటం (Genetic susceptibility, genetic destiny) ఒకటి కాదు. ఒక జన్యువు ప్రభావాన్ని ఇంకో జన్యువు మార్చవచ్చు. వయసు, ఆహారం, వ్యాయామం, ఇతర వ్యాధులు, పర్యావరణం వంటి అంశాలు కూడా ఆ వ్యాధి రావడం రాకపోవటాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ఆధునిక జన్యుశాస్త్రం ఒక వ్యక్తి భవిష్యత్తును జోస్యం చెప్పదు, అది అతనిలో ఉన్న ప్రమాదాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునే సాధనంగా ఉపయోగపడుతుంది.

అరుదైన వ్యాధుల వెనుక జన్యువులు

ప్రతి మనిషి జన్యువులో(genome) లక్షలాది జన్యు వైవిధ్యాలు (genetic variations) ఉంటాయి. వాటిలో అత్యధికం ఎలాంటి సమస్యను కలిగించవు. కొన్ని రకాలు మాత్రం వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా అంతర్లీన జన్యు రుగ్మతల (recessive genetic disorders) విషయంలో ఒక వ్యక్తి వ్యాధికారక జన్యువుని (disease-causing variant) ను కలిగి ఉన్నా అతనికి వ్యాధి బయటపడకపోవచ్చు. అతను వాహకంగా ఉండవచ్చు. తల్లి, తండ్రి ఇద్దరూ అదే జన్యువుకు వాహకం అయినప్పుడు, వారి పిల్లలకు రెండు
మార్పులు చేసిన జన్యువులు (altered gene copies) సంక్రమిస్తే వ్యాధి బయటపడే అవకాశం ఏర్పడుతుంది.

చాలా కాలం ఇతరులతో కలవకుండా ఉన్న చిన్న జనాభాల్లో, అరుదైన జన్యు లక్షణాలు తరతరాలకు కొనసాగి వారిలో అవి సాధారణ జన్యులక్షణాలుగా మారవచ్చు. అందువల్ల కొన్ని వారసత్వ రుగ్మతలు ఆ సమూహాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

ఇక్కడే కుటుంబ వైద్య చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యం వస్తుంది. ఒక కుటుంబంలో ఒకే రకమైన అరుదైన వ్యాధి పదేపదే కనిపిస్తే దాన్ని యాదృచ్ఛికంగా వదిలేయకుండా వైద్యపరంగా పరిశీలించడం అవసరం. సరైన సందర్భంలో జన్యు పరీక్ష, వాహక నిర్ధారణ పరీక్ష, జన్యుపరమైన సలహాలు (genetic testing, carrier screening, genetic counselling) వంటివి ఆ కుటుంబాలకు ఉపయోగపడగలవు. అయితే ఈ పరీక్షల ఫలితాల్ని నిపుణుల సహాయంతో విశ్లేషించడం ముఖ్యం.

మధుమేహం కథ ఈరోజు మొదలైంది కాదు

భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రజారోగ్య సమస్యల్లో టైప్-2 మధుమేహం ఒకటి. పట్టణీకరణ, శారీరక శ్రమ తగ్గడం, అధిక కేలరీల ఆహారం, స్థూలకాయం వంటి ఆధునిక కారణాలు దీనితో బలంగా ముడిపడి ఉన్నాయి. కానీ జీవక్రియ వ్యాధులను (metabolic diseases) పరిణామ దృక్పథంతో (evolutionary perspective) చూసినప్పుడు మరో కోణం కనిపిస్తుంది. ఒకప్పుడు మన పూర్వీకులకు ఆహారం నిరంతరం అందుబాటులో ఉండేది కాదు. ఆహారసమృద్ధి, ఆహారకొరతలు మారుతూ ఉండేవి. లభించిన ఆహారం నుంచి శక్తిని సమర్థంగా పొందడం, అదనపు శక్తిని నిల్వ చేసుకోవడం అప్పటి పరిస్థితుల్లో జీవించడానికి అవసరమైన లక్షణంగా ఉండి ఉండవచ్చు.

ఈ నేపథ్యంలోనే “thrifty gene hypothesis” అనే ఆలోచన వచ్చింది. గతంలో ఆహార కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగపడిన కొన్ని జీవక్రియకు సంబంధించిన లక్షణాలు, నేటి నిరంతర ఆహార సమృద్ధి పరిస్థితుల్లో ప్రతికూలంగా మారి ఉండవచ్చన్నది దాని భావన. మన జీవనవిధానం కొన్ని తరాల్లోనే పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమ తగ్గింది; పిండిపదార్థాలు, చక్కెర, కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కేలరీలు కలిగిన ఆహారం పెరిగాయి. కానీ మన జీవ పరిణామం అంత వేగంగా జరగదు. ఈ పరిణామక్రమ అసమతుల్యత జీవనశైలి రుగ్మతలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తున్న ఒక మార్గం. అయితే ఇది ఒక్కటే మధుమేహానికి కారణం కాదు. టైప్-2 మధుమేహం ఒక సంక్లిష్టమైన వ్యాధి.

ఈ దృక్కోణం మన ఆరోగ్యంపై ఒక ముఖ్యమైన అవగాహనను ఇస్తుంది. మన జన్యువులను మార్చడం మన చేతిలో లేకపోయినా, వాటితోపరస్పర చర్య జరిగే పరిస్థితులని కొంతవరకు మార్చగలం. ఆహార నియంత్రణ, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువు, నిద్ర వంటి అంశాలు అందుకే మరింత ప్రాధాన్యం పొందుతాయి. జన్యుపరమైన రిస్క్ ఉన్న వ్యక్తికి వ్యాధి తప్పనిసరి కాదు; జీవన శైలి మార్చుకోవడం ద్వారా వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ప్రభావితం చేయవచ్చు.

వేల ఏళ్ల క్రితం మన పళ్లెంలో ఏముండేది?

పురాతన మనుషుల ఆరోగ్యాన్ని అధ్యయనం చేయడానికి DNA ఒక్కటే సాధనం కాదు. పాత ఎముకలు, దంతాల్లోని రసాయన ఆనవాళ్లను పరిశీలించే ఐసోటోప్ విశ్లేషణ ద్వారా అప్పటి ఆహారపు అలవాట్ల గురించి కూడా సమాచారం పొందవచ్చు. ఒక వ్యక్తి ప్రధానంగా ఏ రకమైన ఆహారం తీసుకునేవాడు. వృక్ష సంబంధిత ఆహారం ఎంత? జంతు సంబంధిత ఆహారం ఎంత? వంటి అంశాలపై దీనివల్ల సూచనలు లభిస్తాయి. పురాతన ఆహారాన్ని అర్థం చేసుకోవడం కేవలం చరిత్ర కోసం కాదు. మన జీవక్రియ (metabolism) ఏ రకమైన ఆహార విధానం (nutritional environment) లో పరిణామం చెందిందో తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది.

వ్యవసాయం విస్తరించిన తరువాత మానవ ఆహారంలో పెద్ద మార్పు వచ్చింది. ధాన్యాల ఆధారిత పిండిపదార్థాల ప్రాధాన్యం పెరిగింది. ఆధునిక పారిశ్రామిక ఆహార వ్యవస్థ మరో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు అదనపు చక్కెరలు, ప్రాసెస్ చేసిన కొవ్వులు, అధిక కేలరీలు గల ఆహారాలు చాలా సులభంగా లభిస్తున్నాయి. మన ఆహార వ్యవస్థ మారిన వేగం, మన జన్యువులు మారే వేగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

పాలు తాగే అలవాటుకూ పరిణామ చరిత్ర ఉంది

ఆహారం, జన్యువుల మధ్య సంబంధానికి పాలు ఒక చక్కని ఉదాహరణ. శిశువులకు పాలను జీర్ణం చేయడానికి
లాక్టేజ్
అనే ఎంజైమ్ అవసరం. సాధారణంగా బాల్యం తరువాత ఈ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల పెద్దవయసులో లాక్టేజ్ ను పూర్తిగా జీర్ణం చేయలేని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో సహజంగానే కనిపిస్తుంది. పాలు తాగిన తరువాత కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటివి రావడానికి ఇది ఒక కారణం.

అయితే పశుపోషణ, పాల వినియోగం దీర్ఘకాలం కొనసాగిన కొన్ని సమూహాల్లో పెద్దవయసులో కూడా లాక్టేజ్ ఉత్పత్తి కొనసాగడానికి సహాయపడే జన్యువులు విస్తరించాయి. దీనినే లాక్టేస్ పెర్సిస్టెంస్( lactase persistence) అంటారు. భారతదేశంలో కూడా ఈ లక్షణం అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో లేదు. ఉదాహరణకు, హర్యానాలోని రార్ జాతి ప్రజలలో (Ror population) లాక్టేస్ పెర్సిస్టెంస్ కు సంబంధించిన జన్యు రకాలు 85 శాతానికి పైగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇది పరిణామం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఆహారం మన శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయదు; దీర్ఘకాలంలో మన ఆహార సంస్కృతి, మన జన్యువులు పరస్పరం ప్రభావితం చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనినే జన్యు-సంస్కృతి సహ-పరిణామం (gene-culture coevolution) గా అధ్యయనం చేస్తారు.

విటమిన్ లోపం వెనుక ఆహారమే కాదు

విటమిన్ D, విటమిన్ B12 తక్కువగా ఉండటానికి కారణం సాధారణంగా ఆహారం, సూర్యరశ్మి సోకకపోవడం సమస్యలతో ముడిపెడతాం. అవే ప్రధాన కారణాలు కావచ్చు. కానీ కానీ విటమిన్ లను శరీరం శోషించుకోవడం లో వ్యక్తుల్లో వుండే వత్యాసాలకు జన్యు వైరుధ్యం కూడా కారణం కావచ్చు. అందువల్ల ఒకే విధమైన జీవనశైలి ఉన్న వ్యక్తుల్లో కూడా విటమిన్ స్థాయిలో తేడాలు కనిపించవచ్చు.

అయితే జన్యుపరమైన వివరణ ఆకర్షణీయంగా ఉందనే కారణంతో ప్రతి లోపాన్ని DNA కు ఆపాదించడం సరికాదు. వైద్యపరంగా సాధారణ కారణాలను పరిశీలించిన తరువాత మాత్రమే జన్యుపరమైన అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉందో నిర్ణయించాలి.

ఒకే మందు… ఒక్కొక్క శరీరంలో ఒక్కో ప్రభావం

ఆధునిక జినోమిక్ వైద్యం(genomic medicine) లో అత్యంత ఆసక్తికరమైన రంగం ఫార్మకోజినోమిక్స్(pharmacogenomics). ఒక మందు మన శరీరంలోకి వెళ్లిన తరువాత దాన్ని శరీరం తీసుకోవడం, అవసరమైన చోటుకు తరలించడం, ఎంజైమ్ల ద్వారా వాడుకోవడం, చివరకు బయటకు పంపించడం వంటి అనేక ప్రక్రియలు జరుగుతాయి. ఈ ప్రక్రియలను ప్రభావితం చేసే జన్యువులలో వ్యక్తుల మధ్య మార్పులు ఉండటం వల్ల ఒకే మందు ఒకరిలో వేగంగా మెటాబోలైజ్ కావచ్చు, మరొకరిలో నెమ్మదిగా కావచ్చు. ఫలితంగా మందు పనితనంలో లేదా సైడ్ ఎఫెక్ట్స్ లో తేడాలు రావచ్చు.

ఈ పరిశోధన నుంచి అభివృద్ధి అయ్యిందే ప్రెసిషన్ మెడిసిన్. ప్రెసిషన్ మెడిసిన్ అంటే ప్రతి వ్యక్తికి ఒకే విధమైన చికిత్స ఇవ్వకుండా, ఆ వ్యక్తి శరీర లక్షణాలు, జన్యువులు (genes), జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని సరిపోయే చికిత్సను ఎంచుకోవడం. ప్రస్తుతం సాధారణంగా ఒక వ్యాధికి అందరికీ పనిచేసే మందులను ఇస్తారు. కానీ భవిష్యత్తులో, వ్యక్తి జన్యు సమాచారం కూడా ఉపయోగించి అతనికి అత్యంత ప్రభావవంతమైన మందు మరియు సరైన మోతాదును నిర్ణయించే దిశగా వైద్యం అభివృద్ధి చెందుతోంది. దీంతో చికిత్స మరింత ఖచ్చితంగా, సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంటుంది.

కానీ ఇందులో భారతదేశానికి ఒక ప్రత్యేక సమస్య ఉంది. ప్రపంచ జినోమిక్ డేటాబేస్‌(genomic databases) లో యూరోపియన్ ప్రజల సమాచారం చాలా కాలంగా అధికంగా ఉంది. భారతదేశంలాంటి అపారమైన జన్యు వైవిధ్యం(genetic diversity) ఉన్న దేశంలో ఇతర జనాభాల ఆధారంగా రూపొందించిన జన్యు చికిత్సా విధానాలను యథాతథంగా ఉపయోగిస్తే సరైన ప్రభావం ఉండకపోవచ్చు. భారతీయుల్లో సాధారణంగా ఉండే ఒక జన్యురకం అంతర్జాతీయ డేటాబేస్ లో అరుదుగా నమోదై ఉంటే దాని వైద్యపరమైన వివరణ కూడా కష్టమవుతుంది. అందుకే పెద్దస్థాయిలో భారతీయుల పూర్తి జన్యు సమాచారం సేకరించడం అవసరం. ఇది కేవలం శాస్త్రీయ ప్రతిష్టకు (scientific prestige) సంబంధించిన విషయం కాదు; భవిష్యత్ వైద్యానికి అవసరమైన మౌలిక వనరు.

భారతీయులకోసం భారతీయ జన్యుపటం

ఈ నేపథ్యంలో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ (Genome India Project) ఒక కీలకమైన అడుగు. ఈ ప్రాజెక్టులో దేశంలోని 83 జనాభా సమూహాలకు చెందిన సుమారు 10,000 మంది పూర్తి జన్యుపటాలు అధ్యయనం చేయబడ్డాయి. ఈ ప్రయత్నంలో ప్రపంచంలో ఇంతకు ముందు నమోదు కాని అనేక జన్యు రకాలు(genetic variants) బయటపడ్డాయి. భారతదేశంలోని విస్తారమైన వైవిధ్యాన్ని గుర్తించి నమోదు చేయడం ద్వారా వ్యాధి-సంబంధిత జన్యువైవిధ్యాలను(disease-associated variants) మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోవడం, అరుదైన జన్యుపరమైన రుగ్మతల నిర్ధారణను మెరుగుపరచడం, జనాభా-నిర్దిష్ట వ్యాధి ప్రమాద నమూనాలు(population-specific risk models) రూపొందించడం, pharmacogenomics పరిశోధనలకు పునాది వేయడం వంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

భవిష్యత్తులో ఒక చిన్నారి అరుదైన వ్యాధితో ఆసుపత్రికి వచ్చినప్పుడు రోగ నిర్ధారణ కోసం సంవత్సరాల పాటు తిరగాల్సిన పరిస్థితి తగ్గవచ్చు. ఒక కుటుంబంలో వంశపారంపర్య వ్యాధి ఏదైనా ఉంటే దాని జన్యుపరమైన ప్రాతిపదికను త్వరగా గుర్తించవచ్చు. కొన్ని మందులకు తీవ్రమైన ప్రతిచర్య వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించే పరిస్థితి రావచ్చు. మధుమేహం లేదా గుండె జబ్బుల విషయంలోసాధారణ వ్యాద్య పరీక్షా పలితాలతో పాటు సరైన జన్యుపరమైన సమాచారం (validated genetic risk information) ను ఉపయోగించే అవకాశం పెరగవచ్చు. ఇవన్నీ వెంటనే అందుబాటులోకి వచ్చే అద్భుత పరిష్కారాలు కావు. కానీ జినోమిక్స్ (genomics) వైద్యంలో తెరుస్తున్న ద్వారం మాత్రం ఇదే.

DNA పరీక్ష — భవిష్యవాణి కాదు

జన్యు పరీక్షలు అందుబాటులోకి రావడంతో మరో సమస్య కూడా మొదలైంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన జన్యుపటం (genome) మొత్తం పరీక్షించుకొని భవిష్యత్తులో తనకు ఏ వ్యాధి వస్తుందో ముందే తెలుసుకోవచ్చనే భావన పెరుగుతోంది. ఇది ఒక అపోహ మాత్రమే. ఒక వ్యాధి-సంబంధిత జన్యువు (disease-associated variant) ఉండటం, ఆ వ్యాధి రావడం రెండూ ఒకటే కాదు. కొన్ని జన్యువులు ప్రమాదాన్ని స్వల్పంగా పెంచుతాయి; కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వ్యాధి కలిగించేంత ప్రభావం చూపుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *