డా. యం. గేయానంద్

మనిషి భౌతిక జీవితంతో ముడిపడి ఉండేదే టెక్నాలజి. భౌతిక జీవితాన్ని మెరుగు చేసుకునే క్రమంలోనే టెక్నాలజి అభివృద్ధి అవుతూ ఉంటుంది. శాస్త్ర సాంకేతికాంశాల అభివృద్ధిలో మానవుడికి సహజంగా ఉండే ఉత్సుకత/జిజ్ఞాస కూడా ఒక పాత్ర వహిస్తుంది. ఒక్కోసారి ఇతరుల్ని చూసి నేర్చుకొని, టెక్నాలజీని మనిషి సొంతం చేసుకొంటాడు. అట్లే టెక్నాలజి వ్యాప్తిలో అధికారం, వ్యాపారం కూడా పాత్ర వహిస్తాయి. అయితే మధ్యయుగాల భారతంలో టెక్నాలజి అభివృద్ధిలో ఉన్న మందకొడితనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఆనాటి రాచరికాలలో ముఖ్య భాగంగా ఉన్న యుద్ధాలలో ఆయుధాలు, ప్రజా జీవితంలో భాగమైన ప్రయాణ సాధనాలు ఎలా ఉండేవో చూద్దాం.

యుద్ధాలలో విల్లు వాడకం చాలా పురాతనమైనది. విల్లు అనేది ఒక యాంత్రిక పరికరం. మధ్యయుగాలలో 14, 15 శతాబ్ధాలలో విల్లుకు ఒక అదనపు చేర్పు కనిపిస్తుంది. వింటికి లంబకోణంలో ఒక గొట్టాన్ని అమర్చారు. ఈ గొట్టం కొయ్యతోనో, ఇనుముతోనో చేస్తారు. సంధించిన బాణం ఈ గొట్టం ద్వారా వెలువడుతుంది. ఈ పద్ధతిలో బాణం గురి తప్పకుండా ఉండే అవకాశం ఎక్కువ. దీన్నే క్రాస్-బౌ (Cross-Bow) అన్నారు. వందల ఏళ్ళకు ముందే చైనాలో, యూరోప్‍లో ఇది ఉంది. వరంగల్‍పై తుగ్లక్ సైనిక విజయానికి దీని వాడకం తోడ్పడిందంటారు. ఆ తరువాత వచ్చిన చేతి తుపాకి గొట్టాలకు తొలిరూపం యిదే అయ్యిండొచ్చు. అట్లే నాప్తా అనే శిలా తైలాన్ని బాణాలకు పూసి నిప్పు అంటించి యుద్ధంలో ప్రయోగించేవారు. దీన్ని అరబ్బులు, గ్రీకుల నుండి నేర్చుకుంటే, అరబ్బుల నుండి భారత ఉపఖండంలోకి వచ్చింది.

ఆ రోజుల్లో వాడిన మరో యుద్ధ యంత్రం – మాంజనీక్ లేదా మాంగొనెల్ లేదా ట్రెబుషెట్. ఇది కూడా అరబ్బులదే. ఒక పెద్ద కొయ్య స్టాండును ఆధారంగా చేసుకొని, పైకి కిందకీ కదిలే అడ్డ దూలం ఉంటుంది. ఈ అడ్డ దూలానికి ఒకవైపు కౌంటర్ వెయిట్ ఉంటుంది. మరో వైపున ఒక ఒడిసెల లాంటి ఏర్పాటుతో ఒక పెద్ద గుండ్రాయి ఉంటుంది. వందలాది మంది మనుషులు తాడు కట్టి లాగి వదిలితే, ఒడిసెలలో ఉన్న పెద్ద బండరాయి రివ్వున దూసుకుపోతుంది. 13వ శతాబ్ధంలో మరో అదనపు మార్పు జరిగింది. అది తాడును చుట్టే కండె. దీనివల్ల మనుషుల అవసరం కొంత తగ్గింది. కొద్ది మార్పులతో మాంజనిక్, మఘ్రిబి, అర్రాడ అనే పేర్లతో ఈ యుద్ధ యంత్రాలు 14వ శతాబ్ధంలో ఢిల్లీ సుల్తానుల సైన్యం వాడేది. ఇవన్నీ తుపాకి మందు ప్రవేశానికి ముందున్న ఆయుధాలు.

తుపాకి మందు ప్రవేశం:
మధ్యయుగాలలో తుపాకి మందు ప్రవేశం ఒక ముఖ్యమైన సాంకేతిక మార్పు. భారతదేశంలో 15వ శతాబ్ధానికి ముందు తుపాకి మందు లేదు. అంతకుముందు జరిగిన మార్పులన్నీ విల్లంబులలో జరిగిన మార్పులే.

రాకెట్లు:
క్రీ.శ.1400 లో పైకెగసే నిప్పు ఆయుధాలు (రాకెట్లు) బహుశా చైనా నుండి భారతదేశానికి వచ్చి ఉంటాయి. వెదరు కర్రకు ఒక చివర తుపాకీ మందు దట్టించిన గొట్టాన్ని జతచేసి యుద్ధంలో ప్రయోగించేవారు (బాన్ రాకెట్). ఇది ప్రాణాంతకమైనది. టిప్పు సుల్తాన్ ఇటువంటి భారతీయ రాకెట్‍ను తయారుచేసి విజయవంతంగా ఉపయోగించాడు. టిప్పును చూసే 19వ శతాబ్ధంలో బ్రిటీష్ సైన్యం కాంగ్రేల్ రాకెట్‍లను అభివృద్ధి చేసింది.

ఫిరంగి:
పేలుడు మందు వాడి లోహం లేదా రాతి గుండ్లను పేల్చడానికి ఉపయోగపడేదే ఫిరంగి. ఫిరంగి వాడకం భారతదేశంలో 15వ శతాబ్ధం రెండో భాగం నుంచీ ఉంది (దాదాపు వంద సంవత్సరాలకు ముందు చైనాలో, యూరప్‍లో ఫిరంగి కనిపిస్తుంది). పానిపట్టు (1526) యుద్ధంలో ఫిరంగి, చేతి తుపాకి ఉండటం వల్ల బాబర్ కు కలసి వచ్చింది. కంచు, ఇత్తడి పోతతో భారీ ఫిరంగులు భారతదేశంలో తయారయ్యాయి. 16వ శతాబ్ధం ఆఖరుకు ప్రపంచంలోనే అతి పెద్దవైన భారీ ఫిరంగులు మన దేశంలో తయారయ్యేవి. విడిభాగాలుగా విడదీసి మళ్ళీ కూర్పు చేయగలిగేలా ఫిరంగుల్ని చేసేవారు. అట్లే ఒకే వరుసలో 17 ఫిరంగులు చకచకా ఏకకాలంలో పేల్చగలిగేలా ఏర్పాటు చేయగలిగేవారు. కాని 17వ శతాబ్ధం వచ్చేసరికి, ఇనుముతో చేసిన తేలిక రకం ఫిరంగులు యూరోప్‍లో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ భారీ కంచు/ఇత్తడి ఫిరంగులకు కాలం చెల్లిపోయింది.

కాని 17వ శతాబ్ధంలో ఇనుప ఫిరంగుల్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలూ కనిపించవు. ఇనుప కమ్మీలు లేదా గొట్టాలను లోహపు రింగులతో అనుసంధానించి బారల్‍ను తయారుచేసేవారు. ఫిరంగుల విడిభాగాలను యూరోప్ నుండి దిగుమతి చేసుకున్నారు. వాటిని పేల్చే మనుషుల్ని కూడా యూరోప్ నుండే తెప్పించుకున్నారు.

గ్రెనెడ్ షెల్స్:
చేతి బాంబులు (గ్రెనెడ్ షెల్స్), మోర్టారు లాంటివి అప్పటికే యూరోప్‍లో, చైనాలో ఉన్నా అవి మన దేశాన్ని పెద్దగా ఆకట్టుకోలేదు. బహుశా ఫిరంగులు, రాకెట్లు లాంటి శక్తివంతమైన ఆయుధాలున్నాయి కాబట్టి, అది అవసరం లేదనుకొని ఉండవచ్చు.

చేతి తుపాకులు:
చేతి తుపాకులు 15వ శతాబ్ధంలో భారతదేశంలోకి వచ్చాయి. వీటికి ట్రిగర్ ఉండదు. తుపాకి మందును చేతితో అంటించి శక్తి చాలనంగా వాడి గుండును విసురుతారు. ట్రిగరింగ్ – లీవర్‍లు, స్ప్రింగ్‍లు ఉండే తుపాకులు 16వ శతాబ్ధాని కంతా వచ్చాయి. బారెల్‍లో కూడా మార్పులు వచ్చాయి. బారెల్‍ను నునుపుగా మార్చడానికి, ఎక్కువ మందు కూరడానికి, కొత్త పద్ధతులు వాడారు. ఒకేసారి పలు తుపాకుల బారెల్‍ల లోపల డ్రిల్లు తిప్పేందుకు ఒక యంత్రాన్ని రూపొందించారు. పిన్‍డ్రం గేరింగ్ అనే ఒక పళ్ళ చక్రాల వ్యవస్థ ద్వారా పశువుల శక్తిని ఉపయోగించుకునే సాధనం అది. ట్రిగర్ పరిజ్ఞానాన్ని (ప్లింట్ లాక్, వీల్ లాక్) యూరోప్ నుండి నేర్చుకొని ఉండొచ్చు. 17వ శతాబ్ధంలో పొడువు బారెళ్ళతో ఉన్న చేతి తుపాకులకు ఆధారం (రెస్ట్) అవసరమైంది. ఇటువంటి తుపాకులను మన దేశంలోనే తయారు చేసేవారు. అయితే తుపాకుల ప్రాబల్యం సైన్యంలో పెరుగుతూ ఉన్నా, 17వ శతాబ్ధమంతా అశ్వారూడులైన విలుకాండ్రే ప్రధాన ఆయుధధారులుగా ఉండేవారు. గుర్రంపై స్వారీ చేస్తూ, తుపాకి కంటే తేలికపాటి వింటితో గురి చూసి బాణాలు వేయడం సులభంగా ఉండేది.

మధ్యయుగాల ప్రయాణాలు:
14వ శతాబ్ధంలో ప్రయాణాలు ఎలా ఉండేవి? ఎడ్ల బండి, ఒంటె, గుర్రం, పల్లకీలే ప్రయాణ సాధనాలు. అవి అద్దెకు దొరికేవి. పేదవాళ్ళకి కాలినడకే గతి. ఉన్నంతలో ఎడ్ల బండి చవక. బరూచ్ నుండి పట్టన్ (గుజరాత్) కు చేరుకోవడానికి ఎడ్ల బండి ప్రయాణానికి ఎనిమిది రోజులు పట్టిందంట (ప్రఖ్యాత అరబ్ భూగోళ విజ్ఞాన రచయిత ఇద్రిసీ, 1154 ADలో దీన్ని రాశాడు.) అయోధ్య నుండి ఢిల్లీకి ఒంటె మీద రావడానికి 40 రోజులు పట్టేదని 1354 ADలో ప్రస్తావన ఉంది.

ఆహార ధాన్యాలను భారీస్థాయిలో రవాణా చేయడానికి వేలాది ఎడ్లను, మందలను వాడేవారు. 10 – 20 వేల పశువులను వాడి ఢిల్లీకి వేల క్వింటాళ్ళ ధాన్యం తెచ్చారనే ప్రస్తావనలు, 14వ శతాబ్ధంలో కన్పిస్తుంది.

ఆ కాలంలో రహదారులుండేవి. రహదారుల పొడవునా దూరాలు తెలిపే స్తంభాలుండేవి. ప్రయాణ దినమును బట్టి రాదారి బంగాళా, భోజన సత్రం ఉండేవి. మలబార్‍లో తీరం వెంబడి వేసిన రహదారి వెంట చేసిన 2 నెలల ప్రయాణం ఎంతగానో ఆకట్టుకుందని 1340 ADలో ఇబన్ బటూటా రాశాడు. ఈ రహదారుల్లో ప్రతి ఒకటిన్నర కిలోమీటరుకు తాగునీటి వసతితో కూడిన బల్ల కూర్పు ఆశ్రయాలు (షెల్టర్లు) ఉండేవట. మార్గమధ్యంలో లోతైన నదులు వస్తే బల్లకట్టు మీద ఒడ్డుకు దాటించేవారు. యమునా నది మీద మెట్రిక్ టన్నుల కొద్దీ ధాన్యాన్ని సరఫరా చేసే, విశాలమైన పడవలు తిరిగేవట.

ప్రభుత్వ సమాచార అవసరాల కోసం వ్యవస్థలుండేవి. ప్రధాన రహదారుల వెంట ప్రతి 12 కి.మీ.లకు, లేదా ఒకరోజు సరిపడా ప్రయాణానికి ఒకటి వంతున తపాలా గుర్రాల స్టేషన్లు ఉండేవి. వార్తాహరులు గుర్రాలు మారేవారు. అట్లే పరుగెత్తి చేరవేసేవారు (రన్నర్లు) కూడా ఉండేవారు. ప్రతి కిలోమీటరు, లేదా అంతకంటే ఎక్కువ దూరానికి ఉండే పోస్టుల వద్ద ఈ రన్నర్లు రిలేగా మారేవారు. దీన్ని ధావా అనేవారు. ఈ సమాచార చేరవేత మార్గాలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. కాని వీటిని ప్రభుత్వాలు నిర్వహించడం, ప్రజలకు భరోసాను ఇచ్చేది.

మొఘలుల కాలం:
అయితే సుదూర ప్రాంత ప్రయాణాలకు బండ్లను, శకటాలను వాడారు కానీ, వాటిని నడిపించడానికి గుర్రాలను వాడలేదు. మొఘలుల కాలంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరగలేదు. గుర్రపు మెడకు మస్తీబు (హార్స్ కాలర్) వాడితే దాని లాగుడు సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ విషయాన్ని మనం పట్టించుకోలేదు. మొఘలుల కాలంలో కూడా బండ్లకు ఎద్దులనే కట్టేవారు. రాజులు కొంత గుర్రపు బగ్గీలు వాడినా, అది కొంతకాలానికి కనుమరుగైంది. చౌకగా, వేగంగా ప్రయాణించగల ఈ సౌకర్యాన్ని పట్టించుకోలేదు. 17వ శతాబ్ధం దాకా ఇవి ప్రాచుర్యంలో లేవు.

రహదారుల ఉపరితలాలపై తగిన శ్రద్ధ చూపలేదు. వర్షాకాలంలో బురదమయమయ్యేవి. రాళ్లు కప్పిన రహదారులు తక్కువే. ప్రధాన రహదారుల్లో నదులపై రాతి కట్టడపు వంతెనలు కన్పిస్తాయి. 17వ శతాబ్ధంలో రవాణా చేసే సరుకులకు, హుండీలకు భీమా సుదుపాయం ఉండేదట.

మొఘలుల కాలంలో ప్రభుత్వ తపాలా వ్యవస్థల ద్వారా (డాక్-చౌకీ ల ద్వారా) వేగంగా సమాచారం బట్వాడా అయ్యేది. ఢిల్లీ నుండి అహమ్మదాబాద్‍కు ప్రభుత్వ తపాలా 12 రోజులలో చేరేది. అత్యవసరమైతే 7 రోజుల్లో పోయేది. రేయింబవళ్ళు ఫుట్ రన్నర్లు, అశ్వికులు వేగంగా సంచరించేవారు. అయితే వీటిని మామూలు ప్రజలు ఉపయోగించుకోవడానికి అందేది కాదు. అయితే ప్రైవేటు తపాలా ఉండేది. ఇందుకోసం పత్తామాడ్లు, బజార్ కొరియర్లు ఉండేవారు. వీరు ప్రతి పట్టణంలో బహిరంగ ప్రకటన ద్వారా, తాము ఎక్కడికి పోయేది చెప్పి, ఉత్తరాలను ఆహ్వానించేవారు.

సముద్రయానం:
భారతీయ నౌకలను నిర్మించే పద్ధతి గురించి కొలంబస్ (1290 AD) రాశాడు. కొయ్య పలకను, కొబ్బరి నారతో గట్టిగా చేర్చి కట్టి చేపనూనెతో రుద్ది నిర్మిస్తారని రాశాడు. అయితే యూరోప్ నౌకలలో వాడినట్టు ఇనుప మేకులు, తారు పూత వాడలేదు. భారత నౌకలకు ఒకటే స్తంభం, ఒకటే తెరచాప, ఒక చుక్కాని ఉండేది. డెక్కు ఉండేది కాదు. నావ అడుగు భాగాన సరుకు వేసి కప్పేవారు. కొయ్య పలకలు కొబ్బరి పీచుతో కలిపి కట్టడం వల్ల రాతి గుట్టలను ఢీకొన్నప్పుడు నౌకకు ఎక్కువ రక్షణ ఉంటుందని నమ్మేవారు. అయితే 15వ శతాబ్ధంలో, చైనాతో పోల్చదగిన మెరుగైన ఓడల నిర్మాణాలు కూడా ఉన్నాయనే ప్రస్తావనలున్నాయి. 16వ శతాబ్ధం ప్రారంభంలో నౌకా నిర్మాణంలో ఇనుము వాడకం ప్రారంభమైంది. అక్బర్ కాలంలో భారీ నౌకల నిర్మాణం జరిగింది. షిప్ కామెల్ అనే కొత్త సాంకేతికతను – ఓడను సులభంగా చేరవేయడానికి వాడే పొడువాటి బల్లపరుపు నావ – ను ఆవిష్కరించారు.

15వ శతాబ్ధంలో భారతీయ నావికులు అయస్కాంత దిక్సూచిని వాడి ఉండవచ్చు. భారతీయ నౌకలలో ఖగోళమితి ను (అస్టో లేబ్) వాడారు. సూర్యుడిని, ఇతర నక్షత్రాలను చూస్తూ సమయాన్ని, అక్షాంశ రేఖలను నిర్ధారించే పరికరం ఇది. 1535 AD ప్రాంతంలో యూరోప్‍లో కనిపెట్టిన పరికరానికి, దీనికి పోలికలు ఉండొచ్చు. ఖగోళమితితో పాటు దిక్సూచి పటాలు కూడా వాడి, నౌక ఏ మార్గంలో పోతుందో గుర్తించేవారు. 17వ శతాబ్ధం వచ్చేసరికి, యూరోప్‍లో కొత్త పరికరాలు వచ్చేశాయి (టెలిస్కోపు). అంతేకాక యూరోప్‍లో చౌకగా మూడోవంతు ఖర్చుకే నౌకలు తయారయ్యేవి.

అయితే భారతీయ వడ్రంగుల నైపుణ్యానికి ఎంతో పేరు ఉండేది. భారతీయ నౌకలు రూపురేఖల్లో ఇంగ్లండ్, హాలెండ్ నౌకల కన్నా మెరుగ్గా ఉండేవి. అందుకే భారతదేశంలోనే నౌకలు తయారుచేయాలని ఆంగ్లేయ బ్యాంకర్లు షరతులు పెట్టేవారట. భారతీయ పనివారు, ఓడ పలకలను ఒకదానితో మరొకటి కూర్చే పద్ధతి (రివిటింగ్) ఎంతో మెరుగ్గా, దృఢంగా ఉండేదట. చెక్క పలకలతో నీటి టాంకులు చేయడం, కొయ్య పలకలపై సున్నం గచ్చు వేయడం ద్వారా సముద్రపు పురుగుల నుండి అసాధారణ రక్షణ కల్పించడం, ఓడను మరమ్మత్తుల కోసం ఒడ్డున చేర్చే క్రాచ్, టాకెల్ అనే బరువులెత్తే సాధనం – ఇవన్నీ ప్రసంశలందుకొన్న సాంకేతికతలు. యూరోప్ ఇటువంటి నైపుణ్యాలను, మన నుండి చూసి నేర్చుకొన్నది. కాని మనం యూరోపియన్ నైపుణ్యాలను చూసి పరికరాలను స్థానికంగా అభివృద్ధి చేసుకోలేకపోయాము. దిక్సూచీలు, లాంతర్లు, నావికుల పరికరాలు, రేఖల చిత్రాలు, తెరచాప, అయస్కాంత సూదులు లాంటి పరికరాలకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి, వీటిని దిగుమతి చేయాలని ఆంగ్లేయ అధికారులు కోరేవారు. మేకులు, లంగర్లు, నాణ్యమైన ఇనుము సామాను, లంగర్లు కొరత ఉండేది. యూరోప్ నుండి దిగుమతి చేసుకునేవారు. ఓడలను నడిపే నావికులను కూడా యూరోప్ నుండి తెచ్చుకునేవారు.

(ఈ వ్యాసంలో ఉన్న విషయాలు – ఇర్ఫాన్ హబీబ్ రాసిన ‘మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ’ – అనే మోనోగ్రాఫ్ నుండి స్వీకరించబడినవి.)

(వచ్చే నెల – “మధ్యయుగ భారతదేశంలో సాంకేతికతలు ఎందుకని పురోగమించలేదు?”)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *