వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 16
డా. నాగసూరి వేణుగోపాల్
తెలుగునాట శాస్త్రవేత్తగా గణనీయమైన పేరు గాంచిన వ్యక్తి డా.సూరి భగవంతం. వీరు సి.వి.రామన్ శిష్యులుగా, అంతే వాసిగల శాస్త్రవేత్తగా, యుద్ధ విజ్ఞానశాస్త్ర సంబంధించిన దార్శనికులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగపు నిర్మాతగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్దేశకులుగా, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మూలపురుషుడుగా సదా చిరస్మరణీయులు!
1909 అక్టోబర్ 14న కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లిలో జన్మించిన భగవంతం చదువు చాలా సంప్రదాయబద్ధంగా మొదలైంది. ఆనాటి విధానం ప్రకారం పురాణేతిహాసాలు, వేదాలు సంస్కృతాంధ్ర భాషల్లో నేర్చుకున్నారు. తర్వాత ఆంగ్ల పాఠశాలలో చేరారు. అప్పట్లో ఒక్క నిజాం కాలేజీ తప్పా, మిగతా కళాశాలలు ఉర్దూ మాధ్యమంలో సాగేవి. నిజాం కాలేజి మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధంగా ఆంగ్ల మాధ్యమంలో సాగేది. భాగ్యనగరంలో బి.ఎస్సీ.పూర్తయిన తర్వాత భగవంతం చదువు కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర సాగింది. ఒక వ్యాసరచన పోటీలో సాధించిన బహుమతి ఆయనను సర్ సి.వి.రామన్ చెంతకు చేర్చింది. ఈ గురుశిష్యుల అనుబంధం ఎంతో అర్థవంతంగా, విజ్ఞానదాయకంగా నడిచిందనీ; అది జీవితాంతం కొనసాగిందని గర్వంగా చెప్పవచ్చు. సర్ సి.వి.రామన్ తో జీవితాంతం మిత్రత్వం కలిగినవారు చాలా తక్కువమందని అంటారు. సి.వి రామన్ పరిశోధనల పట్ల ఆకర్షితులై 1928లో సూరి భగవంతం కలకత్తాతరలి వెళ్లారు. రామన్ నోబెల్ బహుమతి సాధించిన తర్వాత సూరిభగవంతాన్ని తన సహాయకుడిగా, సహపరిశోధకుడిగా తీసుకున్నారు. అలా చేసిన కృషికే భగవంతానికి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ పట్టా లభించింది.
సర్ సి.వి.రామన్ కలకత్తా నుంచి బెంగుళూరు తరలివెళ్లి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నేతృత్వ బాధ్యతలు స్వీకరించారు. తనతో పాటు భగవంతాన్ని కూడా బెంగుళూరు తీసుకు వెళ్ళాలని రామన్ తలంచారు. అయితే, అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భగవంతం సేవలవసరమయ్యాయి. 1932లో తన 22వ ఏట భగవంతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర శాఖలో అధ్యాపకులుగా చేరారు. ఆయన 1938లో అక్కడే ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. అంత చిన్న వయస్సులో ప్రొఫెసర్ గా ఉన్నతి పొందడం అపూర్వమైన విషయమే. ఈ సంఘటనకు కొద్దిగా ముందే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు పరిశోధనలో గౌరవ డాక్టరేటు బహుకరించింది. అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది
భగవంతం బోధనా విధానం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఆయన ప్రసంగానికి ‘అరటిపండు ఒలిచి పెట్టినట్టు’ అనే తెలుగు సామెత చక్కగా అతుకుతుందని భగవంతం శిష్యుడు,ఆయన చిరకాల మిత్రుడు మామిడిపూడి కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. నిజానికి బోధనా సామర్థ్యం ఆయనకు సహజంగానే అబ్బిన విద్యగా పరిగణించాలి. స్పష్టమైన వ్యక్తీకరణ, విశేషమైన ఆలోచన, ఖచ్చితమైన అనువర్తన, సమగ్రమైన దృష్టి, అద్భుతమైన ప్రతిభ ఆయనకు సొంతం. ఆయన తరగతులకు ఇతర శాఖల నుంచి కూడా విద్యార్థులు హాజరయ్యేవారని అంటారు, ఇతర శాఖల అధ్యాపకులు కూడా తనకన్నా పెద్దవారై ఉండి కూడా వీరి తరగతులకు వచ్చేవారని చెబుతారు. ఇతని బోధనా విధానాన్ని అనుకరించిన వారు ఎందరో ఉన్నారు. ‘ది థియరీ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఇట్స్ ఫిజికల్ అప్లికేషన్స్’ అనే పుస్తకం చాలా ప్రఖ్యాతమైంది, ఇది రష్యన్ భాషలోకి కూడా అనువాదమయ్యింది. ఈ పుస్తకాన్ని ఆ సమయంలో స్పెక్ట్రోస్కోపీ సంబంధించిన శాస్త్రవేత్తలందరూ కొన్నారని, చదివారని అంటారు. ఆయనే రాసిన మరో పుస్తకం ‘స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ రామన్ ఎఫెక్ట్’ కూడా చాలా సుప్రసిద్ధమైంది. అలాగే ‘క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్’ పుస్తకం కూడా. సుమారు 300 పరిశోధనా పత్రాలతో రాసిన భగవంతం గారి మూడు గ్రంథాలు చాలా భాషల్లోకి అనువదింపబడ్డాయి,
1941లో అంటే తన 32వ ఏటే ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాశాలలన్నింటికీ ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించడం గొప్ప విషయం. నిజంగా ఆ సమయంలో ఒక వైపు స్వాతంత్ర్యోద్యమం, మరోవైపు అంతర్జాతీయ సంక్షోభం నెలకొని ఉన్నాయి. ఒక వైపు విద్యార్థుల అలజడి, మరోవైపు ప్రభుత్వం ఒత్తిడి – ఈ రెండిండి మధ్య విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ గా తన పరిపాలన కౌశలం చూపి, విజయులయ్యారు. భగవంతం మీద సర్ సి.వి.రామన్, డా. సర్వేపల్లి రాధాకృష్ణ, డా. కట్టమంచి రామలింగారెడ్డి గార్ల ప్రభావం ఉండేది. దానికి కారణం వీరి ముగ్గురితోనూ ఆయనకున్న అనుబంధమే.
1948-49లో ఒక సంవత్సరం పాటు లండన్ లోని భారత రాయబారి వి.కె.కృష్ణమీనన్ కార్యాలయంలో వైజ్ఞానిక సలహాదారుగా పనిచేసారు. నిజానికి ఈ సంవత్సరం కాలం భగవంతం జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. లండన్ లో ఉన్నప్పుడు రష్యాతో సహా చాలా ఐరోపా దేశాల్లో భగవంతం పర్యటించి, విజ్ఞాన సంబంధమైన విషయాల మీద ప్రసంగాలుచేశారు. 1949లో భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వదిలి, హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వ విద్యాలయంలో భౌతికశాస్త్ర శాఖాధిపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారికి విశేషమైన రీతిలో వనరులు కల్పించడంతో వారి ప్రగతి విశిష్టంగా భాసించింది. అప్పట్లో అధ్యాపకులందరూ ఎం.ఎస్సీ. డిగ్రీ బోధన చేస్తున్న వారే. భగవంతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన నాలుగైదు సంవత్సరాల్లోనే భౌతికశాస్త్ర శాఖలో 12 మందికి డాక్టరేట్ డిగ్రీ లభించడం ఆయన కృషికి నిదర్శనం. దీని తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం వాతావరణమే పూర్తిగా మారిపోయి, పరిశోధనల దిశగా సాగింది
1952లో భగవంతం ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు తీసుకోవడంతో వారి బోధనాప్రస్థానం ముగిసింది. ఒకవైపు పరిశోధనల్లో నిర్దేశకత్వం, మరోవైపు విశ్వవిద్యాలయ పరవాలనా దర్శకత్వం కొనసాగాయి. ఆయన వైన్-ఛాన్స్ లర్ గా ఉన్న కాలంలో కూడా ఆయన నిర్దేశకత్వంలో కొందరికి పరిశోధనలలో డాక్టరేట్లు లభించడం విశేషం
భగవంతానికి జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి ఎంతో ఎక్కువని చెబుతారు. అతి తక్కువ వ్యవధిలో కావల్సిన రీతిలో ప్రయోజనాత్మకమైన సలహాలు అందజేసేవారు. ఏకకాలంలో ఎంతో మందికి వివిధ పనులు అప్పజెప్పడమే కాక, వాటికి గడువులు కూడా విధించారు. ఏమాత్రం ఆలస్యమైనా, ఆయన క్షణంలో గుర్తుచేసి, ఆ వ్యక్తికి కబురు చేసేవారు. ఏ ఇతర అంశాలకు సంబంధించిన సంభాషణలలో ఉన్నా, ఆ విషయానికి న్యాయం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునేవారు. దానికి ఆయనకున్న క్రమశిక్షణే తార్కాణం. అందుకే కాంతి వేగానికి తగిన రీతిలో ఆయన సాగేవారని అంటారు
1957లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆ పదవిలో ఆయన గురువు సర్ సి.వి.రామన్ పనిచేయడం ఖచ్చితంగా విశేషమే. అప్పటికే ఆయనకు పరిశోధకుడిగా, పరిపాలనాదక్షుడిగా పేరుంది. ఈ రెండు సామర్థ్యాలు ఆయనను అక్కడ కూడా వినాయకుడిని చేశాయి. ఇక్కడ పనిచేస్తుండగానే వి.కె. కృష్ణమీనన్ దేశ రక్షణశాఖామాత్యులుగా నియమితులయ్యారు. ఆయన భగవంతాన్ని ఒత్తిడి చేసి రక్షణశాఖ పరిశోధనా సంస్థ అధిపతి గాను, తనకు వైజ్ఞానిక సలహాదారుగానూ చేరమన్నారు. నిజానికి వీటిపట్ల ఆసక్తి లేకపోయినా, కృష్ణ మీనన్ తో ఉన్న స్నేహం కారణంగా 1961 లో బెంగళూరు నుంచే రక్షణశాఖ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు
అయితే రెండు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడం కష్టమని భావించి, కృష్ణమీనన్ ప్రోద్భలంతో భగవంతం
1962లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ డైరెక్టర్ పదవిని వదులుకుని ఢిల్లీ వెళ్లారు. 1962 అక్టోబర్ లో చైనాతో భారత్ యుద్ధం గురించి మనకు తెలిసిందే. ఈ యుద్ధం తర్వాత కృష్ణమీనన్ పదవికి రాజీనామా చేయడం, తర్వాత వై.బి. చవాన్ రక్షణశాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి కృష్ణ మీనన్ తో ఉన్నంత సాన్నిహిత్యం భగవంతానికి చవాన్ తో ఉండేది కాదు. అయినా కూడా భగవంతం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి. ఒ) అధిపతిగా కొనసాగి ఎంతో ప్రగతి సాధించారు. విశాఖపట్నం నుంచి లేహ్, తేజ్ పూర్ వరకూ ఇరవైకి పైగా ప్రయోగశాలలను ప్రారంభించారు. అంతకుమించి యుద్ధ రంగానికి అవసరమైన క్షిపణులు, విమానాలు, ట్యాంకులు, రాడార్లు, ఎలక్ట్రానిక్ పనికరాలు, పర్వత ప్రాంతాల్లో సైనికులకు ఆరోగ్య, ఆయుధాలు వంటి అనేక విషయాల్లో ఆయన దృష్టి పెట్టిన విజయం సాధించారు. వారి దార్శనికత తర్వాత భారత్ విజయాలకు ఆధారమైంది. తొమ్మిది సంవత్సరాలు ఈ బాధ్యతలు నిర్వహించి 1969 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. భగవంతం ఈ చర్యలు తీసుకోకపోయి ఉంటే తర్వాత కాలంలో దేశానికి చాలా సమస్యలు ఉత్పన్నమై ఉండేవని, చాలాకాలం తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన డా. వి.ఎస్. అరుణాచలం పేర్కోవడం ఆయన కృషికి గొప్ప నివాళి
ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. పండిత నెహ్రూ గారికి ప్రొఫెసర్ పి.ఎం.ఎస్. బ్లాకెట్ అప్పట్లో ఒక సలహా ఇచ్చారట, డి.ఆర్.డి.ఒ, తన సొంత పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా; దిగుమతుల మీద ఆధారపడాలని చెప్పారట. అయితే, భగవంతం ఈ ‘గొప్ప’ సలహాని తిరస్కరించి, తన విజ్ఞత ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు. అది ఆయన సమయస్ఫూర్తి, విజ్ఞత, బాధ్యత. పిమ్మట సుమారు ఎనిమిది సంవత్సరాలపాటు విజ్ఞానాన్ని దేశ ప్రగతినికి ఎలా వినియోగించు కోవచ్చో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించారు. వివిధ దేశాల సమస్యలు చర్చించి, వాటికి పరిష్కారాలను ఆయా ప్రభుత్వాలు సూచించారు.
భారతదేశంలో రేడియో, టెలివిజన్ విస్తరణకు సంబంధించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఛందా కమిటీ, వర్గీస్ కమిటీ నివేదికలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. రేడియో నుంచి టెలివిజన్ ను పూర్తిగా వేరు చేయాలని 1966 లో ఛందా కమిటీ ప్రతిపాదిస్తే; వర్గీస్ కమిటీ వీటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని, దానికి ‘ఆకాష్ భారతి’ అంటే నేషనల్ బ్రాడ్ కాస్ట్ ట్రస్ట్ ఏర్పడాలని 1978లో ప్రతిపాదించింది. ఈ రెండు కమిటీల కంటే ముందు 1965లో డా. సూరిభగవంతం అధ్యక్షతన దేశంలో టెలివిజన్ విస్తరణకు ఎంత అవకాశముందో అధ్యయనం చేసి, దానికి సంబంధించి సాంకేతిక సౌలభ్యాలు ఏమిటో, అవి ఎలా సాధించుకోవాలో వివరించేందుకు ఒక కమిటీ ఏర్పడింది. నిజానికి భారతదేశంలో టెలివిజన్ విస్తరణకు సంబంధించిన ఈ కమిటీ తొలి అధ్యయనం, ప్రణాళిక అని చెప్పుకోవాలి.
ఇక్కడ సూరి భగవంతం గారితో నాకు నేరుగా తెలిసిన సంగతులు కొన్ని చెప్పాలి. 1980-83 కాలంలో నేను పుట్టపర్తి లోని సత్యసాయి కాలేజీలో బి.ఎస్సి. చదివే సమయంలో వారి సొంత పుస్తకాలన్ని ఆ కాలేజీ లైబ్రరీలో ఉండేవి. సరళ, సుబోధకమైన సైన్స్ గ్రంథాలను ఎన్నింటినో అక్కడ చూడటం వాటిలో కొన్నింటిని చదవడం నాకు ఒక విలువైన స్మృతి. అలా నేను చదివిన సి.వి. రామన్ జీవిత చరిత్ర ఆంగ్ల పుస్తకం ఆయన రాసిందే. దీనిని ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు ప్రచురించారు. భగవంతం గారి మూడవ కుమారుడు రామకృష్ణ మాకు ఫిజిక్స్ బోధించేవారు. వారు ఎంతో ఓపికగా, ప్రేమగా భౌతిక శాస్త్రాన్ని వివరిస్తూ ఎటువంటి ప్రశ్నలయినా ఆహ్వానిస్తూ పాఠం చెప్పేవారు. భగవంతం గారి తెలుగు, సంస్కృత భాషల్లోని అభినివేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సమయస్ఫూర్తి కూడా విశేషమే, జీవితపు చివరి రోజుల్లో కొంత కాలం సత్య సాయిబాబా దగ్గర ఉన్నారు. అప్పట్లో బాబా తెలుగు ప్రసంగాలకు తక్షణమే ఆంగ్ల అనువాద ప్రసంగాలు చేసేవారు. ఈ పోకడ కొన్ని దృక్పథాల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తర్వాతి కాలంలో ఆయన అక్కడి నుంచి వైదొలగడం నాకు తెలుసు. వారు అనేక సామాజిక కార్యమ్రాలను స్వచ్ఛందంగా కూడా చేపట్టారు.
డా. సూరి భగవంతం 1989 ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచారు.
రచయిత : డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మొబైల్: 9440732392



