డా|| పి.ఎం. భార్గవ, సీనియంబీ వ్యవస్థాపక డైరెక్టర్

జవహర్లాల్ నెహ్రూ 1946లో ప్రచురించిన తన డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో మొదటిసారిగా ‘సైంటిఫిక్ టెంపర్’ అనే పదాన్ని వాడారు. అప్పటికే నెహ్రూ భారత సైన్స్ వర్కర్ల సంఘానికి (అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ పర్ఫన్స్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు. ఇది ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్. ఈ సంఘంతో 1940వ దశకం, 1950వ దశకం ప్రథమార్ధంలో నాకు బాగా సన్నిహిత సంబంధాలుండేవి. దేశ ప్రధాని ఇటువంటి ఒక ట్రేడ్ యూనియన్ కి అధ్యక్షుడుగా ఉండటం ప్రజాస్వామ్యంలో చోటుచేసుకున్న ఒకే ఒక్క ఉదాహరణ. సైంటిఫిక్ టెంపర్  లేదా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోదిచేయడం ఈ సంఘం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. తొలినాళ్లలో ఈ సంఘం చాలా చురుగ్గా పనిచేసేది. కానీ 1960 నాటికి నిర్వీర్యమయింది. ఇందుకు ప్రధాన కారణం మెజారిటీ శాస్త్రవేత్తల్లో ప్రధాన స్థానాల్లో ఉన్న ముఖ్యులతో సహా ఎవరికీ ‘సైంటిఫిక్ టెంపర్’ పట్ల నిబద్ధత లేకపోవటమే. అసత్యాన్ని, మూఢత్వాన్ని, పిడివాదాన్ని నమ్మక పోవడం, హేతుబద్ధమైన ఆలోచన చేయడాన్ని సైంటిఫిక్ టెంపర్ డిమాండ్ చేస్తుంది. ఏ శాస్త్రవేత్తలైతే సైంటిఫిక్ టెంపర్ను అభివృద్ధి చేయడానికి నాయకత్వం వహించాలో అటువంటి మన శాస్త్రవేత్తలలో సైంటిఫిక్ టెంపర్ లేకపోవడం శోచనీయం. సమాజంలో మూఢత్వంతో ఉన్న ఇతర గ్రూపులకు మన శాస్త్రవేత్తలు భిన్నం కాదనడానికి 1964లో జరిగిన ఒక సంఘటన రుజువుగా నిలుస్తుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త సతీష్ ధావన్ (తర్వాత అంతరిక్ష విభాగానికి సెక్రటరీగా పనిచేశారు) ప్రముఖ సైన్స్ చరిత్రకారులు అబ్దుల్ రహమాన్, నేను కలిసి 1964 జనవరిలో సైంటిఫిక్ టెంపర్ సొసైటీ (ది సొసైటీ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్) ఏర్పాటు చేశాం. నోబెల్ శాస్త్రవేత్త ప్రాంసిస్ క్రిక్ వంటి ఎందరో విశిష్ట శాస్త్రవేత్తలు ఈ సొసైటీ స్థాపనకు సభ్యులుగా ఉన్నారు. వీరిలో సభ్యులు కావాలనుకున్నవారు తప్పనిసరిగా ఈ కింది ప్రకటనను అంగీకరించి సంతకం చేయాలి. “మానవ ప్రయత్నం, మేధస్సుతో మాత్రమే జ్ఞానం వస్తుందని… జ్ఞానోదయంతో కాదనీ, మనిషి నైతిక, మేధో వనరులతో సకల సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోగలమని ఇందుకు ఏ అతీంద్రీయ శక్తులు ప్రమేయం అవసరం లేదనీ నమ్ముతున్నాను” ఆ ప్రకటన సారాంశం ఇది. కానీ ఈ ప్రకటనపై సంతకం చేయాలని మేం  శాస్త్రవేత్తలను కోరినప్పుడు నిరాకరించడంతో నిరాశ చెందాం. ఇది వారిలో సైంటిఫిక్ టెంపర్ లేదనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ సంఘటన తరువాత 1976లో అప్పటి కేంద్ర విద్యాశాఖామాత్యులు ప్రొ॥ నూరుల్ హాసన్ ని 42వ రాజ్యాంగ సవరణలో 51ఎ లో సైంటిఫిక్ టెంపర్ క్లాజును చేర్చాలని ఒప్పించా. “సైంటిఫిక్ టెంపర్, పరిశోధించే తత్వాన్ని, సంస్కరణలను అభివృద్ధి చేయటం, ప్రతి భారత పౌరుని బాధ్యత” అని ఈ ఉపకరణం చెబుతోంది. సైంటిఫిక్ టెంపర్ని పౌరబాధ్యతగా చేర్చడంలో మన శాస్త్రవేత్తలను మేల్కొల్పవల్సింది. కానీ 50-60 సంవత్సరాలలో పోలిస్తే నేటికీ పరిస్థితుల్లో ఏమంత మార్పు వచ్చిందనుకోను.

ఇందుకు మూడు ఉదాహరణలు.  గత భాజపా ప్రభుత్వంలో అప్పటి మానవ వనరులు అభివృద్ధి మంత్రి మురళీమనోహర్ జోషి గారు జ్యోతిష్యాన్ని డిగ్రీ కోర్సుగా ఆరంభించాలని యూనివర్శిటీలో గ్రాంట్స్ కమీషన్ను అడిగారు. ఇందుకు ప్రత్యేక గ్రాంటును ఇస్తానని చెప్పారు. సుప్రీంకోర్టులో దీనిని సవాల్చేస్తూ నేనూ, చందనా చక్రవర్తి వ్యాజ్యం వేశాం. ప్రశాంత్ భూషణ్ మా  న్యాయవాది. వ్యాజ్యానికైతే అంగీకరించారు. కానీ ఊహించినట్లే దాన్ని కొట్టివేశారు. పూర్తిగా అశాస్త్రీయమైనదీ నిర్హేతుకమైనదీ పలుమార్లు మిధ్యగా నిరూపణయిన జ్యోతిష్యంలో… నమ్మకం విస్తృతంగా వ్యాపించి ఉన్నది. న్యాయవ్యవస్థను నడిపే వ్యక్తులు కూడా దీనికి మినహాయింపుకాదు. ఈ విషయంలో ఏ ఒక్క శాస్త్రవేత్త నుండీ మాకు సపోర్ట్ రాలేదు. ప్రజాధనంతో నడుస్తున్న 6 సైన్స్ జాతీయ అకాడమీల్లో ఒక్కటి కూడా మమ్మల్ని బలపర్చలేదు. విరాళాలిచ్చిన వాళ్లంతా శాస్త్రవేత్తలు కానివారే. సైన్స్ సంబంధిత సామాజిక సమస్యల పట్ల అకాడెమీల ధోరణికి నిరసనగా మూడు సైన్స్ అకాడమీల గౌరవ ఫెలోషిప్లకు 1993లో రాజీనామా ఇచ్చా. ప్రాచీన భారతదేశంలో అవయవ మార్పిడి చేసేవారని, అందుకు ఏనుగు తలతో ఉన్న వినాయకుడే గొప్ప ఉదాహరణ అని ప్రధాని నరేంద్రమోడీగారు ముంబైలో శాస్త్రవేత్తల నుద్దేశించి గత ఏడాది చేసిన ప్రసంగంపట్ల కూడా మన శాస్త్రవేత్తలు, 6 సైన్స్ అకాడమీలు మౌనం వహించడం రెండో ఉదాహరణ. భారత సైన్స్ కాంగ్రెస్ 102వ సమావేశాల సందర్భంగా ముంబైలో ఏర్పరచిన “సంస్కృతం ద్వారా ప్రాచీన విజ్ఞాన శాస్త్రం” అనే సింపోజియం ఉదాహరణ. ఈ సమావేశంలో ప్రాచీన భారతదేశంలో జంబో విమానాలు (60 × 60 అడుగులు) కొన్ని సందర్భాల్లో 200 అడుగుల పొడవు విమానాలు కూడా ఉండేవని చెప్పారు. ఇవి ఖండాల మధ్య, గ్రహాల మధ్య 9 వేల సంవత్సరాల క్రితమే (అంటే హరప్పా, మొహంజోదారో కంటే 4,500 సం॥ల ముందు) ఎగిరాయని పేర్కొన్నారు. అంతేకాదు. ఇప్పటి రాడార్ వ్యవస్థ కంటే అభివృద్ధి చెందిన రాడార్ వ్యవస్థ కూడా ఉన్నదట. ఇందుకు వారు చెప్పిన సూత్రం – ప్రతి సజీవ, నిర్జీవ వస్తువు ఎల్లప్పుడు శక్తిని విడుదల చేస్తుంటుందని! ఈ 21వ శతాబ్దంలో అంతర ప్రవేశ నియమానుసారం (లా ఆఫ్ ఇంటర్ ప్రెటేషన్) సైన్సు, ఆధ్యాత్మికతకు మధ్య సంయోగం జరుగుతుందని చెప్పారు. ఇటువంటి అర్థరహిత సూత్రం ఒకటి ఉందని ఏ ఒక్క సీరియస్ అకడమిషియన్ కూడా ఇది వినివుండరని నా నిశ్చితాభిప్రాయం. ఇవే కాక ఈ సమావేశంలో చెప్పిన ఎన్నో అర్థంలేని గొప్పలు, ప్రాచీన మధ్యయుగాల భారతదేశం సాధించిన నిజమైన విజయాలకు ఒక విధంగా అవమానం కూడా. గొప్ప శాస్త్రవేత్తలుగా పేరుగాంచిన మన శాస్త్ర వేత్తలుగానీ, సైన్స్ అకాడమీలు కానీ ఈ సింపోజియంలో పేర్కొన్న విషయాల అశాస్త్రీయతను ప్రశ్నిస్తూ గళం విప్పలేదు. సైన్స్ కాంగ్రెస్ నిర్వాహకులకు ఈ సింపోజియం చెప్పబోయే విషయాలు ఖచ్చితంగా ముందే తెలుసు. బహుశా వారు వాటిని నమ్మి అయినా ఉండాలి, లేదంటే రాజకీయ వత్తిడి అయినా ఉండి ఉండాలి. నేను 1997లో “సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఎందుకు నిలిపి వేయకూడదు” అని ‘హిందూ’లో రాసిన వ్యాసంలో చేసిన వాదానికి ఈ ఉదాహరణలు మరింత బలం చేకూర్చుతాయి. ఏటా జరిపే ఈ సైన్స్ కాంగ్రెస్లను నిషేధించాలి, లేదంటే దీనిని భారత సైన్స్ వ్యతిరేక కాంగ్రెస్ గా పేరు మార్చాలి. భారతదేశంలో సైన్సు కు నష్టం జరక్కుండా ఉండాలంటే సైన్సు అకాడమీలను మూసివేయడం అనివార్యం. 85 సంవత్సరాల నోబెల్ ప్రైజ్ చరిత్రలో భారతదేశం ఒక్క నోబెల్ బహుమతి గెలుచుకోలేక పోయింది. దేశంలో శాస్త్రీయ చాతావరణం, సైంటిఫిక్ టెంపర్ లోపించడమే ఇందుకు ప్రధాన కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *