విఠపు బాలసుబ్రమణ్యం

తన కలలకు ముగింపు లేదని ఇప్పటిదాకా ఘంటాపథంగా చెప్పుకున్న ఎంపీ పరమేశ్వరన్ గారు ఈరోజు మనకు కలగా మిగిలిపోయాడు. అన్నట్టు ఎప్పుడూ ఆయన్ని’ ఎంపీ” అనడం తప్ప ఎం.పీ పరమేశ్వరన్ గారు అనడం మనకు తెలియదు. ఇప్పుడందరూ ఆయన్ని ఇలా అంటూ వుంటే ఏదో విచిత్రంగా ఉంది! కొంచెం వెలితిగా కూడా వుంది.

ఎంపి ఒక అసాధారణ స్వాప్నిక లోక చక్రవర్తి. ఆయన ఒక్క క్షణం ఆలోచించకుండా వుండలేడు. ఒక్కరోజూ ఏదో ఒకటి రాయకుండా గడప లేడు. ఇక మనుషులతో మాట్లాడడమంటే ఆయనకెంత ముచ్చటో చెప్పలేము. అసలాయనతో మాట్లాడడమంటే ఏదో ఒక చర్చలోకి దిగడమే. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే! అలాంటి వ్యక్తిని నేను ఒక్క శంకరన్ గారిని మాత్రమే చూశాను. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా వుండడం విచిత్రం!

అణుశాస్త్రవేత్తగా వృత్తి జీవితం ప్రారంభించిన ఎంపీ శిక్షణకు మాస్కోకు వెళ్లి, సోషలిజంలో అక్కడి పిల్లల నవ్వులకు మురిసిపోయి అలాంటి నవ్వులు ప్రపంచమంతా ఎందుకు విరబూయరాదని కలలుకంటూ ఇండియాకి వచ్చి ఉద్యోగానికి స్వస్తి చెప్పి జనంలోకి పడ్డాడు.

ప్రజలు తెలుసుకోవాలి. అన్ని వైపుల నుంచి ఆలోచనలు వాళ్ళని ముంచెత్తాలి. వాళ్లే ప్రపంచాన్ని నడిపించాలి. వాళ్ల చుట్టూనే ప్రపంచం నడవాలి. దీనికి వీళ్లకు కావాల్సింది జ్ఞానం, విజ్ఞానం, అవి వారి ముంగిట్లోకి రావాలి. అరచేతిలోకి చేరాలి. దీనికాయన ఎంచుకున్న మార్గం ప్రజాసైన్సు ఉద్యమం. మనదేశంలో దీనికాయన రూపశిల్పి, తాత్వికుడు, చోదకుడూ! ఎంపీ లేని సైన్సు ఉద్యమాన్ని ఇండియాలో వూహించడం కష్టం.

కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తుతో ప్రారంభించి దేశమంతా ఒక్కోచోట ఒక్కో పేరుతో ఒక్కో రూపంలో ఇంత వైవిధ్యంతో ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థలు వెలిసి ఒకదానికొకటి నేడు అల్లుకుపోయాయంటే ఒక వ్యక్తిగా ఎవరికన్నా ఈ గౌరవం మొదట ఎంపికే జరుగుతుంది. భారత జ్ఞాన విజ్ఞాన జాతా, సాక్షారతా ఉద్యమం, జన వాచన ఆందోళన్, ప్రజాపంచాయతీ ప్లానింగ్, హమారా దేశ్, సృజనోత్సవాలు లాంటివన్నీ ఎంపి కలల్లోంచి పురుడు పోసుకున్నవే. ఇవి ఒక్కొక్కటి ఎంత సృజనాత్మకమైనవో, అంత విస్తృతమైనవి.. అంత ప్రభావశీలమైనవి.. ప్రజల్ని కదిలించి కార్యోన్ము ఖుల్ని చేసినవి.

ఎప్పుడూ ఎంపీ ప్రచారాందోళనోద్యమాలకు పరిమితం కాలేదు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టమని కూడా హెచ్చరించే వాడు కూడా! జనంలో పనిచేయాలి. ప్రత్యామ్నాయాలు చూపాలి, నిర్మాణాత్మక కృషి జరగాలి. ప్రజలకు నమ్మకం కలగాలి, వారు తమంత తాము వీటిలో ముమైకం కావాలి అప్పుడే సమాజం కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇది అక్కడో ఇక్కడో, అంతో ఇంతో జరగడం కాదు. విస్తృతంగా జరగాలి. వెల్లువలా జరగాలి.

దీనికోసం ఆయనలా తపించిన వాళ్ళు చాలా అరుదు ఆలోచించిన వాళ్ళు మరీ అరుదు ఆచరణలో నిరూపించిన వారు ఇంకా అరుదు. ఎంపీ నిర్గమనంతో ప్రజాసైన్సు ఉద్యమం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. సమీప భవిష్యత్తులో మరొకరితో ఈ లోటును పూడ్చుకోడం జరిగే పని కాదు గానీ ఆయన స్ఫూర్తీ, చూపినదారీ మాత్రం మనల్ని నడిపిస్తూనే వుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *