యుగంధర్ బాబు

కుక్కపిల్ల
సబ్బుబిళ్ళ
అగ్గిపుల్ల

కాదేది కవితకు అనర్హం

అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ మనవాళ్లు కుక్కపిల్ల, కాకి పిల్ల, పిల్లి పిల్ల కాదేది భయాలకు అనర్హమని అపోహల్లో కొట్టుకు పోతున్నారు. తెనాలి సినిమాలో కమలహాసన్ అంటాడు “నాకు అంతా భయమయం, తలుపు భయం, మూసి ఉన్న తలుపు భయం, తీసి ఉన్న తలుపు భయం, మూసి మూయని తలుపు భయం, తీసి తీయని తలుపు భయం, బార్ల తెరచిన తలుపు భయం, నీడ భయం, గోడ భయం, కూడు భయం, పేడ భయం……. “ఇలా చాలా భయాల గురించి చెప్తాడు. ఆ విధంగా మన చుట్టూ చాలా భయాలు, (దానికి కారణాలు అనేకం కావచ్చు, )ఆవహించి, ఆవరించి ఉన్నాయి. మళ్లీ ఈ భయాలన్నిటికీ, పరిష్కారాలు, శాంతులు, వ్రతాలు ఉన్నాయి. ఇవన్నీ మీ ఆర్థిక శక్తిని బట్టి, మీరు ఖర్చు పెట్టే స్థాయిని, మనసును బట్టి, మీ భయము యొక్క తీవ్రతను బట్టి అంచలంచలుగా ఉంటాయి. అది వేరే సంగతి.

ఇక అసలు విషయం చూద్దాం. కుక్కలు చాలా విశ్వాసమైన జంతువులు కదా. వీధి కుక్కలకు ఒక్క రోజు అన్నం పెడితే ఆ తర్వాత మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. “కుక్కకున్న విశ్వాసము కూడా నీకు లేదురా” అని తిడుతూ ఉంటారు. అలాంటి కుక్కల గురించి మన సమాజంలో ఉన్నటువంటి అపోహలు, భయాలు కోకొల్లలు. శకునాల లిస్టులో కుక్క వస్తుంది, భయాల లిస్టులో కుక్క వస్తుంది, పురాణాల లిస్టులో కూడా కుక్క వస్తుంది.

 మహాభారత కథ కుక్కతో ప్రారంభమై కుక్కతో అంతమవుతుందని మీకందరికీ తెలుసు.(మహాభారతం ఇదివరకు చదివి వుంటే సుమా). రామాయణంలో విశ్వామిత్రుడు కోపం వచ్చినప్పుడు కుక్క మాంసం తినేవాడిగా పుడతావని తిడుతూ ఉంటాడు. ఇక ఫోటో లో సాధారణంగా దత్తాత్రేయుడు నాలుగు కుక్కలతో, ఒక ఆవుతో కనిపిస్తాడు. ఈ నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా, మరియు అవి దత్తాత్రేయునికి రక్షకులుగా చెప్పబడ్డాయి. ఇక షిర్డీ సాయిబాబా కూడా కుక్కలతో ఉన్నట్టు ఫోటోలలో మీరు చూసే ఉంటారు. కుక్క కాలభైరవుడి వాహనము, కేతు గ్రహానికి ప్రతినిధిగా కుక్కను పూజిస్తారు. సనాతన ధర్మం కుక్కలను ఇంట్లో పెంచుకోకూడ(ట)దని చెబుతోంది. కుక్కను తాకితే వెంటనే స్నానం చేయాలని చెబుతోందట. గోవులను తప్ప ఎలాంటి జంతువులను ఇంట్లో పెంచుకోకూడదట, ఇంట్లో కుక్కలు, పిల్లులు పెంచుకోవడం భారత సంస్కృతి కాదు అని… అందుకే ఆశ్రమాలలో గోవులు మాత్రమే ఉంటాయి అని చెబుతోంది. కుక్క రాజ ద్వారం గుండా ఇంట్లోకి వస్తే పూజా గృహంలోని దేవతలు పస్తు ఉంటారట, వాళ్లు పస్తువున్న పాపము ఆ ఇంటి యజమానికి తగులుతుందట. ఇది పురాణాల లిస్టు.

 ఇక శకునాల గురించి. శకునాలలో కుక్కకు పెద్దలిస్టే ఉంది. ప్రయాణాలలో కుక్క శకునం. …..కుక్క ఆహారం తిని కుడి వైపు తల గోక్కుంటే శుభమని, కుడి ఎడమ కాళ్లతో శరీరంపై గోక్కుంటే మంచి శకునం కాదని, (ఇవి గోకుడు శకునాలు), పొరుగూరికి వెళ్లే వ్యక్తికి కుక్క తన నోటిలో రొట్టె ముక్క, మిఠాయి లేక మాంసంతో కనపడితే ధన ప్రాప్తి అని, ఎముక నోట్లో కరుచుకొని మొరిగితే (నోట్లో ఎముక వుంటే ఎలా మొరుగుతుందో) మృత్యు సమానమైన కష్టం కలుగుతుందని, అవిటి కుక్క కనబడితే కార్యసిద్ధి జరగదని, నీటి నుండి బయటకు వచ్చి శరీరం విదిలించుకుంటూ కనపడితే ప్రయాణంలో దొంగలతో జాగ్రత్తగా ఉండాలని శకున శాస్త్రం చెబుతోందట.

అలాగే మన చెప్పు తీసుకొని పారిపోతే లేక వేరొకరు చెప్పు తీసుకొచ్చి మన ఇంట్లో వేస్తే దొంగతనం జరుగుతుందని భావించాలట.
ఇవన్నీ ఒక ఎత్తయితే భయాలు మరొక ఎత్తు.

కుక్కలు అరిస్తే పట్టించుకుని మనుషులు అవి *ఏడిస్తే మాత్రం భయపడి పోతారు*. అది వీధి కుక్క అయినా ఇంట్లో కుక్క అయినా… భయం మాత్రం ఖాయం. అర్ధరాత్రి కుక్కలు ఏడిస్తే భయం కలుగుతుందని చెడు ఆలోచన వస్తాయని చాలామంది భావిస్తారు. కుక్కలు అదేపనిగా మొరిగినా, ఏడుస్తూవున్నా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని కీడు జరగబోతుందని భయపడతారు.
(ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ల గురించి ప్రవచన కారులు చెబుతూ ఉంటారు. వాటిని కనుక్కోవడానికి సైన్స్ ను మించిన యంత్రం ఏదో వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంది. మనకు కూడా అలాంటి యంత్రం తలా ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది కదా ).

కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని గ్రీకులు నమ్మేవాళ్ళు. కుక్కలు దుష్టశక్తులను కనిపెట్టగలవని, దెయ్యాలను కూడా చూడగలరని వాళ్ళు నమ్మేవారు. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారనే నమ్మకం కూడా వారిదే. కానీ అది మనదేశంలో ఎలా వచ్చిందో తెలియదు. కుక్క ఆకాశం చూస్తూ అరుస్తున్నా, ఏడుస్తున్న వాటికి దెయ్యాలు కనిపిస్తున్నాయని, అప్పుడు వాటి చెవుల మధ్యలో నుంచి చూస్తే మనకు కూడా దెయ్యం కనిపిస్తుందట. దెయ్యాలను చూడగలిగే శక్తి ఉన్న కుక్కలకు చావును కూడా చూసే శక్తి ఉందని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుక్కలకు ఆత్మలు కూడా కనిపిస్తాయట. అంటే మంచి ఆత్మలు(?) కనిపించవు, కానీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నెగటివ్ ఎనర్జీ ఉన్న ఆత్మలు మాత్రం తప్పకుండా కనిపిస్తాయట. అలాంటి ఆత్మలు ఉన్న నెగటివ్ ఫోర్సెస్ ఉన్న ప్రదేశాలలో కుక్కలు ఎక్కువగా అరుస్తాయట. రాత్రిపూట ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.ఆ నెగటివ్ ఎనర్జీ ని చూసినప్పుడు ఆ సమాచారం మిగతా కుక్కలకు అందజేయడానికి అలా ఏడుస్తాయట.

కుక్కల కళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయట. వాటి ఎదురుగా కూర్చుని భోంచేయడం చాలా తప్పట. అవి చూస్తుండగా భోంచేస్తే ఆహారం నిస్సారమైపోతుందట.

ఓ ప్రవచన కారుడు అంటాడు, వాయసం అంటే కాకులు, శునకం అంటే కుక్కలకు చావు గురించి యమబటులు, యమధర్మరాజు వాళ్ల సూచిక, వాసనులను గ్రహిస్తాయి. రాడార్ ఎలాగైతే వాతావరణం లోని మార్పులు పసిగట్టి మనకు తెలియజేస్తుందో అదే విధంగా కాకులు, కుక్కలు చావును పసిగట్టి మనకి తెలియచేస్తాయి ఇద్దరూ అద్భుతమైన సిగ్నల్ శాస్త్ర ప్రవీణులు(!!). కుక్కకు వాసన చూపిస్తే దొంగను వెతుక్కుంటూ వెళ్లడం మీకు తెలుసు కదా. అలాగా అవి చావును వాసన చూసి పసిగడతాయట. కుక్క తల పైకెత్తిపైకి ఏడిస్తే ఒక సంకేతము, తల వంచి ఏడిస్తే ఒక సంకేతం అని ఆయన సెలవిచ్చారు. కాబట్టి చాలా కాలం పాటు కుక్క ఏడిస్తే ఏదో చావు వార్త వింటామన్న భయము ప్రజలలో బాగా నాటుకు పోయింది.

 కుక్క ఏడుపు దాని మానసిక స్థితి, అవసరాలను వ్యక్తీకరించడానికి ఒక సాధారణ మార్గము. భయము నొప్పి, ఆనందం లేదా ఇతరుల దృష్టిని ఆకర్షించడం ఇలాఅనేక కారణాలు. కుక్క ఏడుపు అపశకునంగా భావించ వలసిన అవసరం లేదు. అది చావుకు సంకేతం కూడా కాదు. ఆదిమ మానవుడు వ్యవసాయానికి, వేటకు, కాపలాకు, వస్తువుల రవాణాకు ఆవు, కుక్క, గాడిద, గుర్రము, ఏనుగు లాంటి జంతువుల పైనే ఆధారపడి వాటిని మచ్చిక చేసుకున్నాడు. ఇప్పటికీ మంచు ప్రాంతాల్లో స్లెడ్జ్ బళ్లు లాగడానికి కుక్కల్ని వినియోగిస్తారు. అలా జంతువులతో మనిషి సహజీవనం చేస్తున్నాడు. ఈ జంతువులకి ఎలాంటి ప్రత్యేకమైన అద్భుత శక్తులు ఉండవు.

అన్ని జంతువులలోకి కుక్క చాలా విశ్వాసమైన జంతువు అని మనకు తెలుసు. సామాజిక జంతువులైన కుక్కలు ఒంటరిగా చాలా ఒత్తిడి అనిపించినప్పుడు, ఆహారం కోసం, నీటి అవసరం ఉన్నప్పుడు, బయటికి వెళ్లాలి అనుకున్నప్పుడు గట్టిగా అరుస్తాయి, ఏడుస్తాయి. ఇంటి యజమాని ఇంటికి వస్తే ఆనందంగా అరుస్తాయి. వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు, దంత సమస్యల నొప్పి వల్ల కూడా అరుస్తాయి. కుక్కలకు వాటి టెరిటోరిల్ ఏరియా, సొంత సామ్రాజ్యం ఉంటుంది. ఆ సామ్రాజ్యం లోకి వేరే కుక్కలు ప్రవేశిస్తే కూడా అలా అరుస్తాయి. ఇలాంటి కారణాల వల్ల కుక్కలు ఏడుస్తాయి కానీ, యమ భటులు, యమధర్మరాజు, ఆత్మలు, చావులు లాంటి వాటిని చూసి ఏడుస్తున్నాయి అనడం మాత్రం అపోహ, మూఢనమ్మకం.

కుక్కలు మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. కానీ ఎప్పుడైనా అదుపుతప్పి అవి కరిస్తే మాత్రం వెంటనే రేబిస్ ఇంజక్షన్లు (కోర్సు) తప్పకుండా వేసుకోవాలి, అది పెంపుడు కుక్క అయినా సరే వీధి కుక్క అయినా సరే.కుక్కల ఏడుపు పట్ల భయాలు మాని అపోహలు తొలగించుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *