సంపాదకీయం

జ్ఞానం మౌన సంస్కృతిని బద్దలు చేయాలి. మన బుర్రల్ని తొలిచేస్తున్న అసంగత ఆలోచనావైపరీత్యాల నుంచి మనల్ని బయటపడేసి నిరంతర క్రియాశీలురుగా మార్చాలి. ఆ క్రమంలో జ్ఞానం కూడా తనకు తాను పునరుజ్జీవితమై కొత్త చివుళ్ళు తొడగాలి, వుంటే అలాంటి జ్ఞానం వుండాలి, ఇస్తే అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి అలాంటి జ్ఞానాన్ని ఎందుకు అందివ్వలేకపోతున్నాం? అటువంటి జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాం?

ఈ నిర్ధారణల్ని, ప్రశ్నల్ని చరిత్రలో మొదట వేసుకున్న వాడు ఫాలో ఫెయిరీ ఈ క్రమంలో స్వీయాచరణలోంచి పేదల మధ్య కెళ్ళి వాళ్లతో మమైకమయ్యాక ఆయన పొందిన మొదటి జ్ఞానం పేదలు నిజంగా పేదలు కాదని ! వాళ్లు పీడితులని !! ఇప్పుడు వారికివ్వాల్సిన జ్ఞానం వాళ్లను వాళ్ళు పీడితులుగా గుర్తించ గలిగేలా చెయ్యడమని. ఒకసారి వారికీ తత్వం బోధపడ్డాక వాళ్లు చర్చలోకి దిగుతారు సమాజాన్ని విమర్శనాత్మకంగా చూడ్డం మొదలు పెడతారు. దీంతో అప్పటిదాకా వారినావరించిన మౌన సంస్కృతి బద్దలై పోతుంది. ఈ క్రమంలో జ్ఞానం కూడా తనకు తాను కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది.

పేదలు పీడితులుగా తమను తాము గుర్తించడమంటే వారు ఆర్థిక రాజకీయ సాంఘిక వైరుధ్యాల జ్ఞానాన్నిసంతరించుకోడం. తమ స్థితిగతులకు దీన్ని అన్వయించుకోడం.

ఇలా జరిగితే ఇంకేమైనా వుందా ? అరాచకంగా మారి; కల్లోలానికీ, విధ్వంసానికీ దారితియ్యదా? జ్ఞానం పట్ల తాత్వికులకు, బోధకులకు, పాలకులకు గల ఈ భయమే జ్ఞానాన్ని వికృతం చేసి దాన్ని జ్ఞానం కాకుండా చేస్తోంది. సామాన్యులకు పనికిరానిదిగా చేస్తోంది.

ఈ దశలో జ్ఞానం కొందరు పండిత ప్రకాండుల ఆస్తిగా మారుతుంది వాళ్ళని అందనంత ఎత్తులోకి నిలుపుతుంది. చివరికి వాళ్ళని పదభ్రష్టులను కూడా చేస్తుంది. కానీ పండితులకీ గతితర్కం అంత సులభంగా అర్థం కాదు జ్ఞాన ప్రపంచపు విషాదాల్లో ఇదొకటి !

ఎవరేమన్నా అంగీకరించక తప్పని వాస్తవం ఏమిటంటే ప్రజలు లేని ప్రపంచం అసంభవం. ప్రజలూ, ప్రపంచమూ వేరువేరూ కూడా కాదు. అందువల్ల ప్రజలు ప్రపంచమంటే ఏమిటో, ఆ ప్రపంచంలో తామేమిటో తెలుసుకోకుండా వుండలేరు. తమ అనుభవంలో నుంచే ఈ జ్ఞానం వారికి వొంటబడుతుంది. అప్పుడు వారి మౌనం బద్దలవుతుంది.జ్ఞానవంతులమనుకొనే వాళ్లకిది అవగతమయ్యేప్పటికి భళ్ళున తెల్లవారి సామాన్యుల లోకమంతా మేల్కొంటుంది. జరగాల్సిందంతా జరిగిపోతుంది చరిత్ర వీరిని అజ్ఞాతంలోకి నెట్టేస్తుంది!

బోధకులతో వచ్చిన మరో సమస్య ఏమిటంటే వారికి జ్ఞానం అంటే ఏమిటో తెలియక పోడం. సమాచారమేజ్ఞానమని వారు గట్టిగా నమ్మడం ఆ సమాచారానికి సామాన్యుల ప్రపంచంతో ఏ సంబంధం లేకపోవటం, దీంతో తాము ఎవరికి బోధ చేస్తున్నారో వారు జ్ఞానశూన్యులని లేదా వారి జ్ఞానం జ్ఞానమే కాదని ముద్ర వేయడం. ఖాళీ బుర్రలని లోకాతీత జ్ఞానంతో నింపే మహత్తర కర్తవ్యాన్ని తామ నిర్వహిస్తున్నామని భ్రమ పడ్డం, తమకూ నేర్చుకునే వారికీ మధ్య వీలున్నంత దూరాన్ని, వైరుధ్యాన్ని పెంచుకోవడం. చర్చకు తలుపులు మూసేసి జ్ఞాన ప్రసారాన్ని ఏకపక్షం చెయ్యడం.మౌనానికి పట్టం కట్టడం వృత్తి రీత్యా తమకున్న ఆధిపత్యం ఆసరాతో జ్ఞానాన్ని గందరగోళపరచడం ! తమకు తెలియకుండానే సృజనకు, చైతన్యానికి పాతరేసి గంగిరెద్దుల సంస్కృతికి పట్టం గట్టడం! యథాతథస్థితిని కాపాడే పాత్రలోకి వీరు గొప్పగా, గౌరవంగా ఒదిగిపోవడం !!

ఈ నిష్క్రియాపరత్వం మనిషిని సర్దుకొని పోయే వారినిగా మారుస్తుంది ఎక్కువ సమాచారం తెలిసి, ఎక్కువ ప్రపంచానికి దూరమైన వారు ఎక్కువ సర్దుబాటుకు అలవాటు పడతారు! అల్పసంఖ్యాకుల పెత్తనాన్ని మౌనంగా అంగీకరిస్తారు. సహజంగానే పెత్తందార్ల ఆలోచనలకు, అవసరాలకు ఈ ధోరణి అతికినట్టు సరిపోతుంది.

జ్ఞానం అంటే ప్రపంచపు వాస్తవాన్ని అర్థం చేసుకోవడం. దాన్ని మానవీకరించే వైపు జ్ఞానం మనల్ని క్రియాశీలుర్ని చెయ్యాలి. అలా చేయడం మౌనంతో సాధ్యం కాదు. పలుకులో, పనిలో, చర్యలో, ప్రతిచర్యల్లో మాత్రమే మనిషి మనిషవుతాడు. అలాంటి మనిషి మాత్రమే ప్రపంచాన్ని మానవీకరిస్తాడు.

దీనికి కావలసింది చర్చ! ఫెయిరీ మాటల్లో “ఇది మనుషుల మధ్య జరిగే ఎన్ కౌంటర్ “. అయితే మాట్లాడే హక్కుకు కొందరికీ, అది లేని దుస్థితి చాలామందికీ వున్న ప్రపంచంలో ఈ చర్చ జరగదు. మాట్లాడే హక్కు మానవాళికి అనాదిగా వుంది. మధ్యలో దాన్ని ప్రజలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి వారు దాన్ని సాధించుకోవాలి. దానికి తగ్గ జ్ఞానం వారికి కావలి! వాస్తవానికి ఇదే నిజమైన జ్ఞానం !! ఇదే దానికి నిర్వచనం !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *