కె. బాలగోపాల్
ఏడవతరగతిలో కాబోలు, వాయుపీడనాన్ని గురించి పాఠం ఉండేది. వీధి లోని బోరు పంపు ఏ విధంగా పనిచేస్తుందనేది పరీక్షలో తప్పనిసరి ప్రశ్న. నిలువు కోత పటంతో సహా వివరించాలి. దానిని అధ్యయనం చేస్తూ అప్రయత్నంగా అన్వయించుకొని రోజూ కలంలో సిరా నింపుకునే ‘ఇంక్ ఫిల్లర్’ కూడ అదే సూత్రంమీద పనిచేస్తుందని ఏ పంతులూ చెప్పకుండా అర్థం చేసుకున్ననాడు అనుభవించిన పారవశ్యం మరిచిపోలేనిది.
సైన్స్ అంటే ఏమిటో మన దేశంలో సైన్స్ చదువుకున్న వాళ్ళకు సహితం తెలీదు. సాహిత్యం అంటే డిక్షనరీ కానట్లే, సైన్స్ అంటే వైజ్ఞానిక సమాచారంకాదు. సూర్యగ్రహణం అమావాస్యనాడు మాత్రమే పడుతుందనీ, ఇంటి మిద్దెమీది నుండి ఇనప బీరువాను అందులో పదవవంతు కూడా బరువులేని చెక్కకుర్చీని కింద పారేస్తే రెండూ ఒకేసారి నేలమీద పడతాయనీ, మనం రాత్రింబగళ్ళు కాంతి కిరణాలంత హడావుడిగా తిరుగుతూ వుండగలిగితే ముసలితనం రానేరాదనీ, ఇత్యాది పొడుపు కథలు ఎన్ని నేర్చుకున్నా అవన్నీ సైన్స్ కాదు. సైన్స్ చదువుకున్నవాళ్ళకు చాలావరకు ఇట్లాంటి సమాచారం మాత్రమే తెలుసును. అదే సైన్స్ ఆనుకుంటారు కాబట్టి జీవితానికి అర్థం ఏమిటి అన్న సందేహం కలిగినప్పుడు ఎంతటి అదృష్టవంతులకయినా ఆ సందేహం ఏదో ఒక వయసులో రాకమానదు కాబట్టి, సాయిబాబా దగ్గరికీ తిరుపతి వెంకటేశ్వరుడి దగ్గరికీ పరుగులు తీస్తారు. జీవిత పరమార్థందాకా పోనక్కరలేదు. సైన్స్ చదువుకున్నవాళ్ళు మూఢనమ్మకాలకు ఇంగ్లీష్ పేర్లు పెట్టుకొని గతంలో కంటే ఎక్కువగా తమను తాము బెదరగొట్టుకునే వైనం చూసినా ఈ దురవస్థ అర్థం అవుతుంది. ఒకనాడు, గ్రహణం పట్టినరోజున ఆదృశ్య దుష్టశక్తులయిన రాహుకేతువులకు భయపడి జనం ఇళ్ళలో దాక్కునేవారు. ఇప్పుడు చదువుకున్నవాళ్ళు అదృశ్య దుష్ట కిరణాలయిన అల్ట్రావయొలెట్, ఇన్ ఫ్రారెడ్ కిరణాలకు భయపడి ఇళ్ళల్లో దాక్కుంటున్నారు. అసలు వీటినే మనవాళ్ళు రాహుకేతువులన్నారని త్వరలో ఎవరయినా బుకాయించినా ఆశ్చర్యం లేదు.
సైన్స్ కు విశ్లేషణ ప్రాణం.
‘ఎందుకు? ఏ విధంగా?’ అనే ప్రశ్నలకు వీలయినంత సాధారణ (జనరల్) స్థాయిలో వివరణ ఇస్తుంది సైన్స్. దానివల్ల ఒక్క విషయం మాత్రమే కాక అదే కోవకు చెందిన అనేక విషయాలు మనకు అర్థం అవుతాయి. అదే సమయంలో జీవితానికి వస్తుగతమయిన (objective) ‘అర్థం’ వుంది అనే అవగాహన కూడ పెరుగుతుంది. ఈ అవగాహన సైన్స్ బోధనలోనూ అభ్యాసంలోనూ ప్రధాన విషయం కావాలి. కానీ తరచుగా అది జరగదు. దీనికి గల అనేక కారణాలలో ఒకటి, విజ్ఞానాన్ని మానవులు కష్టించి గ్రహించిన విషయంగా కాక, ప్రకృతి సిద్ధమో లేక దైవదత్తమో అయినట్టు బోధించడం.
రెండవది, విజ్ఞానాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి దానిని నిస్సారం చేయడం. వైజ్ఞానికులు ‘కనుక్కున్న’ ప్రతీ విషయమూ ఏదో ఒక భౌతిక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో కనుక్కున్నదే. కాని అవన్నీ ఇవాళ పాఠ్యపుస్తకాలలో అనాది అయిన పరమసత్యాలుగా బోధించబడతాయి. గతంలో ఈ సత్యం తెలియని దినం ఒకటి వుండిందని, తెలుసుకోవలసిన అవసరం ఒక పరిస్థితిలో ఏర్పడిందని, ప్రయత్నంమీద తెలుసుకోవడం సాధ్యం అయిందని చెప్పడం సైన్స్ బోధనలో భాగం కాలేదు. దానివల్ల సైన్స్ చదువుకున్న వాళ్ళకు కొంత సమాచారం తెలుసును, కొన్ని సమీకరణలు తెలుసును, ప్రయోగశాలలో కల్పితమయిన పరిస్థితులలో కృత్రిమమయిన ప్రయోగాలు సమర్థవంతంగా నిర్వహించడం తెలుసును. అంతేకానీ కొత్త విషయాలకు అన్వయించడం తెలీదు. తద్వారానే జీవితాన్ని ‘అర్థం’ చేసుకోగలమన్న అవగాహనా లేదు. ఇది సాధారణ పరిస్థితి కాగా, మన దేశానిది మరీ అన్యాయమయిన దుస్థితి. దీనికి కూడ చారిత్రక కారణాలున్నాయి.
ఒకటి, ఇవాళ సైన్స్ గా బోధించేది ఏదీ ఈ దేశంలో కనుక్కున్నది కాదు. ఈ దేశ వైజ్ఞానిక సంప్రదాయానికి చెందింది కాదు. రెండు, పాశ్చాత్య దేశాల ఆధునిక వైజ్ఞానిక సంప్రదాయం మధ్యయుగాల చర్చి సంప్రదాయాన్ని ప్రతిఘటించి, పోరాటంచేసి, ప్రాణత్యాగం చేసి, రూపం తీసుకున్నది కాగా, మనదేశ ‘ఆధునిక’ వైజ్ఞానిక సంప్రదాయం మధ్యయుగాల బ్రాహ్మణ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.
సాంఘిక ఆచారాలలో బ్రాహ్మణ సంస్కృతికి వ్యతిరేకంగా కొంత పోరాటం జరిగిందిగానీ, వైజ్ఞానిక రంగంలో అటువంటి పోరాటమేమీ లేకుండానే మనల్ని మనం‘ఆధునికులం’ అనుకుంటున్నాం. సైంటిస్టులలో అధికశాతం కులంరీత్యానూ ఆలోచనలోనూ బ్రాహ్మణులు కాగా, కులంరీత్యా బ్రాహ్మణులు కానివారు కూడ ఆలోచనలలో బ్రాహ్మణులే. విజ్ఞానానికి భౌతికపునాది వుందనీ, ఆ విజ్ఞానాన్ని మానవులు సామాజిక ఆచరణలో భాగంగా సంపాదించుకున్నారనీ బ్రాహ్మణ సంప్రదాయం ఒప్పుకోదు. జ్ఞానం అనాది అయినది, శాశ్వతమయినది, పూర్వ కర్మలవల్ల ద్రష్టలయినవాళ్ళకు అది ద్యోతకం అవుతుంది అంటుంది. ఆ ద్రష్టలు చెప్పగా తక్కినవారు తెలుసుకోవాలి. (గుంటూరు శేషేంద్రశర్మ లాంటివాళ్ళు ఈ ఆర్థంలో నే మార్క్స్ నూ ఐన్ స్టైన్ నూ కూడ ‘ద్రష్టలు’, ‘ఋషులు’ అంటారు). ఈ సంప్రదాయం కొత్త ఆలోచనలకూ విశ్లేషణకూ వ్యతిరేకమయినది. జీవితాన్ని మనం ప్రయత్నం మీద అర్థం చేసుకోగలమనే అవగాహనకూ వ్యతిరేకమయినది. అట్లాగంటే బ్రాహ్మణ సంప్రదాయంలో కొత్త ఆలోచనలు పుడుతూనే వచ్చాయి. కాని
కొత్త విషయాలు చెప్పినవారు కూడా ‘నేను చెప్తున్నదంతా వేదాలలోనే వుంది’ లేక ‘పూర్వ శాస్త్రాలలోనే వుంది’ అని ప్రకటించారు. పాత శాస్త్రాలకు భాష్యం మాత్రమే నన్నారు. అభిప్రాయాలకు ప్రమాణాన్ని జీవితంలో కాక పూర్వశాస్త్రాలలోనూ శ్రుతులలోనూ వెతుక్కోవడం బ్రాహ్మణ సంప్రదాయం ప్రముఖ లక్షణం. ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయనంత కాలం ఫిజిక్స్ లోనో జువాలజీలోనో పి హెచ్ డీ లు పుచ్చుకున్నంత మాత్రాన శాస్త్రీయ దృక్పథం ఏర్పడదు. విజ్ఞానం ప్రొఫెసర్ల బుర్రలలోనూ లైబ్రరీలలోని పుస్తకాలలోనూ వుంటుంది. అక్కడికెట్లా వచ్చిందంటే పూర్వపు ప్రొఫెసర్ల నుండి పుస్తకాల నుండి వచ్చింది.
ఇంకా వెనక్కిపోతే ఎవరో కొందరు ‘ఋషులు’ ఆ విజ్ఞానాన్ని గ్రహించి రాసిపెట్టారు. మనం ఋషులం కాము కాబట్టి మన ప్రొఫెసర్లూ లైబ్రరీలలోని పుస్తకాలూ విడమరచి చెప్పలేని కొత్త పరిస్థితులు ఎదురయితే నల్లబట్టలు తొడుక్కొని గడ్డంపెంచుకొని శబరిమలై పోతాం.
సైన్సు ను ‘చరిత్రహీన’ ను చేసే ఈ వైఖరి మధ్యయుగాల భూస్వామ్య సమాజం నుండి వచ్చినదే కాగా, విజ్ఞానాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టడం ఒక ప్రత్యేకమయిన బూర్జువా ఆవలక్షణం. భూస్వామ్య దశలో జ్ఞానం పూర్తిగా పరాయీకృతం, చాలవరకు కృత్రిమం అయినప్పటికీ ఆ పరాయీకృత జ్ఞానంలో ఒక సమగ్రత ఉంటుంది. నీతిశాస్త్రాలు తెలియని వాస్తునిపుణులు గానీ ధర్మశాస్త్రాలు చదువుకోని ఆలంకారికులుగానీ ఉండే అవకాశం లేదు. అన్ని రంగాలలోని జ్ఞానానికీ ఒకే సిద్ధాంత ప్రాతిపదిక ఉంటుంది. ధర్మం, వేదప్రామాణికత, కర్మ మొదలైన భావాలతో రూపొందింది బ్రాహ్మణ ప్రాపంచిక దృక్పథం. అయితే ఇవాళ ఫిలాసఫీ వేరు, జ్యూరిస్ప్రుడెన్స్ వేరు, ఆర్కిటెక్చర్ వేరు, లిటరరీ క్రిటిసిజం వేరు. ఒక్కొక్కదానికీ గల తాత్విక ప్రాతిపదిక వేరు. ఫ్యాక్టరీలలో కార్మికుల శ్రమను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడంవల్ల మొత్తం ఉత్పాదకతను పెంచినట్టే విజ్ఞానాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడితే మొత్తం విజ్ఞానం పెరుగుతుందనేది బూర్జువా అవగాహన. ఈ విధంగా వివరించగానే ఇది ఎంత అసంబద్ధమైన అవగాహనో అర్ధం అవుతుంది. అయితే చాలామంది విద్యావంతులు సహితం ఈభ్రమలో బ్రతుకుతుంటారు. విజ్ఞానానికి సాంకేతిక ప్రయోజనం మాత్రమే వున్నంతకాలం ఈ భ్రమ వాస్తవికంగానే కనిపిస్తుంది. నిజానికి విజ్ఞానాన్ని సాంకేతిక ప్రయోజనానికి పరిమితం చేయడం ఈ భ్రమ వెనుకనున్న సామాజిక లక్ష్యం. ఆ ప్రయోజనాన్ని దాటి పోదల్చుకున్నవాళ్ళకు ఈ వైజ్ఞానిక విభజన అసంతృప్తికరంగా అనిపిస్తుంది. తెలియక చాలామంది పూర్వకాలపు కృత్రిమ సమగ్రత కోసం అర్రులు చాస్తారు. అందులోని అవాస్తవికతకూ ఇందులోని అసమగ్రతకూ మధ్య కొట్టుమిట్టాడుతూంటారు.
చరిత్రనూ సమగ్రతనూ పోగొట్టుకున్న విజ్ఞానానికి ఆ రెండు లక్షణాలనూ తిరిగి కల్పించాలన్న ఆరాటం అవ్యక్తంగానయినా పాశ్చాత్య వైజ్ఞానికులలో లేక పోలేదు. ఇది ‘పాపులర్ వైన్స్’ అనే రచనా ప్రక్రియలో కొంతమేరకు ప్రతి ఫలించింది. ‘పాపులర్ వైన్స్’కు వేరే ఎన్ని లక్ష్యాలూ, లక్షణాలూ వున్నప్పటికీ, ఆధునిక విజ్ఞానంలోని ఈ వైరుధ్యం యొక్క నేపథ్యంలో దానిని చూడడమే మనకు ప్రయోజనకరం. పాఠ్యపుస్తకాలలో, సైన్స్ కోల్పోయిన చరిత్రకూ, సమగ్రతకూ, ఈ రచనలు కొంతవరకు తిరిగి ప్రాణం పోశాయి. చెప్పుకోవడానికి ఇవి సామాన్య విద్యావంతులకు సైన్స్ ఏమిటో తెలియజేప్పే రచనలే అయినా, సైన్స్ లో పట్టాపుచ్చుకున్న వాళ్ళు సైతం సైన్సు ఏమిటో తెల్సుకోవడం కోసం చాటుగా ఈ పుస్తకాలు చదువుతుంటారు. మానవసమాజ పరిణామక్రమంలో సహజంగా ఎదురయిన సమస్యలకు పరిష్కారంగా విజ్ఞానం పుట్టిందన్న ప్రాథమిక వాస్తవాన్నీ, విజ్ఞానం ఆవిభాజ్యం అనే సత్యాన్నీ, ‘పాపులర్ సైన్స్’ కొంతవరకు విశదీకరించగలిగింది. వ్యవసాయదారుల నుండి శిస్తు సేకరించి తమ సంపదగా ఖర్చు చేసుకున్న పాలకవర్గాలకు భూమిని సర్వే చేయవలసిన అవసరం రావడం పాశ్చాత్య దేశాల చరిత్రలో రేఖా గణితానికి నాంది అనీ, పశుపోషణ కోసం వస్తు మార్పిడీ కోసం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించిన ఆదిమ మానవ బృందాలు దిక్కులనూ, కాలాన్నీ దూరాన్నీ తెలుసుకోవడం కోసం ఆకాశంలోని తారలను అధ్యయనం చేయడం ఖగోళశాస్త్రానికి నాంది అనీ, నాగరిక దశకు వస్తే మధ్యయుగాల అంతంలో యూరప్ విపరీతంగా విస్తరించిన వర్తక పెట్టుబడి దూరప్రాంతాల నావికా ప్రయాణం చేపట్టడం న్యూటన్, కొపర్నికస్, గలిలియో, కెప్లర్ ఖగోళశాస్త్ర సిద్ధాంతాలకూ ఆధునిక గణిత శాస్త్రానికీ బాట వేసిందనీ, ద్రాక్షసారాయి ఉత్పత్తిలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో లూయీపాశ్చర్ సూక్ష్మజీవుల ఉనికినీ నైజాన్నీ కనుక్కోవడంతో ఆధునిక వైద్యశాస్త్రం ప్రారంభం అయిందవీ, ఇత్యాది అనేక చారిత్రక విషయాలు పాపులర్ పైన్స్ ద్వారా ప్రచారంలోకి వచ్చాయి.తెలుగులోనూ.. మన ఆదృష్టం కొద్దీ కాశీపట్నం కొండయ్య, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వసంతరావు వెంకట్రావు, వేమరాజు భానుమూర్తి, మహీధర నళినీ మోహన్, నండూరి రామమోహనరావుల వంటి చక్కటి పాపులర్ సైన్స్ రచయితలుండడంవల్ల సైన్సుకున్న చారిత్రక నేపథ్యం తెలుగు పాఠకులకు కొంత మేరకు అందుబాట్లోకి వచ్చింది.
అయితే పాపులర్ సైన్స్ అనేది సైన్స్ అధ్యయనంలోని వైరుధ్యానికి సమగ్ర పరిష్కారం కాదు. సైన్సుకు గల చారిత్రక భూమికనూ పరిణామక్రమాన్నీఅది కొంత మేరకు చూపించగలదు గానీ, సామాజిక చరిత్రలో సైన్సు పాత్ర ఏమిటో అది చూపలేదు. అది తెలియనంతకాలం సైన్సు సృజనాత్మకంగా అర్థం చేసుకున్నవాళ్ళు సహితం శాస్త్రీయదృక్పథాన్ని సాధించలేరు. నిజానికి సైన్స్ ను కేవలం సృజనాత్మకంగా మాత్రమే అర్థం చేసుకున్న వాళ్ళు మరొక అతివాదానికిపోతారు. భౌతిక విషయాలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడమే శాస్త్రీయదృక్పథం అనీ, అది సైన్సులో పట్టా పుచ్చుకున్నవారికే ఉంటుందనీ, మామూలు జనానికి శాస్త్రీయ దృక్పథం ఉండదనీ, మరొకవైపు సైన్సు అనేది మానవ సమాజానికీ సామాజిక ఆచరణకూ అతీతమయిన పరమ సత్యం అనీ ఒక అతిశయం పెంచుకుంటారు. వైజ్ఞానిక విషయాలను గురించిన మిడిమిడి జ్ఞానంతోపాటు సైన్సును గురించిన ఈ అతిశయం మన దేశంలోని విద్యావంతులలో – ముఖ్యంగా సైన్స్ పట్టా పుచ్చుకున్నవారిలో బలంగా ఉంటుంది. అందుకనే వాళ్ళు సాధారణంగా ప్రజాస్వామిక ఉద్యమాలలోకి రారు. విజ్ఞానానికి మానవ చరిత్రలో వున్న పాత్రను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే సైన్స్ అంటే ఏమిటో సరిగ్గా అర్థం అవుతుంది. అప్పుడు మాత్రమే శాస్త్రీయ దృక్పథం సాధ్యం అవుతుంది. సామాజిక ఆచరణలో భాగంగా మానవులు జ్ఞానం ఎప్పుడూ పొందుతూనే వుంటారు. ఆ జ్ఞానం ఏదో ఒక ప్రాతిపదిక మీద క్రమబద్ధం అవుతూనే వుంటుంది. ఆ ప్రాతిపదిక ఏ మేరకు వాస్తవికమయినది, ఏ మేరకు కృత్రిమ మయినది అనేది ఆ సమాజం పరిణతిని బట్టి, అందులోని విభిన్న వర్గాలకు సమాజంలోగల స్థానాన్ని బట్టి వుంటుంది. ఒకే విషయాన్ని రెండువర్గాలకు చెందిన ప్రజలు వేరువేరుగా అర్థం చేసుకుంటారు. యజ్ఞాల వల్లనే పాడి పంట సమృద్ధిగావుంటాయని బ్రాహ్మణులు నమ్మినా, పాడిపంట సమృద్ధిగా వుంటేనే యజ్ఞాలు సాధ్యం అవుతాయని రైతులు అర్థం చేసుకునే వుంటారు. ఎందరు దేవుళ్ళకు మొక్కినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఫలసాయం సమృద్ధిగా వుండాలంటే నేలస్వభావాన్ని బట్టి, నీటి అందుబాటును బట్టి, భూమి సారాన్నిబట్టి, పంట వినియోగాన్ని బట్టి, సేద్యం చేయాలని ప్రతీ రైతుకూ తెలుసును. ఈ జ్ఞానం ఇవ్వాళ వచ్చింది కాదు, అగ్రికల్చర్ సైన్స్ తో పుట్టింది కాదు. అయితే జ్ఞానం అసమగ్రంగా పున్న దశలో, దానిని క్రమబద్ధం చేసే సిద్ధాంతం పూర్తిగా భౌతిక పునాదినికలిగి వుండదు. భౌతిక వాస్తవికత, అభౌతిక కల్పన, అందులో కలిసే వుంటాయి. పూర్తిగా భౌతిక ప్రాతిపదిక మీద విజ్ఞానాన్ని క్రమబద్ధం చేసే ‘సైన్స్’ అనే ఆధునిక విజ్ఞానరూపం వచ్చిన తరువాత ఈ రెండింటి కలయిక మనకు అసంబద్ధంగా అనిపిస్తుంది గానీ జనానికి అనిపించదు. అందుకే వాళ్ళు అప్పుడు, చదువుకున్నవాళ్ళు ఊహించనంత, శాస్త్రీయంగా వ్యవహరిస్తూ వుంటారు. మళ్ళీ మనం ఆశ్చర్యం నుండి తేరుకునే లోపల పులివేషాలు వేసుకొని గంగమ్మ జాతర అంటూ పూటుగా తాగి నాటుపాటలు పాడుతూ ‘న్యూసెన్స్ ‘ చేస్తారు. అయితే తమ జ్ఞానాన్ని క్రమబద్ధం చేయడంలో భౌతిక వాస్తవికతతోపాటు అభౌతిక కల్పనకూడా వుండడం అనేది కచ్చితంగా ఒక బలహీనతే. సమాజం సంక్షోభంలో పడ్డప్పుడు దోపిడీ పీడనలు ఎక్కువయినా, కరువుకాటకాలు వచ్చినా – ఆ కల్పన పాలు ఎక్కువై జనాన్ని నిస్సహాయులను చేసే ప్రమాదం వుంది. సంక్షోభాన్ని జనం ప్రతిఘటించినా ఆ ప్రతిఘటనా సిద్ధాంతంలోకి కూడ కల్పనపాలు వచ్చి చేరుతుంది. ఆ ప్రతిఘటన నిర్బంధం కారణంగానయినా వేరే ఏ ఇతర కారణంవల్ల నయినా సంక్షోభంలో పడితే మళ్ళీ అవాస్తవిక స్పందన ముందుకొచ్చి పరిష్కారాన్ని దుస్సాధ్యంచేసే ప్రమాదం ఉంటుంది.
ఇక రెండవది – పాలకవర్గాలు జ్ఞానాన్ని క్రమబద్ధం చేయడానికి ప్రతిపాదించే సిద్ధాంత చట్రం జనం అవగాహనకంటే వాస్తవదూరం. అయినప్పటికీ, సమాజంలో అదే ఆధిపత్య స్థానంలో వుంటుంది కాబట్టి అది జనం ఆలోచనలను కూడ లొంగదీసుకుంటుంది. తద్వారా వారి భౌతికమయిన లొంగుబాటుకూ అణచివేతకూ దోహదంచేస్తుంది. దానిని మార్క్స్ ‘భావజాలం’ (ideology) అన్నాడు. బ్రాహ్మణులు భూసురులనీ రాజులు దైవాంశ సంభూతులనీ ధర్మప్రభువుల పాలనలో కష్టాలుండవనీ బాధలన్నీ కర్మఫలం అని నమ్మడం – ఒక్క మాటలో బ్రాహ్మణ భావజాలాన్ని నమ్మడం – జనం ప్రయోజనాలకు హానికరం అయినా ఏదో ఒక స్థాయిలో జనం నమ్ముతారు. ఆ నమ్మకం వాళ్ళ అణచివేతను సుసాధ్యం చేస్తుంది. జనం ఆలోచనలలోని అభౌతిక అంశను ఆసరాచేసుకొని, దానిని పెంచి పోషించి, తమ పాలనకు అవసరమైన భావజాలాన్ని జనంలోకి చొప్పించడం ద్వారా పాలకవర్గాలు జనం మనసుల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుతారు. వాళ్ళ శరీరాలమీద ఆధిపత్యం నెలకొల్పడానికి ఉద్దేశించబడ్డ పోలీసులూ చట్టాలూ కోర్టులూ బందిఖానాలూ ఎంత ముఖ్యమో ఇదీ అంతే ముఖ్యం. చరిత్రలో ‘జ్ఞానం’ నిర్వహించే ముఖ్యమయిన పాత్రలలో ఇది ఒకటి. మన దేశచరిత్రలో ఈ పాత్రకుగల ప్రాముఖ్యం మరీ ఎక్కువ. పుణ్యక్షేత్రాలు ఆత్యధికం ఆటవికులు నివసించే కొండల మీదను, అడవులలోను అడవుల సమీపంలోని మైదానాలలోను ఉండడం. తిరుపతి, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, భద్రాచలం, అన్నవరం, సింహాచలం,వేములవాడ కాకతాళీయం కాదు. జనం జీవితంలో చాలా పరిమితమయిన పాత్ర గల దేవుళ్ళనూ దేవతలనూ తీసుకొని వాళ్ళ పేర్లను సంస్కృతీకరించి – వెంకన్నను వెంకటేశ్వరుడనీ, అప్పన్నను అప్పల నరసింహస్వామి అనీ మల్లన్నను మల్లికార్జునస్వామి అని — వాళ్ళను బ్రాహ్మణ పురాణాలలోనికి ఇరికించి, తద్వారా నాగరిక సమాజానికి ఆ జనాన్ని లొంగదీసుకునే క్రమాన్ని సులభతరం చేశారు. జనంలోవున్న అవాస్తవికమయిన నమ్మకాలు ఈ క్రమంలో భావజాలంగా మారతాయి.
ఆధునిక ‘సైన్స్’ అనేది పుట్టడంతో పాలక వర్గాలకు భావజాల సంబంధమయిన కొత్త వైరుధ్యం వచ్చి పడింది. సైన్సుగల ప్రత్యేకమయిన తాత్విక లక్షణం ఏమిటంటే అది జ్ఞానాన్ని పూర్తిగా భౌతిక ప్రాతిపదికమీద క్రమబద్ధంచేస్తుంది. అందుకోసం అవసరమయిన ఆన్వేషణ చేస్తుంది. అయితే పుట్టింది మాత్రం కొత్తగా చరిత్రలోకి వచ్చిన పెట్టుబడిదారీ వర్గం అవసరాలుతీర్చడంకోసం. ఈ పెట్టుబడిదారీ వర్గం తన అస్తిత్వం కోసమే ఉత్పత్తిని నిత్యం పెంచుతూ ఉత్పత్తి సాధనాలను మెరుగుపరుస్తూ పోతుంది. దానికి పూర్తిగా భౌతిక ప్రాతిపదిక గల సైన్స్ అనే విజ్ఞానరూపం కావాలి. పాలకవర్గాలకు భౌతిక ప్రాతిపదిక గల విజ్ఞానరూపం ఒక ప్రధాన అవసరం కావడమే చరిత్రలో ఒక కొత్త వైరుధ్యం. అంతకుముందు భౌతికజ్ఞానం అవసరం తక్కువ, ఆధ్యాత్మిక భావాల అవసరమే ఎక్కువ. ఇంకొకరకంగా చెప్పాలంటే జ్ఞానం అవసరం తక్కువ, భావజాలం అవసరం ఎక్కువ. పెట్టుబడిదారీ వర్గం భూస్వామ్య వ్యతిరేక కర్తవ్యాలను నిర్వహిస్తూ వున్నంతకాలం ఈ వైరుధ్యం బయటపడలేదు.
బూర్జువా విప్లవాలన్నింటిలోనికి అత్యంత తీవ్రరూపం దాల్చిన ఫ్రెంచి విప్లవంలో మత వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉండింది. సామాన్య ప్రజానీకం మతవ్యతిరేక నినాదాలతో వీధులలోకి వచ్చారు. ఆస్తికులకూ నాస్తికులకూ దొమ్మీలు జరిగాయి. అయితే ప్రథమదశ దాటిపోయిన తరువాత వైరుధ్యం బయటపడింది. పెట్టుబడిదారీ వర్గం కూడ ఒక దోపిడీ వర్గమే కాబట్టి దానికీ ఒక భావజాలం కావాలి. దానికి భౌతిక జ్ఞానం ఎంత అవసరమో అంత దుస్సహం. ఈ వైరుధ్యాన్ని పరిష్కంచుకోవడం కోసం సైన్స్ నే ఒకవైపు భావజాలంగా మారుస్తూ మరొకవైపు పాతమతాలను పునరుద్ధరిస్తూ, ప్రాచ్యమతాలను దిగుమతి చేసుకుంటూ నానా తంటాలు పడుతోంది సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ సమాజం. ప్రత్యేకించి, సైన్స్ నే ఒక భావజాలంగా మార్చేక్రమం ప్రస్తుత సందర్భంలో ముఖ్యమయినది. విషయ పరిజ్ఞానం, విశ్లేషణా చట్రం, ప్రయోగ ప్రక్రియ, తాత్విక దృక్పధం అయిన సైన్స్ ఇవాళ ఒక భావజాలంగా మారింది. సైన్సు ఒక తాత్విక దృక్పథం స్థాయి నుండి సాంకేతిక ప్రక్రియ స్థాయికి దిగజార్చడం, సైన్సును చరిత్ర నుండి వేరుచేయడం, సైన్సును ముక్కలుగా విడగొట్టడం. మరొకవైపు, సాంకేతిక ప్రక్రియ స్థాయికి దిగజారిన సైన్సు సామాజిక ఆచరణకు అతీతమయిన పరమ సత్యంగా ఆకాశానికి ఎత్తడం, ఇదంతా సైన్సును భావజాలంగా మార్చిన క్రమంలో జరిగింది.
ఇందులో చివరి అంశం ప్రభావం సామాన్య మానవులమీదే కాక, తమను తాము సామ్రాజ్యవాద వ్యతిరేక అభ్యుదయ వాదాలుగా భావించేవారి మీద కూడా బలంగా వుంది. సైన్సును ఇటువంటి వ్యక్తులు కూడా సామాజిక ఆచరణకూ వర్గ ప్రయోజనాలకూ అతీతమయిన పరమ సత్యంగా తెలిసో తెలీకో భావించబట్టే అణువిద్యుత్ కేంద్రాలు మానవ మనుగడకు ప్రమాదకరం అని తెలిసినా వ్యతిరేకించడానికి భయపడతారు. కంప్యూటరైజేషన్ వల్ల మనబోటి నిరుద్యోగ దేశాలకు నష్టమే ఎక్కువని నిరూపించినా దానిని వ్యతిరేకిస్తే ‘చాదస్తం’ అనుకుంటారేమోనని భయపడతారు.
మనం సామ్రాజ్యవాద దేశాలనుండి సాంకేతిక పరిజ్ఞానంతోబాటు సైన్సుకు సంబంధించిన ఈ భావజాలాన్ని కూడా దిగుమతి చేసుకున్నాం. అయితే మన దేశ పాలకవర్గాలకు ఈ భావజాలం సరిపోదు. వాళ్ళ సాంకేతిక పునాది పరిమితం, వాళ్ళు సాధించగల సాంకేతిక ప్రగతి అంతంత మాత్రం. కాబట్టి మనదేశ పాలకవర్గాల భావజాలంలో ఈ సామ్రాజ్యవాద సైన్స్ తోబాటు అంతకంటే బలంగా సాంప్రదాయక బ్రాహ్మణ భావజాలమూ కొనసాగుతోంది.
సైన్స్ లోనికీ ఈ భావజాలం ప్రవేశించింది. అంతర్జాతీయ కాన్ఫరెన్సులకు వెళ్ళే భారతీయ సైంటిస్టులు భగవద్గీతను ఇంకొంచెం చదువుకున్న వాళ్ళయితే ఛందోగ్య బృహదారణ్యక ఉపనిషత్తులను వూటంకించకుండ తిరిగిరారు. ఈ రెండింటి సహజీవనాన్ని సమర్థించడం కోసం ఆధునిక భారత తాత్వికులు మానవ జీవితాన్ని రెండుగా విడగొడతారు. మనుషులకు భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేవి రెండు ఉంటాయనీ మొదటి దానికి సైన్స్, రెండవ దానికి వేదాంతం వర్తిస్తాయనీ అంటారు (ఈ ద్వైతం మళ్ళీ కొందరి చేతులలో అద్వైతంగా మారి సైన్సే వేదాంతం వేదాంతమే సైన్స్ అవుతుంది. ఆ గందరగోళం ప్రస్తుతానికి అనవసరం). ఈ మిశ్రమ భావజాలంలో ఒక అంశం అయిన – ఇప్పటికే ఒక భావజాలం అయిపోయిన – సైన్స్ అనేదాని గర్భంలో వున్న నిజమైన సైన్స్ అనే శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథాన్ని వెతికి పట్టుకోవడం సగటు భారతీయ విద్యావంతులకు దుసాధ్యం కావడంలో ఆశ్చర్యం ఏముంది। ఆ కర్తవ్యం సాధించడానికి బ్రాహ్మణ భావజాలంతోనూ తలపడాలి. సామ్రాజ్యవాదపు ‘సైన్స్’ అనే భావజాలంతోనూ తలపడాలి. సైన్సు గురించి ఆలోచించేటప్పుడూ రాసేటప్పుడూ ఈ కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దీనికి ‘పాపులర్ సైన్స్’ సరిపోదు. సైన్సు గురించి రాజకీయంగా ఆలోచించడం నేర్చుకోవాలి. పాశ్చాత్య దేశాలలో రాడికల్ సైన్స్ ఉద్యమం కొన్ని ఏళ్ళుగా నడుస్తోంది. వాళ్ళ దేశాల రాజకీయార్థిక పరిస్థితుల నేపధ్యంలో ఆ ఉద్యమం సైన్స్ నీ. టెక్నాలజీనీ విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా, సామ్రాజ్యవాద పెట్టుబడి, సైన్స్ ను ఒక భావజాలంగా ఏరకంగా మార్చిందీ ఆ ఉద్యమం చక్కగా ఎండగట్టగలిగింది. ఆ ఆవగాహనను మనం టోకుగా దిగుమతి చేసుకుంటే మన అవసరం తీరిపోదు. సామ్రాజ్యవాద పాలనలో వున్న దేశాల పరిస్థితులకు సరిపోయే విశ్లేషణ మన పరిస్థితులను ఆర్థం చేసుకొనడానికి ఉపయోగపడుతుంది గానీ పూర్తిగా సరిపోదు. దానికోసం మనం సృజనాత్మకంగా సైన్స్ నూ టెక్నాలజీని పరిశీలించాలి.
విరసం ప్రచురించిన కొడవటిగంటి కుటుంబరావు సైన్సు వ్యాసాలకు కె. బాలగోపాల్ గారి ముందుమాట