–  సి.వి. కృష్ణయ్య

మనం నడిచే దారిలో విలువైన రత్నాలు ఉంటాయి. అవి మామూలుగా రాళ్ళలాగే ఉంటాయి. వాటిని కాళ్లతో తొక్కుకుంటూ నడిచి వెళ్తాం. మన జీవితంలో కూడా రత్నాలు వంటి విలువైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను జాగ్రత్తగా పరిశీలించి చూడగలిగితే అవి మనకు ఎంతో విలువైన పాఠాలుగా మిగిలిపోతాయి. దురదృష్టం ఏమిటంటే దేనిని మనం సీరియస్ గా తీసుకోము. యధాలాపంగా వదిలేస్తాం. దీనివలన చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాం.

టీచర్లు ,తల్లిదండ్రులు పిల్లలకు నిరంతరం నీతులు చెబుతూ ఉంటారు. పిల్లలకు చెప్పే ఆ నీతులు పెద్దలు అసలు పాటించరు. బయటకు చెప్పలేకపోయినా పెద్దలకు న్యాయం పిల్లలకు న్యాయమా? అనే భావన వారి మనసుల్లో ఉండిపోతుంది. అందుకే పెద్దలు చెప్పే నీతులు వింటున్నట్లు నటిస్తారే గాని వాటిని పట్టించుకోరు. పిల్లలు తప్పులు చేస్తే నిలబెట్టి వాయిస్తాం. వారి చేత సారి చెప్పిస్తాం. అదే తప్పు పెద్దలు చేసి పిల్లలు మనసులు నొప్పిస్తే పొరపాటుగా నైనా సారీ చెప్పరు. అహం అడ్డు వస్తుంది.

టీచరు పిల్లలకి సారీ చెబితే ఏమవుతుంది ? ఇందుకు సంబంధించి నా ఉపాధ్యాయ వృత్తిలో జరిగిన రెండు సంఘటనలు వివరిస్తాను.

సంఘటన 1:  ఒకరోజు సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. కండక్టర్ టికెట్ చెంచి ఇవ్వబోతూ నన్ను చూసి సారీ అంటూ ఇవ్వకుండా వెనుతిరిగాడు. నేను ఆశ్చర్యపడుతూ కండక్టర్ ని పరిశీలనగా చూశాను. డేవిడ్! నా టెన్త్ క్లాస్ స్టూడెంట్.  పోలీస్ గా సెలెక్ట్ అయి ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. ప్రైవేట్ బస్సులో కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు ఏమిటి ?

ఇంతలోనే డేవిడ్ నా దగ్గరకు వచ్చి “సార్, నేను మీ స్టూడెంట్ డేవిడ్ ను గుర్తున్నానా ?”అని అడిగాడు.

“అవును. పోలీసుగా ఉద్యోగం చేస్తున్నట్టు విన్నాను .ఏమైంది ?” అని అడిగాను .

“నా పొగరు. పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారులను ఎదిరిస్తే ఊరుకుంటారా? ఇరికించి సస్పెండ్ చేశారు. మీలాంటి టీచర్లను ఎదిరించి మాట్లాడాను. మీ చేత సారీ చెప్పించుకున్నాను. ఆ పాపం ఊరికే పోతుందా?” అన్నాడు బాధగా.

“డేవిడ్, ఆరోజు నువ్వు తప్పు చేయలేదు. ఈరోజు తప్పు చేసి ఉండవు. నీ ఉద్యోగం నీకు వస్తుంది. ధైర్యంగా ఉండు” అన్నాను. “సార్ మీతో తీరిగ్గా చాలా విషయాలు మాట్లాడాలి. టిక్కెట్లు ఇవ్వాలి ఇంకా వస్తాను” అంటూ వెళ్ళాడు.

డేవిడ్ హాస్టల్లో ఉండేవాడు. బలంగా ఎత్తుగా ఉండేవాడు. ఎప్పుడూ తల దువ్వుకునే వాడు కాదు. ఒంటరిగా ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పాను. తల ఊపుకుంటూ వెళ్లేవాడు. ఉండబట్ట లేక ఓ రోజు క్లాసులో “డేవిడ్ జాగ్రత్త! నీ తలలో పక్షులు గూడు కట్టుకుంటాయి” అని వ్యంగంగా అన్నాను. డేవిడ్ లేచి నిలబడి “నా తల నా ఇష్టం. మీరు అలా మాట్లాడవద్దు” అంటూ కోపంతో అన్నాడు. నా తప్పేమిటో అర్థమైంది. యుక్త వయసుకు వస్తున్న పిల్లలు. అందరి ముందు అవమానంగా ఫీల్ అయ్యాడు. నేను వెంటనే సారీ చెప్పాను. ఆ విషయాన్ని కొనసాగించకుండా, రెండో మాటకు అవకాశం లేకుండా, చాలా సాధారణ విషయంగా తీసుకుని పాఠంలోకి వెళ్లిపోయాను. పిల్లలందరూ డేవిడ్ వైపు కోపంగా చూశారు.

సంఘటన 2: ఒకరోజు ఫోన్లో “సార్ నేను సునీతను. టెన్త్ క్లాసులో మీ స్టూడెంట్ ని. చాలా రోజుల నుండి ఫోన్ చేసి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను. నిన్ననే మీ నెంబర్ దొరికింది. ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు. మీరు మా మేలుకోరు చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మనసు నొప్పించినందుకు సారీ” అంటూ చాలా విషయాలు మాట్లాడింది.

నేను పిల్లలకు వ్యాసాలు చెప్పేటప్పుడు చాలా పద్ధతులు పాటిస్తాను. చివరి పద్ధతికి వచ్చేసరికి స్వయంగా వాళ్ళు రాయగలగాలి. ఇక్కడే పిల్లలు మొండికేసేవారు. అయినా నేను ఎలాగైనా వాళ్ళ చేత రాయించాలని ఓపిగ్గా నిరీక్షిస్తూ ప్రతిరోజు గుర్తు చేస్తూ అలా రాయడం వల్ల పిల్లలకు జరిగే మేలు ఏమిటో వివరించేవాడిని. చివరిగా సునీత మిగిలింది. ఎప్పుడు రాస్తావని అడిగాను. విసురుగా లేచి “నేను రాయను. మీరు చేయాల్సిన పని మా చేత చేయిస్తున్నారు. మీరే చెప్పండి” అని కూర్చున్నది. “ఈ చదువుల వల్ల మీకు మిగిలేది పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం. మనసులో అనుకున్న మాటలు స్వయంగా రాయగలగడం. వంట నేర్చుకుంటాం. ఎప్పుడు నేర్చుకుంటూ కూర్చోము. ఏదో ఒక రోజు సొంతంగా చేయగలగాలి కదా! ఇంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు. మీ మీద కోప్పడి మిమ్మల్ని మరీ ఒత్తిడి చేసి బాధ పెట్టలేను. బాధపెట్టి ఉంటే సారీ” అన్నాను బాధగా.

వయసులోకి వస్తున్న పిల్లలు దుడుకుగా ఉత్సాహంగా ఉంటారు. అదే సమయంలో న్యాయంగా ఆలోచిస్తారు. నేను సారీ చెప్పడంతో ఆలోచనల్లో పడిపోయి ఉంటుంది. మనసులో తర్కవితర్కాలు జరిగి ఉంటాయి. పెళ్లి, పిల్లలు, కుటుంబం వంటి సొంత విషయాల్లో పడి ఆ సంఘటన తాత్కాలికంగా మరుగున పడిపోయింది. పిల్లలు బడికి వెళ్లి చదువుకోవడం, వారి చూచి రాతలు, ఇంపోజిషన్లు చూసిన తర్వాత, చదువుల్లో స్వయంగా రాయాల్సిన అవసరాన్ని గుర్తించి, గతంలో తాను చేసిన తప్పేంటో అర్థం అయింది. పాతిక ఏళ్ల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది.

డేవిడ్ కూడా తన సస్పెన్షన్తో నా సంఘటన గుర్తు వచ్చి మదన పడుతూ ఉండొచ్చు. నేను కనపడగానే గత సంఘటనను గుర్తు చేసుకొని తన తప్పుకు పశ్చాత్తాపం వెలిబుచ్చాడు.

ఆ రోజు నేను వారి మీద కోప్పడి దండించి ఉంటే ఏం జరిగేది ? నాకేం మిగిలేది? పిల్లలు ఏం నేర్చుకుని ఉండేవారు? ఆ సంఘటనలు చెడు సంఘటనలుగా మరుగున పడిపోయి ఉండేవి.

నా సారీ వల్ల ఆ సంఘటనలు నాకు పాఠాలు అయ్యాయి. పిల్లలకు గుణపాఠాలు అయ్యాయి.

మనం పిల్లలనుండి ఏ ఫలితాలు కోరుకుంటామో, ఆ ఫలితాలకు విరుద్ధంగా పెద్దల ప్రవర్తనలు ఉంటాయి. ఇదొక విచిత్రం.

జ్ఞానం అనేది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. పుస్తకాలు చదివి పరీక్షలు రాసి పాస్ అయినంత మాత్రాన జ్ఞానం వంటపట్టదు. పిల్లలతో కలిసి జీవిస్తూ పిల్లల సైకాలజీని, బోధిస్తూ బోధనాకళను, వెంటపట్టించుకోవాలి.

కానీ తెలుసుకోవాలనే కుతూహలాన్ని నేర్చుకునే శక్తి సామర్థ్యాలను చిన్నప్పుడు బడిలోనే పోగొట్టుకుంటాం. ఇది మరో విచిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *