కొన్ని వార్తలు వింటుంటే మనం ఆదిమ బర్బర యుగాల్లోంచి ఇంకా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నామా అనిపిస్తుంది. అలాంటి వార్తల్లో ఒకటి ‘ 2014 -21 మధ్య 103 నరబలులు జరిగా’యన్న వార్త! సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ “జాతీయ నేర రికార్డు బ్యూరో” (NCRB) బయటపెట్టిన వాస్తవమిది. అంతే కాదు 2022లో కూడా ఇలాంటివి ఆరు జరిగాయట! ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (26 అక్టోబరు 2024) తాజా కథనమిది. రికార్డుకెక్కినవే ఇన్నివుంటే బయటికే పొక్కనివి మరెన్ని వుంటాయి? మరీ సిగ్గేసే విషయం ఏమిటంటే ఈ బ్యూరో నేరాల జాబితాలో నరబలుల గణాంకాల కోసం ఒక ప్రత్యేక కాలమ్ ఇప్పటికీ ఉండడం! అది రెగ్యులర్ గా అప్ డేట్ అవుతుండడం!

గత సంవత్సరం సెప్టెంబర్ 22న ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో 11 ఏళ్ల బాలుడిని బలిచ్చిన వార్త అప్పుడు దేశానికి దేశాన్నే కుదిపివేసింది. ఈ “పవిత్ర క్రతువును” ఆ పాఠశాల ప్రిన్సిపాలు, డైరెక్టరు (ఇద్దరూ తండ్రీ కొడుకులు) కలసి తమ “సౌభాగ్యం” కోసం నిర్వహించారు! అంతకుముందు 1980లో తమిళనాడులోని ఒక ప్రాథమిక పాఠశాలలో కూడా ఇద్దరు పసిపిల్లల్ని ఇలానే బలిచ్చారు. మన రాష్ట్రమూ ఇలాంటి కిరాతక తాంత్రిక బలిదానాల్లో తక్కువేమీ తినలేదు. మదనపల్లిలో గణితమూ,రసాయన శాస్త్రమూ బోధించే అధ్యాపకులే 2021లో వయసొచ్చిన తమ ఇద్దరు కూతుళ్లను “పరలోక సిద్ధికి” ప్రేరణనిచ్చి కడతేర్చారు !

ఒకప్పుడు సైన్సూ, చదువూ విస్తరించనప్పుడు, గ్రామాలు అంధకారమయంగా వున్నప్పుడు, కులకట్టుబాట్లు కొందరిని ప్రపంచానికి దూరంగా నెట్టేసినప్పుడు, ప్రజల అజ్ఞానం పెట్టుబడిగా ఆధిపత్యం సాగుతున్నప్పుడు ఇలాంటివి సాగాయంటే అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిన వాళ్ళం. చంద్రమండలాన్ని చేరుకున్న వాళ్ళం. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యతరగతి మనది. ఎల్లలు చెరిపేసి లోకమంతా అల్లుకుపోతున్న వాళ్ళం మనం. మరీ ఇటీవల విశ్వగురు పీఠం మీద కూడా వున్న వాళ్లం! ఈ వైజ్ఞానిక యుగంలోనూ ముక్కుపచ్చలారని బిడ్డల్ని మూర్ఖంగా ఏవేవో ఆశించి మంత్రగాళ్ళ మాటలు నమ్మి బలివ్వడమేమిటి? ఏ శక్తి వీళ్ళనిలా నడిపిస్తోంది? ఏ బలహీనత వీళ్ళనిలా పురమాయిస్తోంది? అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోని అత్యున్నత విద్యావంతులు సైతం నరబలి లాంటి మౌఢ్యాన్ని నెత్తికెత్తుకుంటే ఇక వెనుకబడ్డ రాష్ట్రాల్లో, మారుమూల గ్రామాల్లో, అడవుల్లో కొండల్లోని గిరిజన తెగల్లో మంత్రగాళ్ళ స్వైర విహారానికి అడ్డూ అదుపూ ఏముంటుంది?

ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో వున్నవారే సంప్రదాయం పేరుతో ఛాందసాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాలు ఏ రుజువులు లేని కథనాల్ని ఇష్టం వచ్చినట్లు కుమ్మరిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న స్వాములకూ, బాబాలకూ నోటి నిండా పనీ ప్రచారం ఇవి కల్పిస్తున్నాయి. హేతుత్వానికి, సత్యానికి క్రమంగా నిలువ నీడ లేకుండా పోతోంది. పెరుగుతున్న మధ్య తరగతి, కింది వర్గాల సంస్కృతీకరణ కూడా ఈ ధోరణికి పెద్ద ఆలంబనంగా మారుతున్నాయి. క్రమంగా ఒక ప్రకటిత అంగీకారం సమాజంలో దీనికి లభిస్తోంది. ఇలా చూస్తే ఇవేవో చెదురు మదురు సంఘటనలని తేలిగ్గా కొట్టి పారెయ్యలేం. ఎప్పుడూ చరిత్ర నిండా వున్నవేనని సరిపెట్టుకోలేం. ఒక క్రమంలో వాటికవే రూపు మాసిపోతాయని విస్మరించి వదిలెయ్యలేం. మన ఆలోచనా ధోరణుల్ని, సాంస్కృతిక హైన్యాన్ని, మొత్తంగానే మన సమాజపు నడకను తీవ్రంగా ప్రశ్నిస్తున్నవివి! నడమంత్రపు సిరినీ, పైపై ఆర్భాటాల్ని చూసి మురిసిపోతున్న మనం ఎంత కాలం చెల్లిన సాంస్కృతిక పునాదులపై ఈ సౌధాలు నిర్మిస్తున్నామో గుర్తించమని చేస్తున్న హెచ్చరికలివి! శాస్త్ర సామాజిక సాంస్కృతిక ఉద్యమకాలందరికీ ఎప్పుడూ ఎరగని సవాళ్లివి!

One thought on “ఇంకా నరబలులా?

  1. అవును. ఈ సవాళ్లను ఎదొర్కొని తీరాలి. ఈ ప్రయత్నంలో సైన్స్, సామాజిక, సాంస్కృతిక కార్యకర్తలు ముందుండాలి. భవిష్యత్ తరాలపై ఈ ప్రభావం పడకుండా వారిని మరింత చైతన్యపరచాలి. ఆ క్రమంలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో కదలాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *