ఎం. పి. పరమేశ్వరన్
మానవ పరిణామ క్రమం ప్రారంభ దశల్లో విజ్ఞానశాస్త్రాన్ని సాంకేతికత నుంచి వేరుచేయడం సాధ్యమయ్యేది కాదు. అంతేకాదు, విజ్ఞానశాస్త్రం–సాంకేతికతలను నిత్యజీవిత కార్యకలాపాల నుంచి కూడా విడదీయలేం. రాళ్లను పనిముట్లుగా ఎంచుకోవడం, వాటిని అవసరానికి అనుగుణంగా మలచడం వంటి చర్యలకు పదార్థాల కాఠిన్యం, మెత్తదనం, బలం, పెళుసుదనం, దృఢత్వం మొదలైన లక్షణాలపై అవగాహన అవసరమయ్యేది. విల్లు తయారు చేయడానికి స్థితిస్థాపకత గురించి అవగాహన అవసరమైతే, పరుగెడుతున్న జంతువుపై బాణం ప్రయోగించడానికి గతి శాస్త్రం, చలన శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం అవసరం.
వేట కోసం జంతువుల శరీరంలోని కాళ్లు, మెడ, గుండె వంటి భాగాలను లక్ష్యంగా ఎంచుకోవడం వెనుక జంతు శరీర నిర్మాణం, శరీర క్రియలపై ప్రాథమిక అవగాహన కావాలి. వేటాడటానికి, ఆహార సేకరణకు అనువైన ప్రాంతాలను ఎంచుకోవడం; పండ్లు, వేర్లు సేకరించడం వంటి కార్యకలాపాలకు మొక్కలు, జంతువుల జీవచక్రంపై అవగాహన ఉండాలి. అప్పట్లో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, యాంత్రిక శాస్త్రం లేదా పదార్థాల బలానికి సంబంధించిన ప్రత్యేక శాస్త్ర విభాగాలు లేవు. ప్రజల జీవన అనుభవమే ఉండేది. ఆ అనుభవాలను సేకరించడం, పోల్చడం, సాధారణీకరించడం, భావనలుగా మలచడం, సిద్ధాంతీకరించడం; వాటి ఆధారంగా అంచనాలు వేయడం; కొత్త అనుభవాలను పొందడం, తిరిగి కొత్త సాధారణీకరణలకు చేరుకోవడం. ఈ ప్రక్రియలోనే విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందింది. ఇదే విజ్ఞానశాస్త్రపు చారిత్రక మూలం.
సామాన్యులకు దూరమైన సైన్సు
విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, తొలుత అది ప్రజల జీవనంతో, సాంకేతికతతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించింది. కానీ తరువాత అది మరింత స్వతంత్రంగా మారుతూ, ప్రజల నుంచి క్రమంగా దూరమైంది. ఆ తరువాత సాంకేతికత కూడా విజ్ఞానశాస్త్రంపై మరింత ఆధారపడుతూ సామాన్య ప్రజల నుంచి దూరమైంది. అది కొద్దిమంది చేతుల్లోని ఆస్తిగా మారింది. మెజారిటీ ప్రజలపై తమ దోపిడీ సంబంధాన్ని కొనసాగించేందుకు ఆ కొద్దిమంది చేతుల్లో అది ఒక ఆయుధంగా మారింది. విజ్ఞానశాస్త్రం–సాంకేతికత గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పదివేల ఏళ్ల ప్రజాస్వామ్యం
ఇక ప్రజాస్వామ్యం విషయానికొస్తే అది ఇప్పటికీ గౌరవప్రదమైన పదంగానే ఉంది. ‘సోషలిజం’ అనే పదం లాగా ఇది ఇంకా తన గౌరవాన్ని కోల్పోలేదు. ప్రజాస్వామ్యం ఒక రకమైన సామాజిక ఒప్పందం. అది ప్రభుత్వ వ్యవస్థలోనూ, ప్రభుత్వేతర వ్యవస్థల్లోనూ ఉండవచ్చు. ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు, క్రీడా సంఘాలు మొదలైనవి ప్రభుత్వేతర ప్రజాస్వామ్యానికి ఉదాహరణలు. ప్రభుత్వేతర ప్రజాస్వామ్యాన్ని అనుమతించని సమాజంలో ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా ఉండలేదు.
మానవ చరిత్రలో ‘రాజ్యం’ అనేది ఒక నిర్దిష్ట దశలోనే ఆవిర్భవించింది. అది ఇటీవలి పరిణామం.బహుశా పదివేల సంవత్సరాలకు మించని చరిత్ర కలిగినది. ఈ కాలంలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి: బానిస యజమానుల ఆధిపత్యం, రాజులుచక్రవర్తుల పాలన, భూస్వామ్య వ్యవస్థ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, సామ్రాజ్య ప్రజాస్వామ్యం, బూర్జువా ప్రజాస్వామ్యం, మత నియంతృత్వం, సైనిక నియంతృత్వం, కార్మికవర్గ నియంతృత్వం, గుత్తాధిపత్య సామ్రాజ్యవాదం మొదలైనవి. వీటిలో అనేక రూపాలు ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సామ్రాజ్యాలు, నియంతృత్వాలు ఆహ్వానించదగినవి కావు. ప్రపంచంలోని అత్యధిక దేశాలు, ప్రజలు—దాని అర్థం ఏదైనా సరే—‘ప్రజాస్వామ్యాన్ని’ స్వాగతిస్తారు.
ప్రజాస్వామ్యానికి అబ్రహాం లింకన్ చెప్పినట్లు “ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం” అనే నిర్వచనాన్ని అంగీకరిస్తే, కార్మికవర్గ ప్రజాస్వామ్యం, గాంధేయ ప్రజాస్వామ్యం, బూర్జువా ప్రజాస్వామ్యం వంటి వివిధ భావనలను కూడా దానిలో చేర్చవచ్చు.
‘ప్రజల చేత’ పాలన అంటే ఏమిటి?
ప్రజాస్వామ్యమే అత్యంత ఆకాంక్షించదగిన ప్రభుత్వ రూపమని, దానికి లింకన్ నిర్వచనమే ఆమోదయోగ్యమైనదని భావిస్తే దాని లక్షణాలను కొంచెం లోతుగా పరిశీలించాలి.
ప్రతి ప్రభుత్వం, అది సామ్రాజ్య ప్రభుత్వం కావచ్చు, పెట్టుబడిదారీ అల్పసంఖ్యాకుల పాలన కావచ్చు, నిరంకుశ లేదా నియంతృత్వ ప్రభుత్వం కావచ్చు తాము ‘ప్రజల కోసం’ పనిచేస్తున్నామని చెప్పుకుంటాయి. ఏ ప్రభుత్వమూ తాము ప్రజలకు వ్యతిరేకమని చెప్పదు. కాబట్టి ‘ప్రజల కోసం’ అనే మాట ఒక్కటే సరిపోదు. ‘ప్రజల యొక్క’ అనే మాటకు కూడా నిజమైన అర్థం రావాలంటే ప్రభుత్వం ‘ప్రజల చేత’ నడపబడాలి.
అందువల్ల ఈ నిర్వచనంలో అత్యంత కీలకమైన మాట ‘ప్రజల చేత’ అన్నదే.
ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి: ‘చేత’ అంటే ఏమిటి? ‘ప్రజలు’ అంటే ఎవరు?
ప్రతి దేశంలోనూ సమాజం అనేక వర్గాలు, కులాలు, ప్రాంతాలు, జాతులు మొదలైన విభాగాలుగా విడిపోయి ఉంటుంది. వీరందరినీ కలిపి ‘ప్రజలు’ అనాలా? ఆచరణలో అది అంత సులభం కాదు. ఎందుకంటే వీరి మధ్య ప్రయోజనాల ఘర్షణలు ఉంటాయి. వాటిలో కొన్ని రాజీపడలేనివిగా కూడా ఉంటాయి. కాబట్టి ఒక ప్రభుత్వం ప్రజలందరి కోసం ఉండటం సాధ్యం కాకపోవచ్చు. అందుచేత అది మెజారిటీ ప్రజల చేత, మెజారిటీ ప్రజల కోసం ఉండాలి. ఇదే ప్రజాస్వామ్యానికి మార్గదర్శక సూత్రం.
మరి ‘ప్రజల చేత’ అంటే ఏమిటి?
కొంతకాలానికి ఒకసారి ఎన్నికల్లో ఓటు వేయడమేనా? అభ్యర్థుల ఎంపికలో మీకు ఎలాంటి పాత్ర లేకుండా, ఎన్నికైన తరువాత వారి కార్యకలాపాలపై మీకు ఎలాంటి నియంత్రణ లేకుండా, ఒక అభ్యర్థికి ఓటు వేయడమే ప్రజల పాలన అవుతుందా? అలా అయితే అది ప్రజల ప్రభుత్వం కాదు. అది తిరిగి తీసుకోలేని ‘పవర్ ఆఫ్ అటార్నీ’ ఇచ్చినట్లే.
సామాజిక ఒప్పందంలో శ్రమ విభజన, శ్రమను తిరిగి పంచుకోవడం కూడా ఉండాలి. ఈ పునర్విభజన విస్తృతంగా జరగాలి. నేడు ఉత్పత్తిదారులుగా ఉన్నవారు రేపు పరిపాలకులుగా మారాలి. పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు, అటెండర్ నుంచి ప్రధాన కార్యదర్శి వరకు, టెక్నీషియన్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు, ట్యూటర్ నుంచి ప్రొఫెసర్ వరకు, క్లర్క్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు – ప్రతి స్థానం నిరంతరం పునరుద్ధరించబడే సామాజిక ఒప్పందాల ద్వారా భర్తీ కావాలి.
ఏదీ శాశ్వతం కాదు; వారసత్వంగా రావడం కూడా ఉండకూడదు. ప్రతిదీ ‘ఎన్నుకోబడాలి’.
ప్రజల ప్రభుత్వం అంటే ప్రతి పౌరుడూ సమాజంలోని ఆర్థిక కార్యకలాపాల్లోనే కాకుండా రాజకీయ, పరిపాలనా కార్యకలాపాల్లో కూడా పాల్గొనాలి. ప్రజాస్వామ్యం సంపూర్ణ భాగస్వామ్యంతో కూడినదిగా ఉండాలి.
ఏ కార్యకలాపమైనా ఎంత పై స్థాయిలో నిర్ణయించబడి నిర్వహిస్తే, వ్యక్తుల భాగస్వామ్యం అంత తగ్గుతుంది. యంత్రాలు, నిర్వహణ వ్యవస్థలే నిర్ణయాలు తీసుకునే స్థితి వస్తుంది. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలంటే రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను నిరంతరం కింది స్థాయికి వికేంద్రీకరించడం అవసరం.
అమెరికా వంటి దేశంలో దాదాపు ప్రతిదీ భారీ స్థాయిలో నడుస్తున్నందున ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువగా వుంది. ఎన్నికల్లో కూడా వయోజనుల్లో 25 శాతం కన్నా తక్కువ మంది పాల్గొనే పరిస్థితి . ఎన్నికల్లో పోటీ చేయడానికి అపారమైన ధనం అవసరమవుతుంది. అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే దాదాపు బిలియనీర్ అయి ఉండాలని, సెనేటర్ పదవికి పోటీ చేయడానికే మిలియన్ల డాలర్లు అవసరమవ్వడం గమనించవచ్చు.
భారతదేశంలో కూడా పరిస్థితులు ఈ దిశగానే సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు లక్షల రూపాయలు, పార్లమెంట్ ఎన్నికలకు కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఇక ప్రజల అధికారం కాదు “డబ్బు అధికారం” అవుతోంది.
కార్యకలాపాలను చిన్న స్థాయికి తీసుకురావడం, తగిన ప్రాతినిధ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఎన్నికైన ప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు వంటి చర్యల ద్వారా ఎన్నికల వ్యయాన్ని సమాజానికీ, వ్యక్తులకూ ప్రస్తుతం ఉన్నదానిలో ఒక శాతం కన్నా తక్కువకు తగ్గించడం సాధ్యం.
సమాజపు రోజువారీ నిర్వహణలో పౌరులు చురుకుగా పాల్గొనాలంటే, ఏం జరుగుతోంది? ఏం చేయాలి? అనే విషయాలు వారికి తెలిసి ఉండాలి. అందువల్ల వారికి తెలుసుకునే ప్రాథమిక హక్కు, అలాగే నేర్చుకునే ప్రాథమిక బాధ్యత ఉండాలి.
అధికార నిర్మాణాన్ని తలకిందులు చేయాలి
ప్రస్తుత అధికార నిర్మాణాన్ని తలకిందులు చేయాలి. పౌరులు, వారి చిన్న సమూహాలు – ఇరుగుపొరుగు సమూహాలు, గ్రామసభలు – సార్వభౌమాధికారానికి మూలంగా మారాలి. ముఖాముఖి ప్రజాస్వామ్యం ఈ స్థాయిలోనే సాధ్యమవుతుంది.
గ్రామ పంచాయతీ, మండలం/బ్లాక్, జిల్లా, రాష్ట్రం, జాతీయ స్థాయిలకు వెళ్లేకొద్దీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మాత్రమే సాధ్యమవుతుంది. అది ప్రస్తుతం ఉన్నట్లుగా ప్రత్యక్ష ప్రాతినిధ్యం కావచ్చు లేదా పరోక్ష ప్రాతినిధ్యం కావచ్చు. కానీ ఈ వ్యవస్థలు తమ అధికారాన్ని పౌరులు, గ్రామసభల సమ్మతితోనే పొందాలి. దీనికి విరుద్ధంగా కాదు.
సార్వభౌమాధికారపు ప్రాథమిక స్థాయిలో—అంటే ఇరుగుపొరుగు సమూహాలు, గ్రామసభల్లో—రాజకీయ కార్యకలాపాల స్వభావం కూడా మౌలికంగా మారాలి. కులం, మతం, భాష, వ్యక్తిగత లేదా సమూహ విధేయతలతో రాజకీయాలు ముడిపడి ఉండే పరిస్థితి తొలగాలి. ప్రస్తుతం అధికారం పంచుకోవడానికి సాధనాలుగా మారిపోయిన రాజకీయ పార్టీల ఐక్య కూటముల స్థానంలో, తమ ప్రాథమిక వర్గ ప్రయోజనాలను ప్రతినిధ్యం చేసే ప్రజల ఐక్య కూటములు ఏర్పడాలి.
దేశాన్ని అనేక ఏకకేంద్ర వలయాల సమాహారంగా ఊహించవచ్చు. మధ్యలో ఇరుగుపొరుగు సమూహం లేదా గ్రామం ఉంటుంది. దాని చుట్టూ గ్రామం, బ్లాక్, జిల్లా, పంచాయతీ, రాష్ట్రం, జాతీయ స్థాయి వలయాలు ఉంటాయి. ఇవన్నీ సమాంతరంగా ఉంటాయి. ప్రతి వలయానికీ తనదైన విధులు, ఇతర వలయాలతో సంబంధాలు ఉంటాయి. కాలం, పరిస్థితులకు అనుగుణంగా ఇవి మారుతాయి. వివిధ స్థాయిల బాధ్యతలు, హక్కులు ఏకాభిప్రాయం ఆధారంగా విభజించబడతాయి.
ఆర్థిక అధికారాన్నీ వికేంద్రీకరించాలి
ఆర్థిక అధికారాన్ని తలకిందులు చేయకుండా రాజకీయ అధికారాన్ని తలకిందులు చేయడం సాధ్యం కాదు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల దాడిని తట్టుకునే సామర్థ్యాన్ని సంపాదించాలి; దీర్ఘకాలంలో వాటిపై నియంత్రణ సాధించగలగాలి.
ఇది శాస్త్ర సమాజం ముందు కొత్త సవాళ్లను ఉంచుతుంది. చిన్నదాన్ని అందంగా మాత్రమే కాకుండా శక్తివంతంగా మార్చగల సాంకేతికతలను అభివృద్ధి చేయాలి. చిన్న స్థాయి ఉత్పత్తిని ఆర్థికంగా సాధ్యమైనదిగా, పర్యావరణపరంగా సురక్షితమైనదిగా చేయాలి.
గతంలోనూ, ఇప్పటికీ శాస్త్రసాంకేతిక పరిశోధన, అభివృద్ధి ప్రధానంగా భారీ స్థాయి ఉత్పత్తికి తోడ్పడటమే లక్ష్యంగా సాగింది. దాన్ని మరింత ఆర్థికంగా లాభదాయకంగా చేయడం, ఆర్థికరాజకీయ అధికార కేంద్రీకరణను బలోపేతం చేయడం దాని దిశగా మారింది. అది ‘విలువల నుంచి స్వతంత్రమైనది’ కాదు.
శాస్త్ర–సాంకేతిక సమాజం ముందుంచబడిన సమస్యలు ఎక్కువగా పేద మెజారిటీ ఖర్చుతో నిరంతరం సంపన్నులవుతున్న వారి సమస్యలే. సహజంగానే వాటికి లభించిన పరిష్కారాలు ధనికులను మరింత సంపన్నులను చేయడానికే తోడ్పడ్డాయి.
నిజమైన ప్రజాస్వామిక సమాజంలో ప్రజలు తమను తాము పాలించుకునే సమాజంలో శాస్త్రసాంకేతిక సమాజం పూర్తిగా భిన్నమైన సమస్యలపై దృష్టి పెట్టాలి.
ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం, విద్య, వినోదం, విశ్రాంతి వంటి కనీస జీవన అవసరాలను ధనిక అల్పసంఖ్యాకులకు మాత్రమే కాకుండా పేద మెజారిటీకి కూడా ఎలా అందించాలి? ప్రతి పౌరుడూ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొని సామాజిక ఉత్పత్తిలో తనకు న్యాయమైన వాటాను పొందే అవకాశాన్ని ఎలా కల్పించాలి? భారీ ఉత్పత్తి కన్నా చిన్న స్థాయి, విస్తరించి ఉన్న ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా ఎలా చేయాలి? స్థానిక సమాజాలను మరింత స్వయం సమృద్ధిగా, స్వావలంబనతో ఎలా తీర్చిదిద్దాలి?—ఇవే శాస్త్ర–సాంకేతిక రంగం ముందున్న ప్రధాన ప్రశ్నలు కావాలి.
ముఖ్యంగా సమాచార రంగంలో శాస్త్ర–సాంకేతిక విప్లవం దేశాల భౌగోళిక సరిహద్దులను కరిగిస్తూ ప్రపంచాన్ని ఒక గ్రామంగా మారుస్తోంది. అయినప్పటికీ బలమైన స్థానిక ఆర్థిక వ్యవస్థ అవసరం. ఇది ఏకాకితనానికి పిలుపు కాదు. సమాన సంబంధాలకు పునాది వేయాలనే వాదన.
వనరుల సమస్య – సౌర ప్రజాస్వామ్యం
శాస్త్రసాంకేతిక సమాజం ముందు దీనికంటే మరింత తీవ్రమైన సమస్య ఒకటి ఉంది — అదే రోజురోజుకూ క్షీణిస్తున్న సహజ వనరులు. ఈ వనరుల కొరత ఏదో ఒక రోజు పరస్పర వినాశకర యుద్ధాలకు దారితీసి, మొత్తం మానవాళినే ప్రమాదంలో పడేయవచ్చు.బొగ్గు, చమురు, సహజ వాయువు మొదలైనవన్నీ పరిమితమైనవే; ఏదో ఒక రోజు అవి పూర్తిగా అయిపోతాయి. అందువల్ల మనకు సమృద్ధిగా, నిరంతరంగా లభించే శక్తి వనరు అవసరం.
సూర్యుడే అటువంటి ఏకైక శక్తి వనరు
సౌరశక్తిని తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా, అవసరమైనంత భారీ స్థాయిలో ఎలా వినియోగించుకోవాలి? శాస్త్రసాంకేతిక సమాజం ముందున్న ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. సుస్థిరమైన, భాగస్వామ్య ప్రజాస్వామ్యం కోసం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అత్యవసరం.
అణుశక్తిలో పురోగతి లేదా శిలాజ ఇంధనాలను వెలికితీసే సాంకేతికతలో అభివృద్ధి మాత్రమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేవు.
దీనికంటే మరింత క్లిష్టమైన సమస్య నేల, సముద్రపు నీరు వంటి వాటిలో అత్యంత స్వల్ప పరిమాణంలో విస్తరించి ఉన్న అవసరమైన లోహాలు, ఇతర పదార్థాలను సమర్థవంతంగా వెలికితీయడం.
వనరులను నిరంతరం పునర్వినియోగం, పునఃచక్రీకరణ చేసుకోగల వ్యవస్థతో కూడిన “సౌర ప్రజాస్వామ్యం” (Solar Democracy) మాత్రమే దీర్ఘకాలంలో సుస్థిరంగా నిలబడగలదు.చిన్నవాటిని శక్తిమంతం చేయడానికి, సౌరశక్తిని వినియోగించుకోవడానికి, అత్యంత పలుచగా విస్తరించి ఉన్న వనరులను ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు అనేక రెట్లు ఎక్కువ కృషి చేయడమే అసలయిన ప్రజాస్వామ్యం.
(AIPSN బర్ద్వాన్ ప్లీనం లో చేసిన ప్రసంగం )



