సంపాదకీయం

కేంద్రవిద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొత్తగా ‘గ్రీన్ విచ్ టైమ్’ (GMT) మీద యుద్ధం ప్రకటించాడు. అసలు ‘గ్రీన్ విచ్ ‘ అనేది వలసదార్ల ఊహారేఖ మాత్రమేననీ, దాన్ని కాలానికి కేంద్రంగా పరిగణించడం మెకాలే విద్యా మానసిక స్థితి నుంచి పుట్టుకొచ్చిందనీ కొత్త భాష్యం చెప్పుకొచ్చాడు. ఉజ్జయిని కేంద్రంగా “మహాకాలం” ప్రామాణికంగా గుర్తించే రోజు రావాలని పిలుపునిచ్చాడు.

గత మాసం మొదటి వారం ఉజ్జయినిలో జరిగిన ‘మహాకాల్ అంతర్జాతీయ సదస్సులో ‘ ఆయన తన ఖగోళ శాస్త్ర పాండిత్యాన్ని కూడా ప్రదర్శిస్తూ, ” ప్రధాన మధ్యాహ్న రేఖకు” (Prime Median) కర్కటరేఖకు ఉజ్జయిని సంగమస్థలమనీ, గ్రహగతుల ఆధారంగా కాల నిర్ణయం చేయడం భారతీయ ఖగోళ శాస్త్ర ప్రత్యేకత అనీ, పాశ్చాతులకిది అంతుబట్టదని కూడా సెలవిచ్చాడు! అక్కడితో ఆగక భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలను జ్ఞాన, విజ్ఞాన కేంద్రాలుగా కూడా చూడ్డం మనం అలవర్చుకోవాలని దిశా నిర్దేశం చేసాడు. ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక సైన్సుతో అనుసంధానం చేసి చూసే దృక్పథాన్ని సంతరించుకునేలా మన భవితరాన్ని తీర్చిదిద్దేందుకు నూతన విద్యా విధానం కంకణం కొట్టుకుందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. దీనికాయన పదేళ్ళ గడువు కూడా పెట్టాడు.

అన్నీ”వేదాల్లోనే వున్నాయిష” ధోరణి మనకిప్పుడేమీ కొత్త కాదు. కాకుంటే ఇదీ మధ్య శ్రుతిమించింది. దీన్ని మొదట దయానంద సరస్వతి ప్రారంభించాడంటారు. ఒకవైపు స్త్రీ పురుషసమానత్వం, కులరహిత సమాజం,,బాల్యవివాహాల విరోధం, విగ్రహారాధనా వ్యతిరేకత లాంటి సామాజిక సంస్కరణల్ని దూకుడుగా ముందుకు తెచ్చి, గడ్డకట్టుకున్న వైదిక ఛందసానికి సవాలు విసురుతూనే ఆయన 5000 ఏళ్లకు ముందే వైదిక మతం ప్రపంచమంతా వ్యాపించి వుందంటాడు. కృష్ణార్జునులు ‘పాటల’ (ప్రస్తుత అమెరికా ) దేశానికి” అశ్వతరి” అనే ఓడలో వెళ్లి ధర్మరాజు రాజసూయానికి ఉద్దాలక రుషిని తీసుకొచ్చాడంటాడు. మహాభారత యుద్ధంతో వైదిక సామ్రాజ్యం పతనమై దాని ప్రభావం అడుగంటిందనీ, దేశ దేశాల పండితులు జ్ఞానార్ధన కోసం ఇక్కడికి రావడం అప్పటినుంచి అంతరించి పోయిందనీ ఆయన ఓ కొత్త వాదాన్ని తన “సత్యార్థ ప్రకాశికలో” ప్రతిపాదిస్తాడు. దీనికోసం మహాభారతాన్ని పని గట్టుకొని ఐదువేల ఏళ్లు వెనక్కు నడిపిస్తాడు!

బ్రిటిష్ వాళ్ళ సాంస్కృతిక ప్రాబల్యాన్ని అడ్డుకోడానికి మొదలైన భారతీయ వారసత్వ ప్రాశస్త్య పునరుద్ధరణోద్యమం ఇలాంటి వాదనలతో అప్పటి నుంచి ఒక వరవడిగా కొనసాగింది. ఈ మధ్య క్రమంగా ఇదొక జబ్బుగా మారి వెర్రితలలు వేసింది. రాజకీయంగా కూడా దీనికిప్పుడు దన్ను దక్కడంతో నేరుగా నూతన విద్యా విధానంలోకి ఆధికారికంగా జొరబడింది. ప్రధాన్ గారి “మహా కాలజ్ఞానం ” కూడా ఇలా పుట్టుకొచ్చిందే. పదేళ్లలో మన విద్యార్థుల దృక్పథమంతా మారిపోవడం అంటే ఈ కోవలోకి మారిపోవడమే.

క్రమంగా ఇప్పుడిలాంటివి చాలా మామూలు సంగతులుగా మారిపోయాయి. ఒక నాయకుడు తైమూరు దండెత్తి వచ్చేదాకా (సాశ 1398) మనదేశంలో కుల వ్యవస్థ లేదంటాడు. రక్షణ మంత్రి గారైతే స్థానిక జ్యోతిష్యుల్ని సంప్రదించి ఉపగ్రహ ప్రయోగాలు చేయడం మంచిదని ఇస్రోకు సలహా ఇస్తాడు. మొదటి అంతరిక్ష యాత్రికుడు మన హనుమంతుడే అంటాడు ఇంకో సచివుడు. వీరందరికీ దిశా నిర్దేశం చేస్తూ ప్రధానమంత్రి గారే పరమశివుడు మొదటి ప్లాస్టిక్ సర్జన్ అంటాడు. ఇలాంటివన్నీ విని విని మనకు అలవాటైపోయింది. కొందరం మౌనంగా అంగీకరిస్తున్నాం. కొందరం “ఇది వాళ్ళ గొడవ, వాళ్లింతే” అనుకుంటున్నాం. కొందరం దీనివల్ల ఒరిగే ప్రమాదమేదీ లేదని వదిలేస్తున్నాం. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా అలవాటు పడిపోతున్నాం!

కానీ ఇది ఏ ఆగాధాలకు మనల్ని తీసుకెళ్తుంది? మనకంటే ముందే ప్రపంచంలో ఈ ఛాందస దృక్పథాన్ని నెత్తికెత్తుకున్న వారున్నారా? ఉంటే వారికి ఏ దుస్థితి దాపురించింది? మనమూ వారి దారిలోనే ప్రయాణిస్తున్నామా? కొంచెం ఆలోచించే వాళ్ళని ఈ ప్రశ్నలు వెంటాడుతాయి.

ఇస్లామాబాద్ లోని క్వైద్ -ఇ- ఆజం విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ పర్వేజ్ హుద్బాయ్ ఇస్లామిక్ ప్రపంచంలో ఒకనాడు ఇదే ధోరణి ఎలా తలెత్తిందో, దాని ఫలితాలిప్పుడెంత దారుణంగా వున్నాయో స్వానుభవాన్ని కూడా జోడించి చెబుతాడు. అచ్చు గుద్దినట్టు ఇప్పడు మనకివి సరిపోతాయి చూడండి!

లిబియా నియంత గడాఫీ ప్రకారం షేక్స్పియర్ ఒక అరబ్బు! ఆయన అసలు పేరు షేక్ జూబియార్. టర్కీ అధ్యక్షుడుఎర్డోగన్ గడాఫీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, మరో అడుగు ముందుకేసి, ఇటీవల ఇస్తాంబుల్ లో మాట్లాడుతూ కొలంబస్ కు ముందే ముస్లిములు ప్రపంచాన్ని వలసగా మార్చుకున్నారంటూ దానికి సాక్ష్యంగా కొలంబస్ డైరీలను చూపిస్తాడు.

వాటిలో క్యూబాలోని ఒక పర్వతాన్ని వర్ణిస్తూ “అది గొప్ప మసీదులా ఉంద”ని కొలంబస్ వర్ణించాడట ! అంటే దీనర్థం అప్పటికే ముస్లింలు అక్కడికి చేరినట్లే కదా అనేది ఆయన తర్కం. ఇంత కంటే చారిత్రక ఆధారాలేమీ ఆ మహా నాయకుడికి అవసరం లేకపోయాయి !

పర్వేజ్ మాటల్లో చెప్పాలంటే ఇస్లాం ఛాందసులకు చరిత్రను వేల ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేకపోవడం గొప్ప అదృష్టం ! కారణం ఇస్లాం పుట్టిందే 1400 సంవత్సరాల ముందు! హైందవ పిడివాదులకలా గాదు. యుగాలకు యుగాలే వెనక్కు నడిపించాల్సిన అవసరమో, అవకాశమో వారికి వచ్చింది!

ఇస్లామాబాద్ లోని క్వైద్- ఇ- ఆజం విశ్వవిద్యాలయం ఇస్లామిక్ దేశాలలోని మొత్తం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో రాంకుల ప్రకారం రెండో స్థానంలో వుంది. మధ్యతరగతి విద్యార్థులంతా ఇందులోనే చదువుతారు. ఇందులో ఒక్క గ్రంథాలయమూ లేదు. కానీ ఇప్పటికే అందులో మూడు మసీదులున్నాయి. నాలుగోది నిర్మాణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో సినిమాలు నిషేధం కళా ప్రదర్శనల్ని అంగీకరించరు. సంగీతానికి తావులేదు. ఇక అమ్మాయిలు బురఖాలు ధరించకపోతే ప్రభుత్వ సాయంతో నడిచే ఇస్లామిక్ విద్యాసంస్థల నుంచే ఆసిడ్ పోస్తామని హెచ్చరికలు వస్తుంటాయి! అంతెందుకు దేశ రాజధాని ఇస్లామాబాద్ లో మనకు గ్రంథాలయమే కనబడదు.

క్రమంగా పాకిస్తాన్లో గత 45 ఏళ్ల నుంచి సైన్సుకు ఇస్లాంకు పెద్ద వైరుధ్యం వున్నట్టు మతపెద్దలు వ్యవహరిస్తున్నారు. సైన్సు బోధనలో తీవ్రమైన మార్పులు రావాలని డిమాండు చేస్తున్నారు. ఉదాహరణకు న్యూటన్ సూత్రాలను న్యూటన్ పేరుతో బోధించరాదని హుకుంలు జారీ అయ్యాయి. పాకిస్తాన్తో పోలిస్తే ఇరాన్ ఎంతో మేలు. అక్కడి మతపెద్దలు విద్యాసంస్థల్లో తలదూర్చడం లేదు. కనీసం వాటిని సెక్యులర్ గా బతకనిస్తున్నారు.

పాకిస్తాన్లో 50 ఏళ్ల నుంచి ఇస్లాం సైన్సు, పాశ్చాత్య సైన్సు అని సైన్సు మధ్య గీత గీశారు. ఆధునిక సైన్సు ఆవిష్కరణలన్నిటినీ 1400 ముందే ఇస్లాం ఊహించిందని పని గట్టుకొని అకడమిక్ సర్కిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత శాస్త్ర సాంకేతికాలన్నిటిని ఖురాన్ వెలుగులో చూడాలని వాదిస్తున్నారు. దీనికనుగుణంగా ముస్లిం దేశాలన్నిటా ఈజిప్టు నుంచి సౌదీ అరేబియా దాకా వరుస పెట్టి సదస్సులు పెడుతున్నారు. కొత్త కొత్త వాదాలు తెస్తున్నారు

కొందరు పండితులు నరకంలో ఎంత ఉష్ణోగ్రత వుందో లెక్క గడుతున్నారు. ఇంకొందరు భూమి నుంచి స్వర్గం రోజురోజుకూ దూరం జరుగుతోందంటూ, ఆ వేగాన్ని లెక్కగట్టే పనిలోపడ్డారు. కొందరు పౌరాణిక ప్రాణులను, వాటి చేష్టల్ని ఆధునిక సైన్సు వెలుగులో వెతుకుతున్నారు! జీవ పరిణామాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు! అయితే వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చిన్న ఆధునిక పరికరాన్నయినా తయారు చేసిన వారు కాదు. ఒక్క ఆవిష్కరణకూ కర్తలు కారు!

ఇప్పుడు పాకిస్తాన్లో బహుళ ప్రచారంలో వున్న గ్రంథం “మౌత్ కా మంజార్” ( Scene of life after death) ఒక్కో అధ్యాయంలో ఇందులో ఒక్కో భయంకర మృత్యువర్ణన వుంటుంది. యువకులు లక్ష్యంగా వుండే ఈ గ్రంథానికి విద్యాలయాల పాలనాధికార్లు, అధ్యాపకులు, మతపెద్దల నుంచి ప్రభుత్వం దాకా అందరూ ప్రచారకులే! మరీ దుర్మార్గం ఏమంటే కరాచీ IBM యాజమాన్యం ఇటీవల The Last Movements – An Exclusive Insight on the Death of Man అనే క్లాసులకు హాజరుకమ్మని విద్యార్థులకు ఈ-మెయిల్స్ పంపింది! ఈ క్లాసులు నిర్వాహకుడు సౌదీఅరేబియా నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్! ఈయన ఆ దేశం నుంచి ఆధికారికంగా, ఒక సర్టిఫికెట్ కూడా చేతబుచ్చుకొని వచ్చాడు. “జీవితం కేవలం ఒక క్రీడ. మరి చావుకు నువ్వు సిద్ధమా? మరణం ఎలా వుంటుందో తెలుసా? అప్పుడు దైవకృప నీపై ఎలా వుంటుందో ఊహించుకోగలవా? నువ్వు చనిపోయేప్పుడు ఎలా ఫీలవుతావో చెప్పగలవా?” అంటూ ఈయన వరస ప్రశ్నలతో బెదరగొడతాడు. యువకులకు పిచ్చెక్కిస్తాడు. మరి బతుకుతున్న ప్రొఫెసర్ గారికీ “చావుశాస్త్రం” ఎలా వొంటబట్టిందో ఆయన దేవుడికే ఎరుక!

ఇస్లాం ప్రపంచంలో 1950ల దాకా ఇలాంటి ధోరణి లేదు. అప్పటికి అన్ని ముస్లిం దేశాలు సెక్యులర్ గానే వుండేవి. మహమ్మద్ మొసాదక్ నాటి ఇరాన్ ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకోండి. సుకర్ణో ఇండోనేషియాను, నాసర్ ఈజిప్టును ఒకసారి జ్ఞప్తి చేసుకోండి. అవన్నీ సెక్యులర్ ప్రభుత్వాలు జాతీయవాద రాజ్యాలు. తమ వనరులు తమకే దక్కాలని కోరుకోవడం ఒక్కటే వీరు చేసిన పాపం! ఈ పాపానికవి అమెరికా, పాశ్చత్యదేశాల కన్నెర్రకు గురయ్యాయి, బలయ్యాయి. ఆ తర్వాత ఒక్కొక్కటీ వరసబెట్టి ఛాందస మతవాదుల, నియంతల అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇస్లాం దేశాలు ఆధునిక దృక్పథానికి, సైన్సుకు దూరమయ్యాయి. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలన్నీ అమెరికాకు తాబేదార్లయ్యాయి. వఎపీటిలో ఎప్పుడైతే శక్తివంతమైన సెక్యులర్ జాతీయవాదం కుప్ప కూలిందో ఆ శూన్యాన్ని ఎవరో ఒకరు భర్తీ చేయాల్సి వచ్చింది. మతఛాందసం ఆ పని చేసింది! ఈ పరిణామాల్లో కెల్లా ప్రధానమైందీ, ప్రమాదకరమైందీ ఆఫ్గనిస్తాన్లో సిఐఏ జోక్యం. తాలిబాన్ ప్రాదుర్భావం.

క్రమంగా ఇస్లామిక్ రాజ్యాలు పాశ్చాత్య విజ్ఞానం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. సొంత శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు దూరంగావల్సి వచ్చింది. పరాయిసాంకేతికతకు వినియోగదారులుగా, కొనుగోలుదారులుగా మాత్రమే మారాల్సి వచ్చింది.

ఫలితం ఏమిటి? చెప్పుకోదగ్గ ఏ ఒక్క శాస్త్రావిష్కరణా గత 40 ఏళ్లలో ఇస్లామిక్ దేశాలు చేయలేకపోవడం! ప్రపంచంలో అయిదో వంతు జనాభా గల ఇస్లామిక్ ఆర్గనైజేషన్ దేశాలు దిగాలుగా మిగిలిపోవటం!

వాస్తవానికి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే శాస్త్ర సాంకేతిక విప్లవాల్లో ఇస్లాంది మహత్తర పాత్ర. ఒకనాడు ప్రపంచ విజ్ఞానానికంతటికీ ఇవి కూడళ్ళు. ఇండియా చైనాల నుంచి గ్రీసు దాకా, తర్వాత పాశ్చాత్య ప్రపంచమంటికీ ఇస్లాం దేశాలే వైజ్ఞానిక యాత్రాస్థలాలు. పండిత చర్చలు, అనువాదాలు, వైజ్ఞానిక ఆదాన ప్రదానాలు అక్కడి నుంచే జరిగేవి. గణిత ఖగోళ రసాయన శాస్త్రాల్లాంటివే గాదు సాహిత్యం, కళలు సైతం భారతదేశం నుంచి మొదట ఇరాన్, టర్కీలను చేరి, అనువదింపబడి యూరపు చేరేవి. మరింత పరిష్టమయ్యేవి. ఆధునిక వైజ్ఞానికావిష్కరణలుగా ఆ తర్వాత ఇవి రూపాంతరం చెందాయి. అప్పటి అరబ్బుకూ ఇప్పటి ఇస్లాం దేశాలకు పోలికెక్కడ ?శాస్త్ర సాంకేతికాల్లో ఇప్పటి వాటి స్థానమెక్కడ? దీనికి రెండే కారణాలు. ఒకటి ఆధునిక సైన్సు పట్ల వాటి వైముఖ్యం. రెండు మతనియంతృత్వాల పిడికిట్లో అవి నలిగిపోవడం.

ఇప్పుడు మళ్లీ మనం భారతదేశానికి వస్తే ఇస్లామిక్ దేశాలు చేసిన తప్పులన్నిటినీ పోటీపడి మనం చేస్తున్నట్టు కనిపించడం లేదూ? కాకుంటే వాటికి మనకంటే చాలా ముందు ఈ దుర్గతి పట్టింది. మనకి గత పదిహేనేళ్ల నుంచి పట్టుకొంది. మనల్ని స్వాతంత్య్రోద్యమ లౌకిక విలువలు, ఆధునిక శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్యం నడిపించనంత కాలం అంతో ఇంతో పదిలంగానే వున్నాం. ఇప్పుడీ విలువలు క్రమంగా వెనక్కి పోతున్నాక ‘సోదర’ ఇస్లాం దేశాల సరసన పోటీపడి చేరబోతున్నాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *