ఎస్. వెంకట్రావు
వెజిటేరియన్-నాన్ వెజిటేరియన్ మీమాంస మనకు, అంటే భారతీయులకు కొత్తేమీ కాదు. వెజిటేరియనిజం ఈ దేశంలోనే పుట్టి ప్రపంచ మంతా ప్రాచుర్యం పొందుతోందని నమ్మే వారు చాలామంది ఉన్నారు. కాని మన దేశంలోగాని, మరెక్కడన్నాగాని మానవుని సహజలక్షణం పూర్తి వెజిటేరియనిజం కాదు, పూర్తి నాన్ వెజిటేరియనిజమూ కాదు. మాంసాహారం, శాఖాహారం రెండూ అతని ఆహారంలో భాగాలు. మన దేశంలో కొంతమంది ఆవును పవిత్రమైన జంతువుగా భావిస్తారుగనుక గోమాంస భక్షణం ‘పాపం’ అంటారు. గోమాంసభక్షణ నిషేధం నుండి పూర్తిగా మాంసాహార నిషేధం వరకు వీరి జీవన విధానం వెళ్ళిపోయింది. మరికొందరు పందిమాంసం తినడం ‘పాపం’గా పరిగణిస్తారు. ఇసన్నీ మతపరమైన, సాంస్కృతిక పరమైన నమ్మకాలు. నిజానికి మానవుని సహజ సంస్కృతి మాంసభక్షణమే. మన దేశంలో బుద్ధునికి ముందు గోమాంసాన్ని అందరూ భుజించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదుల్లో వందల సంఖ్యలో గోవులను చంపి తినడం వల్ల, అది కూడా ఒక అనాచారంగా మారడం వల్ల బౌద్ధం దీనిపై తిరుగుబాటు చేసింది. ప్రజలనుండి దానికి మద్దతు లభించింది. అప్పటినుండి దేశంలోని కొన్ని సెక్షన్లు గోమాంసాన్ని తినకుండా వాటి రక్షణకోసం నడుం కట్టాయి కాని దేశంలోనూ, ప్రపంచలోనూ మెజారిటీ ఇప్పటికీ నాన్-వెజిటేరియన్లే. సైన్సు ఈ విషయాన్నే మరో రకంగా చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడా పూర్తి వెజిటేరియన్లు ఉండబోరు. ఎందుకంటే మానవ శరీరనిర్మాణానికి కావలసిన కొన్ని రకాల అమైనో ఆమ్లాలు కేవలం జంతువుల్లో మాత్రమే లభిస్తాయి. అందువల్ల మనిషి శరీరం పెరగాలంటే అతను ఖచ్చితంగా జంతుసంబంధమైన ఆహారం తీసుకోవలసిందే. మనిషి సహజంగా మాంసాహారజీవి గనుకనే అతని శరీరనిర్మాణం దానికి అనుగుణంగా ఉంది. మాంసాహారుల్లో మాత్రమే ఉండే కోరపళ్లు మనిషిలో కూడా ఉంటాయి. పూర్తి శాఖాహార జీవుల జీర్ణాశయ నిర్మాణానికీ, మనిషి జీర్ణాశయ నిర్మాణానికి తేడా ఉంటుంది. పుట్టిన పిల్లాడికి తల్లిపాలు లేకపోతే ఎదుగుదల ఉండదు. తల్లిపాలుకాకపోతే ఇతర పాలు, పాలపదార్ధాలు కావాల్సిందే. అలాగే మనలో చాలామంది శాఖాహారులుగా చెప్పకునేవారు కూడా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి జంతుసంబంధ పదార్థాలు తీసుకోకపోతే బతుకు సాగదు. ఆ సమస్య ఉందిగనుకనే పాలు, పెరుగు, నెయ్యి వగైరాలను అవి ‘శాఖ’లనుండి రాకపోయినా శాఖాహారంగా పరిగణిస్తున్నారు. సమాజంలో పాలు, పాలపదార్ధాలు సమృద్ధిగా లభించనివారు అన్నిరకాల మాంసాలపై ఎక్కువగా ఆధారపడతారు. గిరిజనుల్లో ఇది మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇతర మాంసాలు తినని వారు పాలు, పాలపదార్దాలపై ఎక్కువ ఆధారపడతారు. ఈ మధ్య చాలామంది కోడిగుడ్డును కూడా శాఖాహారంగా పరిగణిస్తున్నారు. ఇది మంచి పరిణామమే.
మాంసాహారం శరీరానికి మంచిది కాదనే వాదనకూడా సరైందికాదు. నిజానికి ఇంతకు ముందే చెప్పినట్లు మనిషి మాంస సంబంధమైన ఆహారం లేందే బతకలేడు. అదే సమయంలో మాంసాహారం ఎక్కువైనా సమస్యే. కొవ్వు ఎక్కువై మనిషికి అనేక రోగాలు వస్తాయి. అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ తిండిగింజలను పశువులకు పెట్టి వాటి మాంసాన్ని తాము తింటున్నారు. ఆహారంలో తృణధాన్యాల శాతం తగ్గి, మాంసాహారం పెరిగితే అభివృద్ధికి చిహ్నంగా భావిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి కొన్ని సమస్యలను కూడా సృష్టిస్తోంది. అధికబరువు, కొవ్వు సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. పేద దేశాల్లోని, పేద ప్రజల్లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఇక్కడ మాంసకృత్తులు తగినంతగా లభించక నూటికి యాభై మందికి పైగా ప్రజలు పౌష్టికాహారలోపంతోనూ, దాని వల్ల వచ్చే అనేక వ్యాధులతోనూ బాధపడుతూ, చనిపోతూ ఉన్నారు. మరోవైపు వెజిటేరియనిజం అనే సంప్రదాయంకూడా అనేక కుటుంబాల్లో, ముఖ్యంగా మహిళల్లో పౌష్టికాహార లోపానికి కారణమవుతోంది. అందువల్ల మాంసం మరీ ఎక్కువతినడం ఎంత నష్టమో అది లేకపోవడమూ అంతే నష్టం. సమతుల్య ఆహారం ఎంతైనా మంచిది.
వెజిటేరియన్లూ మాంసం తినాలంటే వెజిటేరియనిజం అనేది అడ్డొస్తుంది కాబట్టి ‘వెజిటేరియన్ మాంసం’ ఉత్పత్తికి నడుంకట్టారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం జీవశాస్త్ర పరిశోధకులు చేస్తున్న కృషి గనుక ఫలిస్తే – రుచి, శుచి, సౌలభ్యం అన్ని గుణాలూ కలగలిసి ‘వెజిటేరియన్ మాంసం’ రానున్న కాలంలో భోజన పళ్లాలన్నిటినీ ఆక్రమిస్తుందని బ్రిటిష్ జీవశాస్త్రవేత్త బ్రియాన్ జె. ఫోర్డ్ అంటున్నారు. “ది ఫ్యూచర్ అఫ్ ఫుడ్” అని దీనిపై ఆయన ఒక పెద్ద పుస్తకమే రాశారు.
జంతు శరీరంలోని కండర కణాలను తీసి లాబరేటరీలో ‘సెల్ కల్చరింగ్’ ద్వారా మాంసం కండల్ని ఉత్పత్తి చేస్తారు. అంటే లేబరేటరీలో ఒక కండరకణం తనలాంటి కణాలను ఉత్పత్తి చేసుకునేట్లు చేయడం ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. దీనికి జంతువులను తెచ్చి పెంచక్కరలేదు, పోషించక్కరలేదు. జంతువులను నరకక్కరలేదు, రక్తంతో పనేలేదు, కనుక ఫారమ్ కోడిగుడ్డు మాదిరిగానే ఇది కూడా ఖచ్చితంగా ‘శాఖాహార మాంసమే’ అవుతుందంటున్నారు ఫోర్డు. మన ఇళ్ల పెరళ్లలో తోటకూర, బచ్చలికూర మాదిరిగా మాంసం కండలు పెంచుకునే రోజులు ఇంకా చాలా దూరంగానే ఉన్నా ప్రస్తుతానికైతే మన వద్ద సాంకేతి పరిజ్ఞానం ఉందంటున్నారాయన. ప్రస్తుతం ప్రయోగశాలల్లో ప్రయోగాత్మకంగా చేస్తున్న జీవకణ కల్చరింగును ఉపయోగించుకుని బర్గర్లు, సాస్లకు కావలసిన మాంసాన్ని ఇప్పటికిప్పుడు తయారు చేయవచ్చునంటున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) కోసం టౌరో బయో ఇంజినీరింగ్ కళాశాలకు పరిశోధకులు సముద్ర చేపమాంసాన్ని బయోఇంజినీరింగ్ ద్వారా పరిశోధనా శాలలో ఉత్పత్తి చేశారు. “ఆ చేప మాంసాన్ని మేం వండాం కూడా. అచ్చం మామూలు చేపమాంసం లాగే ఉంది.” అని ఈ కళాశాలకు చెందిన ఇంజినీర్ ఒకరు చెప్పారు. నాసా వారు దాన్ని తినడానికి పనికొచ్చే మాంసంగా ఇంకా నిర్ధారించాల్సిఉంది. అయితే ప్రస్తుతం నాసావంటి సంస్థలు మాత్రమే ఇలా ఉత్పత్తి అయిన మాంసం ధర భరించగలవు. పారిశ్రామిక స్థాయిలో కల్చర్డ్ మాంసం ఉత్పత్తిచేయడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చు.



