వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 11
డా. నాగసూరి వేణుగోపాల్
1943 బెంగాల్ లో భయంకరమైన కరువు సంభవించింది. కరువు అంటే మనకు తెల్సిందే! రకరకాలుగా వనరులు అంతరించడం. ఆ బెంగాల్ కరువులో పాలు అసలు లభ్యం కాకుండా పోయాయి. ప్రొటీన్లున్న ఆహారం దొరక్కుండా పోయింది. పసికందులు పాలు లేకుండా మాడిపోవడం ఎందరినో కలచివేసింది. దీనిని గమనించిన ఒక శాస్త్రవేత్త తన పరిశోధనాంశం వదిలి – దృష్టి మళ్ళించారు. దాని ఫలితమే కాయగూరలతో పాలు.
ఈ కృత్రిమమైన పాలు ఎలా తయారయ్యాయో తెలుసా? బార్లీ పొడి, వేరుశనగ గింజల పొడి ఆధారంగా తయారైన పాలలో ఆవుపాలలోని పోషక విలువలు ఉండటం విశేషం. అలాగే సోయాబీన్ తో పాలు తయారు చేశారు. అలాగే పెద్దవారికి ప్రొటీన్ ప్రత్యామ్నాయాలు రూపొందించారు. గడ్డి ఆకుల నుంచి ప్రొటీన్ ప్రత్యామ్నాయాల తయారీ ఆశ్చర్యమే! అంతేకాదు ఈ ప్రొటీన్ పదార్థాలను భోజనంలో ఎలా మిళితం చేయాలో కూడా వివరించారు. ఇదీ పరిశోధన అంటే! ఇదీ శాస్త్రవేత్త తపన అంటే! తోటివారికి ఆకలిని, పేదరికాన్ని పరిష్కరించటాన్ని మించిన ఆదర్శం సైన్స్ కు లేదు.
ఆ శాస్త్రవేత్త ఎవరో తెలుసా? అతనే బి.సి.గుహా! భారతదేశపు ఆధునిక జీవన రసాయన శాస్త్రంలో అగ్రగణ్యుడయిన శాస్త్రవేత్త ఆయన. ఈ శాస్త్ర విభాగం ఒక స్పష్టమైన రూపు రావడానికి అద్భుతమైన కృషి చేశారు. భారతదేశపు రకరకాల చేపలు, భారతదేశపు తేయాకులో పోషక విలువలు గురించి ఆయన చేసిన పరిశోధన చాలా అంశాలకు సంబంధించింది. అలాగే ఆయన కేవలం శాస్త్రరంగానికే పరిమితం అని అసలు చెప్పలేం. సంస్కృతం, ఆంగ్లం, బెంగాలీ భాషలపై గట్టి పట్టు ఉంది. అలవోకగా కాళిదాసునో, షేక్స్ పియర్ నో, రవీంద్రనాథ్ ఠాగూర్ నో – కవితాత్మకంగా గుర్తుచేసేవారు. అంతకుమించి ప్రసంగించడంలో నేర్పు సంపాదించారు. జన సామాన్యంతో కలిసిపోయే శాస్త్రవేత్త ఆయన.
బి.సి.గుహా 1904 జూన్ 7న మైమెన్ సింగ్ అనే చోట జన్మించాడు. అదిప్పుడు బంగ్లాదేశ్ లో ఉంది. మేనమామ అశ్వనికుమార దత్త మంచి విద్యావేత్త. స్వాతంత్ర్య పోరాటయోధుడు. గుహాపై అతని ప్రభావం చాలా ఉంది. పదకొండు సంవత్సరాలకే జుగంతర్ పార్టీలో చేరాడని తెలుసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. 1917 దాకా బారిషాల్ లో చదువుకుని 1918లో కలకత్తాకు వచ్చారు. అక్కడ మెట్రిక్యులేషన్ పాసయ్యారు. తన అన్నయ్య ప్రోద్బలంతో సైన్స్ కోర్సులో చేరారు. తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో బి.యస్సీ ఆనర్సులో చేరారు. అయితే తనకు ఉన్న రాజకీయ సంబంధాలు కారణంగా ఆ కళాశాలను వదలివేయవలసి వచ్చింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడని ఆరోపణ. తర్వాత జేవియర్ కళాశాలలో చేరారు. తర్వాత ఎమ్మెస్సీ పూర్తయ్యింది. పిమ్మట ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. వద్ద పరిశోధన ప్రారంభించారు. కేవలం ఒక సంవత్సరంలో మూడు పరిశోధనా పత్రాలు ప్రచురించారు గుహా. తర్వాత టాటా మెమోరియల్ స్కాలర్ షిప్ చేయూతతో ఇంగ్లాండు వెళ్ళారు. అయితే ఈ ప్రయాణం కూడా ఇబ్బంది కల్గించింది. ఇతని పాస్ పోర్టు దరఖాస్తుకు సంబంధించి పోలీసులు వ్యతిరేకంగా రాశారు. కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ చొరవతో పాస్ పోర్టు లభించింది. అది కూడా ఇంగ్లాండులో అతని గురించి సురేంద్ర మల్లిక్ బాధ్యత వహిస్తారనే పూచీ మీదనే!
ఇంగ్లాండులో మొదట లండన్ యూనివర్సిటీలో, తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధన చేశారు. కేంబ్రిడ్జిలో సర్ ఫ్రెడ్రిక్ హోప్ కిల్స్ దగ్గర పరిశోధన కొనసాగించడం పెద్ద మలుపు. ఇంగ్లాండులో జీవరసాయన శాస్త్రానికి హోప్ కిల్స్ ను పితగా భావిస్తారు. గుహా పరిశోధనలు చాలా ఆసక్తి కల్గిస్తాయి. బియ్యం పాలిష్ లో ఉండే విలువయిన ప్రొటీన్ ను గుర్తించి, వేరు చేశారు. ‘బి1, బి2’ విటమిన్ లకు సంబంధించి పది పరిశోధనా పత్రాలు వెలువరించారు. తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ‘విటమిన్ సి’నే ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు.
పిహెచ్.డి., డి.యస్సీ. తర్వాత 1932లో గుహా భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పట్లో కొత్తగా ఏర్పడిన ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ సంస్థలో ప్రొఫెసర్ గా చేరమని తన ఆచార్యులు చెప్పారు. అయితే రాజకీయ కారణాల వల్ల ఆ ఉద్యోగం లభించలేదు. దాంతో గుహా ఆచార్య పి.సి.రే స్థాపించిన బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ లో చేరారు. తర్వాత తనే న్యూట్రిషనల్ రీసర్చి లాబొరేటరీని స్థాపించారు. 1932-’35 మధ్య ఆ సంస్థ నుంచి 38 పరిశోధనా పత్రాలు వెలువరించారు. ఇందులో ఆరు పత్రాలు నేచర్ జర్నల్ లో ప్రచురింపబడ్డాయి. బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ లో పనిచేస్తున్నపుడు కార్మికుల వేతనాలకై పోరాడి యాజమాన్యం కోపానికి గురయ్యారు. తర్వాత యూనివర్సిటీ కళాశాలలో చేరారు.
యూనివర్సిటీ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగాన్ని ప్రతిభావంతంగా తీర్చి దిద్దారు. విదేశాలు పర్యటించి అక్కడ ఆ విభాగం ఎలా పరిశోధన చేస్తున్నదో అధ్యయనం చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో పట్టుబట్టి దేశంలో జీవ రసాయన శాస్త్రం పరిస్థితి గురించి సమీక్షాపత్రం వెలువరింపచేశారు. ఇది రాకముందు కేవలం బెంగుళూరు, మద్రాసు, కలకత్తాలలోనే సదుపాయాలుండేవి. కానీ ఈ సమీక్ష ఫలితంగా చాలాచోట్ల జీవరసాయన శాస్త్ర విభాగం గుర్తింపుకు నోచుకుని మెరుగుపడింది.
1958లో సైంటిఫిక్ పాలసి రిజల్యూషన్ ప్రభుత్వం చేత ఆమోదింపచేయడం విశేషం. అయితే దీనిని సాధించాలంటే పాఠశాల, కళాశాలల స్థాయిలో విజ్ఞాన శాస్త్రబోధన పటిష్టం కావాలని ఆయన పేర్కొనేవారు. 1948లో భారత్ ఆహార మంత్రిత్వ శాఖలో ముఖ్య సాంకేతిక సలహాదారుగా చేరారు. ఆహారపదార్థాల పరీక్ష నిర్ధారణకు విభాగాలు రూపొందించారు. ఆహార శాఖ నుంచి యునెస్కో వెళ్ళారు. భారత్ ప్రతినిధిగా, పారిస్ లో వ్యవసాయ సంబంధ శాఖలకు భారత పర్యవేక్షకుడిగా పనిచేశారు. తిరిగి వచ్చిన తర్వాత దామోదర్ వ్యాలి కార్పొరేషన్ లో చేరారు. 1953లో మరలా కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. జీవరసాయన శాస్త్రపు బోధన, పరిశోధనపై మరింత దృష్టి పెట్టారు.
నిజానికి బి.సి.గుహా ఎన్ని సంస్థలలో పనిచేశాడో చెప్పడం కష్టమే! సిఎస్ఐఆర్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి, ఐసిఎంఆర్, యుజిసి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. .. యిలా చాలా విజ్ఞాన శాస్త్ర సంబంధ సంస్థలతో కృషి చేశారు. అతని సేవలకు గుర్తుగా డాక్టర్ బి.సి. గుహా సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీను కలకత్తా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
1962 మార్చి 20న గుహా మరణించినా, ఆయన దేశానికి చేసిన జీవ రసాయనశాస్త్ర కృషి అజరామరం!
డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మొబైల్: 9440732392



