మిఠాయి యుగంధర్ బాబు
“మొలతాడు లేని వాడు మగాడే కాదు నాయనా”….. అని చిన్నప్పుడు మా నాయనమ్మ ఎప్పుడు నాకు మొలతాడు కట్టేది. స్నానం చేసేటప్పుడు ఆ మొలతాడు నాని,నాని సబ్బు దాని చుట్టూ పేరుకుపోయి అది పెట్టే నవ్వను భరించలేక, గీక్కోలేక తెంపి పారేయాలి అనుకునేవాడిని. కానీ ‘మగతనం’ పోయి ఆడది అయిపోతానేమో భయమేసి ఆగిపోయేవాడిని. కానీ ఆరో క్లాసులో మా సైన్స్ టీచర్ ఇచ్చిన ధైర్యంతో నాయనమ్మ చెప్పిన దాంట్లో అర్థం లేదని అర్థమై మొలతాడు ను తెంపి పారేసే వాడిని. మళ్లీ నా వీపు రుద్దేటప్పుడు గమనించి మా నాయనమ్మ తాడు కట్టేది. అది నూలు మొలతాడు. ఇంత లావు ఉండేది. ఆమె మీద కోపం వచ్చేది.
కానీ ఈ మొలతాడు వల్ల కొన్ని సౌలభ్యాలు కూడా ఉండేవి.ఆ మొలతాడు కు పిన్నులు (అత్యవసర పరిస్థితుల్లో పనికి వస్తుందని) వేసుకునే వాడిని. నిక్కర్ జారిపోకుండా మొలతాడును పైన వేసుకునే వాడిని. బావుల్లో ఈతకు వెళ్ళినప్పుడు గోచిపాత పెట్టుకోవడానికి మొలతాడు పనికొచ్చేది. అంతే తప్ప దాని ప్రయోజనం ఏదీ నాకు కనపడలేదు.
ఎందుకంటే గత 50 ఏళ్లుగా నేను మొలతాడు కట్టుకోవడం లేదు కాబట్టి.!!!
ఈ మొలతాడు ఏమిటో దాని కథ ఏమిటో చూద్దాం రండి. హిందూ సంప్రదాయంలో మొలతాడు కట్టుకోవడం కేవలం ఒక పద్ధతి కాదని అది శరీర శాస్త్రం, జీర్ణక్రియ, నాడీ సమతుల్యం, ఆధ్యాత్మిక శాంతి కోసం సహజమైన మార్గమని ఊదరగొడుతూ ఉంటారు. మన సమాజంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. నడుము చుట్టూ మొలతాడు కట్టుకోవడం ఆచారంగా కొనసాగుతోంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరు కట్టుకుంటారు. కానీ పెద్ద అయినాక మగవారు మాత్రం తప్పనిసరిగా కట్టుకోవాలని ఓ రూలింగ్.
ఈ మొలతాడును నలుపు ఎరుపు రంగులలో వుండే నూలు దారాలు కట్టుకుంటారు. కొంచెం డబ్బు ఉన్నవాళ్లు వెండి మొలతాడు కట్టుకుంటారు. ఇంకా బాగా డబ్బున్నోళ్ళు బంగారు మొలతాడు కూడా కట్టుకుంటారు. మాకు చిన్నప్పుడు ఓ పద్యం ఉండేది “చేతి వెన్న ముద్ద.. చెంగల్వ పూదండ…. బంగారు మొలతాడు పట్టుదట్టి”…అని. మూడో క్లాసులో పుస్తకంలో ఆ బొమ్మను చూసి వామ్మో!! బంగారును కూడా మొలతాడుగా కట్టుకుంటారు కాబోలు అనుకునేవాడిని!.
మొలతాడు పుట్టుక
అసలు ఈ మొలతాడు ఎలా పుట్టింది? ఎందుకు కట్టుకుంటున్నారు ? గమనిద్దామా. ఆదిమానవుడు దిశమెలతో తిరుగుతూ ఉండేవాడు. తరువాత వర్షం, చలి, ఎండ నుండి తనను కాపాడుకోవడానికి మొల చుట్టూ ఆకులు కట్టుకోవడం కోసం నడుముకు దారం లాంటిది కట్టుకునేవాడు. ఆడ మగ అందరూ ఆపైన జంతు చర్మాలను దుస్తులుగా వాడేటప్పుడు కూడా దారాలు కట్టుకునేవారు. ఆ దారానికే తాను వేటాడే అంబుల పొది, కత్తులు, వేటాడిన చిన్న చిన్న పక్షులను కట్టుకొని వేలాడదీసేవారు.నాగరికత అభివృద్ధి చెందుతూ ఇంకా ఆధునిక దుస్తులు అందుబాటులోకి రానప్పుడు చిన్న వస్త్రాన్ని గోచిలాగా (కౌపీనం) పెట్టుకోవడానికి మొల చుట్టూ దారం స్థిరపడిపోయింది. ఆ మొల దారం వల్ల రకరకాల ఉపయోగాలు ఉండేవి. రాను రాను దుస్తుల ఆకారాలు మారినా మొలచుట్టూ ఉండే దారం మాత్రం అలాగే అంటు పెట్టుకొని ఉంది. కాకుంటే ఈ దారం నుండి ఆడవాళ్ళని మినహాయింపు ఇచ్చి, మగవాళ్ళకు దానిని ప్రత్యేకంగా చేసి, వాళ్లు కట్టుకుంటే రకరకాల ఉపయోగాలు ఉన్నాయని ప్రచారంలోకి వచ్చింది.
ఉపయోగాల అపోహలు
ఆ ఉపయోగాల అపోహలు గురించి కాస్త పరికించి చూస్తాం. వారి ప్రకారం… మన శరీరంలో నాభి ఒక కేంద్ర స్థానం. ఇది ఎనర్జీ హబ్ గా పని చేస్తుంది!!. అన్ని ముఖ్యమైన నాడులు ఇక్కడ కలుస్తాయి మొలతాడు కట్టడం ద్వారా నాభి ప్రాంతానికి మృదువైన ప్రెషర్ వస్తుంది!!. ఇది జీర్ణ క్రియలను మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరం శక్తిమంతంగా సరిగ్గా పనిచేస్తుంది. నడుము చుట్టూ కాటన్ లేదా సిల్క్ దారం కట్టుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యం గా ఉంటుంది!.
అసలు విషయానికి వద్దాం. మన శరీరం అంతా ఎనర్జీ ఉంటుంది. నాడులు శరీరం అంతా వ్యాపించి అందులో విద్యుత్ తరంగాలను మెదడుకు చేరవేస్తూ ఉంటుంది కదా. మనకు కలిగే బాధ, స్పర్శ అదే కదా.మరి నడుము మాత్రం హబ్ గా ఎలా తయారవుతుంది?. ఇక నూలు దారం, సిల్క్ దారం శరీర ఉష్ణోగ్రతను ఏ విధంగానూ నియంత్రణ చేయలేవని మనకు తెలుసు.
ఇంకో సూడో సైంటిస్టు మరొక అడుగు ముందుకేసి ఈ విధంగా చెప్తున్నాడు. “మన శరీరం ఒక బయో ఎలక్ట్రిక్ సిస్టం.ఇది ఎలక్ట్రో మాగ్నెటిక్ ప్రభావాలకు సున్నితంగా ఉంటుంది. సహజమైన దారాలు (కాటన్, కుంకుమ పసుపుతో శుభ్రం చేసినవి) ఉపయోగించి మొలతాడును కట్టడం శరీరాన్ని చెడు ప్రభావాల నుండి రక్షణ ఇస్తుంది. ప్రత్యేకంగా స్మార్ట్ఫోన్లు కంప్యూటర్ల లోని ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ నుంచి భద్రత కల్పిస్తుంది”.
“మన దేహం పై భాగంలో జీర్ణాశయం వుంటుంది. క్రింది భాగంలో విసర్జక అవయవాలు కలిగి ఉంటుంది. వీటిని శుద్ధి చేయడానికి, శరీరం అపవిత్రం కాకుండా ఉండటానికి ఓ అడ్డుగోడగా ఈ తాడు కట్టుకోవాలని నియమంగా పెట్టారు!!. మొలతాడు ధరించడం వల్ల సంతాన ఉత్పత్తి శక్తి పెరుగుతుందట?!! అందుకే మొలతాడు కట్టే వాడే మగాడు అనే నానుడి పుట్టింది!!.
దీని వివరణ ఏమంటే… శరీరంలో జీర్ణ వ్యవస్థ గురించి పూర్తిగా తెలియనప్పుడు చెప్పిన మాటలు ఇది. నోటి నుండి గుదం వరకు ఒకే గొట్టం (పైపు)… నోటినుండి అన్నవాహిక,, పెద్ద ప్రేగు, జీర్ణాశయము, చిన్న పేగులు… చివర్న గుదము. ఉంది కదా. అలాంటప్పుడు పై భాగం శుభ్రత, కింద భాగం అశుభ్రత అనడం మూర్ఖత్వమే అవుతుంది. అడ్డుగోడగా మొలతాడు అనడం అడ్డుగోలు వ్యవహారమే. ఇక సంతాన ఉత్పత్తికి మొలతాడు కు ఎలాంటి సంబంధం లేదు.
అభివృద్ధి చెందిన సైన్స్ ని తమ అబద్ధాల ప్రచారానికి ఎలా వాడుకుంటారో మరొక ఉదాహరణ చెబుతాను.
“పూర్వకాలంలో పసర్లు రాసి జాగ్రత్త పరిచిన బొడ్డుతాడు ముక్కను తాయత్తులో పెట్టి మొలతాడుగా కట్టే వారట. అది ఒక స్టెమ్ సెల్ థెరపీ లాగా పనిచేస్తుందని నమ్మేవారట.అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ ను బ్యాంకులలో దాచుకుంటున్నారు కదా. కానీ ఆ రోజుల్లోనే దీన్ని మన పూర్వీకులు కనిపెట్టారట.!!! చూశారా ఎంత అబద్ధం చెపుతున్నాడో మరి స్టెమ్ సెల్స్ గురించి పూర్వీకులకు తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకు దాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు?. ఎవరో ఏదో కనిపెట్టి దానిని ఆచరణలోనికి తెస్తే…ఇంకో.. ఇది మా పుస్తకాల్లో ఎప్పుడో రాశారని, మా పురాణాల్లో చెప్పారని చెప్పడం ఓ అలవాటుగా మారిపోతుంది. ఇందువల్ల అది నిజమని నమ్మే ప్రమాదంలో నేటి సమాజం ఉంది.
ఆయుర్వేదంలో కూడా ఈ మొలతాడు గురించి ప్రస్తావన ఉందట.నడుము ప్రాంతంలో నరాల ఉత్తేజానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, మలబద్ధకం సమస్యలను నివారించడానికి. కడుపు కడరాలకు మద్దతు ఇవ్వడానికి నల్లటి దారం కడతారట. మరి ఈ సమస్యలన్నీ ఆడవాళ్లకు కూడా ఉంటాయి కదా. ఆంటే ఆడవాళ్లకు కూడా మొలతాడు తప్పకుండా కట్టుకోవాలి కదా. కానీ అలా ఎవరూ చెప్పలేదు.
మరో అపోహ ఉంది. స్నానం చేసే సమయంలో వివస్త్రలై (అంటే నగ్నంగా) స్నానం చేయరాదట. ఒంటి మీద నూలు పోగు లేకుండా స్నానం చేస్తే కామ దేవతలు, దుష్టశక్తుల ప్రభావం ఉండే అవకాశం ఉందట. కాబట్టి మనం మొలతాడు కట్టుకోవాలట!!. ఓ ఆధ్యాత్మిక గురువు ఇలా చెప్తున్నాడు “నా శరీరం దేవాలయం. నేను దీన్ని మా పవిత్రంగా ఉంచుతాను. దానికి నేను మొలతాడు కట్టుకుంటాను. ఇది మనకు మానసిక శాంతిని ఇస్తుంది. స్వీయ నియంత్రణ, ధ్యానం, ఆత్మ నియంత్రణకు సహాయపడుతుంది.
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా??? అన్నారు వేమన గారు. మనసు బాగుండాలి గాని మొలతాడు మనసును ఆధీనం చేస్తుందా??. ఒంటిపైన నూలు పోగు లేకపోతే అనర్ధం జరిగిపోతుందా???
మొలతాడు వల్ల నష్టాలు
నిజానికి ఈ మొలతాడు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. నల్ల దారము, ఎఱ్ఱ దారము ఇతర లోహపు తాడులు దీర్ఘకాలం బాటు కట్టుకోవడం వల్ల ముఖ్యంగా వేసవిలో ఆ ప్రదేశం లో చర్మం ఆరకపోవడం వల్ల అలర్జీ, దురద లేదా చర్మం రంగు మారిపోవడం జరుగుతుంది. దాదాపు మొలతాడు క్రమం తప్పకుండా మార్చకపోతే అక్కడ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్స్ దారితీస్తుంది. చర్మవ్యాధులు రావచ్చు. తాడు దిగుతుగా ఉంటే కడుపునొప్పి రావడంతో బాటు నడుము భాగంలో చర్మంపై చారలు ఏర్పడవచ్చు. చలం గారు తన “బిడ్డల శిక్షణ” అనే పుస్తకంలో మొలతాడు తామర, గజ్జి అంటించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. ఈనాటి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ రెసిడెన్షియల్ హాస్టల్ లలో పెరుగుతున్న పిల్లల విషయంలో ఇది నూటికి నూరుపాళ్ళు నిజమవుతోంది.
ఏతా వాతా చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా సరే నడుము దగ్గర ఆసరా కోసం ఏదో ఒక తాడు కట్టుకోవచ్చు… కానీ అది నలుపని, ఎఱుపని, వెండి అని, బంగారని. ..అది లేకపోతే మగవాడు కాదని…. ఈ అపోహలను నమ్మి మానసిక వేదన చెందకుండా ఉంటారని ఆశిస్తున్నాను.



