మిఠాయి యుగంధర్ బాబు
అది 1994లో ఒకరోజు. రెండవ సంతానం డెలివరీ కోసం నా భార్యకు సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ ఉన్నారు. మొదటి కూతురు పుట్టి రెండేళ్లయింది. డాక్టర్ నా స్నేహితుడే. రెండోది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసేయమని ముందే చెప్పేసా. “రెండోది కూడా అమ్మాయే అనీ, ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలా వద్దా?” అని లోపలి నుంచి కబురు పంపాడు డాక్టర్. వేరే ఆలోచన లేదు ఆపరేషను చేసేమని చెప్పి పంపించాను. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది తల్లి బిడ్డ క్షేమం. మా నాన్నకు విషయం తెలిసింది. కసుబుస్సు లాడాడు. ఎంత పని చేసావు?. ఇంకొక ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా.? మగ బిడ్డ లేకపోతే మన వంశం ఏం కావాలి?. అని కోపంతో చీదిరించుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడో చల్లబడ్డారు అనుకోండి. అది వేరే కథ. మా నాన్న “వంశాంకురం” అన్న మాటతోనే ఆగిపోయాడు. పున్నామ నరకం గట్రా ఆయన మొదలు పెట్టలేదు. కానీ నా స్నేహితుడు ఒకడికి ఆరు మంది ఆడపిల్లలు. వాళ్ళ అమ్మానాన్నలు పోరు పెట్టి (వాడి కూడా మనసులో మగ బిడ్డ కావాలని ఉండేది), ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కొడుకు కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిన దానికి ఫలితం అది. ఇపుడు ఇంట్లో వాళ్ళ అమ్మానాన్న లేరు, వాళ్ళ ఆవిడ అనారోగ్యంతో బాధపడుతోంది. ముగ్గురు కూతురు పెళ్లి చేశాడు. ఇంకా అవస్త పడుతున్నాడు. ఇది మా స్నేహితుడి కుటుంబంలోనే కాదు. చాలా కుటుంబాలలో జరుగుతున్నటువంటి తతంగమే.
ఇక్కడ మహిళ తను ఎన్ని సంతానాలను కనాలో అన్నది ఆమె చేతిలో లేదు. (ఆమె అభిప్రాయంతో పనిలేదు). ఆమె అమ్మ, నాన్న చేతిలో కూడా ఉండదు. అది అత్తమామ, భర్త చేతిలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు పెళ్లి అయిపోయింది. కాబట్టి ఆమె పైన సర్వాది హక్కులు భర్త, అత్తమామలదే అంట. ఆమె బిడ్డల్ని ఒక యంత్రం మాత్రమే. కొన్నిచోట్ల మగ సంతానం కోసం కొడుక్కి రెండో పెళ్లి చేసేటువంటి అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. ఆశ్చర్యంగా మగ బిడ్డను కోరుకునేది, తాను ఆడది అయినటువంటి అత్తమ్మే!!. ఏమి ఆ మగ బిడ్డ తవ్వి తలకెత్తేది? ఎందుకు మగ బిడ్డ గురించి అంత ఆరాటం? ‘పున్నామ్నో నరకాత్ తాయతే ఇది పుత్రః’.అంటే “పుత్” అనే పేరుగల నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కాబట్టి కొడుకును పుత్రుడు అని పిలుస్తారట. అని పురాణాలు చెబుతున్నాయట. (కానీ ఈ కెపాసిటీ కూతుర్లకు ఉండదు కాబోలు). మనిషి పుట్టుకతోనే దేవ, ఋషి, పితృ రుణాలను కలిగి ఉంటారట. కొడుకుని కన్నడం ద్వారా పితృ రుణం తీరుతుందని నమ్ముతారు. కొడుకు పుడితేనే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వం పుత్రుడు కోసం పుత్రకామేష్టి యాగం చేసేవారట. పుత్ర సంతానం కోసం పూజలు, పుణ్య కార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన ఎన్నో సందర్భాలు, గుళ్ళు గోపురాలు, తటాకాలు సత్రాలు నిర్మించిన సందర్భాలు చరిత్రలో, పురాణం ఇతిహాసాలులో మనకు తెలుస్తాయి. మత గ్రంధాల ప్రకారం ఈ లోకంలోకి వచ్చిన తరువాత మనిషి బతుకుతున్న సమయంలో తను చేసిన పాప పుణ్య పలితాలు తన శరీరంపై ఆవరణ లాగా, ఓ కప్పు లాగా ఏర్పడి ఉంటుందట. ఆడవారికి, మగవారికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఈ ఆవరణ ఏర్పడి ఉంటుందట. ఈ ఆవరణ పేరే “పుం”.(ఈ ఆవరణలోపల ఉన్నది జీవాత్మ). మన శరీరం మరో లోకానికి పోవాలన్నా, ఈ లోకపు దుఃఖాలు లేకుండా ఉండాలన్నా, దాని కప్పి ఉన్న ఆవరణ (పుం) తొలగిపోవాలి. అది ఉన్నంత కాలం నీవు ఈ లోకంలోనే ఉంటావు. ఎన్నిసార్లు అయినా మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటావు. మళ్లీమళ్లీ పోతూ ఉంటావు. స్వర్గాన్ని చేరుకోలేవు. ఇలా చాలాసార్లు పుట్టి పెరిగి,పోయి పుట్టే నరకాన్నే పున్నామ నరకం అంటారు. ఇది ఎలా పోగొట్టాలి? ఈ శరీరం నుంచి ఇంకొక శరీరం వస్తే, అంటే సంతానం కలిగితే…ఆ సంతానం కూడా కర్మాధికారం ఉన్నవాడు కావాలి కదా. అంటే పుత్ర సంతనం కలిగితేనే. అదే కూతురు కలిగితే ఆమెకు పితృ కర్మలు చేసే అధికారం లేదు. అందువల్ల పుత్రుడు పుట్టాలి. వాడు కలిగితే ఈ పాపాలు తీసుకుంటాడు అప్పుడు మరో లోకానికి పోతాము. కొడుకు లేకపోతే ఎలాగా? కూతుర్ల యొక్క కొడుకులకు కర్మలు చేసే అవకాశం ఉంటుంది. వాళ్లను దహిత్రులు అంటారు. అల్లుడు కూడా కర్మలు చేయవచ్చట. కానీ కూతురు మాత్రం చేయకూడదట. ఇవి మన పురాణాల వల్ల మనవాళ్లు నమ్ముతున్నటువంటి పుత్ర గాథలు.
రచయిత “యువర్ నోవా హరారీ” రాసిన ‘సేపియన్స్’ (SAPIENS) అనే పుస్తకంలో…. “You could never convince a monkey to give you a banana by promising him limitless bananas after death in monkey heaven…..”(కోతికి అది చనిపోయాక స్వర్గంలో అంతులేనన్ని అరటి పళ్ళు దొరుకుతాయి అని మాటిచ్చి తన దగ్గరున్న అరటిపండుని మీకు ఇచ్చేటట్టు ఒప్పించలేరు) అని వ్యంగ్యంగా చెబుతాడు. కల్పిత భావనలైన స్వర్గం, నరకం, పున్నామ నరకం, జన్మ, పునర్జన్మ వీటన్నిటిని నిజమని నమ్మేవారు చనిపోయాక జరిగే వాటికోసం తాపత్ర పడుతూ ఉంటారు. ఈ అపోహలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాలలోనూ ఉన్నాయి. అయితే ఈ స్వర్గానికి కొడుకుకి లింక్ ఏమిటి?. మాతృస్వామిక సమాజం నుంచి పితృస్వామిక సమాజం వైపుగా మానవజాతి అభివృద్ధి చెందినప్పుడు మొత్తం ఆస్తి పురుషుడికే ధార దత్తమైనప్పుడు జరిగిన మార్పు ఇది. కూతురు కంటే కొడుకే ప్రధానమని కొడుకుకి అన్ని హక్కులు ఉండాలని అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఆస్తి కొడుకు సంక్రమించేలా సమాజంలో మార్పులు ఏర్పడ్డాయి. దాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారు. కానీ సమాజం లో కొంత మార్పు అయితే వస్తోంది.
ప్రస్తుత కాలంలో చాలామందిలో కూతురైన కొడుకేనా ఒకరే అనే భావన పెరుగుతోంది. ఇక ఇంటి పేరు నిలబెట్టడానికి కొడుకులు కావాలనుకునే వాళ్ళకు ఒక సూటి ప్రశ్న. గతంలో ప్రసిద్ధిగాంచిన చక్రవర్తుల కుటుంబాలు, రాజుల కుటుంబాలు ఏమైనాయి? వాళ్ళ ఇంటి పేర్లు ఏమైనాయి? వాళ్లంతా ఎక్కడ ఉన్నారు? ఈమధ్య అమ్మ ఇంటి పేరును తమ ఇంటిపేరుగా కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. అది ఒక మంచి పరిణామం. ఇక ఆస్తి విషయం. కూతుర్లకు తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కల్పించే చట్టాన్ని మన దేశంలో ప్రప్రధమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి తారక రామారావు గారు 1985 లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందూ వారసత్వ చట్టాన్ని సవరిస్తూ దేశ వ్యాప్తంగా కూతుళ్ళకు ఆస్తి హక్కును 2005 లో కల్పించింది. తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో ఆర్థికంగా, శారీరికంగా కొడుకు ఆసరాగా ఉంటాడని నమ్ముతారు. సమాజంలో మగ పిల్లలు ఉంటే భద్రత ఎక్కువగా ఉంటుందని, వంశం నిలుస్తుందని చాలామంది భావిస్తారు. ఇవన్నీ అపోహలని తేలిపోతున్నాయి. ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిలే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. ఆసరాగా నిలబడుతున్నారు. అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికంటే ఒక పైమెట్టు… కొంత అవగాహన ఉన్న వాళ్లు మరణించిన తర్వాత మన శరీరాలను మెడికల్ కాలేజీలకు విద్యార్థుల కోసం డొనేట్ చేస్తున్నారు. డాక్టర్ కావలసిన విద్యార్థులకు ఇది చాలా అవసరం. ఇలా చేసిన తర్వాత అసలు ఇక ఈ నరకం ఈ స్వర్గము అన్న మాటలే అందుబాటుకు రాదు కదా.

మిఠాయి యుగంధర్ బాబు, 9394782540



