డా. నాగసూరి వేణుగోపాల్

ఉమ్మడి అనంతపురంజిల్లాలో గిన్నిస్ పుస్తకంలో ఎక్కిన మర్రిచెట్టు వుంది. ఈ తిమ్మమ్మ మర్రిమాను విస్తీర్ణంలో ప్రపంచంలోకెల్లా పెద్దది. దాని కాండం ఏదో, ఊడలు, ఏవో గుర్తుపట్టలేం. ఇటువంటి మర్రి చెట్టును పరిశీలించి, దీనికి మూలం అయిన మర్రి విత్తనం ఎంత చిన్నగా వుంటుందో గుర్తు తెచ్చుకోండి. విస్మయం చెందడం అనివార్యం. సరిగ్గా ఇటువంటి భావనే కలిగింది డా॥ ఎమ్. శాంతప్ప నేపథ్యం పరికించినపుడు!

కరువు జిల్లా అనంతపురం లోని ఉరవకొండకు చెందిన దళిత బాలుడు; చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యుడు; స్వయంకృషితో, ఆత్మీయుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్త కావడం; శ్రీవేంకటేశ్వర, మదరాసు, విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ కావడం; తన పరిశోధనా ఫలితాలతో భారతదేశపు విదేశీ మారక ద్రవ్యాన్ని గణనీయంగా పెంచిన శాస్త్రవేత్తగా రాణించడం అల్పమైన విషయాలు కాదు. చిట్టి మర్రిగింజ విశాలమైన చెట్టుగా వ్యాపించినట్టు శాంతప్ప తన శక్తితో, యుక్తితో, కఠోరదీక్షతో, లభించిన అలంబనతో, జీవితంలో ఎదిగారు, రాణించారు. కరువు ప్రాంతాలకూ, వెనుకబడిన వర్గాలకు చెందిన నేటి యువతీ యువకులు నిరాశపడకుండా స్ఫూర్తి అందుకోగల చైతన్య శిఖరం డా॥ ఎమ్. శాంతప్ప 

1927 అక్టోబర్ 2న శాంతప్ప జన్మించారు. తల్లిదండ్రులు రాజోలు శాలమ్మ, అరికేలి బసప్ప. ఉరవకొండలోని శ్రీ కరి బసవస్వామి గవర్నమెంట్ (తర్వాత బోర్డు) హైస్కూలులో 1931 నుంచి 1938 దాకా చదవడంవల్ల విశాల ప్రపంచంలోకి వెనుదిరగకుండా ప్రవేశించ గలిగానని డా|| ఎమ్. శాంతప్ప అనేవారు. ఆ స్కూలు వాతావరణం ఆదర్శవంతమని వివరిస్తూ 2002-03 కాలంలో అనంతపురం ఆకాశవాణికి చేసిన పరిచయంలో నాతో యిలా గుర్తు చేసుకున్నారు. “తూర్పున కరి బసవస్వామి గుడి, దక్షిణాన మేజిస్ట్రేట్ కోర్టు; గంభీరమైన స్ఫూర్తికరమైన ‘ఉరగాద్రి’ (కొండ) ఉత్తరాన; దూరంగా చప్పుడు చేస్తూ నిరంతరం పనిచేసే ప్రత్తి మిల్లులు పశ్చిమాన-ఉండటం ఆహ్లాదకరం, ఆదర్శవంతం”. ఎంతో కాలం తర్వాత కూడా వాటిని గుర్తు పెట్టుకుని మనకు చెప్పారంటే బాల్యంలోనే వాటిని గుర్తించగలిగే భావుకత, సృజన, మేధ శాంతప్ప సొంతం అనడం అతిశయోక్తి కాదు. ఉరవకొండలో పేద పిల్లల చదువుకు ధనికులు ఆర్థికసాయం చేసేవారని, కొందరు పిల్లలు పాఠశాల ఆవరణలోనే రాత్రి పూట చదువుకునేవారనీ, సత్యసాయి బాబా తనకు పాఠశాలలో రెండేళ్ళు జూనియర్ అని శాంతప్ప గారి బాల్యాన్ని అధ్యయనం చేస్తే బోధపడుతుంది.

శాంతప్ప తండ్రి బసప్ప ఒకప్పుడు తోళ్ళ వ్యాపారం చేసి శ్రీమంతులయినా తర్వాత ఆర్థికంగా నష్టపోయారు. శాంతప్ప పాఠశాలలో ప్రవేశించేసరికి కుటుంబ పరిస్థితి పూర్తిగా చితికిపోయింది. వీరు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అమ్మ, నాన్న చనిపోయారు. ఆ సమయంలో తన సన్నిహిత బంధువు గుంతకల్లు రాయప్ప అందించిన చేయూతతో చదువు కొనసాగింది. అప్పట్లో నెలకు ఆరు రూపాయలు యిచ్చి నాయర్ హెూటల్లో శాంతప్పకు భోజనం ఏర్పాటుచేశారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత వేసవిలో రెండు మాసాల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగం చేశారు శాంతప్ప. ఆ సమయంలో శాంతప్పను పై ఆఫీసర్ కేశవరెడ్డి చేరదీసి ‘ఆ ఉద్యోగంలోనే ఆగిపోకు, పై చదువులకు ప్రయత్నించు’ అని ఉద్బోధించారు. సెలవు పెడదామంటే సాధ్యం కాకపోయేసరికి రాజీనామా చేసి బి.ఎ. లో చేరారు.

        అప్పట్లో అనంతపురం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కళాశాల (ఇప్పుడు అనంతపురం ఆర్ట్స్ కళాశాల) ఒకటే పెద్ద కళాశాల, శాంతప్ప అక్కడే విజ్ఞానశాస్త్రాలతో ‘బి.ఎ’ పూర్తి చేశారు. ఆ సమయంలో జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం సందర్భంగా అనంతపురంలోని సి.డి. కళాశాల రసాయన శాస్త్ర ప్రయోగశాలకు నిప్పంటించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉద్యమ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఈ విషయం కోర్టులో వాదానికి వచ్చినపుడు ప్రఖ్యాత రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ డిఫెన్సు లాయర్ పాల్గొనడం బాగా గుర్తు అంటారు డా|| శాంతప్ప. ఆయన కళాశాలలో చదువుతున్న సమయంలో (1939-43) కట్టమంచి రామలింగారెడ్డి, లక్ష్మణస్వామి మొదలియార్ వంటి ప్రముఖులు ఈ కళాశాలను సందర్శించారు. “మీరు (అనంతపురం వారు) మాతో కలిస్తే అనంతపురాన్ని వాల్తేరు (ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా) చేస్తానని వారు ప్రకటించారని డా॥ శాంతప్ప చెప్పారు. 

భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో పెరిగే చెట్టును స్ఫూర్తిగా తీసుకోమంటారు స్వామి వివేకానంద. డా॥ శాంతప్ప ఎక్కడా రాజీ పడకుండా శ్రమించారు. బి.ఎ. అయ్యాక ఒక సంవత్సరం (1943-44) అదే కళాశాలలో డెమాన్స్టిటర్ గా ఉద్యోగం చేశారు. ఆరోజుల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదవడం గొప్పగా భావించేవారు. 1944లో శాంతప్ప బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్. ఎస్సి. కోర్సులో చేరారు. మళ్ళీ ఆర్ధిక ఇబ్బందులు. అక్కడున్న కోపరేటివ్ సొసైటి వారు సాయం చేశారు. అప్పట్లో డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అప్పట్లో ఎమ్.ఎస్సి విద్య తొంభై శాతం దాకా ప్రయోగశాలలోనే సాగేది. సంవత్సరానికి డజను కంటే ఎక్కువ క్లాసులుండేవి కావు అని ఆయన చెప్పిన విషయాలు గమనిస్తే తెలుస్తుంది. చదువు అంటే ప్రయోగాత్మకమే!

శాంతప్ప చదువులో చురుకు అని వేరుగా చెప్పనక్కరలేదు. 1946లో ఎం.ఎస్సి. చేస్తున్నపుడు డా|| అర్థసీర్ దలాల్ నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటి ఉన్నత విద్యకు శాంతప్పను ఎంపిక చేసి ఇంగ్లాండుకు పంపింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక పి.హెచ్.డి. తర్వాత 1951లో మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజికల్ కెమిస్ట్రీలో మరో పి.హెచ్.డి. సంపాయించారు. ఇంగ్లాండులోని క్రమశిక్షణ. శాంతప్పను ముగ్ధుణ్ణి చేసింది. అక్కడ రోడ్డు పక్కన డబ్బాలో డబ్బులు వేసి, దినపత్రికను తీసుకొనే పద్ధతి ఆశ్చర్యం కల్గించింది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా దృష్టి, అంతకుమించి పరిశోధన, పరిశ్రమల మధ్య మంచి సమన్వయం వుండేది. ఇంగ్లాండులో ఉన్నపుడు ఫ్రాన్స్, స్విట్జర్ల్యాండ్, జకొస్లోవాకియా, పోలాండు వంటి దేశాలు సందర్శించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు వారు కమ్యూనిస్ట్ దేశమైన జకొస్లోవాకియాలో వేడుకలు జరుపుకున్నారు.

1951లో డా॥ శాంతప్ప స్వదేశానికి తిరిగి వచ్చారు. తమాషా ఏమంటే విదేశాల పి.హెచ్.డి.లు రెండు ఉన్నా ఒక సంవత్సరం నిరుద్యోగిగా వుండటం. మద్రాసు విశ్వవిద్యాలయపు అప్పటి ఉపాధ్యక్షులు డా|| లక్ష్మణస్వామి మొదలియార్, డా॥ శాంతప్ప యోగ్యత పత్రాలు గమనించి రసాయన శాస్త్రంలో రీడర్ గా నియమించారు, 1958లో ఆచార్యులయ్యారు. 1972 నుంచి మద్రాసు విశ్వవిద్యాలయం ఆచార్యులుగా వుంటూనే సెంట్రల్ లెదర్ రీసర్చి ఇన్స్టిట్యూట్ (CLRI) డైరెక్టరుగా నియమితులయ్యారు.

           1979-80 మధ్యకాలంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, 1981-84 మధ్యకాలంలో మద్రాసు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వున్నారు. తమ హయాంలో డా॥ శాంతప్ప రెండు విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు ప్రారంభింప చేశారు. 320 పరిశోధనా పత్రాలు వెలువరించారు. ఆయన పర్యవేక్షణలో 57 మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్లు పొందారు. దా॥ శాంతప్ప పరిశోధక రంగాలు పాలిమర్లకు (అంటే స్థూలంగా ప్లాస్టిక్కులు) సంబంధించిన శాస్త్ర, సాంకేతిక అంశాలు అలాగే జంతు చర్మాలకు సంబంధించి భౌతిక, సేంద్రియ ధర్మాలు, యింకా వాటి ఫోటో కెమిస్ట్రి, ఇతర సాంకేతిక అంశాలను అధ్యయనం చేశారు. వాటి వల్ల తోళ్లను శుభ్రం చేయడంలో పర్యావరణ కాలుష్యం కల్గించే పాత విధానాలకు బదులు కాలుష్యం కల్గించని, నాణ్యమైన విదేశీ ఎగుమతి స్థాయి గల చర్మాలను తయారుచేయడానికి వీలయ్యింది. దీనితో దిగుమతులు తగ్గి స్వావలంబన సాధ్యపడింది. చిన్నపుడు తన తండ్రి వ్యాపారం చేసి నష్టపోయిన రంగంలోనే కుమారుడు పరిశోధనలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఆశ్చర్యకరమే! తమిళనాడు కాలుష్య నియంత్రణా మండలి సలహాదారుగా పర్యావరణాన్ని కాపాడటానికి శ్రమించారు. వీరి పరిశోధనల కారణంగా 1970లో రూ.100 కోట్లు ఉన్న చర్మాల ఎగుమతి, తర్వాతి కాలంలో 10,000 కోట్లకు పెరగడం విశేషం. అలాగే మరోవైపు దేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ కూడా గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్ర, గుల్బర్గా, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు డా॥ ఎమ్. శాంతప్పకు గౌరవ డాక్టరేట్లను యిచ్చాయి. ఇండియన్ నోబెల్ బహుమతి వంటి భట్నాగర్ అవార్డు ఆయనకు వచ్చిన మొదటి అవార్డు.

చదువుకు మొదట రాయప్ప సహాయం అందిస్తే తరువాత ఉన్నత విద్యకు పోలీస్ ఆఫీసర్ పి. కేశవ రెడ్డి ప్రోత్సహించారు. చదువయ్యాక డా॥ లక్ష్మణస్వామిని కలసిన 24 గంటలలోపే ఆయన మద్రాసు విశ్వవిద్యాలయంలో రీడర్ ఉద్యోగం ఇస్తే, డా|| వై. నాయుడమ్మ సెంట్రల్ లెదర్ రీసర్చి ఇన్స్టిట్యూట్ డైరెక్టరుగా ఆహ్వానించారు.

ఇలాంటి పురస్కారాలు అందుకున్నప్పుడల్లా తనకు తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలనేవారు శాంతప్ప. అదే సమయంలో తన జీవితంలో చేదోడు వాదోడుగా పూర్తిగా సహకరించిన భార్య ధనలక్ష్మి పాత్ర విశిష్టమైందని కూడా శాంతప్ప శ్లాఘిస్తారు. సంపాదకుడు, కవి విద్వాన్ విశ్వం వీరికి మంచి మిత్రుడు. మద్రాస్ లోని అడయారులో ఆనందకరమైన శేష జీవితాన్ని గడిపిన డా. ఎం. శాంతప్ప అక్కడే ఫిబ్రవరి 26న కన్నుమూశారు. వారి పిల్లలందరూ ఉన్నత చదువులు చదివి జీవితంలో రాణిస్తున్నారు. 

డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు, మొబైల్: 9440732392

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *