డాక్టర్ రవి రాజా పొతినేని

పరిచయం:
1977వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ లాంచ్ ప్యాడ్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి నాసా (NASA) ఒక అద్భుతమైన వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమైంది. అదే వాయేజర్-1 (Voyager 1). అప్పట్లో ఎవరికీ ఊహించని విధంగా, ఈ చిన్న యంత్రం కేవలం కొన్ని గ్రహాలను చుట్టి రావడమే కాకుండా, మానవ చరిత్రే గర్వపడేలా అనంత విశ్వంలో ఒక చరిత్రాత్మక ఇతిహాసాన్ని లిఖిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

చిత్రం: వాయేజర్-1 వ్యోమనౌక. సౌజన్యం: నాసా (NASA) 

ఈరోజు, దాదాపు ఐదు దశాబ్దాలు గడిచాయి. కాలం మారుతోంది, తరాలు మారుతున్నాయి. కానీ వాయేజర్-1 మాత్రం భూమికి బిలియన్ల కిలోమీటర్ల దూరంలో, చీకటి నిండిన నక్షత్రాంతర ప్రదేశంలో ఇప్పటికీ తన ఒంటరి ప్రయాణాన్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు సైన్స్ కల్పనలను సైతం వెనక్కి నెట్టేస్తూ, మానవ నిర్మిత వస్తువు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా “ఒక కాంతి రోజు” దూరపు మైలురాయిని, 18 నవంబర్ 2026, సమీపిస్తోంది. అసలు ఈ సుదీర్ఘ ప్రయాణపు కథాకమామిషు ఏమిటి? ఆ అద్భుత మైలురాయి వెనుక ఉన్న సైన్స్ ఏమిటో చూద్దాం!!

అసలు “ఒక కాంతి రోజు” అంటే ఏమిటి?
దూరాలను కొలవడానికి మనం కిలోమీటర్లను వాడతాం. కానీ అంతరిక్షంలో దూరాలు కోట్ల కొద్దీ కిలోమీటర్లలో ఉంటాయి కాబట్టి, శాస్త్రవేత్తలు కాంతి వేగాన్ని కొలమానంగా ఉపయోగిస్తారు. కాంతి సెకనుకు దాదాపు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో కాంతి కనుక ప్రయాణిస్తే…

  • మనం నివసించే భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని దాటడానికి కాంతికి పట్టే సమయం కేవలం 8నిమిషాల 20 సెకండ్లు మాత్రమే! అంటే సూర్యుని కిరణాలు మనల్ని చేరడానికి కేవలం కొన్ని నిమిషాలు పడతాయన్నమాట.
  • అదే కాంతి మన సౌర కుటుంబంలోని చివరి గ్రహమైన నీలిరంగు నెప్ట్యూన్ దగ్గరకు వెళ్లడానికి దాదాపు 4 గంటల 10 నిమిషాలు తీసుకుంటుంది.
  • ఇక, ఆ కాంతి క్షణం ఆగకుండా, రాత్రింబవళ్ళు అలా 24 గంటలు (ఒక పూర్తి రోజు) ప్రయాణిస్తే ఎంత దూరం వెళ్తుందో… సరిగ్గా అంతటి అపారమైన దూరమే “ఒక కాంతి రోజు”!

ఇప్పుడు వాయేజర్-1 ఖచ్చితంగా భూమికి ఇంతటి భారీ దూరంలో ఉంది.

ఎలా మొదలైంది ఈ సాహసయాత్ర?
నిజానికి, 1977లో వాయేజర్-1 ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నాసా పెట్టుకున్న లక్ష్యం చాలా చిన్నది, పరిమితమైనది. అప్పట్లో ఈ వ్యోమనౌక కేవలం మన సౌర కుటుంబంలోని మహా దిగ్గజాలైన బృహస్పతిమరియు శని గ్రహాల దగ్గరకు వెళ్లి, వాటి అద్భుతమైన వలయాలను, భారీ ఉపగ్రహాలను (Moons) దగ్గరినుంచి ఫోటోలు తీసి భూమికి పంపడం మాత్రమే ఆనాటి ప్రధాన ఉద్దేశం. ఆ రెండు గ్రహాల రహస్యాలను ఛేదించిన తర్వాత, ఆ మిషన్ దాదాపు ముగిసినట్టే అనుకున్నారు.

కానీ, శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేస్తూ వాయేజర్-1 అద్భుతంగా పనిచేయడం ప్రారంభించింది. ఆ రెండు గ్రహాల గురించిన సమాచారాన్ని అందించిన తర్వాత కూడా, దానిలో ఉన్న ఇంధనం, సాంకేతిక పరికరాలు ఇంకా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గమనించిన నాసా శాస్త్రవేత్తలు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దీనిని కేవలం సౌర కుటుంబానికి పరిమితం చేయకుండా, ఏ వ్యోమనౌక ధైర్యం చేయని రీతిలో సౌర కుటుంబం వెలుపలికి పంపాలని నిశ్చయించుకున్నారు.

అలా, సూర్యుడి శక్తి మరియు సౌర గాలి (Solar Wind) ప్రభావం పూర్తిగా ముగిసిపోయి, మరో కొత్త లోకం ప్రారంభమయ్యే అదృశ్య సరిహద్దు ప్రాంతాన్ని—శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా పిలిచే ‘హెలియోపాజ్’ ప్రాంతాన్ని వాయేజర్-1 విజయవంతంగా దాటేసింది. ఆ చారిత్రక గీతను దాటడంతోనే అది మన సౌర కుటుంబాన్ని శాశ్వతంగా వెనక్కి నెట్టి, అసలుసిసలైన నక్షత్రాంతర అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవ నిర్మిత రాయబారిగా విశ్వ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది!

నాసా శాస్త్రవేత్తలనే విస్మయపరుస్తున్న కమ్యూనికేషన్ సవాళ్లు!
ప్రస్తుతం వాయేజర్-1 భూమి నుండి ఊహకందని, మన మస్తిష్కానికి కూడా అందని సుదూర ప్రాంతంలో విహరిస్తోంది. అక్కడి నుంచి భూమికి ఎలాంటి సంకేతాలు రావాలన్నా, లేదా మనం అక్కడికి ఏదైనా సందేశం పంపాలన్నా… కాంతి వేగంతో ప్రయాణించే ఆ రేడియో తరంగాలకు ఏకంగా దాదాపు ఒక రోజు (సుమారు 22 నుండి 24 గంటలకు పైగా) సమయం పడుతోంది.

దీని అసలు అర్థం ఏమిటో తెలుసా? భూమిపై ఉన్న నాసా కంట్రోల్ రూమ్ నుండి శాస్త్రవేత్తలు వాయేజర్-1కి ఏదైనా ఒక చిన్న కమాండ్ (ఆదేశం) పంపితే, ఆ నౌక దాన్ని అందుకుని, స్పందించి, ఆ సమాచారాన్ని తిరిగి భూమికి చేరవేయడానికి సరిగ్గా ఒక పూర్తి రోజు (48 గంటల రౌండ్ ట్రిప్ ప్రయాణం) పడుతుంది! ఒకవేళ సుదూర అంతరిక్షంలో నౌకకు ఏదైనా సాంకేతిక సమస్య వస్తే, శాస్త్రవేత్తలు దాన్ని ఇక్కడ కూర్చుని సరిదిద్దడానికి కనీసం ఒక రోజంతా ఉత్కంఠగా నిరీక్షించాల్సిందే.

అంతేకాదు, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే… నేటి అత్యాధునిక సూపర్‌ కమ్యూటర్ల కాలం కాదు ఇది! సరిగ్గా 1970ల నాటి అతి సాధారణ, ఇరుకైన పాత కాలపు కంప్యూటర్ టెక్నాలజీతో, కేవలం కొన్ని చిన్న వాట్ల శక్తిని మాత్రమే ఇచ్చే రేడియో ట్రాన్స్‌మిటర్‌తో ఈ నౌక ఇన్ని బిలియన్ల కిలోమీటర్ల దూరం నుండి ఇప్పటికీ భూమితో మాట్లాడుతూనే ఉండటం ఒక ఆధునిక శాస్త్ర విస్మయం! మానవ మేధస్సుకు, పట్టుదలకు ఇదే అసలైన నిదర్శనం.

ఈ ‘లైట్-డే’ మైలురాయి ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది?

  1. మానవ మేధస్సుకు సరిహద్దుల్లేవని నిరూపణ: కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరాన్ని ఒక వ్యోమనౌక చేరుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇది మానవుడు సాధించిన సాంకేతిక మరియు శాస్త్రీయ విజయాలకు పరాకాష్ట.
  2. అజ్ఞాత ప్రపంచాల రహస్యాల సేకరణ: సౌర కుటుంబపు వెలుపలి వాతావరణంలో ఉండే కాస్మిక్ కిరణాలు, అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సాంద్రత వంటి విషయాలను ఈ నౌక నిరంతరం మనకు చేరవేస్తోంది. మానవుడు ఎప్పుడూ తాకని ప్రాంతాల నుండి వస్తున్నఈ డేటా విశ్వం పుట్టుకను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం.
  3. భూమి మనుగడకు ఒక శాశ్వత సందేశం – ‘గోల్డెన్ రికార్డ్’: వాయేజర్-1 కేవలం శాస్త్రీయ పరికరాలను మాత్రమే మోసుకెళ్లడం లేదు. దానితో పాటు ఒక ‘గోల్డెన్ రికార్డ్’ అనే బంగారు రికార్డును కూడా తీసుకెళ్తోంది. భూమిపై ఉన్న వివిధ భాషల్లో శుభాకాంక్షలు, పక్షుల కిలకిలరావాలు, వర్షపు శబ్దాలు, సంగీతం, మరియు మన నాగరికతకు సంబంధించిన చిత్రాలను ఇందులో పొందుపరిచారు. భవిష్యత్తులో ఎప్పుడైనా, కోట్లాది సంవత్సరాల తర్వాత, భూమి అంతరించిపోయినా… విశ్వంలో తిరుగుతున్న ఈ ఏలియన్ నాగరికతలు ఎవరైనా వాయేజర్-1ని కనుగొంటే, “భూమి మీద ఒకప్పుడు మనుషులు అనే అద్భుతమైన జీవులు ఉండేవారు” అని తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది.
చిత్రం: గోల్డెన్ రికార్డ్. సౌజన్యం: నాసా (NASA)

ముగింపు:
రోజులు గడుస్తున్న కొద్దీ, వాయేజర్-1 లోని శక్తి వనరులు (ప్లూటోనియం బ్యాటరీలు) నెమ్మదిగా క్షీణిస్తున్నాయి. ఒక రోజు దానిలో ఉన్న దీపాలు శాశ్వతంగా ఆరిపోవచ్చు, అది భూమితో మాట్లాడటం ఆపేయవచ్చు.

కానీ… ఆ యంత్రం మౌనంగా నిశ్చలంగా మారిపోయినా, దాని ప్రయాణం మాత్రం ఆగదు! మానవ జాతి అంతులేని అన్వేషణా తృష్ణను, మన ఇనుమడించిన ఆశలను మోసుకుంటూ అది ఆ అనంత చీకటి సముద్రంలో అలాగే సాగిపోతూనే ఉంటుంది. ఒకనాడు మనం ఈ భూమ్మీద లేకపోయినా, ఈ విశ్వపు వెండితెరపై మనుషులమనే ఒక అద్భుతం ఉండేదని చెప్పడానికి… కోట్ల ఏళ్ల తర్వాత కూడా వాయేజర్-1 ఒక శాశ్వత చారిత్రక సాక్ష్యంగా, మన జాతి మూగ దూతగా వినీలాకాశంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది!

రచయిత ఖగోళ పరిశోధకుడు, సైన్స్ ప్రచారకర్త .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *