డా. విరించి విరివింటి
గత సంచిక కొనసాగింపు..
చరిత్ర పూర్వదశలో మాతృస్వామ్యం అనే ఒక ఆదర్శవంతమైన సమాజం నిజంగా ఉండేదని, ఆ మాతృస్వామ్యం అంతరించిపోయిన తర్వాత లేదా పురుషులు దాన్ని నాశనం చేసిన తర్వాత పితృస్వామ్యం మొదలైందని స్త్రీవాద చర్చల్లోనూ, ప్రగతిశీల మేధావి వర్గాల్లోనూ ఒక అభిప్రాయం/వాదన ప్రాచుర్యంలో ఉంది. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక పుస్తకంపై ఇటీవల జరిగిన ఒక చర్చలో, మాతృస్వామ్య ఉనికి సత్యమని ఋజువయ్యాయని కొందరు మేధావులు వ్యాఖ్యానించడం కూడా జరిగింది.
ఐతే, ఈ అభిప్రాయానికి/వాదనకు పూర్తిగా విరుద్ధంగా, అసలు మాతృస్వామ్యం అనేదే మానవ చరిత్రలో లేదనీ, అది కేవలం ఒక అపోహ మాత్రమేననీ ఎవరైనా అంటే?..
ఈ అభిప్రాయాలను కేవలం అభిప్రాయాలుగా కాకుండా, పరిశీలించి నిర్ధారించాల్సిన వాదనలుగా పరిగణిస్తూ, వాటిలోని నిజానిజాలను కొంత లోతుగా చర్చించేందుకు ఉద్దేశించబడిన ఈ వ్యాసానికి ఇది రెండో భాగం
ఆధునిక పురావస్తు శాస్త్రం, కొత్త ఊహలు:
చాతల్హోయుక్, మరిజా గంబుటాస్
ఇరవైయవ శతాబ్దం మధ్యలో బ్రిటీష్ వలస వాదం పతనం చెందిన తర్వాతి దశాబ్దాలలో శాస్త్ర- సాంకేతిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వచ్చిన మార్పులు మాతృస్వామ్య భావనకు అంకురార్పణ చేశాయి.

1. 1960లలో టర్కీ (అనాటోలియా) లోని చాతాల్హోయుక్ (Çatalhöyük) అనే సుమారు 9,000 ఏళ్ల నాటి నవీన శిలా యుగపు (Neolithic) నగరాన్ని జేమ్స్ మెల్లార్ట్ అనే పురాతత్వవేత్త తవ్వితీశారు. ఇవి 9000 ఏళ్ళ నాటివి అని ఖచ్చితంగా చెప్పగలిగేందుకు, ‘రేడియో కార్బన్ డేటింగ్’ విధానం 1950 ల నుండే అందుబాటులోకి వచ్చింది. అక్కడ సింహాసనంపై కూర్చుని, ప్రసవిస్తూ, సింహాలపై చేతులు వేసి ఉన్న ఒక స్థూలకాయ మహిళా విగ్రహం దొరికింది, దీనిని “సీటెడ్ ఉమెన్ ఆఫ్ చాతాల్హోయుక్” అంటారు.
దీనితో పాటు అనేక స్త్రీ విగ్రహాలు దొరకడంతో, కొంతమంది పరిశోధకులు మానవజాతి ప్రారంభంలో “మాతృ దేవత” (Mother Goddess) ఆరాధన ఉండేదని, ఈ విగ్రహాలను మాతృదేవత ఆరాధనకు, స్త్రీకేంద్రక సమాజానికి సూచనలుగా అర్థం చేసుకున్నారు.
2. లిథువేనియా దేశానికి చెందిన ప్రసిద్ధ మహిళా ఆంత్రోపాలజిస్ట్/ఆర్కియాలజిస్ట్ మరిజా గంబుటాస్ 1970, 80లలో తూర్పు యూరప్‌లో చేసిన విస్తృతమైన తవ్వకాల ద్వారా పురాతన ఐరోపా⁴ (ఓల్డ్ యూరప్) సిద్ధాంతాన్ని తెచ్చారు. ఆమె ప్రకారం – ఇండో-యూరోపియన్ల దండయాత్రల కంటే ముందు (క్రీ.పూ. 7000–3500 మధ్య) యూరప్‌లో ఉన్న సమాజాలు శాంతియుతమైనవి, ప్రకృతిని ఆరాధించేవి, అలాగే మహిళా కేంద్రకమైనవి (matristic, matrifocal, matrilineal, sex-egalitarian). అక్కడ దొరికిన వందలాది స్త్రీ విగ్రహాలను (figurines) విశ్లేషిస్తూ, స్త్రీ దేవతలను కొలిచే ఆ సమాజాలలో యుద్ధాలు లేవని, స్త్రీలే పూజారులుగా, స్త్రీలే సమాజ నిర్దేశకులుగా ఉండేవారని ఆమె పురావస్తు ఆధారాలుగా చూపారు.అప్పటికే యూరోప్ దేశాలు రెండు ప్రపంచ యుద్ధాల బీభత్సాన్ని చూసి యుద్ధాలు లేని ఆదర్శ సమాజంకోసం ఎదురుచూస్తున్న తరుణమది. పితృస్వామ్యం అంటేనే యుద్ధాలు, హింస అనీ, దానికి భిన్నంగా ‘ఓల్డ్ యూరప్’ మాతృకేంద్రకంగా యుద్ధాలు లేని శాంతియుత సమాజంగా అలరారుతుందన్న పురావస్తు ఆధారాలు యుద్ధానంతర కల్లోలిత మానసానికి ఒక గొప్ప ఊరటనిచ్చింది. సమాజం ఏ స్వర్గ ఉనికిని వినాలనుకుంటుందో సరిగ్గా అదే అంశాన్ని మరిజా గంబూటాస్ పరిశోధనలు బయటపెట్టడంతో వారు ఈ నూతన ఆలోచనలను అక్కున చేర్చుకున్నారు.
3. దాదాపు అదే సమయంలో పాశ్చాత్య దేశాలలో ఉవ్వెత్తున లేచిన స్త్రీవాద ఉద్యమాలు “సమాజం ఎప్పుడూ ఇలాగే పురుషాధికారంతోనే ఉందా? దీనికి ప్రత్యామ్నాయం లేదా?” అని అడగడం ప్రారంభించాయి. ఆ సమయంలో వారికి చాతాల్హోయుక్ తవ్వకాలు, మరిజా గంబుటాస్ పరిశోధనలు స్త్రీ వాదానికి తగ్గ సైద్ధాంతిక బలాన్ని అందించాయి. బహుశా స్త్రీ ఆధిక్యతను అణచివేయడం వలననే పురుషాధిక్యత పుట్టుక జరిగిందన్న ఊహ ,వారిని ప్రాచీన స్వర్ణయుగ భావన ఐన గోల్డెన్ ఏజ్ సిండ్రోమ్ లోకి తీసికెళ్ళింది. అందుకే స్త్రీ ఆధిపత్యం, స్త్రీ పరిపాలన, సమానత్వాన్ని కాంక్షించే మాతృస్వామ్యమనబడే ఆ ఉన్నతమైన సమాజం గురించిన భావనలు మిన్నంటాయి. ఒకరకంగా స్త్రీ దేవతలు పూజింపబడే చోటల్లా మాతృస్వామ్యం ఉండిండవచ్చనే కల్పనలు జోడింపబడ్డాయి. స్త్రీవాద ఉద్యమాలు పురుషాధిక్యతకు ప్రత్యామ్నాయమైన సామాజిక వ్యవస్థలను వెతికాయి. గంబుటాస్ ప్రతిపాదించిన Old Europe అలాంటి ఊహలకు ఒక చారిత్రక రూపాన్ని ఇచ్చింది. అయితే ఆ సిద్ధాంతాన్ని స్త్రీవాదులు స్వీకరించడమే దాని శాస్త్రీయ ప్రామాణికతకు రుజువు కాదు. అలాగే, దాని మీద వచ్చిన ప్రతి విమర్శనూ స్త్రీ వ్యతిరేకతగా కొట్టిపారేయలేం. పురావస్తు శాస్త్రవేత్తలు గంబుటాస్ సిద్ధాంతాల ఆధారాలను, ఆమె వ్యాఖ్యానాల్లోని పరిమితులను రెండింటినీ పరిశీలించారు.
స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకునే ప్రజాస్వామ్య, సామ్యవాద రాజకీయ సిద్ధాంతాలు కూడా ఈ ఉటోపియాని పరోక్షంగా సమర్థించినట్టయింది.. మార్క్స్, ఏంగెల్స్ ల సిద్ధాంతాల ప్రకారం ‘ప్రైవేట్ ఆస్తి’ రాకముందు సమాజంలో వర్గాలు లేవు, అణచివేత లేదు. అంటే ఆనాటి స్త్రీవాదులుకూ అలాగే సామ్యవాదులకూ “వ్యక్తిగత ఆస్తి లేని, వర్గ రహిత సమాజమే మాతృస్వామ్య సమాజం” అని ఊహ ఇద్దరికీ చాలా దగ్గరైనది. పితృస్వామ్యం లేని, యుద్ధాలు లేని, పూర్తి సమానత్వం ఉండే ఒక సమాజం వారి ఆకాంక్షల్లో నిర్మించుకునే అవకాశం కలిగింది. వ్యవసాయం స్థిరపడి, పెరడు వ్యవసాయం స్థానంలో నాగలితో దున్నే వ్యవసాయం వచ్చి, ధాన్య సమృద్ధి పెరిగి, ప్రైవేటు ఆస్తికి మార్గాలేర్నడటం, దాని ద్వారా దంపతీ వివాహం, ఆస్తుల బదిలీకి ఏక పత్ని (నిజానికి ఏక పతి) విధించబడటమూ, స్త్రీలైంగికతకు ఆంక్షలు విధించబడటమూ జరిగిపోయాయి. ఆ విధంగా వ్వవస్థలో వచ్చిన మార్పులు ఉపరితలంలో మానవ సంబంధ బాంధవ్యాలలో, సంస్కృతిలో ప్రతిఫలించాయి వంటి వివరణలు చారిత్రక భౌతికవాదం ద్వారా పరిశీలించదగిన పరిణామాలుగా ప్రాచీన గతంపై ఆసక్తిని ప్రభావితం చేసే విషయంలో విలువైనవిగా మారాయి.
రాజకీయ ఆశయం – స్త్రీవాదం, స్వర్ణయుగ భావన, సింథియా ఎల్లర్:
ఇప్పటివరకూ “పురుషాధికారమే సహజమైనది, అది దైవదత్తమైనది, ప్రకృతి సిద్ధమైనది” అని నమ్మిన పురుష ప్రపంచానికి.. “కాదు, పితృస్వామ్యం అనేది చరిత్ర మధ్యలో వచ్చిన ఒక తాత్కాలిక స్థితి మాత్రమే” దీనిని అధిగమించి మరల పాత మాతృస్వామ్యానికి సమాజం చేరుకోగలదనే ధైర్యాన్ని ఈ మాతృస్వామ్య ఉటోపియా ఇచ్చింది. అంటే ఈ మాతృస్వామ్య భావన స్త్రీ వాదపు సైద్ధాంతిక కవచంగా మారింది. మాతృస్వామ్యము, మాతృవంశ క్రమము అనే రెండు పధబందాల మధ్య తేడా దాదాపు మరుగున పడిపోయింది. మాతృస్వామ్యమనే పద బంధమే స్థిరపడి చారిత్రక సత్యంగా మలచబడింది. ఈ వాదనకు సజీవ సాక్షాలుగా గిరిజన సమాజాలను కూడా చూపించారు. గిరిజన సమాజాలు చారిత్రక పరిణామాలకు అతీతంగా, మార్పులేకుండా నిలిచిపోయిన సామాజిక శిలాజాలన్నట్టుగా వాటిని చిత్రించారు. ప్రస్తుతం జీవిస్తున్న గిరిజన సమాజాలను పరిశీలిస్తే ఆదిమ కాలపు మాతృస్వామ్య సమాజాల స్వరూపం తెలుస్తుందన్నట్టుగా కొందరు భావించారు. కానీ ఏదైనా గిరిజన సమాజంలో మాతృవంశ క్రమం కనిపించిందని మాత్రమే, ఆ సమాజం ప్రాచీన మాతృస్వామ్యానికి ప్రత్యక్ష నమూనా అని చెప్పలేం. మాతృవంశ క్రమం, స్త్రీల సామాజిక అధికారం, స్త్రీల రాజకీయ పాలన — ఇవి వేర్వేరుగా పరిశీలించాల్సిన అంశాలు.

దీనివలన “స్త్రీవాద మాతృస్వామ్యవాదలు”( Feminist matriarchalists) అనే కొత్త తరం 1970 లో అమెరికన్ యూరోప్ లలో మధ్య – ఉన్నత తరగతి స్త్రీలనుండి ఏర్పడిందని స్త్రీవాద రచయిత ప్రొఫెసర్ సింథియా ఎల్లర్ అంటారు. ఆమె 2000వ సంవత్సరంలో రాసిన పుస్తకం the Myth of Matriachal Prehistory అనే పుస్తకంలో ఆమె ఈ ధోరణిని తీవ్రంగానే విమర్శించారు. ఈ స్త్రీవాద మాతృస్వామ్యవాదులు, మరిజా గంబుటాస్ ప్రతిపాదించిన ‘ఓల్డ్ యూరప్’ సిద్ధాంతాన్ని ఎలాంటి ప్రశ్నలు లేకుండా, ఒక మత గ్రంథం లాగా విశ్వసిస్తూ గంబుటాస్ చూపించిన పురావస్తు ఆధారాలను తమకు అనుకూలంగా మార్చుకుని, ఒక కల్పిత ‘స్వర్ణయుగాన్ని’ (Golden Age) సృష్టించుకున్నారనీ, భవిష్యత్తులో తాము సాధించబోయే ఆధునిక సమాజానికి ఈ ‘గతం’ ఒక నమూనా అని వారు బలంగా నమ్మారని ఎల్లర్ విమర్శించింది. కార్ల్ యూంగ్ ప్రతిపాదించిన ‘ఆర్కిటైప్స్’ భావనను ఉపయోగించిన కొన్ని స్త్రీవాద ఆధ్యాత్మిక ధోరణులు స్త్రీత్వానికి ఇలాంటి శాశ్వతమైన మూల లక్షణాలను ఆపాదించాయి. స్త్రీత్వం అంటే ప్రకృతి, శాంతి, పోషణ, సృజనాత్మకత అని; పురుషుడు అంటే దూకుడు, యుద్ధం, నాశనం అని (ఎస్సెన్షియలిజం) ప్రాచీన సమాజం స్త్రీల చేతిలో ఉండింది కాబట్టే అది శాంతియుతంగా, పర్యావరణ హితంగా ఉండిందని ఈ స్త్రీవాద మాతృస్వామ్యవాదులు వాదించారు. అంటే, వారు స్త్రీ, పురుషుల సామాజిక పాత్రలను కేవలం వారి జీవశాస్త్రానికి (Biology) పరిమితం చేసే ప్రమాదకరమైన ధోరణిని అనుసరించారని అని ఎల్లర్ హెచ్చరించారు. ఇటువంటి కల్పిత మాతృస్వామ్య గతం కోసం ఆరాటపడటం (Lusting after it) వల్ల స్త్రీవాద ఉద్యమానికి దీర్ఘకాలంలో తీవ్ర నష్టం జరుగుతుందన్నది ఆమె ప్రధాన విమర్శ. ఎందుకంటే, స్త్రీల విముక్తి, సమానత్వం అనేవి భవిష్యత్తులో సాధించాల్సిన మానవ హక్కుల కోణం నుండి ఉద్యమాల రూపంలో హక్కుల సాధన రూపంలో రావాలి కానీ, చరిత్రలో ఎప్పుడో ఉండిందనే ఒక నిరూపించబడని, అబద్ధపు ‘చారిత్రక పునాది’ మీద నిలబడకూడదు. ఒకవేళ భవిష్యత్తులో సైన్స్ ఈ మాతృస్వామ్యాన్ని పూర్తిగా అబద్ధమని ఆధారాలు చూపించగలిగితే (చాలా వరకు ఆధునిక ఆంత్రోపాలజీ అటు వైపే సాగుతోంది), అప్పుడు స్త్రీవాద ఉద్యమ సైద్ధాంతిక పునాది మొత్తం కూలిపోతుంది. అంతేకాకుండా సమాజంలో పురుషాధిక్యత, అణచివేత అనేవి కేవలం హింసాత్మక పురుషుల వల్ల రాలేదు అవి సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక పరిణామాల వల్ల వచ్చాయి. వాటన్నింటినీ వదిలేసి, కేవలం ‘దేవతల కాలం’ గురించి కలలు కనడం వల్ల ప్రస్తుత సమస్యలకు పరిష్కారం దొరకదన్నది ఆమె ప్రతిపాదన. స్త్రీ వాద ఉద్యమం నికార్సైన ఆధారాలమీద నిలబడాలే కానీ కల్పిత కథల మీద, భావోద్వేగ ఊహల మీద ఉండకూడదని ఆమె ఇచ్చిన పిలుపు మాతృస్వామ్యంపై స్త్రీవాదులకున్న కొన్ని ధోరణులను పునః సమీక్షకు తోడ్పడింది. చరిత్రలో అనేక సమాజాలు స్త్రీలను ఆరాధించాయి. ఉదాహరణకు ఏథెన్స్. ఎథీనా ఆ నగరరాజ్యానికి అధి దేవత కానీ అక్కడ స్త్రీలకు ఓటు హక్కు కానీ,ఆస్తి హక్కు కానీ లేదు. గమనిస్తే మన దేశంలో కూడా స్త్రీ దేవతారాధన ఉంది. శక్తి పూజలు ఉన్నాయి. మహాభారతాది ఇతిహాసాల్లో కొన్ని చోట్ల తల్లి నుండి వంశక్రమం చెప్పడం వంటిది ఉంది. అంటే ఒక సమాజంలో స్త్రీ దేవతల ఆరాధన ఉన్నంత మాత్రాన, తల్లి ద్వారా వంశక్రమం చెప్పినంత మాత్రాన, ఆ సమాజంలో స్త్రీ రాజ్య పాలనలో ఉందని చెప్పడానికి మానవ శాస్త్రంలో ఎక్కడా ఆధారాలులేవు. కాబట్టి తల్లి వంశ క్రమం ఉన్న సమాజాలు మౌలికంగా పితృస్వామ్య సమాజాలే అనే విషయం ఈ చర్చలో మరో కొత్త కోణాన్ని చేర్చింది.
అకడెమిక్ స్త్రీవాద ప్రపంచంలో ప్రధాన స్రవంతి విజ్ఞాన శాస్త్ర, మానవ శాస్త్త్ర ప్రపంచంలో ఎల్లర్ పుస్తకానికి అవసరమైనగుర్తింపు దొరికింది. ఐతే ఇక్కడ మరో చిక్కు ఉదయిస్తుంది. పురావస్తు ఆధారాలను వాటి సంకేతార్థాలతో సహా చదవాలా, లేక ప్రత్యక్షంగా నిరూపించగల సామాజిక నిర్మాణాలకే పరిమితం కావాలా? కొందరు చరిత్రకారులు, పురావస్తు శాఖ పండితులు⁵ ఎల్లర్ ని ఖండిస్తూ, గంబుటాస్ సిద్ధాంతాన్ని స్త్రీలు పురుషులను రాజకీయంగా పాలించిన వ్యవస్థగా మాత్రమే అర్థం చేసుకోవడం ఆమె ప్రతిపాదనను కుదించి చూపడమేనని విమర్శకులు వాదించారు. పురుషులను ఏలే ‘రాజకీయ మాతృస్వామ్యాన్ని’ (Female rulership) ఆమె ప్రతిపాదించలేదని, ఆమె కేవలం మాతృకేంద్రక (Matrifocal) లేదా మాతృవంశ (Matrilineal) సమాజాల గురించే మాట్లాడారనీ, ఎల్లర్ వాటన్నింటినీ కలిపేసి “మాతృస్వామ్య పురాణం” అని ఒకే లేబుల్ వేసి, తానే ఒక కల్పిత శత్రువును సృష్టించి ఓడించారని (Straw Man Argument) వాదించారు. ఈ వాదనలో నిజం లేకపోలేదు. స్త్రీ పురుష సమానత్వం ఉన్న చిన్న దేశం, విద్య ఒక లక్జరీగా కాకుండా జాతీయ అస్తిత్వంగా నిలుపుకున్న లుథియానియా వంటి చిన్న దేశంనుంచి వచ్చిన పురాతత్వ పరిశోధకురాలు గంబూసియాని అంత తేలికగా కొట్టి పరవేయడానికి ఏమీలేదు. ఓల్డ్ యూరోప్ సిద్ధాంతం, కుర్గాన్ హైపోథెసిస్ ల ద్వారా , వాటి పరిమితులు ఎంత ఉన్నప్పటికీ, ఆమె ప్రపంచ చరిత్ర దృక్కోణాన్నే మార్చడంలో ప్రముఖపాత్ర వహించారు అనడంలో సందేహం లేదు. “చరిత్రలో ఎప్పుడూ పితృస్వామ్యమే ఉండింది” అని చెప్పడం ద్వారా ఎల్లర్ తెలియకుండానే పురుషాధిక్యతను ఒక శాశ్వతమైన సత్యంగా మారుస్తున్నారనీ, మరిజా గంబుటాస్ చూపించిన వేలాది విగ్రహాల వెనుక ఉన్న లోతైన సంకేతాలను (Symbolism) అర్థం చేసుకోవడంలో ఎల్లర్ విఫలమయ్యారని కొందరు ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ వాద ప్రతివాదాలకు ఇప్పటికీ స్థానం ఉంది. శాస్త్ర సాంకేతికత పెరిగే కొద్ది ఈ రెండు వాదనలూ మరింత పదును తేలి అసలైన నిజమేంటన్నది బయటపడే అవకాశం ఉంది. ఐతే స్త్రీ వాద దృక్పథంలో సింథియా ఎల్లర్ తెచ్చిన మార్పు ఏమిటంటే, దీని తర్వాత స్త్రీవాదులు కూడా ‘మేట్రియార్కీ’ (Matriarchy – స్త్రీల అధికారం) ‘మేట్రిఫోకల్’ (Matrifocal – స్త్రీ కేంద్రకం) లేదా ‘ఇగాలిటేరియన్’ (Egalitarian – సమానత్వ సమాజం) వంటి పదాలను మరింత శాస్త్రీయమైన పదాలుగా వీటిని ఒకే భావనగా చూడకూడదనే స్పృహకు వచ్చారు. ఈ పుస్తకం గొప్ప అభినందనలు,తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, స్త్రీవాద ఉద్యమాన్ని మరింత వాస్తవిక (Realistic) మార్గంలో పెట్టడానికి సింథియా ఎల్లర్ కృషి ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఐతే చరిత్రను తెలుసుకోవడానికి వాస్తవిక మార్గం ఒక్కటేనా?. పురాతన మానవుల కళల్లోనూ, ఆచారాల్లోనూ ఉన్న సంకేత భాషను విస్మరించడం సరైనదేనా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మాతృస్వామ్యం అంటే కేవలం రాజకీయ పరమైన అధికారంగా మాత్రమే అర్థం ఎందుకు చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు మరిజా గంబుటాస్ తూర్పు యూరప్‌లో దొరికిన విగ్రహాల గురించి మాట్లాడిన సంకేతాలు (Symbolism), దేవిప్రసాద్ చటోపాధ్యాయ తన ‘లోకాయత’ (Lokayata) గ్రంథంలో భారతీయ ప్రాచీన సంస్కృతి గురించి వివరించిన సంకేతాలు ఒకే తాత్విక పునాదిపై నిలబడ్డాయా అన్న అనుమానం మనకు కలుగుతుంది. ఐతే వాటిని పక్కపక్కన ఫెట్టి అధ్యయనం చేయాల్సిన అవసరరం కూడా ఉంది. ప్రాచీన మనిషి దృష్టిలో స్త్రీ శరీరం, భూమి ఒకటే. స్త్రీ పిల్లల్ని కన్నట్లే, భూమి పంటలను ఇస్తుంది. తూర్పు యూరప్ తవ్వకాలలో దొరికిన స్థూలకాయ మహిళా విగ్రహాల పొత్తికడుపులపై తరచుగా విత్తనాలు, ధాన్యపు గింజల గుర్తులు చెక్కి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆ విగ్రహాలు కేవలం అందాల బొమ్మలు కావు, అవి “భూదేవి” (Earth Mother) కి సంకేతాలు. (ఐతే, ప్రాచీన స్త్రీ విగ్రహాలన్నీ మాతృదేవతలవేనని నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవని సమకాలీన పురావస్తు శాస్త్రం వాదిస్తుంది). అలాగే, స్త్రీ ఋతుస్రావానికీ, భూమి ఫలదీకరణానికీ ఉన్న సంకేత భాష ఈ సమాజాల ఆచార వ్యవహారాలలో కనబడటం చూస్తాం. అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో జరిగే ‘అంబుబాచి మేళా’ (దేవికి బహిష్టు అయ్యే పండుగ) ప్రాచీన మనిషి భావనలో స్త్రీ ఋతుస్రావానికి, భూమి పంటలు పండడానికి (Fertility) నేరుగా ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. దేవి ఉద్భవించినప్పుడు లేదా ఋతుస్రావం జరిగినప్పుడే భూమి ఫలవంతం అవుతుందని, ఎర్రటి రంగును సృష్టికి, రక్తానికి, పంటకు ప్రతీకగా చూశారని దేవిప్రసాద్ చటోపాధ్యయ వివరిస్తే, ఐరోపా విగ్రహాలపై అక్కడి ప్రాచీన గుహలపై ‘రెడ్ ఓకర్’ (Red Ochre – ఎర్రటి మట్టి రంగు) పూసి ఉండటం, చనిపోయిన వారి శవాలపై, విగ్రహాలపై ఎరుపు రంగును పూయడం అనేది ‘ఋతు రక్తం’ లేదా ‘జీవ రక్తం’ (Blood of Life) కు సంకేతమనీ, చనిపోయిన మనిషి మళ్లీ భూమి గర్భంలోకి వెళ్లి, ఆ రక్తం ద్వారా పునరుజ్జీవం పొందుతాడనే తాత్వికత అక్కడ ఉందనీ గంబూటాస్ వివరించారు. ఐతే ఈ అర్థీకరణను ప్రతి పురావస్తు సందర్భానికీ వర్తింపజేయలేం అనే జాగ్రత్త కూడా ఇక్కడ అవసరమౌతుంది. భారతదేశంలో తాంత్రిక ఆచారాలు, నృత్యాలు, గర్భధారణ ఆచారాలను ప్రతిఫలించాయి. స్త్రీ ఆచారం చేస్తే పంటలు బాగా పండుతాయనే నమ్మకాలు ఇక్కడి నుండే వచ్చాయి. అలాగే యూరప్ లో పక్షి, పాము ముఖంగల స్త్రీ విగ్రహాలు ఆకాశాన్ని భూమినీ కలిపే వర్షానికి, స్త్రీ పూజారులకి సంకేతాలన్నారు. అంటే మాతృస్వామ్య భావనని కేవలం రాజకీయ స్త్రీ అధికారంగా చూడటం ఎల్లర్ వంటి ఆధునిక పరిశోధకుల కొత్త ధోరణిగా పరిగణిస్తే, అసలుకి మాతృస్వామ్యం స్త్రీ జీవితాన్ని, ఆమె శరీరాన్ని, తమ వ్యావసాయక జీవితపు సాంకేతిక భాషగా చూసిన కాలంగా అర్థం చేసుకోవాలన్నది ఇక్కడి మనకు కలిగే కొత్త ఆలోచన. చరిత్ర పూర్వ మానవుడి భాషను సంకేతిక భాషగా చూడాలని, అది అతడి జీవితంలో ఆచారంలో నృత్యంలో సింబాలిక్ గానే వ్యక్యమవుతుందనే అవగాహన ఈ ఆలోచనకు ముఖ్యమైనది. కాబట్టి సింథియా ఎల్లర్ విమర్శను కానీ గంబూటాస్ సమర్థకుల వివరణలు కానీ శాస్త్రీయంగా స్థిరపడిన తుది నిర్ధారణగా స్వీకరించే దశలో మనం నేటికీ లేము. ఏ తొందరపాటు నిర్ధారణ ఐనా సత్యాన్వేషణకు అడ్డంకిలా మారకూడదు.
తాత్విక ముగింపు
పితృస్వామ్యాన్ని సహజమైనదిగా భావించిన సమాజాలు, దానికి భిన్నమైన గతాన్ని సూచించే సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేసి ఉండవచ్చనే ఏంగెల్స్ విమర్శ ఒకటైతే, పితృస్వామ్యానికి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న కొన్ని స్త్రీవాద ధోరణులు, గతంలో ఒక ఆదర్శప్రాయమైన మాతృకేంద్రక సమాజం ఉండేదనే భావనకు ఆకర్షితులై ఉండవచ్చనే ఎల్లర్ విమర్శ మరొకటి. ఒకటి సంప్రదాయ అధికార వ్యవస్థ తనకు అసౌకర్యమైన చారిత్రక వాదనలను నిర్లక్ష్యం చేయడం గురించి ఐతే మరొకటి విముక్తి లక్ష్యంతో ఉన్న ఉద్యమం తన ఆశయాలకు అనుకూలమైన గతాన్ని ఆదర్శీకరించే అవకాశం గురించి. ఒక అధికారాన్ని సమర్థించే సిద్ధాంతమైనా, అధికారాన్ని ఎదిరించే సిద్ధాంతమైనా, రెండింటినీ ఆధారాల ప్రమాణంతోనే పరీక్షించాలనే విషయాన్ని తెలుపుతున్నాయి. ఒకవాదన రాజకీయంగా ప్రగతిశీలమైన వాదన కాబట్టి అది స్వయంచాలకంగా శాస్త్రీయమైపోదు. అదే సమయంలో, దాని చారిత్రక ఆధారాల్లో లోపాలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఆ వాదన ముందుకు తెచ్చిన సమానత్వ లక్ష్యం ఏమీ అడుగంటి పోదు. ఒక సమాజంలో గతంలో సమానత్వం ఉండేదని నిరూపించలేకపోయినా, వర్తమానంలో సమానత్వం అవసరమనే వాదన బలహీన పడటానికి వీలు ఉండకూడదు.

గైనకోక్రసీ లేదా మాతృస్వామ్యమనే పద బంధం చుట్టూ బాచోఫెన్ నుండి ఎల్లర్ దాకా నూటా యైభై యేళ్ళుగా సాగిన, ఇంకా నేటికీ సాగుతున్న ఈ సుదీర్ఘ మేధోమథనం
మానవ సమాజాలని కొత్తగా మనకు చూపిస్తాయి. మానవసమాజాలు స్త్రీ లేదా పురుష ‘అధికార కేంద్రీకం’ గా మొదలయ్యాయా లేక, ‘సహజీవన కేంద్రీకృతం’ (Egalitarian/Co-existence) గా మొదలయ్యాయా అనేది నిరంతర ప్రశ్న. ఈ ప్రశ్నలో మూడో అవకాశాన్ని కూడా ఎప్పటికీ తెరిచే ఉంచాలి. మానవ మేధస్సు తన గతాన్ని ఎలా ఊహించుకుంది, తన గతాన్ని ఏ ఆధారాలతో నిర్మించుకుంది, అందుకై తనకు తాను ఎంత గతంలోకి వెళ్ళి చూడగలిగింది, ఎంతగా ఆధునికతను ఒడిసి పట్టుకుంది, వీటన్నింటితో తన వర్తమానాన్ని ఎలా అర్థం చేసుకుంది, సమర్థించుకుంది, ఎలా విమర్శించుకుంది, అలాగే తన భవిష్యత్తును ఎలా, ఏ సత్యాల ఆధారంగా నిర్మించుకుంటే బాగుంటుదన్నది నిరంతరం కొనసాగే ఒక అన్వేషణే. గతాన్ని తెలుసుకోవడమే అన్నింటికన్నా క్లిష్టమైనది. చారిత్రక ఆధారాలు, శాస్త్ర సాంకేతిక సహాయాలూ, సిద్ధాంతానికి కట్టుబడి ఉండిపోవడం, పిడివాదాలు, రాజకీయ ఆశయాలూ, లక్ష్యాలు ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నప్పుడు జరిపే ‘గతయాత్రలు’ సిద్ధాంతపరమైన పక్షపాతాలను సృష్టిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి తొందరపాటు లేకుండా, నిర్ణయాలకు రాకుండా, కొత్త ఆధారాల వెలుగులో సవరించుకునే వీలుగల శాస్త్రీయ దృక్కోణ విమర్శనా పద్దతితో అన్వేషించాలి.
foot notes:
⁴ పురాతన యూరోప్ భావనని గంబూటాస్ 1974లో ప్రచురించిన The Gods and Goddesses of Old Europe నుంచి, 1991లో వచ్చిన The Civilization of the Goddess వరకు అనేక రచనల్లో అభివృద్ధి చేసింది.
⁵ జోన్ మార్లర్ 2006లో రాసిన The Myth of Universal Patriarchy వ్యాసం, మాక్స్ దాషు రాసిన Knocking Down Straw Dolls విమర్శ — రెండూ ఎల్లర్ మాతృస్వామ్య భావనను నిర్వచించిన తీరును, గంబుటాస్ ఆలోచనలను ఆమె ప్రతినిధీకరించిన విధానాన్ని ప్రశ్నించాయి.



