దృష్టిని సరుకుగా మార్చిన డిజిటల్ పెట్టుబడిదారీ వ్యవస్థపై ఒక విశ్లేషణ
డి. ఉదయకిరణ్
డిజిటల్ యుగంలో సమాచారం మన చుట్టూ విపరీతంగా పెరిగిపోయింది. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ప్రపంచంలోని దాదాపు ఏ సమాచారాన్నైనా కొన్ని క్షణాల్లో మన ముందుకు తీసుకురాగలదు. కానీ మనం చూస్తున్న ప్రపంచం మొత్తం ప్రపంచం కాదు. మనకు కనిపిస్తున్నది, మన కోసం ఎంపిక చేయబడిన ప్రపంచం.
ఒకప్పుడు ఉదయాన్నే వార్తాపత్రిక చేతిలోకి తీసుకున్నప్పుడు ఏ వార్త మొదటి పేజీలో ఉండాలి, ఏ ఫొటోకు పెద్ద స్థానం ఇవ్వాలి, ఏ అంశాన్ని ప్రధాన వార్తగా ఎంచుకోవాలి అనే నిర్ణయాన్ని ఒక సంపాదకుడు తీసుకునేవాడు. పత్రిక కేవలం వార్తలను ముద్రించేది కాదు; ప్రజల దృష్టిని కూడా ఒక క్రమంలోకి తీసుకువచ్చేది.
నేడు పత్రిక స్థానంలో మొబైల్ స్క్రీన్ వచ్చింది. సంపాదకుడి స్థానంలో ఒక అల్గోరిథం నిలిచింది.
ఈ కొత్త సంపాదకుడికి కార్యాలయం లేదు. ముఖం లేదు. పేరు కూడా చాలామందికి తెలియదు. అయినప్పటికీ ప్రతిరోజూ కోట్లాది మంది ఏమి చూడాలి, ఏ వీడియో దగ్గర ఆగాలి, ఏ వార్త ముందుగా కనిపించాలి, ఏ రాజకీయ అంశం గురించి తెలుసుకోవాలి, ఏ సినిమా పాట వినాలి, ఏ వుస్తకం గురించి ఆసక్తి కలగాలి అనే ప్రక్రియలో అది కనిపించని సంపాదకుడిలా పనిచేస్తోంది.
కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, సినిమా పరిశ్రమ, పుస్తక ప్రచురణ సంస్థలు, విద్యా సంస్థలు, చిన్న వ్యాపారులు, కళాకారులు, ఉద్యమకారులు…అందరూ ఇప్పుడు ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు.
ప్రజల దృష్టిని ఎలా ఆకర్షించాలి?
ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ , ఎక్స్ (X) వంటి డిజిటల్ వేదికలు కేవలం సమాచార మాధ్యమాలుగా కాకుండా, సమాజంలోని కార్యకలాపాలను, అభిరుచులను, చర్చలను ప్రభావితం చేసే వ్యవస్థలుగా మారాయి. అందుకే ఈ వ్యాసం ఇన్స్టాగ్రామ్ గురించి మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో అల్గోరిథం అనే కొత్త సంపాదకుడు సమాజాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నాడో అర్థం చేసుకునే ప్రయత్నం.
ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెపాలి . AI (Artificial Intelligence), అల్గోరిథం రెండూ ఒకటి కావు. అల్గోరిథం అనేది ఒక నిర్దిష్ట పని చేయడానికి లేదా నిర్ణయం తీసుకోవడానికి కంప్యూటర్ అనుసరించే నియమాలు, దశలు, లెక్కల పదతి. AI అనేది డేటా నుంచి నేర్చుకుని అంచనాలు వేయగల విస్తృత సాంకేతిక వ్యవస్థ. AI లో అల్గోరిథంలు ఉపయోగించబడతాయి, కానీ ప్రతి అల్గోరిథం AI కాదు. ఈ వ్యాసంలో మనం ప్రధానంగా మాట్లాడేది మన ప్రవర్తనను విశ్లేషించి, మనకు ఏ సమాచారం లేదా కంటెంట్ కనిపించాలో ఎంపిక చేసే అల్గోరిథం వ్యవస్థ గురించి.
అల్గోరిథం అనేది కేవలం కంప్యూటర్ కోడ్ కాదు. అది ఒక ఎంపిక చేసే వ్యవస్థ. కోట్లాది పోస్టులు, విడియోలు, ఫొటోలలో మనకు ఏది ముందుగా కనిపించాలో అది నిర్ణయిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక పుస్తకం గురించి వెతికారు. దానికి సంబంధించిన ఒక రీల్ ను పూర్తిగా చూశారు. ఇంకో వీడియోను వెంటనే దాటేశారు. ఒక పోస్టును సేవ్ చేశారు. ఇంకొకదాన్ని స్నేహితుడికి పంపారు. మీకు ఇవన్నీ సాధారణమైన చర్యలే. కానీ ప్లాట్ ఫార్మ్స్ కు ఇవి మీ ఆసక్తిని అర్థం చేసుకునే సంకేతాలు. మీరు ఏ కంటెంట్ దగ్గర ఆగుతున్నారు, దేనిని వెంటనే దాటేస్తున్నారు, దేనిని ఎక్కువసేపు చూస్తున్నారు, దేనిని షేర్ చేస్తున్నారు, దేనిని సేవ్ చేస్తున్నారు అనే సమాచారాన్ని అది విశ్లేషిస్తుంది. ఆ ఆధారంగా తర్వాత మీకు ఎలాంటి కంటెంట్ ను చూపించాలో నిర్ణయిస్తుంది.అందుకే ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంస్టాగ్రామ్ తెరిచినా, వారికి కనిపించే కంటెంట్ ఒకేలా ఉండదు.
ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. మనం ఇన్స్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. కానీ అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ కూడా మన గురించి నేర్చుకుంటోంది. మన ఆసక్తులు, మన ప్రవర్తన, మనం ఏ విషయాలపై ఎక్కువగా స్పందిస్తున్నామన్నది ప్లాట్ ఫారం కు సంకేతాలుగా మారుతున్నాయి. అంటే అల్గోరిథం కేవలం మనకు కంటెంట్ ను చూపించే వ్యవస్థ కాదు. మన ప్రవర్తన నుంచి నేర్చుకుని, మనకు తదుపరి ఏమి చూపించాలో నిర్ణయించే వ్యవస్థ.
అయితే అల్గోరిథంలు ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నాయి?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం సాంకేతిక ప్రపంచం నుంచి రాజకీయ ఆర్థిక శాస్త్రం వైపు అడుగు వేయాలి.అమెరికన్ ఆర్థికవేత్త హెర్బర్ట్ సైమన్ చాలా కాలం క్రితమే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాడు. సమాచారం పెరిగే కొద్దీ మనిషి దృష్టి అరుదైన వనరుగా మారుతుంది. సమస్య సమాచారం కొరత కాదు. సమస్య మన దృష్టి కొరత.
నేడు ఈ ఆలోచన డిజిటల్ ప్రపంచానికి మరింతగా సరిపోతుంది. మన దృష్టి కోసం డిజిటల్ వేదికల మధ్య పోటీ జరుగుతోంది. మనం ఒక వీడియో దగ్గర మరో పది సెకన్లు ఆగినా, ఒక పోస్టును మరొకరికి పంపినా, ఒక పుస్తక సమీక్షను సేవ్ చేసినా, ఆ చర్యలు ప్లాట్ ఫారం ఆర్థిక వ్యవస్థలో విలువను సృష్టిస్తాయి. ఇక్కడ మన దృష్టి కూడా ఒక విలువైన వనరుగా మారుతుంది. దీన్నే Attention Economy గా పిలుస్తారు. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో కేవలం సరుకులు మాత్రమే అమ్మబడవు. మనం దేన్ని చూస్తాం అనేది కూడా ఒక మార్కెట్‌గా మారుతుంది. మనం స్క్రీన్ పై ఎంతసేపు ఉంటాం,దేనిని చూస్తాం, దేనితో ఇంటరాక్ట్ అవుతాం అనేవి ప్లాట్ ఫారం ల ఆర్థిక విలువతో ముడిపడతాయి.
ఈ మార్పు పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావంలో కూడా ఒక కొత్త దశను చూపిస్తోంది. ఒకప్పుడు కర్మాగారం ఉత్పత్తికి కేంద్రంగా ఉండేది. యంత్రాలు,ముడిసరుకు, కార్మిక శ్రమ అక్కడే కేంద్రీకృతమయ్యేవి. ఇప్పుడు డిజిటల్ వేదికలు మరో రకమైన ఆర్థిక మౌలిక వసతులుగా మారాయి.నిక్సిర్నస్క్(Nick Srnicek) దీనినే Platform Capitalism గా విశ్లేషించాడు. కంపెనీలు ఉత్పత్తులను మాత్రమే విక్రయించవు. ప్రజలు కలిసే వేదికలను నిర్మిస్తాయి. ఆ వేదికలపై జరిగే కార్యకలాపాలు, సేకరించబడే డేటా, ప్రజల దృష్టి అన్నీ ఆర్థిక విలువతో ముడిపడతాయి.
ఇక్కడ కార్ల్ మార్క్స్ ఆలోచనలు మరోసారి గుర్తుకు వస్తాయి. పారిశ్రామిక యుగంలో కార్మికుడి శ్రమ ద్వారా విలువ ఎలా సృష్టించబడుతుందో మార్క్స్ విశ్లేషించాడు. డిజిటల్ యుగంలో శ్రమ స్వరూపం భిన్నంగా కనిపించినప్పటికీ ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది.
నేడు కోట్లాది మంది ప్రతిరోజూ ఫొటోలు, వీడియోలు, వ్యాఖ్యలు, సమీక్షలు, మీమ్స్, రీల్స్ వంటి కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. మనం వీటిని వ్యక్తిగత వ్యక్తీకరణగా చూస్తాం. కానీ ఈ మొత్తం డిజిటల్ శ్రమ ప్లాట్ ఫారం లను సజివంగా ఉంచుతుంది. ప్రజలు ఎక్కువగా పాల్గొన్న కొద్దీ ప్లాట్ ఫారం కు మరింత సమాచారం లభిస్తుంది, మరింత లావాదేవీలు జరుగుతాయి, మరింత ప్రకటనల విలువ ఏర్పడుతుంది.
అయితే ఈ విలువ సృష్టిలో పాల్గొంటున్న వినియోగదారుడికి దానిలో ఎంత భాగం తిరిగి వస్తుంది?
పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రమ, విలువ, లాభం మధ్య ఉన్న సంబంధాలను మార్క్స్ విశ్లేషించిన ప్రశ్నలకు ఇది డిజిటల్ యుగం నుంచి వస్తున్న కొత్త ప్రశ్న. డిజిటల్ ప్లాట్ ఫారం లు ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన తర్వాత మరో ప్రశ్న ముందుకొస్తుంది. ఈ సంస్థల అసలు ఆస్తి ఏమిటి? కార్యాలయ భవనాలా? కంప్యూటర్ సర్వర్‌లా? లేక వినియోగదారులేనా?
షోషానా జుబాఫ్ (shoshana zuboff) దీనిని Surveillance Capitalism అనే భావనతో విశ్లేషించారు. మన డిజిటల్ కార్యకలాపాల నుంచి సేకరించే సమాచారాన్నిభవిష్యత్ ప్రవర్తనను అంచనా వేయడానికి ఉపయోగించవచ్చని ఆమె వివరించారు. మీరు ఒక వస్తువు గురించి వరుసగా వెతికితే, కొద్దిసేపటికే దానికి సంబంధించిన ప్రకటనలు కనిపించడం యాదృచ్చికం కాదు. మిగత చర్యల నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా మీ తదుపరి ఆసక్తిని అంచనా వేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే డేటా విలువ మనం ఏం చేశామో తెలుసుకోవడంలో మాత్రమే లేదు. మనం తర్వాత ఏం చేయబోతున్నామో అంచనా వేయడంలో కూడా ఉంది.
ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది?
చమురు భూమిలో ఉంటుంది. దాన్ని వెలికితీయాలి. కానీ డేటా మన రోజువారీ జీవితంలోనే ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రతి వీడియో, చదివే ప్రతి వ్యాసం, చేసే ప్రతి సెర్చ్, పంపే ప్రతి మెసేజ్, నొక్కే ప్రతి లైక్, చేసే ప్రతి షేర్… ఇవన్నీ కలిసి ఒక డిజిటల్ చరిత్రను నిర్మిస్తాయి.
ఈ నేపథ్యంలో నిక్ కౌల్డ్రి(Nick Couldry), ఉలిసిస్ ఏ. మేజియాస్(Ulises Mejias) వంటి పరిశోధకులు సమాచార వలసవాదం (Data Colonialism) అనే భావనను ప్రతిపాదించారు. ఒకప్పుడు వలసవాదం భూమి,ఖనిజాలు, సహజ వనరులను స్వాధీనం చేసుకుని సంపదను కేంద్రీకరించింది. నేడు డిజిటల్ వేదికలు మన దైనందిన జీవితాన్నే డేటాగా మార్చి దాని నుంచి విలువను సృష్టిస్తున్నాయని వారు వాదించారు. ఈ పోలికతో పూర్తిగా ఏకిభవించాల్సిన అవసరం లేకపోయినా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమాచారం ఎంత కేంద్రీయమైన వనరుగా మారిందో ఇది గుర్తు చేస్తుంది.
అంటే మనం డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ను ఉపయోగిస్తున్నప్పుడు కేవలం కంటెంట్ ను వినియోగించడం మాత్రమే జరగడం లేదు. మన ప్రవర్తన కూడా ఆర్థిక వ్యవస్థకు ఒక వనరుగా మారుతోంది.అయితే డిజిటల్ ప్రపంచాన్ని కేవలం మార్కెట్ కోణంలో మాత్రమే చూడలేం. ఈ మార్పు మన సంస్కృతిపై కూడా ప్రభావం చూపుతోంది.
సినిమా పరిశ్రమలో ఇదే పరిణామం కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందనను అంచనా వేసేవారు. ఇప్పుడు విడుదలకు ముందే సినిమా డిజిటల్ ప్రయాణం మొదలవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ , పాటలు, చిన్న వీడియోలు, నటీనటుల ఇంటర్వ్యూలు, అభిమానుల స్పందనలు… ఇవన్నీ సినిమా మార్కెటింగ్ లో భాగమవుతున్నాయి. నిర్మాతలు సినిమా మాత్రమే తీయడం లేదు. అది అల్లోరిథంల ప్రపంచంలో ఎలా ప్రయాణిస్తుందో కూడా ఆలోచిస్తున్నారు.
పుస్తకాల ప్రపంచంలో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు మంచి పుస్తకాన్ని రాయడం, ప్రచురించడం, సమీక్షలు రావడం, పుస్తక ప్రదర్శనల్లో పాఠకులను కలవడం చాలు అనుకునేవారు. నేడు బూక్స్టాగ్రామ్, బుక్ రీల్స్, రచయితల వీడియో సంభాషణలు, పాఠకుల సమీక్షలు కూడా ఒక పుస్తక ప్రయాణంలో భాగమయ్యాయి. ఒక పుస్తకం మరో పుస్తకంతో మాత్రమే పోటీ పడటం లేదు. అదే స్క్రీన్ పై ఒక సినిమా ట్రైలర్ తో, ఒక రాజకీయ వీడియోతో, ఒక వంట వీడియోతో, ఒక కామెడీ రీల్ తో కూడా పాఠకుడి దృష్టి కోసం పోటీ పడుతోంది.
ఇది ప్రచురణ సంస్థల ముందు ఒక కొత్త ప్రశ్నను నిలబెడుతోంది. మంచి పుస్తకాలను ప్రచురించడం మాత్రమే సరిపోతుందా? లేక వాటిని డిజిటల్ ప్రపంచంలో కనిపించేలా చేయడం కూడా ప్రచురణలో భాగమా?నాణ్యత అవసరం. కానీ నాణ్యత కనిపించకపోతే పాఠకుడిని చేరుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఈ మార్పును పెద్ద సంస్థలకే పరిమితం చేయలేం. ఒక చిన్న గ్రామంలోని కళాకారుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోగలుగుతున్నాడు. ఒక కొత్త రచయిత పెద్ద ప్రచురణ సంస్థ సహాయం లేకుండానే పాఠకులను సంపాదించగలుగుతున్నాడు. ఒక చిన్న వ్యాపారి భారీ ప్రకటనల ఖర్చు లేకుండానే తన ఉత్పత్తిని పరిచయం చేయగలుగుతున్నాడు.
డిజిటల్ వేదికలు ఈ అవకాశాలను నిజంగా విస్తరించాయి. కానీ మరో వాస్తవాన్ని కూడా గుర్తించాలి. వేదిక అందరికీ అందుబాటులో ఉన్నా, వీక్షకాదరణ అందరికీ సమానంగా దక్కదు. ఆ వీక్షకాదరణకు ఇప్పుడు అల్లోరిథమే మధ్యవర్తి.
ఇక్కడే ఇటాలియన్ ఆలోచనాపరుడు ఆంటోనియో గ్రామ్స్కి చేసిన పరిశీలన కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. సమాజంలో ఆధిపత్యం కేవలం రాజకీయ అధికారంతోనే ఏర్పడదని, సంస్కృతి ద్వారా కూడా నిర్మితమవుతుందని ఆయన వివరించాడు.
నేడు ఆ సంస్కృతిని ప్రభావితం చేసే ప్రక్రియలో అల్లోరిథంలు కూడా భాగమవుతున్నాయా?ఏ ఆలోచన ఎక్కువ మందికి చేరుతుంది? ఏది పదేపదే కనిపిస్తుంది? ఏది ప్రజా చర్చగా మారుతుంది?ఒక సినిమా పాట ఎందుకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వినిపిస్తుంది? ఒక పుస్తకం ఎందుకు వేలాది కొత్త పాఠకులను చేరుకుంటుంది? ఒక అంశం ఎందుకు జాతీయ చర్చగా మారుతుంది?ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేటప్పుడు అల్లోరిథంల పాత్రను పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు.
అయితే అల్లోరిథంను ఒక సర్వశక్తిమంతమైన వ్యవస్థగా కూడా చూడకూడదు. అది సమాజానికి వెలుపల ఉన్న శక్తి కాదు. సమాజం ఎలా స్పందిస్తుందో దాన్నుంచే నేర్చుకునే వ్యవస్థ. మనం ఏది చూస్తామో, ఏది పంచుకుంటామో, ఏది ఎక్కువసేపు చూస్తామో అవే దానికి సంకేతాలుగా మారుతాయి.కానీ ఒకసారి ఆ సంకేతాలను విశ్లేషించిన తర్వాత, మనలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు ప్రపంచాలను నిర్మించడం ప్రారంభిస్తుంది. అదే దాని శక్తి. అదే దాని పరిమితి.
ఇక్కడ ఫ్రెంచ్ తత్వవేత్త మిషెల్ ఫూకో చేసిన అధికారంపై విశ్లేషణ కూడా గుర్తుకు వస్తుంది. అధికారం ఎప్పుడూ చట్టాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా బలప్రయోగంలో మాత్రమే ఉండదు. మన దైనందిన జీవితాన్ని నిశ్శబ్దంగా క్రమబద్ధీకరించే వ్యవస్థల్లో కూడా అధికారం ఉంటుంది.ఆ కోణంలో అల్లోరిథంలను చూస్తే అవి మనకు ఆదేశాలు ఇవ్వవు. నిషేధాలు విధించవు. కానీ మనకు కనిపించే ప్రపంచాన్ని క్రమబద్ధీకరిస్తాయి.
మనకు ఏది ముందుగా కనిపించాలి? ఏది తర్వాత కనిపించాలి? ఏది ఎక్కువసేపు మన ముందుండాలి? ఏది కనిపించకుండానే మిగిలిపోవాలి? ఇవి కూడా అధికారానికి సంబంధించిన ప్రశ్నలే. అందుకే అల్లోరిథంను కేవలం సాంకేతిక వ్యవస్థ (Technical System)గా చూడటం సరిపోదు. అది మన దృష్టిని క్రమబద్ధీకరించే ఒక సామాజిక శక్తి కూడా.
ఈ మార్పును అత్యంత వేగంగా స్వీకరించిన రంగాల్లో రాజకీయాలు ఒకటి. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే సభలు, గోడపత్రికలు, కరపత్రాలు, పత్రికా ప్రకటనలు. ఇప్పుడు రాజకీయ ప్రచారం మొబైల్ స్క్రీన్ పైకి వచ్చింది.అన్ని రాజకీయ పార్టీలు చిన్న వీడియోస్ , రీల్స్, ప్రత్యక్ష ప్రసారాలు, మీమ్స్, వంటి డిజిటల్ కాంపెయిన్ ద్వారా ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రజలను ఆకర్షించే ప్రసంగం మాత్రమే కాదు, అల్లోరిథం దృష్టిని ఆకర్షించే కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగమైంది.
ఇక్కడే సోషల్ మీడియాలో రాజకీయ కమ్యూనికేషన్లో మరో సమస్య వస్తుంది.
ఎవరైనా ఒక రెచ్చగొట్టే ప్రశ్న అడుగుతారు. మనం వెంటనే సమాధానం ఇస్తాం. వాళ్లు మరో ప్రశ్న వేస్తారు. మనం మళ్లీ స్పందిస్తాం. చివరికి మనం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు చెప్పకుండా, ఇతరులు నిర్ణయించిన అంశాల చుట్టూనే మన సంభాషణ తిరుగుతుంది.
ఇది కేవలం రాజకీయ చర్చ సమస్య కాదు. అట్టెన్షన్ ఎకానమీ (Attention Economy) లో ఇది ఒక ముఖ్యమైన సమస్య. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతున్నారు అన్నదానికంటే, ప్రజలు దేనిపై మాట్లాడుతున్నారు అన్నదే ఎక్కువ విలువైనది. అందువల్ల ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మాత్రమే రాజకీయ కమ్యూనికేషన్ కాదు.
ఆ ప్రశ్న వెనుక ఉన్న కారణాలు ఏమిటి?దాని ద్వారా ఏ సమస్యను దాచిపెడుతున్నారు?ప్రజల దృష్టిని ఏ విషయం నుంచి మరొక విషయం వైపు మళ్లిస్తున్నారు? ఇవన్నీ బయటపెట్టాలి.
అంటే ఇతరులు నిర్దేశించిన ప్రతి అంశానికి ప్రతిస్పందిస్తూ ఉండటం కాకుండా, మనం చర్చించాల్సిన అసలు సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావాలి.ఇది డిజిటల్ ప్రపంచంలో అజెండా సెట్ చేయడంపై జరిగే పోరాటం కూడా.
Gen Z డిజిటల్ అల్గోరిథమిక్ ప్లాట్ ఫార్మ్స్ (Digital algorithmic platforms) లో పెరిగిన తరం. అందుకే మీమ్స్ , షార్ట్ వీడియోస్ , విజువల్ కమ్యూనికేషన్ , ఇంటర్నెట్ లాంగ్వేజ్ వంటి వాటిని తమ రాజకీయ వ్యక్తికరణలోకి తీసుకురావడం సహజంగా కనిపిస్తుంది. జులై మాసంలో లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన Gen Z విద్యార్థుల నిరసనల్లో ఇన్స్టాగ్రామ్, మీమ్స్, షార్ట్ వీడియోలు, విజువల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ లాంగ్వేజ్ వంటి డిజిటల్ రూపాలు నిరసనలో భాగమయ్యాయి. నిరసన స్థలంలో జరుగుతున్న పరిణామాలను అక్కడికక్కడే కంటెంట్ గా రూపొందించి, సోషల్ మీడియా ద్వారా విస్తరించడం ఈ తరం లో ఒక ప్రత్యేక లక్షణంగా కనిపించింది.
ఒకప్పుడు ఒక నిరసనకు ప్రజలను పిలవడానికి పోస్టర్లు , కరపత్రాలు , సమావేశాలు అవసరమయ్యేవి. ఇప్పుడు ఒక 30 సెకెన్ల చిన్న వీడియో కూడా ఒక పిలుపుగా పనిచేయగలదు.
అంటే సాంకేతికత కేవలం సమాచారాన్ని వేగంగా పంపించే సాధనం మాత్రమే కాదు; ప్రజలను చేరుకునే రాజకీయ సాధనంగా కూడా మారింది. అయితే ఒక ఉద్యమం వైరల్ కావడం, అది విజయవంతం కావడం రెండూ ఒకటి కాదు. అల్లోరిథం దృష్టిని తీసుకురాగలదు. కానీ ప్రజల భాగస్వామ్యం, రాజకీయ స్పష్టత, సంస్థాగత శక్తిని భర్తీ చేయలేదు.
అల్లోరిథం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాను పూర్తిగా తిరస్కరించాలా?
అది పరిష్కారం కాదు.
ఒక చిన్న గ్రామంలోని కళాకారుడు తన పనిని ప్రపంచానికి చూపించగలుగుతున్నాడు. ఒక కొత్త రచయిత పెద్ద ప్రచురణ సంస్థ అండ లేకుండానే పాఠకులను చేరుకోగలుగుతున్నాడు. ఒక చిన్న వ్యాపారి భారీ ప్రకటనల ఖర్చు లేకుండానే తన ఉత్పత్తిని పరిచయం చేయగలుగుతున్నాడు. సామాజిక ఉద్యమాలకు కూడా ఈ సాంకేతికత కొత్త అవకాశాలను తెరిచింది.
కాబట్టి ప్రశ్న సాంకేతికత మంచిదా, చెడ్డదా అనేది కాదు. దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు? ఏ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? అన్నదే అసలు ప్రశ్న.
సాంకేతికతను అర్థం చేసుకోకుండా దాని నుంచి దూరంగా నిలబడటం ఒక మార్గం కాదు. దాని స్వభావాన్ని, పరిమితులను అర్థం చేసుకుని, దాని అవకాశాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అవసరం. రేపటి భావజాల పోరాటం కేవలం పుస్తకాల్లో, సభల్లో, పత్రికల్లో మాత్రమే జరగదు. అది మొబైల్ Screen పైనా జరుగుతుంది.
అక్కడ ఒక ఆలోచన కొన్ని seconds లో వేలాది మందికి చేరవచ్చు. అదే వేగంతో తప్పుడు సమాచారం కూడా వ్యాపించవచ్చు. కాబట్టి వేగం మాత్రమే ముఖ్యం కాదు. దిశ కూడా ముఖ్యం.
ప్రజల దృష్టిని ఆకర్షించడం మొదటి అడుగు మాత్రమే. ఆ దృష్టిని ఆలోచనగా, ఆలోచనను చర్చగా, చర్చను ప్రజా భాగస్వామ్యంగా మార్చడం అసలు సవాలు. ఇక్కడే టెక్నాలజీ ని ఉపయోగించడం, టెక్నాలజీ చేత ఉపయోగించబడటం మధ్య తేడా తెలుస్తుంది. అల్లోరిథం మన దృష్టిని ఎటు తీసుకెళ్తుందో తెలుసుకోవాలి. అదే సమయంలో మనం ప్రజల దృష్టిని ఏ సమస్యల వైపు తీసుకెళ్లాలనుకుంటున్నామో కూడా నిర్ణయించుకోవాలి. ఇది అల్లోరిథంను జయించడం కాదు.దాని logic ను అర్థం చేసుకుని, దాని అవకాశాలను మన సామాజిక లక్ష్యాలకు ఉపయోగించుకోవడం.
ఒకప్పుడు సంపాదకుడు అందరికీ ఒకే మొదటి పేజీని రూపొందించేవాడు. నేడు అల్లోరిథం ప్రతి వ్యక్తికి వేర్వేరు మొదటి పేజీని రూపొందిస్తోంది. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు.ప్రజలు ప్రపంచాన్ని చూసే విధానంలో వచ్చిన మార్పు.అందుకే డిజిటల్ యుగంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే.
నేను ప్రపంచాన్ని చూస్తున్నానా? లేక అల్లోరిథం నాకు చూపిస్తున్న ప్రపంచాన్నే చూస్తున్నానా?
అల్లోరిథం చూపించే ప్రపంచాన్ని మాత్రమే చూడకుండా,
మనం చూడాల్సిన ప్రపంచాన్ని మనమే ప్రజల ముందుకు తీసుకురావడం అసలు సవాలు.
డి. ఉదయకిరణ్, 9490692552, dvpr1966@gmail.com
(ఈ వ్యాసం ‘మార్క్సిస్టు’ పత్రికలో ప్రచురింపబడింది)



