డా. యం. గేయానంద్
మధ్యయుగాలలో శాస్త్ర సాంకేతికాలలో జరిగిన అభివృద్ధి చాలా నిదానంగా జరిగింది. దీనికి కారణాలేమిటి? అని ఇర్ఫాన్ హబీబ్ ‘మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజి’ అనే పుస్తకంలో చివరి అధ్యాయంలో పరిశీలిస్తాడు.
1500 AD ప్రాంతాలలో ఉన్న టెక్నాలజీ స్థాయి, భారతదేశంలో ఎలా ఉంది? యురేషియాలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే భారతదేశం వెనుకబడి ఉందని భావించలేము. మధ్యయుగాలలో స్థానిక ఆవిష్కరణలతో పాటు, బయటి నుండి వచ్చిన సాంకేతికతలూ కన్పిస్తాయి. అయితే ఈ మార్పులు ఒకే స్థాయిలో లేవు. 13 – 15 శతాబ్ధాల మధ్య కాలంలో అనేక మార్పులు కనిపిస్తాయి.
(భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి ఏర్పడిన పరిమితుల గురించి చూద్దాం!)
మధ్యయుగాలలో అనేక యాంత్రిక సూత్రాలు భారతీయులకు తెలుసు. కొన్ని ముఖ్యమైన యాంత్రిక సూత్రాలను విదేశాల నుండి స్వీకరించారు. కానీ ఆ సూత్రాలను విడివిడి అవసరాలకే వాడుకున్నారు కానీ, వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించుకొని వాడలేదు. ఒక వృత్తిలో ఉపయోగపడిన ఒక సూత్రాన్ని, మరో వృత్తికి అనువర్తించుకోలేదు. కొన్ని సాధనాలు వ్యాప్తి కాకపోవడానికి కారణం కఠినమైన భౌగోళిక పరిస్థితులు కూడా. అయితే ఈ సాంకేతిక మార్పులన్నీ నత్త నడక నడిచాయి. యూరోపులో వస్తున్న సరికొత్త సాంకేతికతలకు భారతదేశం పెద్దగా స్పందించలేదు. అనుకరించడం కూడా పెద్దగా చేయలేదు.
అయితే, పనివాళ్ల నైపుణ్యం ఉన్నత స్థాయిలో ఉండేది. దేశీయ పరికరాలు మోటుగా ఉన్నా, ఆ లోపాన్ని ఈ నైపుణ్యం భర్తీ చేసేది. ఒక ముత్యాల పనివాడి పనితనం గురించి 17వ శతాబ్ధంలో ఒక ప్రస్తావన కన్పిస్తుంది. యూరప్‌లో కనిపెట్టిన కొత్త సాధనాల కంటే, సూరత్ ముత్యాల పనివాళ్ళ చేతిపని అబ్బుర పరిచాయని రాశారు. చీటీ గుడ్డలు, బంగారు – వెండి పనుల్లో కూడా ఇటువంటి పనితనం కన్పిస్తుంది.
అంటే ఆ కాలంలో నైపుణ్యం గల పనివారు, చౌకగా కావాల్సినంత మంది దొరికేవారు. కాబట్టి యంత్రాల అవసరం కనిపించలేదు. కొత్త పనిముట్ల అభివృద్ధి అవసరం కాలేదు. పెద్ద పెట్టుబడి పెట్టే అవసరం లేకుండా, ఖర్చులు తగ్గేట్టయితే కొత్త పనిముట్లు వాడారు. కలంకారీ బట్టలపై చేతులతో చిత్రించే బదులు, అద్దకపు అచ్చులు వాడిన ఉదాహరణ ఇటువంటిదే. కాని కాగితంపై అచ్చువేసే కొత్త పద్ధతిని భారతదేశం స్వీకరించలేదు.
అట్లే కళాత్మకంగా బట్టలు నేయడానికి లాగుడు మగ్గం భారతదేశంలో వాడి ఉండొచ్చు, అది ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. కాని మనం ఆ పరిజ్ఞానం స్వీకరించలేదు. జంటలుగా ఇద్దరేసి ధాకా నేతపనివారు కష్టపడుతూ నేసేవారు.
అయితే అందుబాటులో ఉన్న నిపుణులైన పనివారిని ఉపయోగించుకోవడం, యాంత్రిక సాధనాల కంటే లాభసాటి అనే భావన ఆనాడు ఉండేది. అదే సాంకేతికాభివృద్ధికి అడ్డంకి అయ్యింది.
హిందూస్థాన్‌లో అసంఖ్యాకంగా, అన్ని రకాల పనివాళ్లూ దొరుకుతారని 16వ శతాబ్ధంలో అనుకునేవారు. అయితే ఆ పనివాళ్ల కిచ్చే వేతనాలు తక్కువగా ఉండేవి. ఉత్పత్తీ తక్కువగా ఉండేది. వృత్తి కార్మికుడికి సొంత పనిముట్లు ఉండేవి. పోటీ ఎక్కువైతే, అతడు నైపుణ్యాన్ని మరింత పెంచుకునేవాడు కానీ, పనిముట్లు మెరుగు పరచుకొనేవాడు కాదు.
నైపుణ్యాల ప్రత్యేకీకరణ:
నైపుణ్యం అభివృద్ధి చేసుకోవడమంటే ఏమిటి? అది మరింత ప్రత్యేకీకరణకు (స్పెషలైజేషన్) దారి తీయడమే. ఈ ప్రత్యేకీకరణ అనేక కొత్త వృత్తులకు దారి తీసేది. ఆగ్రాలో వంద వృత్తులుండేవట. స్వర్ణకారులు, చిత్రకారులు, బట్టల మీద ఊలు కుట్టేవారు, తివాచీ తయారీదారులు, నూలు/పట్టు నేతకారులు, కమ్మరి పనివారు, రాగి పనివారు, దర్జీలు, కట్టుబడి మేస్త్రీలు, రాతి పనివారు, భవనాలను నిర్మించేవారు – ఇటువంటి వృత్తులెన్నో ఉండేవి. ఒక టంకశాలలో (1626 AD లో) నాణేల పునరుత్పత్తిదారులు, తూకందారులు, ఖనిజం కరిగింపుదారులు, స్వర్ణ ఫలక తయారీదారులు, లోహశుద్ధికారులు, కడ్డీలు పోతపోసేవారు, నగిషీ పనివారు, శుద్ధి చేసిన లోహం వేరుచేసేవారు, మదింపుదారులు, బంగారం వేరుచేసేవారు, వెండి వేరుచేసేవారు – లాంటి ప్రత్యేక పనులు (వృత్తులు) చేసేవాళ్ళు ఉన్నారని రాశారు.
కుల వ్యవస్థ ఇటువంటి ప్రత్యేకీకరణకు మూలాధారమైంది. ఇది నైపుణ్యాల పరిరక్షణకు ఉపయోగపడింది. కాని ఒక వృత్తికి మరొక వృత్తికి మధ్య సంపర్కం లేకపోవడంతో, ఒక పరిజ్ఞానం గురించి మరొకరు పట్టించుకోలేదు. దీనివల్ల ఒకరి నుండి మరొకరు కొత్త అంశాలను నేర్చుకొని, అన్వయించుకోవడం దాదాపు జరగలేదు. ఒక వృత్తికీ, మరో వృత్తికీ మధ్య సాంకేతిక సాధనాల వ్యాప్తి అరుదైపోయింది. ఇది సాంకేతిక పరిజ్ఞానాల మెరుగుదలకు అవరోధంగా మారింది. తండ్రులు తమ బిడ్డలు కుల వృత్తులు చేసుకుంటే చాలనుకొన్నారు, కానీ అంతకుమించి తమ జీవన పరిస్థితుల మెరుగుదల గురించి ఆలోచించలేదు.
అయితే సుదీర్ఘకాల వ్యవధిలో, ప్రత్యేకీకరణ వల్ల కులాల మధ్య పునర్ విభజన జరిగి కొత్త వృత్తులలోకి ప్రవేశించారు. 18వ శతాబ్ధం మొదట్లో మహారాష్ట్రలో దర్జీ కులం వారు అద్దకపు పని చేపట్టారు. అయితే వీరిలో ఒక తరగతి, నీలి రంగు అద్దకం కోసం వేరు పడ్డారు.
సమాజంలో వచ్చే ఆర్థిక మార్పులకు అనుగుణంగా సర్దుకుపోగల, ఇముడ్చుకోగల సామర్థ్యం కుల వ్యవస్థకు ఉంది కాబట్టే, అది నశించకుండా, తట్టుకొని నిలబడింది. అందుకే నైపుణ్యాల ప్రత్యేకీకరణ తెచ్చిన ఒత్తిడిని తట్టుకొన్నది. కానీ అదే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ప్రతికూలంగా మారింది.
లోపించిన ప్రేరణలు:
అంటే మధ్యయుగాలలో, దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ఆవిష్కరణలకు అంతర్గత ప్రేరణలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రేరణలు మామూలుగా అయితే ఉన్నత, ఉత్పత్తేతర, పాలక వర్గాల నుండి వచ్చి ఉండాలి. లేదా వర్తకుల నుండి వచ్చి ఉండాలి. కాని పాలకుల నుండి కానీ, వర్తకుల నుండి కానీ ఈ ప్రేరణలు రాలేదు.
ఒక ఉదాహరణ చూద్దాం. మొఘలులు మామిడి, నారింజ లాంటి పళ్ళను ఇష్టపడేవారు. ఆ తోటలను పెంచేవారు. అందుకోసం పర్షియన్ వీల్స్‌తో నీటి సదుపాయం కల్పించారు. విదేశీ తోటమాలుల్ని పిలిపించుకున్నారు. విదేశీ విత్తనాలు తెప్పించారు. అంటుగట్టి, పళ్ళ నాణ్యతను పెంచారు. అయితే ఇదే ఆసక్తి ప్రభు వర్గాల అదుపులోనే ఉన్నా కూడా ఉత్పత్తి ప్రక్రియలపై చూపలేదు. అక్కడ యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞానాలలో అభివృద్ధిని వారు పట్టించుకోలేదు. లేదా కార్ఖానాలు, గనులు, నౌకా నిర్మాణం లాంటి కార్యకలాపాలను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న వర్తకులైనా, ఇటువంటి పాత్ర తీసుకోలేదు.
ఆనాడున్న పరిస్థితులను ఒకసారి విశ్లేషిద్దాం. మధ్యయుగాల భారతదేశంలో ఉన్న పూర్వ పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో ఉత్పత్తి స్వల్పమే. అక్కడ పనిముట్లు ఎప్పుడూ పనివాడివే. రాచ కర్మాగారాలలో కూడా ఎవరి పనిముట్లు వారే తెచ్చుకునేవారు. ముడి సరుకు మాత్రమే యజమానిది. వర్తకుల ఆధీనంలో కూడా వజ్రాల గనుల్లో, జౌళి పరిశ్రమల్లో ఉత్పత్తి జరిగేది. వేలమంది పనివాళ్లు పనిచేస్తున్నా, ఒక్క సాధనం మీద కూడా వర్తకుడు పెట్టుబడి పెట్టేవాడు కాదు. గనుల్లో మంచినీళ్ళ బొక్కెనలు కూడా పనివారివే. నేతపనివారికి సరుకు, డబ్బు ముందస్తుగా ఇచ్చి పని చేయించుకున్నా, మగ్గాలు నేతపనివారివే. పెద్ద మగ్గాలు అవసరమైనప్పుడు, ఒకే ఒక సందర్భంలో ఈస్టిండియా కంపెని అడ్వాన్సులు ఇచ్చింది. అదీ, పనివారే మగ్గాలు కొనుక్కోవడానికి.
అట్లే నౌకా నిర్మాణ పరిశ్రమలో కూడా – భారతీయ పనివారు డచ్చి, ఇంగ్లీషు నౌకల డిజైన్లను చూసి, అద్భుతంగా కాపి చేసి, నౌకలను నిర్మించారు. యూరపులో వాడిన ఒక్క యంత్ర సాధనం కూడా వాడకుండానే నిర్మించారు. అంటే యూరప్ నుండి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వాడుకోలేదు.
కొన్ని పోలికలు:
ఇప్పుడొక ప్రశ్న వస్తుంది. 16వ శతాబ్ధంలో పశ్చిమ యూరపులో పాక్షికంగానైనా జరిగినట్టుగా, ఇక్కడి సమాజంలో మిగులు (surplus) లో ఒక వాటాను అదుపు చేసిన వర్గాలు, తామే సాంకేతిక పరికరాలను ఎందుకు సమకూర్చలేదు? మెరుగు పరచలేదు? ఆ విధమైన ఉత్పత్తి ప్రక్రియలో ప్రవేశించలేదు? – అనేవి ఆ ప్రశ్నలు.
అయితే పశ్చిమ యూరపులో 16వ శతాబ్ధం నుంచే ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాలపై, శాస్త్రీయ ఆలోచనల ప్రభావం పడింది. ఉత్పత్తి చేస్తూ పనివారు కనిపెట్టిన యాంత్రిక సూత్రాలను విజ్ఞానులు పరిశీలించి, వాటిని సమన్వయపరచుకొని, ఉత్పత్తికి కొత్తగా అన్వయించే ప్రయత్నం చేసేవారు. పారిశ్రామిక విప్లవం జరిగే నాటికి వృత్తుల సాంకేతికలు, సైద్ధాంతిక శాస్త్ర పరిజ్ఞానం, సన్నిహితం అయి, ఒకే వ్యవస్థగా రూపొందాయి.
అయితే భారతదేశంలో ప్రాచీన కాలం నుండీ కూడా ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, సైద్ధాంతిక శాస్త్రం, ఎప్పుడూ సన్నిహితం కాలేదు. 13వ శతాబ్ధంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశం జరిగినా, అప్పటికే అది విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. అక్బరు, ఆయన మంత్రి అబు ఫజర్ వంటి వారు కొన్ని సాంకేతిక ఆవిష్కరణలకు తోడ్పడినారు. స్వేదన క్రియ, తుపాకి గొట్టాలను నునుపు చేయడం, మొక్కజొన్నను పిండి పట్టడం, నీటి ఎత్తిపోతలు, చేతి తుపాకులు, ఫిరంగుల తయారీ, షిప్ కెమెల్, పెట్లుప్పుతో ఐసు తయారీ – లాంటి ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో, ఆవిష్కరించడంలో వారి పాత్ర కనిపిస్తుంది. అయితే వారు హేతువు మీద బేషరతుగా ఆధారపడి, ప్రోత్సహించలేదు. అంతేకాక వారికి సామాన్య మానవులు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాల పట్ల ఒక విముఖత కనిపించేది. అందుకే మొఘలుల కాలంలో కవిత్వం లాంటి కళలకు ఎంతో ఆదరం కన్పించినా, వ్యవసాయం మీద కానీ, చేతివృత్తుల మీద కానీ ఒక్క పుస్తకమైనా రాలేదు.
అయితే ఈ పరిస్థితి చైనాలో కూడా కనపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానాలపై సుదీర్ఘకాలం అనేక ప్రాచీన విజయాలు సాధించిన చైనా కూడా, యూరపులో జరిగిన శాస్త్ర సాంకేతిక పరిణామాల లాంటివి జరగలేదు.
యూరపులో 16 – 17 శతాబ్ధాల నాటి శాస్త్రీయ విప్లవంలో, ఆనాటి సాంకేతిక ప్రయోగాలకు అవసరమైన పెట్టుబడి రాశి విస్తరించడంలో, యూరప్ ముందంజ కనిపిస్తుంది. ఈ పెట్టుబడి ఎక్కడి నుండి వచ్చింది? యూరపులో అంతర్గత వాణిజ్య అభివృద్ధి ద్వారా, విదేశాల నుండి వలస వాద దోపిడీ ద్వారా వచ్చిన పెట్టుబడి ఇది.
సారాంశం:
కుల వ్యవస్థలో వృత్తులు ఘనీభవించడం. వృత్తుల ప్రత్యేకీకరణ కూడా కులాలుగా సర్దుకోవడం. దానివల్ల వృత్తుల మధ్య ఉండాల్సిన సాంకేతిక ఆదాన ప్రధానాలు లోపించడం. దాని ద్వారా సాంకేతిక విజ్ఞానాల మధ్య ఉండాల్సిన ఒక సంపర్కం, సంభాషణ – లు లోపించడం. ఈ కారణాల వల్లే భారతదేశంలో మధ్యయుగ సాంకేతిక పరిజ్ఞానాలు ముందుకు పోలేదు. అంటే వృత్తుల ఉత్పత్తి వ్యవస్థలో ఏ కులానికి, ఆ కులం విడివిడిగా ఉండిపోయింది. సాంకేతిక విజ్ఞానంలో కొత్త ఆలోచనలకు అవసరమైన అంతర్గత ప్రేరణలు లేకుండా పోయాయి. అట్లే – బయట నుండి కూడా అవసరమైన ప్రేరణలు రాలేదు. రాజులు, కులీన వర్గాలు, వ్యాపారుల నుండి కూడా సాంకేతిక అభివృద్ధికి అవసరమైన ప్రేరణలు, ప్రోత్సాహం కొరవడింది. పనివాళ్ల పనిముట్ల అభివృద్ధికి కూడా అవసరమైన తోడ్పాటును అందించలేదు. మిగులును సొంతం చేసుకున్న వర్గాలు కూడా మానవ శ్రమ చౌకగా దొరుకుతున్నప్పుడు, సాంకేతికాభివృద్ధి అనవసరమని అనుకున్నట్టు కనపడుతుంది. అక్కడక్కడా కొంత సాంకేతిక పురోగమనం కన్పించినా, అది హేతుబద్ధత ఆధారంగా జరగలేదు. పైగా పాలక వర్గాలకు సాధారణ ప్రజల విజ్ఞానం పైన చిన్నచూపు ఉండేది.
(మధ్యయుగాలలో సాంకేతికతలపై ప్రఖ్యాత చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ రాసిన మోనోగ్రాఫ్ నుండి సరళీకరించి, క్లుప్తీకరించబడింది. ఇతర సోర్సుల నుండి కొన్ని అంశాలు తీసుకున్నా అది 10 – 15 శాతానికి మించదు. తెలుగులో 112 పేజీలున్న ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి ప్రచురించింది. గత నాలుగైదు సంచికలలో వచ్చిన వ్యాసాలకు కూడా ఆధారం ఈ పుస్తకం.)
వచ్చే నెల… యూరప్‌లో మలి మధ్యయుగాలలో ఏం జరిగిందో చూద్దాం.



