డా. యం. గేయానంద్

మధ్యయుగాల నాడు ఉన్న కొన్ని సాంకేతిక విజ్ఞానాల గురించి మాట్లాడుకొందాం. లోహాల గురించీ, కొన్ని వృత్తుల గురించి, కట్టడాల గురించీ మాట్లాడుకొందాం. వీటన్నింటిలో ఉన్న సాంకేతికతలు, అనుభవ విజ్ఞానం ద్వారా నేర్చుకొన్నవే. కొన్ని విదేశాల నుండీ స్వీకరించినవి. అయితే చాలా అంశాలలో అవసరమైన వేగం, చురుకుదనం కనిపించదు. దానికి ఆనాడున్న సామాజిక పరిస్థితులే కారణం కావచ్చు.

లోహాల గురించి మాట్లాడుకోవాలంటే ముందు గనుల గురించి మాట్లాడుకోవాలి.

గనులు:
గనుల నుండి లోహాల సంగ్రహణం చాలా ప్రాచీనమైనది. రాజస్థాన్ జవార్ గనుల నుండి వెండి, సీసం కోసం తవ్వకాలు జరిగేవి. ఈ ఖనిజాలతో పాటు, క్షయీకరణ రసాయన చర్య ఫలితంగా తుత్తునాగం (జింకు) కూడా దొరికేది. దీన్ని ఇత్తడి తయారీలో వాడేవారు. అయితే ఇదంతా క్రీ.పూ. తొలి శతాబ్ధం రెండో భాగం నాటిది. ఆ తరువాత మరో వెయ్యి సంవత్సరాలు ఈ గనుల గురించి మనం పట్టించుకోలేదు. 

మళ్ళీ జవార్ గనులలో తాజా తవ్వకాలు ప్రారంభమైంది 13, 14 శతాబ్ధాలలోనే. అయితే ఈసారి జింకు ఉప ఉత్పత్తి కాదు. అది ప్రధానమైన ఉత్పత్తి. స్వేదన పద్ధతిలో ఈ ఖనిజం నుండి స్వచ్ఛమైన లోహాన్ని వేరు చేశారు. మధ్యధరా ప్రాంతం నుండి వచ్చిన స్వేదన (సెంటు ఉత్పత్తిలో వాడేవారు) బట్టీల ప్రేరణతో జింకు స్వేదన ఉత్పత్తి జరిగి ఉంటుంది. కాని జింకుతో మిశ్రమ లోహాల తయారీ జరిగింది బహుశా 18వ శతాబ్ధంలోనే.

మధ్యయుగాలలో గనుల కోసం భూగర్భంలో ఎక్కువ లోతులకు వెళ్ళాలంటే కష్టమయ్యేది. లోతులకు వెళితే భూగర్భ జలాలు వూరుతాయి. వాటిని తోడెయ్యడానికి పెద్దగా సామాగ్రి ఉండేది కాదు. బావుల నుంచి నీళ్ళు తోడే గిలకలు వారికి తెలుసు. కానీ వాటిని కూడా వాడినట్టు కనిపించదు. మనుషులు బకెట్లతో ఒకరి నుండి మరొకరు అందుకుంటూ తోడి పోసేవారు. ఉప్పు గనులు, వజ్రాల గనుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. మొఘలుల కాలంలో కూడా ఇదే పరిస్థితి.

ఇనుము:
మధ్యయుగాలలో ఇనుము ముఖ్యమైన ఖనిజం. ఉప్పు తరువాతి స్థానం ఇనుముదే.  క్రీ.పూ.800 లో ఉత్తర భారతంలో ఇనుము విస్తారంగా వాడారు. కర్భనం చేర్చడం ద్వారా ఇనుమును గట్టి పరచవచ్చు అనేది అర్థమైన తర్వాతే ఇది సాధ్యమైంది. క్రీ.శ.400 నాటికి దృఢమైన దుక్క ఇనుముతో తుప్పు పట్టని స్తంభాలు (కుతుబ్‍మినార్, మెహ్రోలి పిల్లర్) తయారు చేశారు. 13వ శతాబ్ధానికంతా మన ఇనుముకు చాలా ప్రఖ్యాతి వచ్చింది. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కర్భనంతో కలిపి చేసిన ఉక్కును దృఢమైన ఖడ్గాలకు వాడేవారు. దీనికి విదేశాలలో ఎంతో పేరు ఉండేది. ఊట్జ్ ఉక్కు అనే పేరుతో ఇది యుద్ధతంత్ర, విజ్ఞాన శాస్త్ర రచనలలో కూడా స్థానం సంపాదించుకొంది. నగిషీ ఉక్కు తయారీపై కూడా సాహిత్యంలో చాలా ప్రస్తావనలు కనిపిస్తాయి.

ఈ ఉక్కును తయారుచేసే ప్రక్రియ ఏవిధంగా ఉండేదంటే.. గాలి తిత్తులతో బొగ్గుల కొలిమిని మండించి, ఇనుము కడ్డీలను తీవ్రంగా వేడి చేసేవారు. ఇనుముతో బొగ్గు కలిసేది. ఈ గట్టిపడిన ఇనుముతో కత్తిని తయారు చేసేవారు. చక్రంతో కత్తి అంచులకు పదును పెట్టేవారు. చివర్లో ద్రాక్షరసం (వెనిగర్) పూసేవారు. అనుభవాల ద్వారా వచ్చిన జ్ఞానం ఇది.

15వ శతాబ్ధం చివరి కొచ్చేసరికి భారతీయ ఇనుముకు దేశదేశాల్లో డిమాండ్ ఉండేది. తుపాకీల తయారీ కోసం ఇక్కడి ఇనుము వారు వాడేవారు. అందుకు భారీస్థాయిలో ఇనుమును ఉత్పత్తి చేయాలి. అందుకు ఇనుమును కరిగించే, పోతపోయాల్సిన పెద్దపెద్ద మూసలు ఉండాలి. ఇదొక అవసరం కానీ ఆ మూసలను స్థానికంగా తయారు చేసుకోలేకపోయారు.

ఇనుమును కరిగించాలంటే భారీ కొలుముల్లో, భారీ ఉష్ణోగ్రతలు సాధించాలి. ఇనుము ద్రవీభవన స్థానం చాలా ఎక్కువ. 1535OC దగ్గర ఇనుము ద్రవీభవిస్తుంది. అలా కరిగిన ఇనుమును మూసలోకి పోసి పోత పోస్తారు. ఆనాటి కొలముల్లో అంతంత ఉష్ణోగ్రతలు సాధించడం కష్టంగా ఉండేది.  బర్రె తోలు తిత్తులను వాడి, చేతిలో ఆడించి, పంపించే గాలి సరిపోయేది కాదు.

అయితే యూరోపు వాళ్ళ తుపాకులు, ఓడ లంగర్ల తయారీకి మన ఇనుము కావాల్సి వచ్చేది. కాబట్టి ఇనుము పోత పని ఏదో ఒకస్థాయిలో ఇక్కడ జరుగుతూ ఉండేది. అయితే అది అంత నాణ్యంగా ఉండేది కాదు. తరువాతి కాలాలలో కూడా ఈ పోత పరికరాలు పెద్దగా మెరుగుపడలేదు. క్రమంగా యూరోపుతో మనం పోటీ పడలేకపోయాము.

కొన్ని ఇతర సాంకేతికతలు:
మధ్యయుగాలలో మన దేశంలో ఉన్న కొన్ని చేతి పనిముట్ల గురించి చూద్దాం. రంధ్రాలు వేయడానికి వాడే బరమాలను వడ్రంగులు, వజ్రాలు పనివారు వాడేవారు. కత్తులకు సానబెట్టే ఆకురాయి చక్రాలను చేతితో తిప్పేవారు. 17వ శతాబ్ధం వచ్చేసరికి బెల్ట్ డ్రైవ్‍ను ను బరమాలకు జోడించారు. ఇంతకుముందు కాలాలలో రాట్నంలో వాడిన బెల్ట్ డ్రైవ్‍ను ఇక్కడ కొత్తగా వాడారు. ఈ బెల్ట్ డ్రైవ్‍ను వజ్రాలకు సానబెట్టే బరమాలకు వాడేవారు.

కానీ యూరప్‍లో అప్పటికే గుర్రాల శక్తితో, నీటి శక్తితో పనిచేసే తరిమెణ (లేత్) లు, బరమా (డ్రిల్లు) లు విస్తృతంగా వాడకంలోకి వచ్చాయి. స్క్రూలు, స్ప్రింగులు ఆవిష్కరింపబడ్డాయి. కాని మనకు ఇటువంటి పరిజ్ఞానాలు అందుబాటులో లేవు. స్క్రూలు, స్ప్రింగులు సమకూర్చ గలిగిన నాణ్యత, దృఢత్వమూ మన సాంకేతికతలలో లేకపోయింది.

సాల్డరింగ్ (కరిగించడం), రివెటింగ్ (మేకుల కొసలు సవక గొట్టడం), వెడ్జ్ ఫిట్టింగ్ (చీలికలో ఇరికించడం) లాంటి ప్రక్రియలు యూరోపులో మధ్యయుగాలలో ఉన్నాయి. ఒక లోహాన్ని, మరో లోహంతో అనుసంధానించడానికి ఈ సాంకేతికతలు పనికి వచ్చాయి. కాని 16వ శతాబ్ధం మధ్యలో ఈ ప్రక్రియలన్నింటి స్థానంలో మరమేకు వాడుకలోకి వచ్చింది. కానీ మన దేశంలో మేకుకు లోహపు తీగను సర్పిలాకారంలో చుట్టి, దాన్నే మరలాగా తిప్పేవారు. అయితే ఇది బలహీనమైన అనుకరణ. సాంకేతికమైన ముందడుగు కాదు.

స్ప్రింగు చాలా ముఖ్యమైన సాధనం. 14వ శతాబ్ధంలోనే యూరోపులో చుట్ట స్ప్రింగులు అభివృద్ధి చేసారు. కాని యూరోపు స్ప్రింగు (చుట్ట స్ప్రింగు, సర్పిల స్ప్రింగు) లను భారతీయ లోహకారులు పట్టించుకున్నట్టు కనిపించదు. భారతదేశంలో దూదిని ఏకే ఏకుబద్దలు ఎప్పట్నించో వాడకంలో ఉన్నాయి. అట్లే బాణాలు వేసే విల్లు మరింత ప్రాచీనమైనది. వీటిలో స్ప్రింగు సూత్రం ఉన్నా, స్ప్రింగును మనం  అభివృద్ధి చేసుకోలేకపోయాము. యూరోప్ గడియారాలలో వాడిన స్ప్రింగ్-డ్రైవ్ ను కూడా మనం పట్టించుకోలేదు.

అట్లే మరొకటి – సిరంజి. హోలీ పండుగ నాడు వెదరు బొంగులతో ఎర్రటి రంగులు చిమ్ముకున్నట్టుగా 16వ శతాబ్ధం చివర్లో ఒక వర్ణన కనిపిస్తుంది. బహుశా మన దేశంలో సిరంజి ఉనికికి ఇది తొలి ఆధారం. ప్రాచీన కాలంలో గ్రీకులకు, మధ్యయుగాల్లో ఇరాన్ కు సిరంజి తెలుసు. కానీ మన దేశంలో దీని వాడకం 15, 16 శతాబ్ధాల నుండే కన్పిస్తుంది. చైనా, యూరోపులలో అప్పటికే తెలిసిన పిస్టన్ వాడకం మనకు తెలియదు.

14, 15 శతాబ్ధాలలో ముస్లింలు కళాయి వేసే ప్రక్రియను తెచ్చారు. దీనితో తగరపు కళాయి వేసి రాగి పాత్రలను వంట పాత్రలుగా వాడుకోవడం సాధ్యపడింది. ఇది భారతీయుల ఆవిష్కరణే.

బంగారు, వెండి:
మధ్యయుగాలలో అద్భుత నైపుణ్యాలున్న బంగారు పనివారు ఉండేవారు. యూరోపు పనివారికంటే వీరి నైపుణ్యాలు ఎక్కువే. బాగా సాగగొట్టిన బంగారు రేకుల్ని ఇతర లోహాలపై అతికించి, నగిషీ చెక్కేవారు. అయితే, బంగారు మలాము పూయడం అనే పద్ధతి భారత దేశంలో తెలియదు. అయితే యూరోపు నుండి తెప్పించిన రంగురంగుల గాజు పొడి లాంటి పదార్థాన్ని, వేడి చేసి ద్రవంగా మార్చి, నగిషీ చెక్కిన బంగారానికి పూత పూసేవారట (1739 AD).

మొఘలుల కాలంలో టంకశాలల్లో బంగారు, వెండి, రాగి నాణేలను జారీ చేసేవారు. ఒకేరీతిన బరువు (11.5 గ్రాములు) ఉండే, అధిక స్వచ్ఛత గల వెండి నాణేలను వేల కొద్దీ తయారు చేసేవారు. అయితే యంత్రాలు ఉండేవి కాదు. పనివారే స్వయంగా ముద్ర వేసి, కత్తిరించేవారు. ఎంతో గొప్ప వ్యక్తిగత నైపుణ్యం, శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇదంతా కూడా మానవాధారిత శ్రమ, నైపుణ్యాలతోనే జరిగేవి. విదేశాల నుండి వచ్చిన వెండి డాలర్లను కూడా కరిగించి, కటింగ్, స్టాంపింగ్‍లతో నాణేలుగా మార్చేవారు. యూరోపులో అప్పటికే ముద్రణా యంత్రాలు, యంత్ర సామాగ్రి ఉన్నాయి, కాని మన దేశంలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

నిర్మాణ పరిశ్రమ:
సింధూ నాగరికత (2100 – 1900 BC) నాటికే కాల్చిన ఇటుకలు ఉన్నాయి. అధునాతన  తరహాలో ఉన్నట్టు కన్పించే ఆ కూర్పులు ఆశ్చర్యం కల్పిస్తాయి. స్తంభాలు వాడి కట్టిన కట్టడాలు అశోకుడి కాలంలో కనిపిస్తాయి.

7వ శతాబ్ధం తరువాత ఎల్లోరా, ఎలిఫెంట్ గుహలు నిర్మించారు. కాని అవి శిలలను తొలచి నిర్మించినవి. ఆ తరువాత కాలాలలో రాతి దిమ్మెలు, స్తంభాలతో (పిల్లర్ & బీం) నిర్మించే పద్ధతి ప్రధానంగా ఉంది. పెద్దపెద్ద రాతి దిమ్మెలను అతికించడానికి ఇనుప క్లాంపులను వాడేవారు. ఇతరత్రా పదార్థాలు వాడి అతికించే విధానాలు బహుశా వారికి తెలియవు. 5వ శతాబ్ధం తరువాత కొన్ని ఆలయాలలో వంపు వలయాల నిర్మాణాలు కనిపిస్తాయి. కానీ ఒండ్రు, బురదను అతికింపుకు వాడటం వల్ల అవి బలహీనంగా ఉండిపోయాయి.  

మధ్యయుగాల్లో కట్టడాలు, నిర్మాణాలు ఎలా ఉండేవి?

13వ శతాబ్ధంలో నిర్మాణ పద్ధతులలో మార్పు కనిపిస్తుంది. కాల్చిన ఇటుకలు, గలస (rubble), సున్నము, జిప్సం వాడటం ప్రారంభమైంది. నిజానికి సున్నం గురించి ప్రాచీన కాలాలలో తెలిసింది తక్కువే. సింధూ నాగరికత కాలంలో జిప్సం వాడినా, తరువాత దాన్ని మరచిపోయారు. సున్నాన్ని రోమన్ సామ్రాజ్యం, బైజాంటియన్ కాలాలలోనే వాడినట్టు (Mortar and plaster గా) కన్పిస్తుంది. ఇరాన్, ససావిడ్ కాలంలో జిప్సంను వాడారు. వీరిని జయించిన అరబ్‍లు 7వ శతాబ్ధంలోనే జిప్సం, సున్నం వాడకం నేర్చుకున్నారు. కానీ మన దేశంలో ఈ సాంకేతికలు వాడటానికి చాలా కాలం పట్టింది. 13వ శతాబ్ధంలో ఢిల్లీ సుల్తానుల కాలానికి వీటి వాడకం ఒక కొలిక్కి వచ్చింది. కాని కొన్ని చోట్ల పాత పద్ధతులు కూడా చాలాకాలం కొనసాగాయి. ఉదాహరణకు విజయనగర కట్టడాలలో (1530 AD) సున్నాన్ని వాడలేదంటారు.

మొఘలుల కాలం వచ్చేసరికి సున్నం, జిప్సం విరివిగా వాడారు. వంపుగా కట్టే నిర్మాణాలకు (ఆర్చీలు), ఇవి అవసరం. ఢిల్లీ సుల్తానులకు ముందు నిర్మాణాల శైలి దూలాల తరహా శైలిలో ఉండేది.

13వ శతాబ్ధంలో దేశంలోకి ప్రవేశించిన ఆర్చి నిర్మాణాలు బైజాంటియన్, ససావిడ్ (ఇరాన్) నిర్మాణ శైలుల సమ్మేళనంగా చూడొచ్చు. ఇది స్థిరపడటానికి ఒక శతాబ్ధం పట్టింది. అప్పటిదాకా వాడిన పెద్దపెద్ద రాతి దిమ్మెల స్థానంలో ఇటుకలు, గులక రాళ్లు, చిన్న చిన్న రాతి బండలతో నిర్మాణాలు సాధ్యమయ్యాయి. నిర్మాణ వ్యయాలు తగ్గడంతో 14వ శతాబ్ధంలో ఢిల్లీలో భవన నిర్మాణాలు వేగంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో చేతి వృత్తుల నిపుణులు, తాపీ పనివారు తయారయ్యారు. సున్నం కాల్చే పని లాంటి కొత్త వృత్తులు వచ్చాయి.

నిర్మాణాలలో లాగుడు యంత్రాలు అవసరం. ఏదైనా కట్టాలంటే భారీ వస్తువులను పైకెత్తాలి. 14వ శతాబ్ధంలో కాప్‍స్టన్ (నిటారు ఇరుసు తిరుగుడు యంత్రం) లాంటివి వాడినట్టు కన్పిస్తుంది. ఇది కొయ్యలతో, తాళ్ళతో చేసిన యంత్రం. అలాగే నౌకలను లాగడానికి ఇటువంటి యంత్రాలను వాడి వుండొచ్చు (1679 AD).

నిర్మాణ రంగంలో శ్రమ తగ్గింపు సాధనాల అవసరం ఉంటుంది. చక్రాల తొట్టి అటువంటిదే. చైనాలో (క్రీ.శ. 3వ శతాబ్ధం) యూరోపులో (13వ శతాబ్ధం) ఇది కన్పిస్తుంది. భారతదేశంలో వలస పాలకులు వచ్చేదాకా ఇది కన్పించదు.

మొఘలుల కాలంలో సాంకేతికంగా నిర్మాణ రంగంలో మౌలిక మార్పులేవీ పెద్దగా రాలేదు. అయితే ఒక విషయంలో మాత్రం నూతన ఆవిష్కరణ చేశారనవచ్చు. అది – ముందస్తు కూర్పు నిర్మాణాలు (ప్రీ – ఫాబ్రికేటెడ్). కొయ్య స్తంభాలు, దూలాలు, చెక్క పలకలతో, ఇనుప తొడుగులతో, వెదురుతో అల్లిన తడకలతో గృహాలను అంతస్తులుగా నిర్మించారు. వీటిని అవసరమైనప్పుడు, దేనికదే విడగొట్టుకొని తీసుకుపోవచ్చు. ఇటువంటి సంచార కొయ్య గృహాలు అక్బర్ కాలంలో (1579 లో) ఉండేవి. తరువాత 17వ శతాబ్ధంలో వాటినే బంగ్లాలు అని అన్నారు.

ముగింపు:
మధ్యయుగాల్లో భారతదేశంలో హస్త నైపుణ్యాలకే ప్రాధాన్యత ఉండేది. ఎంతటి పనినయినా శారీరక శ్రమతోనో, హస్త నైపుణ్యంతోనో పూర్తి చేసేందుకే ప్రయత్నించారు. యాంత్రిక సూత్రాలను అన్వయించడానికి, శ్రమను తేలిక చేసుకోవడానికి తక్కువ ప్రయత్నాలే జరిగాయి. విదేశాల నుండి కూడా వచ్చిన సాంకేతికతలను చాలా వాటిని పట్టించుకోలేదు. ఇందుకు చాలా కారణాలున్నాయి. వాటిని ముందు ముందు చూద్దాము.       

{ఈ వ్యాసంలో ఉన్న విషయాలు – ఇర్ఫాన్ హబీబ్ రాసిన ‘మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ’ – అనే మోనోగ్రాఫ్ నుండి స్వీకరించబడినవి.}

(వచ్చే నెల – మధ్యయుగాల సాంకేతికతలు – వృత్తులూ, యుద్ధాలూ, ప్రయాణాలు గురించి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *