డా.గేయానంద్
భారతదేశ చరిత్రలో 12వ శతాభ్ధాన్ని ఒక మలుపుగా చూస్తారు. ఉత్తర భారతదేశంలో టర్కు-ఆఫ్గానుల ఆక్రమణలు ప్రారంభమైంది 1192 AD – 1206 AD ల కాలంలోనే. అప్పటికే భారతదేశానికి గ్రీకు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలతో సాంస్కృతిక సంబంధాలున్నాయి. నిజానికి ఈ సంబంధాలు చరిత్రకు పూర్వ యుగం నుండే ఉన్నాయి. అయితే 12వ శతాబ్ధంలో సైనికులతో పాటు పండితులు కూడా దేశంలోకి ప్రవేశించారు. ఈ పరస్పర సంబంధాలలో శాస్త్రీయ ఆలోచనల ఫలదీకరణ ప్రారంభమైందనవచ్చు. ఈ కాలంలోనే (1258 AD) ఇరాన్, ఇరాక్ మధ్య ఆసియా దేశాలు ఆక్రమణకు గురి అయ్యాయి. ఆక్రమించిన వారు మంగోలులు. దీనితో ఈ ఆక్రమిత దేశాలలోని ముస్లిం ఖగోళ విజ్ఞానులు, గణిత విజ్ఞానులు, వైద్యులు భారతదేశానికి రావడం పెరిగింది. టాలమీ, యూక్లిడ్ రచనల అరబిక్ అనువాదాలు 12వ శతాబ్ధాని కంతా వీరి ద్వారా భారతదేశానికి చేరాయి. ఇక్కడున్న వారు వాటిని పర్షియన్ లోకి అనువదించారు. యూక్లిడ్, ఆర్కిమెడిస్, థియోడోసియాస్, అపోలోసియాస్ లాంటి గ్రీకు రచయితల పర్షియన్ అనువాదాలు భారతదేశంలో అనేక చోట్ల లభ్యం కావడం ప్రారంభమైంది.
ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. విజ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తో కాదు. ఉదాహరణకు ప్రాచీన భారతదేశంలో, గ్రీకు, రోములలో ఉన్న గణిత, ఖగోళ, వైద్య విజ్ఞానాలను తొలి మధ్యయుగాల ప్రారంభంలో అరబ్బులు స్వీకరించి, వాటిని అనువాదాలు చేసుకున్నారు. వాటినే అభివృద్ధి చేసి, తమదిగా చేసుకున్నారు. 12వ శతాబ్ధంలో ముస్లింలు భారతదేశంలోకి వచ్చినప్పుడు వారి విజ్ఞానాలు భారతదేశంలోకి సరికొత్తగా ప్రవేశించాయి.
అయితే సాంకేతిక విజ్ఞానాలలో భారతదేశం పెద్దగా ముందుకు పోలేదు. దీనికి కారణాలేమిటో తరువాత చూడవచ్చు. అప్పుడున్న కొన్ని సాంకేతికతల గురించి కొంచెం మాట్లాడుకొందాం.

కాగితం సాంకేతికత:
ప్రపంచంలో మొదట కాగితం తయారు చేసింది ఎవరు? అంటే చైనా అని చెప్పాలి. క్రీ.శ.4వ శతాబ్ధం నాటికే చైనాలో కాగితం తయారీ ఉంది. క్రీ.శ.751 సమర్‍ఖండ్ వద్ద పట్టుబడిన చైనా యుద్ధ ఖైదీల ద్వారా ఇస్లామిక్ ప్రపంచానికి కాగితం తయారీ విధానం తెలిసింది. ఇది భారతదేశానికి పాకడానికి మరో 4 – 5 వందల సంవత్సరాలు పట్టింది. అయితే 11వ శతాబ్ధం మొదట్లో (1035 AD) లో దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలలో చెట్ల బెరళ్ళనే వ్రాత సాధనాలు వాడుతుంటే, దక్షిణ భారతదేశంలో తాటి ఆకుల్ని వాడుతున్నారు. అయితే భారతదేశంలో మొట్టమొదటి కాగితం వాడకం 12వ శతాబ్ధంలో కనిపిస్తుంది. ఇవి గుజరాతీలో రాసిన సంస్కృత ప్రతులు. బహుశ, గుజరాత్ ముస్లిం పాలిత ప్రాంతాలు దగ్గరగా ఉండటం వల్ల, వారి ద్వారా కాగితం ప్రవేశించి ఉండవచ్చు. సుల్తానుల కాలంలో ఢిల్లీలో పేపరు తయారీ జరిగింది. 14వ శతాబ్ధంలో ఢిల్లీలో కాగితం విరివిగా దొరికేది. మిఠాయి అంగళ్ళలో పాత కాగితాలు పొట్లాలుగా వాడేంత విరివిగా ఉండేదట.
కాని అన్ని ప్రాంతాలలోనూ ఇట్లా లేదు. 15వ శతాబ్ధం మొదటి అర్ధభాగంలో విజయనగర సామ్రాజ్యంలో కాగితం వాడకం కనిపించదు. 16వ శతాబ్ధం చివర్లో కూడా కేరళ, ఒరిస్సాలలో సాధారణ వ్రాత అవసరాలకు కాగితాల స్థానంలో తాటి ఆకులు వాడేవారు.
మొఘలుల కాలంలో కాగితం తయారీలో నూలు వస్త్రం, ముతక దారాలు, పాత తాళ్ళు, గోనె సంచులు, కొన్ని బెరళ్ళు ముడి పదార్థంగా వాడేవారు. నీళ్ళల్లో నాన్చి, చితకగొట్టి, గుజ్జు చేసేవారు. సోడా లేదా సున్నం కలిపేవారు. వెదరు బద్ద మూసలను ఈ గుజ్జు తొట్టెలో ఉంచి, వాటికి పట్టిన పదార్థాన్ని సున్నని పొరలుగా చీల్చి, ఎండబెట్టేవారు. రాతితో లేదా గాజుతో రుద్ది ఉపరితలాన్ని మృదువుగా చేసేవారు. 17వ శతాబ్ధంలో ఈ నాణ్యమైన కాగితంపై గిల్టు పూలు అద్ది అలంకరించేవారు.
కాగితం వాడకం ప్రారంభం కావడం ఒక మహత్తర సంఘటనే. దీని వల్ల పుస్తకాలు, విజ్ఞాన ప్రసారం, రికార్డ్ కీపింగ్, వాణిజ్య పత్రాలు – లాంటివి సులభమయ్యాయి. మాములుగా అయితే కాగితంతో పాటు ప్రింటింగ్ యంత్రం కూడా వ్యాప్తి చెందాలి. కాని మన దేశంలో అది జరగలేదు. మొఘల్ చక్రవర్తులకు యూరోపియన్ల ద్వారా పుస్తకాల ముద్రణ గురించి, కొయ్య ముద్రణా అచ్చుల గురించి తెలుసు. కానీ వారు ఉదాసీనంగా ఉండిపోయారు. ప్రింటింగ్ అక్షరాలను అమర్చడంలో కొంత క్లిష్టత ఉంటుంది. తరువాతతరువాత ఈ క్లిష్టత తగ్గినా, ప్రింటింగ్ విస్తృతం కాలేదు. చేతితో రాసే క్యాలిగ్రాఫర్లు విరివిగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.

గాజు సాంకేతికత:
గాజు ఒక సౌందర్య భావనకు గుర్తు. ముతక రంగుల చిన్న చిన్న గాజు పాత్రలు క్రీ.పూ.500 నాటికే దేశంలో కనిపిస్తాయి. 12వ శతాబ్ధంలో గాజు సామాగ్రి తయారీలో ఎంతో వికాసం కనిపిస్తుంది. పింగాణి పూత/ఎనామిల్ ప్రక్రియ వాడుకలోకి వచ్చింది. కెంపులు, పచ్చలు లాంటి రత్నాలను పోలి ఉండే గాజు ముక్కలను తయారుచేసేవారు. వారిని మీనాకార్ అనేవారు. వీరు మధు పాత్రలపై, స్నానశాలల గవాక్షాలపై రంగురంగుల గాజు ముక్కలను అలంకరించేవారు.

గాజు ఆధారిత పరిశ్రమలు కూడా ఉండేవి. చేతి గాజులు కొంచెం ముతకగా ఉండేవట (1319 AD). ఇంటిగోడలకు బిగించిన గాజు పలకలు పారదర్శకంగా ఉండేవి (1469 AD). సూర్యకిరణాలు ఇంటిలోకి వచ్చేట్టుగా వీటిని అమర్చేవారు. ఇవి లోపలికీ బయటకూ చూడడానికి పారదర్శకంగా ఉండేవి. ఈ పారదర్శక గాజు తయారీ, ఇసుక గడియారాల తయారీకి, కంటద్దాల తయారీకి మార్గం సుగమం చేసింది.
17వ శతాబ్ధంలో ఉన్న ఇసుక గడియారాలు 24 నిమిషాల ఘడియను సూచించేవి. అంటే ఇసుక ప్రవహించే గాజు పనిముట్టును ఎంతో నైపుణ్యంతో చేసి ఉండాలి. గాజును ఊదే ప్రక్రియలో ఎంతో పనితనం ఉంది ఉండాలి. ఇవి దేశీయంగానే తయారైనాయి. అక్బరు పాలన చివరి రోజులలో (1595) లో గాజు కంటి అద్దాల ప్రస్తావనలు కనిపిస్తాయి. కొంత ముతకగా ఉండే దేశీయ కంటి అద్దాలను సామాన్యులు ఇతరులు వాడేవారు. కానీ ప్రభు వంశీకులు యూరోపు కంటి అద్దాలను తెప్పించుకునేవారు.
అట్లే టెలిస్కోపులను యూరోప్ నుండి దిగుమతి చేసుకునేవారు. ఢిల్లీలో జయసింగ్ వేదశాలలో ఏర్పాటు చేసిన (1730 AD) దూరదర్శక యంత్రం యూరోప్ నుండి దిగుమతి చేసుకొన్నదే.
మొత్తం మీద భారతదేశంలో మధ్యయుగాలలో గాజు తయారీ పరిమితంగానే ఉండేది. గాజును సరిగా కరిగించడం, అతికించడం అరుదుగా ఉండేది. పెద్ద స్థాయిలో పారదర్శక గాజు తయారయ్యేది కాదు. వెండి కళాయి వేసిన గాజు దర్పణాలు కూడా తయారయ్యేవి కావు. 18వ శతాబ్ధం దాకా బాగా మెరుగు పట్టిన స్టీలునే అద్దాలుగా వాడేవారు. గాజు దర్పణాలను యూరోప్ నుండి దిగుమతి చేసుకునేవారు.

కుమ్మరి సాంకేతికత:
కుమ్మరం మరో ప్రధానమైన వృత్తిగా ఉండేది. చేనేత వృత్తిలో ఉన్నవారి కంటే కూడా కుమ్మర వృత్తిలో ఎక్కువమంది ఉండేవారు. పింగాణి లాగా అనిపించేట్టుగా బాగా కాల్చిన మెరుగు పెట్టిన పాత్రలు 10వ శతాబ్ధిలో ఉండేవి. నీలి, తెలుపు, హరిత రంగుల పాత్రలు వాడేవారు. నిజానికి ఇవన్నీ 12వ శతాబ్ధం తరువాత వాడుకలో ఎక్కువగా కనిపిస్తాయి. తూర్పు మధ్యధరా ప్రాంతపు ఇస్లాం ప్రభావం ఇందులో కనిపిస్తుంది. లోహాల వాడకం పెరిగే కొద్దీ కుమ్మరంలో క్షీణత కనిపిస్తుంది. మొఘలుల కాలంలో ఈ క్షీణత ప్రారంభమైంది.
సబ్బుల తయారి:
మధ్యయుగాలకు ముందు వృక్ష సంబంధమైన గింజలను నురగ కోసం వాడేవారు. అయితే క్షార మృత్తికలను, జంతు కొవ్వులను సబ్బు తయారీలో వాడటం ప్రారంభమైంది ముస్లింల కాలంలోనే. ‘సాబూన్’ అనే అరబిక్ పదం కూడా అలా వచ్చిందే. ఫిరోజ్ తుగ్లక్ కాలంలో సబ్బుల తయారీ ముఖ్యమైన వృత్తిగా ఉండేది. ఈ తయారీపై పన్నులు కూడా వేసేవారట. సబ్బుల తయారీతో ఒక కొత్త వృత్తి ఉనికిలోకి వచ్చింది.
చల్లదనపు సాధనాలు:
ఎండకు ఇప్పటికి గొడుగు వాడుతాము. కానీ ఈ గొడుగు సింధూ నాగరికత కాలం నాటిది. మధ్యయుగాలలో మూసి తెరిచే గొడుగు ఉంది (1350 AD). గది కప్పు నుంచి వేలాడే వీవెలన ప్రస్తావన (1467 AD) కనిపిస్తుంది. గదికి వేలాడదీసిన ఒక పెద్ద పంఖాకు తాడు కట్టి, అటూ ఇటూ విసురుతూ ఉంటే, గాలి వీచేదట. తడిసిన వట్టి వేళ్ళ తడికలు అక్బర్ కాలంలో బాగా వ్యాప్తిలో ఉండేవి. అదొక కొత్త సాంకేతికతే. సురేకారం లేదా పెట్లుప్పు వాడి శీతలీకరణ (రిఫ్రిజిరేషన్) సాధించడం మరొక సాంకేతికత. ఇది తానే కనిపెట్టినట్టు అక్బర్ చెప్పుకొన్నాడట (1585 AD). అప్పటికి యూరపుకు ఈ శీతలీకరణ సాధనాలు కానీ, సాంకేతికత కానీ తెలియదు.

కొలమాన సాధనాలు:
భూమి కొలతలు తీయడం వ్యవసాయానికీ, పాలనకు అవసరం. భూమిని తాడుతో కొలిచేవారు. కాని తాడు ఎండాకాలంలో సాగుతుంది, చలికి సంకోచం చెందుతుంది. కాబట్టి కొలతలు నిక్కచ్చిగా కావాలంటే తాడు సరిపోదు. దానికి పరిష్కారంగా ఇనుప రింగులతో కూడిన వెదరు గొట్టాలను వాడటం అక్బర్ కాలంలో ప్రారంభమైంది. సాధారణ త్రాసులతో పాటు తూచిక కోల (స్టీల్ యార్డ్) ను వాడటం 15వ శతాబ్ధంలో కనిపిస్తుంది.
అట్లే కాలాన్ని కొలవడానికి అనేక పద్ధతులు వాడారు. క్రీ.శ.7వ శతాబ్ధంలోనే నీటి గడియారాలు వాడారు. ఒక పెద్ద రాగి పాత్రలో, చిన్న రాగి పాత్ర ఉంటుంది. చిన్న పాత్రకు రంధ్రం ఉంటుంది. పెద్ద పాత్రలో ఉండే నీళ్ళు, చిన్న పాత్రలోకి ప్రవేశిస్తూ, కచ్చితంగా ఘడికొకసారి నిండుతూ ఉంటుంది. గంటను నాలుగు విభాగాలు చేస్తే ఒక ఘడి అవుతుంది (22.5 నిమిషాలు). రోజుకు రాత్రిపగలు కలసి 16 గంటలుగా లెక్కించేవారట. అయితే 16వ శతాబ్ధం ప్రారంభాని కల్లా ఘడి నిడివిని 24 నిమిషాలకు సమానం చేశారు. 14వ శతాబ్ధంలో ఢిల్లీలో నగరమంతా వినిపించేట్టు భారీ కంచు ఘంట లుండేవి. నీటి గడియారాలు తెలియజేసే సమయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికై ‘ఘడీ కూలీ’ లను పెట్టుకునేవారు. ఉన్నత వంశీకుల ఇళ్ళలో ఈ ఘడీ కూలీలు ఉండేవారు. పాత్ర మునిగినపుడంతా భేరీని మోగించి సమయ సూచన చేసేవారు.
అయితే ఈ నీటి గడియారాలను, ఇసుక గడియారాలను ఇంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ఏమైనా కృషి జరిగిందా అంటే లేదనే చెప్పాలి. 1700 AD ప్రాంతంలో మొఘలు వంశీకులు, అధికారులూ యూరోపు నుండి బాగా ఖరీదైన గడియారాలను (100 రూపాయలు) తెప్పించుకునేవారు. కానీ ఇక్కడే వాటిని తయారుచేసే ప్రయత్నం చేయలేదు.
భారతీయ ఖగోళ విజ్ఞానులు సూర్య గడియారాన్ని, అస్ట్రోలాబ్ లను మధ్యయుగాలలో వాడేవారు. అక్షాంశాలు, గోళాల స్థానాలను గమనించేవారు. వాటిని లాహోర్ లాంటి ప్రాంతాలలో తయారు చేసేవారు. కాని తరువాత కొత్త వీక్షణా సాధనాలు యూరోప్ నుండి రావడం ప్రారంభం కావడంతో, వీటి కథ ముగిసింది.
కొన్ని వైద్య పద్ధతులు:
మొఘలుల కాలం నాటి రెండు రకాల వైద్య పద్ధతులను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. టీకా లాంటి ప్రక్రియ ఒకటైతే, ప్లాస్టిక్ సర్జరీని పోలినది మరొకటి. బెంగాల్‍లో టీకా వైద్యం 1731 లో నమోదైంది. ఈ టీకా వైద్యం అంతకు ముందే 150 ఏళ్ళుగా ఉందని నమోదైంది. మశూచి బొబ్బల నుండి రసిని తీసి, మందపాటి సూదితో మరో మనిషి రక్తంలోకి ప్రవేశ పెట్టేవారట. అయితే ఈ వైద్యాన్ని చేసినవారు పండితులు కాదు. వారు అక్షరాలు కూడా రాని సామాన్యులు.
భారతదేశంలో “తప్పు” చేసిన వారి ముక్కు కోయడం ఒక శిక్షగా ఉండేది. లేదా కక్షతో ముక్కు కోసేవారు. అయితే దానికి వైద్యం ఉండేది (1680 AD). కనుబొమ్మలపైన ఉండే నుదుటి చర్మాన్ని వొలిచి, ఆ చర్మపు ముక్కను గాయం మీదకు వంచి సర్దేవారు. అది మాని, అతుక్కొనేది. ఈ వర్ణన 1686 AD లో నమోదైంది. హిమాచల్‍లోని కాంగ్రా ఇలాంటి శస్త్ర చికిత్సలకు ప్రసిద్ధిగా ఉండేదట.

వెలుగు:
చెకుముకి రాళ్లు చాలా ప్రాచీనమైనవి. చెకుముకి రాళ్ళతో రాజేసిన నిప్పుతో దివిటీలు, దీపాలు వెలిగించేవారు (1469 AD). అగ్గిపుల్లలు అప్పటికి లేవు. 1739 AD లో అగ్గిపుల్ల వర్ణన కనిపిస్తుంది. కొయ్యపుల్లను గంధకంలో ముంచే వారట. దాన్ని దియా-సలాయి అనేవారు. ఈ ప్రక్రియ యూరోప్ నుండి నేర్చుకొని ఉండొచ్చు.
ఆ కాలంలో వెలుగు అంటే గుర్తుకు వచ్చేది దివిటీలు. గుడ్డపీలిక వత్తి చుట్టిన, చెక్క పిడి కలిగిన గుండ్రపు లోహపు కడ్డీ దివిటీగా నూనెతో తడిపి వెలిగించేవారు. దీనికోసం దివిటి వాళ్ళు ఉండేవారు. మైనపు కొవ్వొత్తులు కూడా ఉండేవి. దివిటీలను మోసేవాళ్ళకు బదులు భారీ లోహపు దిమ్మెల మీద పెద్ద పెద్ద మైనపు స్తంభాలు పోత పోయించి వాడటం కూడా ఉండేది. గాజు బుడ్డీల లోపల ఉండేలా అమర్చిన కొవ్వొత్తులు కూడా కనిపిస్తాయి. అయితే ఇవన్నీ వ్యక్తుల, పాలకుల సౌకర్యాల కోసమే. అంతేకానీ వీధి దీపాలు లాంటి బహిరంగ ప్రదేశాలలో వెలుతురును కల్పించాలనే భావన ఆనాడు లేదంటారు.
చివరిగా:
మధ్యయుగాలలో ఎందుకని సాంకేతికతలు ఒక తార్కిక అభివృద్ధికి ఎదగలేదు? శతాబ్ధాల పాటు మౌలికమైన మార్పులు లేకుండా ఉన్నవి ఉన్నట్టుగానే ఎందుకు ఉన్నాయి? ఒక వైపున విజ్ఞానంలో ఆదాన ప్రధానాలు బాగానే ఉన్నా, మరొక వైపు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఎందుకని సమాజం అందిపుచ్చుకోలేక పోయింది? అనే ప్రశ్నలు తల ఎత్తుతాయి. చివర్లో వాటి గురించి తెలుసుకుందాం.
{ఈ వ్యాసంలో ఉన్న విషయాలు – ఇర్ఫాన్ హబీబ్ రాసిన ‘మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ’ – అనే మోనోగ్రాఫ్ నుండి స్వీకరించబడినవి, క్లుప్తీకరించబడినవి.}
(వచ్చే నెల – మధ్యయుగాల సాంకేతికతలు – యుద్ధాలూ, ప్రయాణాలు గురించి)



