మిఠాయి యుగంధర్ బాబు

వెనుకటి ఒక సామెత. ఒకడికి భగవంతుడు (ఉంటే సుమా!!) ప్రత్యక్షమై’ ఏం వరం కావాలో కోరుకోరా’ అంటే….”నా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు స్వామి, తత్తిమాది నే చూసుకుంటా” అన్నాడంట. అంటే అర్థం ఏమిటి ? మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిస్తే అది అదృష్టం కింద లెక్క. అప్పుడిక ఆయన పట్టింది అంతా బంగారం అయిపోతుంది! తరువాత  ఆయన కూతురుని పెళ్లి చేసుకుంటే ఆ బంగారం మొత్తం తనదే అవుతుందని  వాడి ఆశ.

అలాంటి వరం ఒకటి ఇప్పుడు మీ ముందర ఉందట!. మీ చేతిలో ఉందట!!. మీరు చేయవలసిందల్లా ఒక్కటే. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కి సరైన నెంబర్ ని (అంటే సిమ్ కార్డుని) కనిపెట్టడమే!. అంటే మీ పుట్టినరోజు తారీకూ.. నెలా ..సంవత్సరమూ…. తో పాటు, మీ పేరు లోని అక్షరాలకు  జోడీ కట్టే ఆ అదృష్ట ఫోన్ నెంబర్ ని (సంఖ్యను) వెతుక్కోవడమే!! . అదృష్ట ఫోన్ నెంబర్ కనుక్కోవడం ఎలా? జత పరచడం ఎలా? దానికి రూల్స్ రెగ్యులేషన్స్  ఏమిటి? అలా జతపరిచే ఆ దివ్య జ్ఞానం ఎవరికీ ఉంది? ఈ ప్రశ్నలు అన్నింటికీ   సమాధానం ఒకేఒక్కటి….అదే “న్యూమరాలజి”.

సృష్టికి ప్రతి సృష్టి చేశాడని విశ్వామిత్ర గురించి చెబుతారు. నీ తల రాతను మార్చే రేఖ కొంచెం పొట్టిగా ఉందని చెబితే ప్రపంచ విజేత ‘చెంగిజ్  ఖాన్’ కత్తితో చేతిలో రేఖను పొడవుగా గీసేసుకున్నాడట. అలాగ ప్రతి సృష్టి చేసి, మీ తలరాతనూ, జరగబోయే వాటిని పూర్తిగా మార్చే శక్తి నంబర్లలో (సంఖ్యలో ) ఉందని ఘంటాపదంగా చెబుతారు సదరు  న్యూమరాలజిస్టులు. వారి సిద్ధాంతం న్యూమరాలజీ.!! అసలు ఈ న్యూరాలజీ, దాని కథా కమామీషు ఏమిటో చూద్దామా!

న్యూమరాలజీ, (‘సంఖ్యాశాస్త్రం’) అంటే… అంకెలు వాటికి సంబంధించిన రహస్య అర్థాలు, మనిషి జీవితంపై వాటి ప్రభావం గురించి చెప్పే శాస్త్రం (శాస్త్రం కాని శాస్త్రం) అన్నమాట.ఓ వ్యక్తి పుట్టిన తేది ఆధారంగా, పేరులోని అక్షరాల ఆధారంగా అతని భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఓ పద్ధతి. ఆ అంచనా వల్ల ఆ వ్యక్తి జీవితంలో దోషాలు ఉంటే ఆ పేరులోని అక్షరాలు, తద్వారా వాటి నంబర్లు మార్చి వారి జీవితాన్ని బాగు చేయడం కూడా ఈ పద్ధతిలో భాగమే. అలా బాగు చేయడమే ఈ న్యూమరాలజీ యొక్క అసలైన పద్ధతి. ఈ  పద్ధతిని భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాచీన సంస్కృతులు అనుసరిస్తున్నాయి. ఈ న్యూమరాలజీలో కొన్ని ప్రముఖమైన పద్ధతులున్నాయట.

“పైథాగరియన్”అనే సంఖ్యా శాస్త్ర పద్దతిని పాశ్చాత్య  దేశీయులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పైథాగరస్ పేర్కొన్న మాదిరిగా” ఈ ప్రకృతిలోని ప్రతి విషయం కూడా గణితం పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా1 నుండి 9 లోపల సంఖ్యలు గా మార్చవచ్చును. ఈ సంఖ్య ప్రతి ఒక్కటి ఒక్కొక ప్రత్యేకమైన ప్రకంపన శక్తిని కలిగి ఉంటుందట. అది మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటుందట”.  రెండోది చాలా పురాతనమైన “చాల్డియన్” సంఖ్యా శాస్త్రము. ఇది అక్షరాల వైబ్రేషన్స్ (కంపనాలు) మానవ జీవితంలో ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందనే నమ్మకం పైన ఆధారపడి పనిచేస్తుంది. మూడవది మనదేశంలో భారతీయ సంఖ్యా శాస్త్రము లో నవగ్రహాలు,  జ్యోతిష్యం కారణంగా సంఖ్య శాస్త్రాన్ని అనుసరిస్తారు.

ఈ సంఖ్యా శాస్త్రంలో ప్రతి అక్షరానికి నిర్దిష్టమైన సంఖ్యా విలువ  ఉంటుందట. మీ పేరులోని అక్షరాలను అంకెల రూపంలో మార్చి, వాటిని కూడడం వల్ల  వచ్చే “మొత్తం” ను పరిశీలించి మీ లక్షణాలు, అభివృద్ధి , అదృష్టం మరియు దురదృష్టం ఎలా ఉంటాయో అంచనా వేస్తారన్న  మాట. మొత్తంలో వచ్చిన నంబర్ల ప్రకారం ఏ గ్రహాల ప్రభావం ఉంటుందో లెక్కిస్తారు. మీరు పుట్టిన తేదీని  (date) మాత్రమే తీసుకొని ఒక లెక్క వేస్తే అది మీ వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని సూచిస్తుందట. అలా కాకుండా మీరు పుట్టిన తేదీ (date), నెల (month),  సంవత్సరం (year) మొత్తాన్ని కూడితే వచ్చే అంకె మీ జీవిత గమనాన్ని మరియు మీరు ఎదుర్కొనే ముఖ్యమైన అనుభవాలను, సవాళ్ళను తెలియజేస్తుందట. ఇందులో సహజంగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లెక్కించడానికి అరబిక్ సంఖ్యలను తీసుకుంటారు.ఉదా.21.07.1964 … ..ఇలా. అందులో ఎలాంటి తిరకాసు లేదు. ఈ అంకెలను లెక్కించడం సులభం. అదే  వారి పేరు వచ్చేసరికి ఆ పేరులో ఏ అక్షరాలు తీసుకోవాలి? ఇంగ్లీషులో రాసిన అక్షరాలా?, తెలుగులో రాసిన అక్షరాలా?, తమిళం లో రాసిన అక్షరాలా?.. ఏది తీసుకోవాలి? ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే తీసుకుంటే అది భారతీయ సంఖ్యా శాస్త్రం ఎలా అవుతుంది? నివారణ ఎలా సూచిస్తారు?

ఉదాహరణకి “అన్నపూర్ణ” అనే పేరు తీసుకుందాం. తెలుగులో నాలుగు అక్షరాలు. ఇంగ్లీషులో Annapoorna ….10 అక్షరాలు. ఈ పేరు తమిళంలో ఎలా రాస్తారో తెలుసా ?

తమిళంలో ఒత్తులు , సంయుక్తాక్షరాలు ఉండవు. కాబట్టి ఇలా రాస్తారు. “అ న్ న పూ ర్ న” .అంటే  తమిళంలో ఆరు అక్షరాలు అయింది.  అప్పుడు పై పేర్కొన్న పేరుకి ఏ భాషలో అక్షరాలు లెక్కపెట్టి సంఖ్యాశాస్త్రాన్ని ఏ విధంగా అన్వయిస్తారు. ఏ విధంగా లెక్కపెట్టినా, ఎవరు లెక్కపెట్టినా, ఎక్కడ లెక్కపెట్టినా ఒకే విధమైన ఫలితం రావాలి కదా.అలా వస్తేనే కదా అది  శాస్త్రీయపరంగా ఆమోదం అయ్యేది. ఇక్కడ మూడు భాషలు మాత్రమే తీసుకున్నాను. మూడు రకాలుగా ఫలితాలు వస్తున్నాయి.ఇదే పేరును ప్రపంచంలో లిపి ఉండే అన్ని భాషల రాస్తే అనేక వేల ఫలితాలు వస్తాయి. అలాంటప్పుడు ఏ రకంగా వీళ్ళు సంఖ్యా శాస్త్రం నిర్ణయిస్తారు? అంటే ఇవన్నీ అర్థం పర్థం లేని తతంగం అని అనిపిస్తోందా లేదా?

ఈ  న్యూమరాలజీ… జ్యోతిష్యం పరస్పరం పరిపూరకాలుగా పనిచేస్తాయి. జ్యోతిష్యం గ్రహాల గమనాన్ని బట్టి సమగ్రమైన వివరాలు ఇస్తే ,న్యూమరాలజీ ఆ గ్రహల యొక్క శక్తిని సంఖ్యల రూపంలో సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుందన్న మాట. పేరు లోని అక్షరాల గందరగోళం లాగే వీళ్ళు అనుసరించే  గ్రహాల లిస్టులో కూడా గందరగోళం ఉంది. ఆ లిస్టులో ఉన్నవన్నీ గ్రహాలు కావు. ఒక నక్షత్రం ఉంది. ఒక ఉపగ్రహం  ఉంది. ఒక ఊహాజనిత గ్రహం కూడా ఉంది. అంటే ఆదిలోనే హంస పాదు అన్నమాట. వీరు అనుకున్న పద్ధతిలోనే దోషం ఉందన్నమాట. అన్నిటిలో సాంప్రదాయం.. సాంప్రదాయం… అనే వీళ్ళు పేర్లలో సంఖ్య శాస్త్రాన్ని లెక్కించడానికి మాత్రం ఇంగ్లీషు పదాలనే తీసుకుంటున్నారు. అదెలా సాంప్రదాయం అయిందో అర్థం కాదు. అలా పేర్లకు సంఖ్యా విలువలను కేటాయించడం, ఆ విలువలకు గ్రహాల ప్రభావం నిర్ణయించడం మరియు ఆ విలువలకు మతపరమైన అర్థాన్ని ఆపాదించడం అనేది జరుగుతోంది. ఇందులో ఇంకో తిరకాసు కూడా దాగి ఉంది. నీ పేరులోని అక్షరాలను సంఖ్యలుగా మార్చి దాని లెక్కలు వేసినపుడు అది పాజిటివ్ గా ఉండొచ్చు లేక నెగిటివ్ గా ఉండొచ్చు. పాజిటివ్ అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ ఎనర్జీ   ఉంటుందట . న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పేరు లోనుంచి నెగిటివ్ ఎనర్జీ ని ఎలా తీయాలి ? ఆ పేరు లోకి పాజిటివ్ ఎనర్జీని ఎలా చొప్పించాలి? దారి తప్పిన జీవితాన్ని  గాడిలోకి ఎలా పెట్టాలి? దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఎలా ఆవాహన చేయాలి? వీటన్నిటిని చేయడానికే, ఇందుకోసమే ఉన్నారు మన న్యూమరాలజిస్టులు… సైన్స్ కనుక్కున్న ఆధునిక మాధ్యమాలను ఉపయోగించి, రకరకాలుగా ప్రకటనలు చేసి, వీడియోలు గుప్పించి, బోర్డు తగిలించుకొని, బోర్డుపై లెక్కలు వేసి చూపి వ్యాపారాలు  చేస్తున్నారు.  మీ పేరులో ఒక అక్షరం తొలగించడం ద్వారానో ఒక అక్షరం చేర్చడం ద్వారానో మొత్తం భవిష్యత్తు మారిపోతుందని భ్రమలు కల్పిస్తారు. ఆ మేరకు మీరు అదృష్టవంతులు?! గుడిలో మెల్ల.. మీ పేరులో మాత్రమే మార్పు చెపుతున్నారు. అలా కాకుండా మీ భార్య పేరులోనో, పిల్లల పేర్లలోనో మార్పులు చేయాలని చెబితే  చాలా కష్టం. వాళ్లు ఒప్పుకోరు కదా. (వాళ్ల మీతో ఉంటారు కాబట్టి వాళ్ల ప్రభావం మీ అదృష్టం పై ఉండొచ్చు కదా). ఇంకా నయం జన్మనిచ్చిన మీ అమ్మానాన్న ల పేర్లు కూడా మార్చాలని ఇంకా రాలేదు సుమా.  ఒకవేళ తాతల పేర్లు, అమ్మమ్మ , నాన్నమ్మల పేర్లు కూడా మార్చాలంటే ?? అసలు ఉన్నారో లేదో ఈ భూమి పైన…. అప్పుడు ఇంకా కష్టం కదా!? అది కూడా రాబోతుందేమో?

మీ పేరులోని అక్షరాల మార్పు మాత్రమే కాదు ….ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్న వ్యాపారం ఏమంటే మీ మొబైల్ నెంబరు! లక్కీ మొబైల్ నెంబర్!! న్యూమరాలజీ మొబైల్ నెంబర్!!! మీ తలరాతలు మార్చే మొబైల్ నెంబర్!!! అంటే మీ పుట్టినరోజు ప్రకారం, మీ పేరు ప్రకారం మీకు సరిపోయే మొబైల్ నెంబర్ను ఎన్నుకోవడం అన్న మాట. దీనికి సహకరించే న్యూమరాలజిస్టులు ప్రస్తుతం ఎక్కువైనారు. ఒకాయన ఇలా చెబుతున్నాడు …మీ సెల్ నెంబర్లలో చివర్లలో సున్నా (zero…0) అనేది ఉండకూడదట. 4,7,8 నంబర్లు కూడా చివరన ఉండకూడదట ఎందుకంటే అవి రైసింగ్ నెంబర్లు కావట. మధ్యలో ఎక్కడైనా 4 అంకె ఉండాలట అది ధనాకర్షణ చేస్తుందట. 8 శని గ్రహమట అది స్లో గ్రహమట. అంటే మీరు కోరుకునేవన్నీ ఆలస్యం అవుతూ పోతుందట.

10 అంకెల మొబైల్ నెంబర్ లోని అంకెలన్నీ  కూడితే వచ్చే మొత్తం 36 లేక 63 రాకూడదట. అలా వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తాయట .ఆ రెండు వ్యతిరేక నెంబర్లు అంట. 43 లేదా 52 వస్తే అవి స్పిరిచువల్ నెంబర్ అంట. అంటే వైరాగ్యం కలుగుతుందట.46 లేక 49 వస్తే చాలా ప్రమాదకరమైన నెంబర్లు అంట. అవి వస్తే ఇక సర్వ నాశనమట.అదే  సమయంలో మీరు పుట్టిన నెంబరు కు మీ ఫోన్ నెంబర్  మ్యాచింగ్ అయితే.. నా సామిరంగా! ఇక చూసుకోండి . మీరే అదృష్ట వంతులు!!. మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారట. మీ పేరుకి ఏ నెంబర్ మ్యాచ్ అవుతుందో వీళ్ళు అనలైజ్ చేసి చెబుతారట.   ఇలా లేనిపోని భయాలు సృష్టించి, నమ్మదగిన మాటలు చెప్పి వ్యాపారం చేసుకుంటున్నారు. 20 ఏళ్ల ముందు కనిపెట్టిన ఫోన్ నెంబర్ పైన ఇంతలా భ్రమలు సృష్టించి వ్యాపారం చేస్తున్నారంటే  వీళ్ళు చాలా తెలివైన వాళ్ళని చెప్పాలి. మంచి వ్యాపారవేత్తలు అని భావించాలి. వీరికి పెట్టుబడి ఎదుటివారి భయమే.

నేను  మా స్నేహితులతో తమాషాకి ఇలా చెప్తుంటాను. ” నీ మొహం లో వాస్తు  సరిగా లేదు. నీ ముక్కుకీ, పై పెదవికీ మధ్య గ్యాప్  తక్కువగా ఉంది. అందుకే నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఆ గ్యాప్ ఓ అర్థ సెంటీమీటర్ పెరిగితే కష్టాలన్నీ తొలగిపోతాయి . వెంటనే నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఆ గ్యాప్ పెంచుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. నీ ముఖ వాస్తు సరిపోతుంది”. అని తమాషా చేస్తుంటాను. నవ్వొస్తుంది కదా!? ఇది వినడానికి ఎంత హాస్యాస్పదమో…. అక్షరాలు మార్చడం వల్లనో, నంబర్లు మార్చడం వల్లనో, ఫోన్ నెంబర్లు మార్చడం వల్లనో మన జీవితాలు బాగు పడిపోతాయి అనడం  కూడా అంతే హాస్యాస్పదం.

సంఖ్యా శాస్త్ర పండితులమని, న్యూమరాలజిస్టులని చెప్పుకొని “మీ పుట్టిన తేదీ, మీ పేరు పంపించండి. దాన్ని అనలైజ్ చేసి మీ గురించి మీకు చెబుతాము. మీ భవిష్యత్తు గురించి చెబుతాం. భవిష్యత్తును మార్చేస్తాం. సరైన సూచనలు చెప్పి మార్పులు తీసుకొస్తాం” అని చెప్పే వాళ్ళని నమ్మకండి. 

ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు రాసిన 18 ప్రకృతి సూత్రాలలో మొదటి సూత్రం ఈ విధంగా చెబుతోంది. మొదటి సూత్రం…..” సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారంగా జరగవు. వాస్తవ మనుగడలో ఉన్న దాన్నే పరిశీలకులు గమనిస్తారు. సంఘటనలు పరిశీలకుడు గమనించడం కోసం జరగవు.” (Events occur independent of the observer. Observation  may perturbs the event ,but the event itself occurs independent of the observation) జరిగే విషయాలు యధాతధంగా జరుగుతాయి. అవి పరిశీలించే వాడి ఊహలకూ, అంకెలు నెంబర్లు మార్చడం వల్ల వారికి అనుకూలంగా  జరగవు.   “జరిగేది జరగకుండా పోదు నాయనా” అని మా నాయనమ్మ చెప్పేది. కాబట్టి ఈ న్యూమరాలజీలు, అంకెల గారడీలు, పేరు మార్పిడిలు  ఏ విషయాన్ని ఏమాత్రం మార్చలేవని  తెలియజేస్తుంది ఈ ప్రకృతి సూత్రం.

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు….
మహా పురుషులవుతారు….
తరతరాలకు తరగని వెలుగవుతారు ….
ఇలవేల్పులు అవుతారు…….”

అనే పాటను అనుసరించి కృషి  చేస్తూ పోవాలి. అంటే పని చేసుకుంటూ పోవాలి. ఫలితం అదే వస్తుంది. మనం మారాలి. మన ఆలోచన మారాలి. మనం కొత్తగా మారాలి.

న్యూ“మారాల”జీ!!

రచయిత: మిఠాయి యుగంధర్ బాబు, పలమనేరు, మొబైల్ నం.9394782540

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *