సంపాదకీయం

ఇటీవల ఎప్పుడూ లేనట్టు మన సమాజం ఎటు పోతోందన్న భయం మనకు పట్టుకుంది. ఆర్థిక సంక్షోభం గురించీ, నిరుద్యోగం గురించీ ఒకవైపూ ; రాజ్యాంగ విలువలకూ, మానవ విలువలకూ గ్రహణం పట్టడం గురించి మరోవైపూ ఏ నాడూ ఎరగని ఆందోళన మొదలైంది. పెరుగుతున్న సామాజిక అంతరాల గురించి తీవ్రంగా ఆందోళన పడుతున్న కాలం మనది. నానాటికీ శాస్త్రీయ దృక్పథం కొరవడుతోందనీ, ఛాందసం ముదురుతోందనీ బాధపడుతున్న రోజులు మనవి.

నిజమే గానీ వీటన్నిటికీ మూలాలు ఎక్కడ వున్నాయి అంటే మన విద్యారంగ సంక్షోభంలో వున్నాయి అంటోంది జెన్ జీ. విద్యారంగం కేంద్రంగా విస్తృత సామాజిక రాజకీయ ఉద్యమం జరగాలన్నది దాని వాదం.

విద్యారంగం గురించి చాలా చాలా చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ విద్యారంగ సంక్షోభం సామాజిక ఆర్థిక సంక్షోభంగా మారిందన్న జెన్ జీ విశ్లేషణ కొత్తది, విలువైనది. ఇదో నూతన కోణం, దృక్పథం.

ఇప్పుడు మనం మొదట మన ఆర్థిక సంక్షోభాన్ని గురించి చూద్దాం

ప్రజల వార్షిక ఆదాయంలో గృహ వినియోగంలో విద్యావ్యం వాటా ఎంత? ఇతర దేశాల్లో ఎంత? మనదేశంలో ఎంత? జనం రుణ భారంలో దీని వాటా ఎంత ?దీనివల్ల ఇతర అత్యవసర వినియోగాలపై పడుతున్న ప్రభావం ఎంత? దీనిపై లోతైన అధ్యయనాలు, సాధికారమైన గణాంకాలు మన వద్ద పెద్దగా లేవు. కాంప్రహెన్సివ్ మోడ్యులర్ సర్వే 2025 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 51.6% పిల్లలు చదువుతున్న దేశం మనది. ప్రపంచంలోనే ఇందులో మనం ముందున్నాం. వీటిలో 1-10 తరగతుల్లో చదువుతున్న వారు ఏడాదికి రు. 28,693లు ఫీజుల కోసం చెల్లించాల్సి వస్తోంది. UDISE 24-25 దీన్ని రు 33,612లుగా అంచనా వేసింది. రవాణా, పుస్తకాలు, ప్రైవేటు ట్యూషన్ల ఖర్చులు దీనికి అదనం. CESS 2018-19 అంచనా ప్రకారం జిడిపిలో విద్యావ్యయం 6.6% కాగా అందులో ప్రవేటువ్యయం 2.7 శాతం. ఈ ఖర్చు వేగంగా పెరుగుతున్నట్టు కూడా అది పేర్కొంది. ఒక్క నీట్ పరీక్ష సన్నద్ధత కోసం మన విద్యార్థులు పెడుతున్న ఖర్చు మొత్తం కేంద్ర విద్యా బడ్జెట్ తో సమానం! నెల్లూరు నగరంలో 1-12 తరగతుల చదువుల కోసం తల్లిదండ్రులు రు. 600 కోట్లు ఖర్చు చేస్తుంటే ప్రభుత్వం చేస్తున్నది 79.6 కోట్లు మాత్రమేనని ఒక ప్రజా సర్వే నిర్ధారించింది. ఇక విదేశీ విద్య కోసం వెళుతున్న మూడు లక్షల మంది ఒక్కొక్కరు 30 లక్షలు ప్రతి సంవత్సరం రుణం తీసుకుంటున్నారని, ఇది 90,000 కోట్లకు చేరుకుందని ఇంకో అంచనా! ఇప్పుడు మన దేశంలో విద్య కంటే కోచింగ్ ఖరీదైనది. అసలు కోచింగే విద్యగా మారిపోయింది. ఈ పరిశ్రమ కొన్ని లక్షల కోట్లు జనం నుంచి పిండుతోంది. ( దీన్ని Industry అనడంలో ఎవ్వరూ సిగ్గుపడ్డం లేదు).ఈ కోచింగ్ తీసుకొన్న వారిలో ఎందరికి ఏ ఫలితం దక్కుతోందన్న లెక్కలు ఎక్కడా లేవు. అంతెందుకు ఏ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని పలకరించినా తమ పిల్లల చదువులు తలకు మించిన భారంగా మారాయని చెబుతారు. వీరంతా పేదరికంలోకి జారిపోవడానికి మన ప్రైవేట్ చదువులు పెద్ద కారణమని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరం కేరళలో ఒకటవ తరగతిలో 2,50.858 మంది చేరగా వీరిలో ప్రైవేటు స్కూళ్ళలో చేరింది కేవలం 16.4 ఒక శాతం! దేశమంతా ఇలానే ఉంటే ప్రజల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది ? ఈ వైపున మన ఆర్థికవేత్తల చర్చలు జరిగితే ఎంత బాగుంటుంది?

ఇక సామాజిక న్యాయం దగ్గరకు వస్తే ఇప్పుడు మన దేశంలో నీట్ కు ముందు నీట్ వెనక మెడిసిన్ సీట్లు ఎవరికి దక్కాయో చూస్తే చాలు ఇదంతా మన సమాజాన్ని ఎటు తీసుకెళుతోందో తెలిసిపోతుంది. నీట్ వల్ల మెరిట్ కు న్యాయం జరుగుతుందనీ, బహుళ పరీక్షల భారం తగ్గుతుందనీ, కాపిటేషన్ ఫీజుల ఆటలు సాగవనీ చాలా చాలా బడాయి మాటలు చెప్పారు. నిజానికి జరిగిందేమిటి ?నీట్ కు ముందు తమిళనాడులో 12వ తరగతి పరీక్షల మార్కుల ఆధారంగానే వైద్య విద్యా సీట్లు లభించేవి. రాజన్ కమిటీ నివేదిక ప్రకారం అప్పుడు 19.8శాతం తమిళ మీడియం విద్యార్థులకు ప్రవేశం దొరికితే ఇప్పుడు అది 1.6 శాతానికి పడిపోయింది. దళితులప్పుడు 5.4 శాతం వుంటే ఇప్పుడు వారు 1.6 శాతమే వున్నారు. మొదటి తరం గ్రాడ్యుయేట్లు నీట్ కు ముందు 24.6% అయితే ఇప్పుడు 14.5% కు పడిపోయారు. షణ్ముగం అనిత 12వ తరగతిలో 2000 కు 1176 మార్కులు తెచ్చుకొంటే నీట్ లో 700కు 86 మార్కులు రావడంతో ఆత్మహత్య చేసుకుంది! ఆమె ఒకటే కాదు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ రవీంద్ర భట్ నిపుణుల కమిటీ ప్రకారం ఉన్నత విద్యారంగంలో 9శాతం విద్యార్థులు ఆత్మహత్య ఆలోచనలు కలవారు ! వీరిలో 67% బీసీ ఎస్సీ ఎస్టీలు !! వీరుగాక 15% తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నవారు. క్యాంపస్ లో ఇమడ లేక పోతున్నామంటున్న వారు 34 శాతం ! వీరంతా బడుగు బలహీనవర్గాల వారే!

ఇది చాలక కొత్తగా వచ్చిన నైపుణ్యాభివృద్ధి కోర్సులు, ప్రధాన సబ్జెక్టులకు ప్రాధాన్యత తగ్గింపు, తాడు బొంగరం లేని క్రెడిట్లు మన డిగ్రీ కోర్సులను డొల్లగా మారుస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో నాలుగో సంవత్సరం దాకా కొనసాగుతున్న వారు 30% కూడా లేరన్నది నిష్ఠురవాస్తవం. మరి ఈ ప్రాణం లేని కోర్సులు చదువుతున్న వారు, వాటిని కూడా పూర్తి చెయ్యకుండా జారిపోతున్నవారు ఏ వర్గాల వారు?

ఇక విలువల దగ్గరకు వస్తే జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చాక మన విద్యారంగ స్వభావమే మారిపోయింది. భారతీయ జ్ఞాన వ్యవస్థలు, విజ్ఞానశాస్త్రభారతీయీకరణ, మన ఘన వారసత్వం విలువలు తాత్వికత అంటూ కాలం చెల్లిన వాటితో మన చదువుల్ని నింపుతున్నారు. ఆధునిక సైన్సుకు, శాస్త్రీయ దృక్పథానికి సమాధి కడుతున్నారు. ప్రపంచ వైజ్ఞానిక అన్వేషణలన్నిటిని ఎద్దేవా చేస్తున్నారు.జీవపరిణామ సిద్ధాంతం మన పాఠశాల విద్య నుంచి మాయమైంది. మూడు వందల ఏళ్ల మొగలాయిల చరిత్ర అదృశ్యమైంది. పైథాగర సిద్ధాంతాన్ని జాతీయం చేసారు. ఇప్పుడు పసిపిల్లల్ని కూడా కర్మయోగులుగా మారుస్తామంటున్నారు. యోగాతో మూడో కన్ను తెరుచుకొంటుందంటున్నారు. ప్రార్థనలతో చెరుకు దిగుబడి పెరుగుతుందట. హనుమంతడే మొదటి అంతరిక్ష యాత్రికుడట. నారద పురాణం నుంచి రేఖాగణితం పుట్టిందట. శత్రువులపై యుద్ధాల్లో మన వీరులకు దేవతలు పవిత్ర ఖడ్గాలు ప్రసాదించారట.ఇలాంటివన్నీ మన పాఠ్యాంశాల్లోకి ఎక్కాక వీటిని చదువుకొన్న మన విద్యార్థులు ఈ ఆధునిక ప్రపంచంలో ఎందుకు పనికొస్తారు? ఈ ఛాందసం వీరిని ఎక్కడికి తీసుకెళుతుంది ?ఎలాంటి పౌరులుగా వీరు మారుతారు?ఇదిక్కడితో ఆగడం లేదు. జాతీయత పేరుతో విద్వేషాల్ని రగల్చడం, మైనారిటీలను మూలకు నెట్టడం, దేశాన్ని నిలువనా మీరు -మేము అంటూ చీల్చడం మన చదువులకు లక్ష్యాలుగా మారుతున్నాయి. చివరికివి మన పిల్లల్ని ఏ విలువల వైపు తీసుకెళ్తాయి ?మన సమాజాన్ని ఎక్కడికి నడిపిస్తాయి?

మన విద్యా వ్యవస్థ పతనం ముప్పై ఏళ్ల నాడే మొదలైంది. ఇప్పుడీ రూపాన్ని సంతరించుకుంది.నానాటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ శక్తి హీనమవుతోంది. నిధులు లేవు. పోస్టులు భర్తీగావు. పరిశోధనలకు స్వేచ్ఛ లేదు. కొత్త కోర్సులు కనపడవు. చివరికి మన విశ్వవిద్యాలయాలు సైతం చూస్తుండగానే అనాధశరణాలయాలుగా మారి, పిల్లలు లేక, జనానికి నమ్మకం లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతికి శిశువిద్య నుండి విశ్వవిద్యాలయాల దాకా విద్యాబేహారులకు అప్పగించడానికి ప్రభుత్వరంగాన్ని పనిగొట్టుకొని ధ్వంసం చేశారు.దీంతో మార్కెట్ శక్తులు విద్యారంగ రూపురేఖలే మార్చేశాయి. పోటీల్ని, మార్కుల్ని, గ్రేడుల్ని, వల్లెవేతల్ల్ని చదువుల సారంగా మార్చేశాయి. టీచింగ్ స్థానం లోకి కోచింగ్ తెచ్చాయి. అధ్యయనం, ప్రశ్నించడం, తార్కికత, శాస్త్రీయత అనే వాటికి స్థానం లేకుండా చేశాయి.

చివరికిది ఒక అల్లరి మూకల చేతుల్లోకి సమాజంలోని అన్ని వ్యవస్థలు వెళ్లేలా చేసింది. మొత్తం సమాజానికి సమాజమే ఇలా విద్వేషమయమయ్యే దుస్థితి దాపురించింది.

వీటన్నిటి మూలాలను విద్యారంగంలో వెతకమంటుంది జెన్ జీ. దీన్ని సరిచెయ్యకుండా ప్రస్తుత సామాజిక ఆర్థిక సంక్షోభాల్ని నివారించలేమంటోందది. తిరోగామి శక్తులు విద్యారంగం పైనే ఎందుకు కేంద్రీకరిస్తున్నాయో గుర్తించమంటోందది. ఈ రంగాన్ని రాజకీయ సామాజిక అజెండాల్లోకి బలంగా తేలేకపోవటం, సమాజంలో 40 శాతంగా వున్న 25 ఏళ్ల లోపు వారి భవిష్యత్తు మన ఉద్యమాలకు కేంద్రంగా మారకపోవడం పెద్ద నష్టం తెచ్చిందని హెచ్చరిస్తూ విద్యారంగం కేంద్రంగా ప్రస్తుత సంక్షోభాలను బేరీజు వెయ్యడం ఒక వొరవడిగా మారాలంటోందది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *