డా. నాగసూరి వేణుగోపాల్
వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 17
ఆధునికత, సాంప్రదాయం, వంటలు, హోమో సెక్చుయాలిటీ వంటి అంశాలపై రచనలతో పాటు నవలలు, జ్యోతిష్యం… వీటికి మించి ఆరు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే లభించే అపారమైన గణిత ప్రతిభ… వీటన్నిటికి బీజగణితాత్మక సమాకలనం వంటిది శకుంతలా దేవి!

‘హ్యూమన్ కంప్యూటర్’ గా ప్రాచుర్యం పొందిన శకుంతలాదేవి చిన్నారి బాల్యం ఎటువంటి శిక్షణా, అధ్యయనం లేకుండా చదవడం, రాయడం వంటి సామర్థ్యాలు పొందినట్లు కీర్తి గడించింది. 1929 నవంబరు 4న శకుంతలాదేవి బెంగుళూరులో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మూడేళ్ళ ప్రాయంలో తండ్రితో పేకాట ఆడుతున్న సమయంలో ఆ అద్భుత ప్రతిభ వెల్లడయ్యింది. ఆమె తండ్రి సి. వి. సుందరరాజారావుకు గుడిలో పూజారి కావడం ఇష్టం లేక సర్కస్ లో చేరి పులులతో ఆడించడం, తాడు మీద నడవడం, మేజిక్ వంటి నైపుణ్యాలు గడించిన సాహసి .
మూడేళ్ళ కూతురు అంకెలతో ఆశ్చర్యకరమైన తమాషాలు చేయడం గమనించగానే ఆ తండ్రి తన సర్కస్ ఉద్యోగాన్ని వదలి, శకుంతలా దేవి మీదనే దృష్టి పెట్టారు. కూతురుతో చిన్న చిన్న ప్రదర్శనలు చేయించడం మొదలు పెట్టారు. అదే సమయంలో దాన్నే కూడు పెట్టే ఉపాధిగా మార్చుకున్నారు. ఆరేళ్ళ వయసులో శకుంతలాదేవి మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రదర్శనిచ్చేలా చేశారు . తర్వాత అన్నామలై విశ్వవిద్యాలయంలో సైతం ప్రదర్శన ఇచ్చారు. ఇదంతా ఎనిమిదేళ్ళలోపే! కొంత వయసు రాగానే ఈ అద్భుత ప్రతిభ తగ్గిపోతుందని కొందరు భావించారు. అలాంటిది ట్రూమన్ హెన్రీ సాఫోర్ట్ విషయంలో జరిగింది కూడా! తండ్రితో శకుంతలా దేవి లండన్ వెళ్ళి సుమారు ఒక పదిహేనేళ్ళు అక్కడ పెరిగారు
1960లో భారతదేశం తిరిగి వచ్చారు. కలకత్తాకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నారు. 1979లో భర్త హోమసెక్స్యూయాలిటి కారణంగా వారి వివాహ బంధం విచ్ఛిన్నమై. విడాకులుగా మిగిలింది. శకుంతలాదేవి రచించిన 1977 లో వెలువడిన ‘ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సూవల్స్’ పుస్తకం అప్పటికిది ఆ అంశాల పట్ల మనదేశపు తొలి రచన.
1982 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో శకుంతలా దేవి పేరు నమోదు చేశారు. గిన్నిస్ బుక్ అంటే ప్రపంచ రికార్డు అని వేరుగా చెప్పనవసరం లేదు. కేవలం 28 సెకెన్లలో రెండు పదుమూడు అంకెల సంఖ్యల హెచ్చవేతను చెప్పగలిగారు.
ఎటువంటి పరికరాలు లేకుండా 7686369774870, 2465099745779 అనేవి ఆ రెండు సంఖ్యలు. మొదటి సంఖ్యను రెండవ సంఖ్యతో హెచ్చిస్తే ఏమి వస్తుందో తెలుసా? అ 26 అంకెల సంఖ్య ఇలా ఉంటుంది 18947668177995426462773730 దీన్ని మనం సరిగా చూసి చదవలేక పోవచ్చు, లేదా చూసి సరిగా రాసుకోలేక పోవచ్చు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విశేషాలు శకుంతలా దేవి గురించి చాలా ఉన్నాయి. ఒక అంకె లేదా సంఖ్యను అదే సంఖ్యతో లేదా అంకెతో గుణిస్తే వచ్చే మొత్తాన్ని వర్గం అంటారు. మూడును మూడుతో గుణిస్తే తొమ్మిది వస్తుంది. తొమ్మిది అనేది మూడుకు వర్గం అవుతుంది. అలాగే మూడు అనేది తొమ్మిదికి వర్గమూలమవుతుంది. మూడు సార్లు హెచ్చ వేస్తే ఘనవర్గం అవుతుంది. మూడుకు ఘనం 27 అవుతుంది. అలాగే 27కు 3 ఘనమూలమవుతుంది. మరి 61, 629, 875 కు ఘన మూలమెంత? అని శకుంతలా దేవిని అడిగారు. అంటే ఏ సంఖ్యను అదే సంఖ్యతో రెండు సార్లు హెచ్చవేస్తే ఈ సంఖ్య వస్తుంది అనేదే ఆ ప్రశ్న. ఆ సంఖ్య 395 అని ఠక్కున శకుంతలా దేవి చెప్పగలిగారు.
ఇంకా 170,859,375 అనే సంఖ్యకు ఏడవ వర్గమూలమెంత అని అంటే 15 అని ఆవిడ చెప్పారు. 15 ఇంటూ 15 ఇంటూ ఇలా ఏడుసార్లు వేసి గుణిస్తే ఈ 170859375 అనేది వస్తుంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ సైకాలజి ప్రొఫెసర్ డా॥ ఆర్థర్ జెన్సన్ ఈ పరీక్షలు పెట్టి నోట్బుక్ లో రాసుకునే ముందే శకుంతలా దేవి జవాబు చెప్పడంతో ఆయన నివ్వెరపోయారు. ఈ వివరాలను ఆయన 1990లో పరిశోధన పత్రంగా వెలువరించారు.
ఆమె కుమార్తె అనుపమతో 1980లో బెంగుళూరులో స్థిరపడి గణిత క్రీడలతో పాటు రకరకాల రచనలు మొత్తం 30 దాకా చేశారు. వాటిలో కాల్పనిక సాహిత్యంతో పాటు ఆలోచనాత్మకమైన రచనలు కూడా ఉన్నాయి. కొన్ని టైటిల్స్ ఇలా ఉన్నాయి:

Figuring: The Joy of Numbers;
Puzzles to Puzzle You;
More Puzzles to Puzzle You;
The Book of Numbers;
Astrology for You;
Super Memory: It Can Be Yours;
Mathability: Awaken the Math Genius in Your Child;
Perfect Murder.
1977లో అమెరికాలో సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో 201 అంకెలు గల సంఖ్యను ఇచ్చి దాని 23వ వర్గమూలాన్ని కనుక్కోమన్నారు. ఏ సంఖ్యకు అదే సంఖ్యతో 23 సార్లు గుణిస్తే ఈ 201 అంకెల సంఖ్య వస్తుందో తెలుసుకోవాలని పరీక్ష. కేవలం 50 సెకెన్లలో శకుంతలా దేవి జవాబు 546 372 891 అని చెప్పారు. ఇది కరెక్టు అని ఎవరు నిర్ణయిస్తారు? అప్పట్లో శకుంతలా దేవి జవాబును యూనివీక్ – 1108 కంప్యూటర్ తో సరిచూశారు!
రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు ఆవిడ దగ్గరకు జ్యోతిష్యం కోసం వచ్చేవారు.1980లో మెదక్ లోకసభ స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేశారు.
2013 ఏప్రిల్ 21న శకుంతలా దేవి బెంగుళూరు అస్పత్రిలో శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో పోరాడి కన్నుమూశారు. తర్వాత సరిగ్గా రెండు రోజులకు హిందూస్తాని మహాగాయని షంషాద్ బేగం మరణించారు. తన నోటి నిండా ఉండే అమృతాన్ని మన చెవుల నిండా పంచగలిగిన గంధర్వగాయని షంషాద్ బేగం. ఈమె కూడా శకుంతలాదేవి లాగే ఏ పాఠశాలలో చదువుకోలేదు, శిక్షణా పొందలేదు. మరి ఈ అమరగానం ఎలా సాధ్యమైందో అంతు చిక్కదు. నిజానికి ఇలాంటివి మన మానవ మేధకు అంతు చిక్కక పోవచ్చు. 2013 నవంబర్ 4 గుగుల్ సెర్చి ఇంజన్ శకుంతలా దేవి జన్మదినమనీ, ప్రత్యేకంగా గణితాత్మకంగా రోజంతా గుర్తు చేసింది.
శ్రీనివాస రామానుజం ఒకరకమైన గణితశాస్త్రపు అద్భుతంగా కనబడితే; శకుంతలా దేవి మరోరకమైన అద్భుతంగా భాసించారు. అయితే ఈ ఇద్దరిలో తేడా ఏమిటంటే శకుంతలాదేవి పాఠశాలకు పోలేదు, చదువుకోలేదు. కానీ ఇంత విశేష ప్రతిభ ఎలా సాధ్యమైందో బోధపడ లేదు. అంతకు ముందు వారి కుటుంబంలో ఎవరికీ అంకెల మీద ఇంత మోజు గానీ, ఇంత ప్రకాశం కానీ లేవని తెలుస్తోంది.
తన కన్నా ఇరవై సంవత్సరాల పెద్ద వాడైన, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పుట్టుగ్రుడ్డి లక్కోజు సంజీవరాయశర్మ గణిత ప్రతిభను శకుంతలా దేవి విశేషంగా గౌరవించారు, అభినందించారు!

డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు, మొబైల్: 9440732392



