డా. విరించి విరివింటి

జీవశాస్త్ర పరిధిలోనే కాలానుగుణంగా క్రమానుగతంగా వచ్చిన ఒక అంతర్గత హేతుబద్ధ పరిణామమే చివరికి డార్విన్ సిద్ధాంతంగా ఏ విధంగా పరిపక్వతకు వచ్చిందో గత వ్యాసంలో చూశాం. ఈ వ్యాసంలో ఇంకాస్త ముందుకు పోయి అసలు ఇటువంటి జీవశాస్త్రం వంటి విజ్ఞాన సంబంధ విషయాలను ఆయా కాలాల సామాజిక ఆర్థిక పరిస్థితులు లేదా భావనలు ఏమైనా ప్రభావితం చేస్తాయా? అనే విషయాన్ని గమనిద్దాం‌. 

ఎందుకంటే మనకందరకూ తెలిసిన విషయమేమిటంటే, డార్విన్ తన పరిణామ సిద్ధాంత ఆలోచన అభివృద్ధిలో ఆర్థిక శాస్త్రవేత్త థామస్ రాబర్ట్ మాల్థస్ జనాభా పై రాసిన పుస్తకం కూడా ఒక ముఖ్యమైన భూమిక వహించిందని. అందుకే ఆయా కాలాల సామాజిక ఆర్థిక అంశాలు వ్యక్తులనూ, ఆలోచనాపరులనూ, శాస్త్రవేత్తలనూ, వారి వైజ్ఞానిక శాస్త్ర అంశాలనూ ప్రభావితం చేస్తుంటాయా అనే చర్చ ఈ సందర్భంగా ముఖ్యమైనదౌతుంది. Robert M. Young, వంటి సైన్స్ చరిత్రకారులు డార్విన్ ఆలోచనలకు విక్టోరియన్ బ్రిటన్‌లో ఉన్న ఆర్థిక-సామాజిక పోటీ వాతావరణంతో సంబంధం ఉందని Materialistic conception of science history కోణంలో వివరించారు కనుక మనం ఈ కోణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం.

 ధామస్ రాబర్ట్ మాల్థస్ (1766–1834) ఒక బ్రిటిష్ రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, పాస్టర్ కూడా. అతడు 1798 లో An Essay on the Principle of Population అనే గ్రంథం రాశారు. “జనాభా గణాంకంగా పెరుగుతుంది కానీ ఆహార వనరులు నెమ్మదిగా పెరుగుతాయి- కాబట్టి వనరుల కోసం పోటీ తప్పదు” అనేది అతడి ప్రధానమైన వాదన స్థూలంగా. ఈ పుస్తకాన్ని 1838 లో డార్విన్ చదవడం జరిగింది. సమాజంలో వనరుల పోటీ వల్ల బలమైనవారు మాత్రమే బతుకుతారు అనే మాల్థస్ ఆలోచనే ఒకరకంగా డార్విన్ సహజ ఎంపిక (natural selection) సిద్ధాంతానికి ప్రేరణ అయింది. ఒక ప్రశ్న ఇక్కడ సహజంగానే ఉద్భవిస్తుంది: శాస్త్ర ఆలోచనలు పూర్తిగా ప్రకృతి పరిశీలనల నుంచే పుడతాయా? లేక అవి పుట్టుకొచ్చే కాలం యొక్క సామాజిక-ఆర్థిక వాతావరణం కూడా వాటి భాషను, ఉపమానాలను ప్రభావితం చేస్తుందా?

18వ శతాబ్దం చివరిలో బ్రిటన్‌లో ఆడం స్మిత్ తన “Wealth of Nations”(1776)పుస్తకంలో అప్పటికే రూపుదిద్దుకుంటున్న Laissez Faire మార్కెట్ ఆర్థిక వ్యవస్థను సైద్ధాంతికంగా వివరించాడు. అప్పుడప్పుడే మొదలవుతున్న పారిశ్రామికీకరణ (Industrialization) ప్రభుత్వ నియంత్రణ తగ్గాలనీ, మార్కెట్ స్వేచ్ఛ పెరగాలనీ కోరుకుంది. గ్రామీణ వ్యవసాయ జీవితం క్రమంగా కుంచిచుకుపోతూ వాటి స్థానంలో చిన్న పరిశ్రమలు వచ్చి నగరీకరణ పెరిగింది. వ్యవసాయ గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. టెక్స్టైల్ మిల్లులు, చిన్న పరిశ్రమలు వేగంగా పుంజుకోవడంతో వ్యవసాయ కూలీల స్థానంలో కార్మిక వర్గం వచ్చింది. వాణిజ్యకారులు, పరిశ్రమల యజమానులు సమాజంలోకి వచ్చారు. ధనికులైన పరిశ్రమ యజమానులు vs ఆ పరిశ్రమల్లో పని చేసే పేద కార్మికులు అనే విభజన వచ్చి సమాజంలో ధనిక పేద వ్యత్యాసం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ మార్పులకు ప్రతిస్పందనగా రొమాంటిక్ కవులు ప్రకృతిని తిరిగి గుర్తుచేశారు. William Wordsworth, John Keats వంటి కవులు గ్రామీణ ప్రకృతినీ ఆ అందమైన జీవితాన్నీ కోల్పోతున్నామనే స్పృహతో ప్రకృతిని తమ కవిత్వంలో మహిమాన్వితం చేశారు. ఈ పరిస్థితుల్లో సమాజంలోని మేథో వర్గంలో – ఉత్పాదకత, మార్కెట్, పోటీ, పేదరికం, జనాభా, వనరుల పంపిణీ వంటి వాటిపై తీవ్రమైన చర్చలు జరుగుతుండిన్నాయి. ఆ సమయంలో Thomas Robert Malthus “జనాభా పెరుగుదల వనరులపై పోటీని పెంచుతుంది” అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రభుత్వం పేదలకు ఎక్కువుగా సహాయం చేయడం వల్ల జనాభా మరింత పెరిగి సమస్యలూ పెరుగుతాయని ఆయన భావించాడు. కాబట్టి పేదరికాన్ని ప్రభుత్వ జోక్యంతో పూర్తిగా తొలగించలేమని ఆయన సూత్రీకరించాడు. ఈ అభిప్రాయం అప్పటి Laissez Faire ఆర్థిక ధోరణిని ప్రతిబింబిస్తుంది. మాల్థస్ చేసిన ఈ ఆలోచనలను చదివిన Charles Darwin అందులోని పోటీ తత్త్వాన్ని జీవ ప్రపంచానికి విస్తరించాడు. అది Natural Selection అనే పరిణామ సూత్రాన్ని struggle for existence రూపంలో ముందుకు వచ్చింది. 

 ఐతే ఇక్కడ మనం గమనించాల్సినది, డార్విన్ అప్పటి ఆ సామాజిక వాతావరణంలోనే పెరిగినా, కొందరు చరిత్రకారులు భావిస్తున్నట్టు అతని శాస్త్రీయ ఆలోచనలను పూర్తిగా ఆర్థిక-లెసీజ్ ఫాయిర్ విలువలకు సమానంగా చూడటం చేశారు‌. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా డార్విన్ చాలా మానవతా దృక్పథం కలిగినవాడు. తరువాత కాలంలో దాస్యాన్ని (slavery) తీవ్రంగా విమర్శించిన వాడు, మనుషుల మధ్య సహకారం కూడా పరిణామంలో ముఖ్యమని చెప్పినవాడు. అంటే జీవశాస్త్ర వేత్తగా ఆ సమాజపు ఆర్థిక విలువలకు దూరంగా జరిగినవాడు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ సిద్ధాంతం యొక్క మూల జీవశాస్త్ర సూత్రాలు జీవశాస్త్ర పరిధిలోనే అభివృద్ధి చెందినా, వాటిని వివరించే భాష మరియు ఉపమానాలు సమకాలీన ఆర్థిక-సామాజిక ఆలోచనతో కొంతవరకు ప్రభావితం ఔతాయనీ, ఈ పోలికలు భాష కేవలం యాదృచ్ఛికం కాదనీ, ప్రతి కాలం తనకున్న భావజాలంతో శాస్త్రాన్ని కూడా పునర్వ్యాఖ్యానించుకుంటుందనీ అర్థమవుతుంది.

అంతే కాకుండా డార్విన్ తరువాత పరిణామ వాద సిద్ధాంతంలో వచ్చి చేరిన మార్పులు చేర్పులు కూడా ఆయా ఆర్థిక-సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించడం కూడా మరో ఆసక్తికరమైన కోణం. రిచర్డ్ డాకిన్స్ Selfish Gene భావనలో వ్యక్తి/జీన్ ప్రయోజనం ప్రధానమని చెప్పడం, ఈ ఆధునిక కాలంలో పెరిగిన “నయా-ఉదారవాదం” లోని వ్యక్తి-కేంద్రిత పోటీ భావనలకు పోలిక కలిగి ఉందని కొందరు వ్యాఖ్యానించారు. జాన్ మేనార్డ్ స్మిత్ అభివృద్ధి చేసిన Evolutionary Game Theory లో జీవుల వ్యూహాలు, సహకారం- వాటి మధ్య పోటీ & సమతుల్యం వంటి భావనలు ఈ కాలపు మార్కెట్ వ్యూహాలు, ఆర్థిక నిర్ణయ నమూనాల పోలికలతో కనిపిస్తాయని కూడా వ్యాఖ్యానాలు ఉన్నాయి. “శాస్త్ర సిద్ధాంతాలు పూర్తిగా శూన్యంలో పుట్టవు” అన్న కొంతమంది చరిత్రకారులు, తాత్వికుల వాదన ఇటువంటి వ్యాఖ్యానాలకు ఆధారమౌతుంది. ఐతే శాస్త్ర వర్ణన పై పరిస్థితుల ప్రభావం భాష ఉపమానాలకే పరిమితమౌతుందా లేక జీవ శాస్త్ర సిద్ధాంతాలను కూడా ప్రభావితం చేస్తుందా అనేది చాలా సున్నితమైన అంశం. ఈ సందర్భంగా సామాజిక-రాజకీయ దృక్పథంలో ఎడమ పక్షానికి సామ్యవాదానికి దగ్గరగా ఉండే స్టీఫెన్ జె గౌల్డ్ జీవ పరిణామాన్ని సహకారం, యాదృచ్ఛికత, నిర్మాణ పరిమితులు వంటి కోణాల్లో వివరించడానికి మొగ్గు చూపడం కేవలం యాదృచ్ఛికం కాదు. అంతే కాకుండా అతడు డాకిన్స్ చెప్పిన జీన్ కేంద్రక ధోరణిని కూడా తీవ్రంగా ఖండించడం సామాజిక ఆర్థిక ప్రభావం శాస్త్ర విజ్ఞానం పై ఉంటుందనే వాదనకు బలాన్నిస్తుంది. హైపోథెటికల్ గా ఈ రోజు డార్విన్ ఉండి, తన పరిణామ సిద్ధాంతం ప్రతిపాదించి ఉండింటే ఆ జీవ శాస్త్ర మూల సిద్ధాంతం అలాగే ఉన్నా దానిని వివరిస్తున్న భాష వేరేగా ఉండేది అనుకోవచ్చు. అంటే ఈ వివరణలు విజ్ఞాన శాస్త్రం ద్వారా సామాజిక దృక్పథాలను చూడటానికి కిటికీలుగా మాత్రమే మనం చూడవలసి ఉంటుంది. వీటి ఆధారంగా విజ్ఞాన శాస్త్ర పరిశోధనల విలవను, మంచి చెడులను బేరీజు చేయడం ఎంతమాత్రం సరైన ధోరణి కాదు.

వ్యవసాయాధారంగా ఉన్న మాల్థస్ కాలంలో అతడు మనిషిని వనరులను ఉపయోగించి, వాటిని ఖర్చు చేసే వ్యక్తిగా చూశాడు. అందువలన జనాభా పెరిగితే సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని ఆతడు భావించాడు. పారిశ్రామికీకరణలోమనిషి కార్మిక శక్తిగా చూడబడితే, ఈ రోజు నయా ఉదారవాద ఆర్థిక సమాజంలో మనిషి “మార్కెట్ ని విస్తరించగల శక్తి”గా చూడబడుతున్నాడు. ఈ భూమి మీద మొదటిసారిగా అతి ఎక్కువగా ఏడువందల కోట్లపైన జనాభాగా మనమంతా వ్యాపించి ఉన్నాం. ఐతే ఆశ్చర్యకరంగా ఎక్కువ జనాభాని కలిగి ఉంటేనే మార్కెట్ కి లాభం చేకూరుతుందన్న “డెమోగ్రాఫిక్ డివిడెండ్” భావనలు ప్రపంచ దేశాల్లో ప్రబలుతున్న మార్కెట్ ఆధారిత కాలంలో కూడా ఉన్నాం.

ఇంతకాలం భారతదేశ సమస్యలకూ, బీదరికానికీ ప్రధాన కారణాల్లో ఇక్కడున్న జనాభా కూడా ఒక ప్రధానమైన కారణం అనుకునేవాళ్ళం.. కానీ ఈరోజు, ఎక్కువ జనాభా ఉంటేనే, అది కూడా ఉత్పాదన పెంచగల వయసులో ఉన్న యువత( 15 నుండి 64 సంవత్సరాల వయస్సు గలవారు) ఎక్కువగా ఉంటేనే, ఆర్థిక వ్యవస్థకు తగినంత కార్మిక శక్తి, శ్రామిక శక్తి (Labor Force) అంది మార్కెట్లు విస్తరిస్తాయి, దేశ ఉత్పత్తి పెరుగుతుంది, వినియోగం (consumption) పెరుగుతుంది, పొదుపు పెరుగుతుంది, అలాగే పెట్టుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి దేశం ఆర్థికాభివృద్ధి జరుగుతుంది – అనే కొత్త భావనకు వచ్చేశాం. ఈ భావనను demographic dividend అంటున్నారు..

ఏ సమాజం ఐతే అభివృద్ధి చెందుతూ జీవన పరిస్థితులు మెరుగవుతున్నాయో అక్కడ ఇతరులపై ఆధారపడిన జనాభా తగ్గుతుంది. ఇతరులపై ఆధారపడిన జనాభా అంటే స్థూలంగా పిల్లలు, ముసలి వాళ్ళు. ఇదెందుకు జరుగుతూందంటే అభివృద్ధి చెందిన సమాజాల్లో ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది. ఆలస్య వివాహాలు, పిల్లలు వద్దనుకోవడం, భార్యాభర్తలిద్దరూ పనిచేసే వారే ఐతే ఎక్కువ మంది పిల్లలను పెంచగలిగే స్థితి లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతుండటంతో పిల్లల సంరక్షణ కష్టతరమౌతుందని తక్కువ పిల్లలను కనడం వంటి ఎన్నో అంశాలు ఆధునిక సమాజంలో ఫెర్టిలిటీ రేటును తగ్గిస్తాయి. ఆరోగ్య సౌకర్యాలు పెరగడంతో ఎవరి మీద ఆధారపడని ముసలి వారి సంఖ్య పెరగడంతో , పని చేసే యువత పూర్తి స్థాయిలో శ్రమ శక్తిని అందించగలిగే అవకాశం పెరుగుతుంది. ఇలా ఉన్న దేశం డెమోగ్రాఫిక్ డివిడెండ్ లో ఉందని చెప్పవచ్చు. ఐతే ప్రస్తుతం అతి ఎక్కువగా యువత ఉన్న దేశంగా భారతదేశం కూడా ఆ ఫలాలను అందుకునేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఈ దశ భారతదేశానికి 2050 వరకు కొనసాగుతుంది. 2050 తర్వాత ప్రస్తుతమున్న యువత అంతా వయసు మళ్ళినవారవుతారు కనుక ఇప్పటినుంచే భారతదేశం కూడా ఎక్కువగా పిల్లలను కనాలనే ఆలోచన చేస్తోంది. 

ఐతే ముసలి వాళ్ళ జనాభా పెరుగుతున్న జపాన్, దక్షిణకొరియా, చైనా వంటి దేశాలు ఈ మార్కెట్ లాజిక్ ఆధారంగానే జనాభా పెంపుదలపై దృష్టి పెట్టాయి. ఒకప్పుడు ‘ఒక సంతానమే చాలు’ అని చట్టాలు చేసిన చైనా ఇప్పుడు నాలిక కర్చుకుని జనాభా పెంచే దిశగా అడుగులు వేస్తోంది. భారతదశంలో ఉత్తరాదికంటే దక్షిణాదిన ఫర్టిలిటీ రేటు తగ్గుతోంది. కాబట్టి దక్షిణ రాష్ట్రాలలో జనాభా పెంచవలెననే స్పృహ పెరుగుతోంది.

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మార్కెట్ తర్కాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ జనాభాను కనండని, అలా కన్న వాళ్ళకు రాయితీలు, అదనపు సౌకర్యాలు కూడా ప్రకటించడం ప్రస్తుత సమాజంలో మార్కెట్ లాజిక్కే జనాభాను నియంత్రిస్తుందనడానికి ఒక ఉదాహరణ. ఐతే ఇక్కడున్న ముఖ్యమైన మెలిక ఏంటంటే – ఈ డివిడెండ్ కేవలం యువత సంఖ్య మీదే ఆధారపడి ఉండదన్న సత్యం మనం తప్పక గమనించాలి. యువత సంఖ్య కంటే వారిలో ఉన్న పని చేయగలిగిన స్కిల్ మీద ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆధారపడుతుంది . అంటే ఇది జనాభా ఆర్థికత( population economy) నే కాకుండా విజ్ఞాన /నేర్పు ఆర్థికత (knowledge/ skill economy) కూడా. కాబట్టి యువత జనాభా పెరిగితే చాలు రాబోయే కాలంలో ఆర్థికాధిపత్య లాభాలు వచ్చేస్తాయని అనుకునే ముందు, ఈ జనాభా ఎంత పని నిపుణతగల జనాభా (స్కిల్డ్ జనాభా)గా మారిందనేది కూడా ముఖ్యమవుతుంది. దేశంలోని మొత్తం పని శక్తి (వర్క్ ఫోర్స్) లో నైపుణ్యంగల పనిమంతులు( స్కిల్డ్ వర్కర్స్) మన దేశంలో చాలా తక్కువగా ఉన్నారని Confederation of Indian Industry(CII) హెచ్చరించింది. జపాన్ లో మొత్తం పని శక్తిలో నైపుణ్యతగల పనిశక్తి 80 శాతం ఉంటే, బ్రిటన్ లో 68శాతం, అమెరికాలో 52 శాతం ఉంది. కానీ భారతదేశంలో అతి తక్కువగా ప్రమాద స్థాయిలో ఈ నిపుణత 3-5 శాతంగా ఉంది. ఇది అంతర్జాతీయ సగటుకంటే తక్కువగా ఉండటం విభ్రాంతికరమైన విషయం. పెరుగుతున్న నిరుద్యోగం, పాఠశాల డ్రాపవుట్లు, తరుగుతున్న ఉన్నత విద్యా ప్రమాణాలు, పెరుగుతున్న బీదరికం, మధ్యతరగతి తరుగుదల ఇత్యాదివన్ని మన దేశం ఆశించబోయే జనాభా లాభాన్ని(డెమొగ్రాఫిక్ డివిడెండ్ ను) ఒక భరించలేని భారంగా( లయబిలిటీగా ) మార్చనున్నాయి. తక్షణ ఉద్యోగ కల్పన, విద్యా ప్రమాణాల పెంపుదల, నైపుణ్యతల పెంపుదల సాధించకుండా కేవలం జనాభా పెంచడం వలన ఎలాంటి ఉపయోగం కలగకపోగా మాల్థస్ ఊహించినట్లు వనరులపై ఒత్తిడిని పెంచుతుంది. చైనాను మించిపోయే యువశక్తి మన సొంతం అనుకునే ముందు స్కిల్ లేని జనాభా పెరిగితే వచ్చే అసమానతలను ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడం ఎలా అన్న ముందు జాగ్రత్త, సంసిద్ధత లేకపోతే ఈ ధోరణి సమాజాన్ని మరింత ప్రమాదం లోకి నెట్టి వేస్తుంది. ఎందుకంటే నియోలిబరల్ విధానం welfareని తగ్గిస్తుంది, వనరుల ప్రైవేటీకరణ కూడా చేస్తుంది. కాబట్టి ఆర్థిక అసమానతలను కూడా పెంచుతుంది. అంటే నియోలిబరల్ ఆర్థికతలో జనాభా ఒక సమస్య ఎప్పటికీ కాదు; దాని సమస్య మార్కెట్. సమాధానం మార్కెట్. స్కిల్ లేని జనాభా పెరిగి ప్రైవేట్ మార్కెట్ విస్తరించే కొద్దీ అసమానతలు పెరిగి అది సామాజిక సంక్షోభంగా మారుతుందనేది సామాజిక వేత్తలకున్న ఆందోళన. 

మాల్థస్ కాలంలో జనాభా అనేది వనరులపై ఒత్తిడిని సృష్టించే సమస్యగా కనిపించింది. జీవ పరిణామ వాదానికి భూమికగా కూడా నిలబడింది. కానీ పారిశ్రామిక, మార్కెట్ ఆధారిత సమాజం అభివృద్ధి చెందేకొద్దీ అదే జనాభా కార్మిక శక్తిగా, ఉత్పాదక శక్తిగా, మార్కెట్ విస్తరణకు మూలంగా పునర్వ్యాఖ్యానించబడింది. అంటే, మనిషి అనే జీవి మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకునే సామాజిక సిద్ధాంతాలు కాలానుగుణంగా మారే ఆర్థిక నిర్మాణం, ఉత్పత్తి సంబంధాలూ, సామాజిక అవసరాల ప్రకారం “మనిషి” అనే భావనను, జనాభా సిద్ధాంతాలను, తిరిగి నిర్వచిస్తుంది. దాని తాలూకు పరిభాషను విజ్ఞాన శాస్త్రానికీ అందిస్తుంది. అందువల్ల మాల్థస్ నుంచి డెమోగ్రాఫిక్ డివిడెండ్ వరకు వచ్చిన ఈ భావనల పరిణామం ఒక ఆసక్తికరమైన మేథో వైజ్ఞానిక చరిత్ర. వైజ్ఞానిక శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక తత్వశాస్త్రం ఒకదానికొకటి విడదీయరానంతగా పెనవేసుకుని పోయి ఇప్పటిదాకా మనకు దర్శనమిచ్చాయి. కానీ నేడు కృత్రిమ మేథ రూపంలో వస్తున్న యంత్ర నైపుణ్యాలు మనిషి నైపుణ్యాలను మించిపోయిన కచ్చితత్వంతో మనముందుకు వస్తున్న తరుణంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ నాలెడ్జి ఎకానమీగా మారనున్న సందర్భంలో రాబోయే కాలంలోని ఆర్థికవేత్తలు, జీవశాస్త్రవేత్తలు struggle for existence ని survival of the fittest ని ఎలా నిర్వచిస్తారన్నది ప్రస్తుతానికొక అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *