డా. యం. గేయానంద్
తొలి మధ్యయుగాలలో భారతదేశం అనేక చిన్న మధ్యతరహా రాజ్యాలుగా విడిపోయింది. ఒక కేంద్రీకృత అధికారం క్షీణించింది. స్థానిక పాలకులు నిరంతర యుద్ధాలకు పాల్పడేవారు. వివిధ పద్ధతులలో ఫ్యుడలీకరణ జరిగింది. నగదుకు బదులు భూములను దానంగా/ ప్రతిఫలంగా ఇచ్చే పద్ధతి ఎక్కవయింది. విదేశీ వాణిజ్యం తగ్గడం వల్ల నగరాల ప్రాముఖ్యత తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్వవస్థ బలపడింది. అనేక కొత్త ఉప కులాలు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజల్లోకి మతాన్ని సులభంగా తీసుకు వెళ్ళే కార్యకలాపాలు కూడా పెరిగాయి.
భారతదేశంలో తొలి మధ్యయుగాలు (క్రీ.శ.600 -క్రీ.శ.1200 వరకు) ఒక ప్రత్యేకమైన కాలం. అప్పటికే మహా సామ్రాజ్యాల దశ ముగిసింది. దేశమంతటా అనేక స్థానిక పాలకులు తలెత్తారు. సామాజిక చలనాలు ఉన్నా వృత్తుల చుట్టూ కుల వ్యవస్థ బిగుస్తున్న కాలమది. పురాణాలకు ప్రాధాన్యత పెరుగుతున్న కాలం కూడా. వృత్తులు సాంకేతికంగా సంఘటితమవుతున్నాయి. కాని వృత్తి విజ్ఞానాలు సైద్ధాంతీకరణలకు పెద్దగా దారితీయని పరిస్థితి. హైందవ మతం పురాణీకరణ జరుగుతున్న కాలం కూడా అదే. అయితే తొలి మధ్యయుగాల కంటే కొద్దిగా ముందు కాలంలో ఉన్న ఆర్యభట్ట/ ఆర్యభట ప్రభావం ఈకాలం అంతా కనిపిస్తుంది.
వైజ్ఞానిక విప్లవకారుడు, ఆర్యభట్ట…
ఆర్యభట్ట క్రీ.శ.476 లో జన్మించి ఉండొచ్చు. అది గుప్తుల కాలం, ఆయన పాటలీపుత్రంలో ఉండేవాడు. అయితే ఆయన కేరళ వాడని కొందరు, నర్మదా గోదావరి మధ్య ప్రాంతం వాడని మరికొందరు అంచనా వేశారు.
ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయంలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉండి ఉండవచ్చు.
ఆర్యభట్టు వైజ్ఞానిక కృషిని ఒకసారి గుర్తుచేసుకొందాం. ఆధునిక గణితంలో చూసే అనేక ప్రాథమిక సూత్రాలను ఆ కాలంలోనే ఆయన ప్రతిపాదించాడు. సున్నా కు ఒక విలువ ఇచ్చి స్థాన విలువ పద్ధతిని (place value system) ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన పాత్ర కీలకం. వృత్తం యొక్క చుట్టుకొలతకు వ్యాసానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే ‘పై’ విలువను ఆయన లెక్కించాడు. “నాలుగుకు వంద కలిపి ఎనిమిదితో గుణించి 62,000 కలపండి. వచ్చిన మొత్తాన్ని 20 వేలతో భాగిస్తే సుమారుగా వృత్తం యొక్క చుట్టుకొలతకు వ్యాసానికి గల సంబంధం (‘పై’ విలువ) వస్తుంది” అని “ఆర్యభట్టీయం” లో వివరించాడు. ఇది మనం ఇప్పడు చెప్పే విలువకు దగ్గరలో ఉంటుంది. అట్లే బీజ గణితంలో ఉండే వర్గమూలాలు, ఘనమూలాలను కనుగొనే పద్ధతిని ఆయన వివరించారు. సైన్ పట్టికల గా, భావించే లాంటి వాటిని రూపొందించి త్రికోణమితి శాస్త్రానికి పునాదులు వేశాడు.
అట్లే టెలిస్కోప్‍లు ఏవీ లేని ఆకాలంలో కేవలం గణితం ద్వారా ఆయన విశ్వం గురించి చెప్పిన విషయాలు (భూ భ్రమణం, గ్రహణాలు సవత్సరం లెక్కింపు) నేటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి.
దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ లాంటి వారు ఆర్యభట్టను ఒక వైజ్ఞానిక విప్లవకారుడిగా చూశారు. ఆర్యభట్ట కంటే ముందు ఖగోళ శాస్త్రం మతపరమైన నమ్మకాలపై ఆధారపడి ఉండేది. భూమి స్థిరంగా ఉందని నక్షత్రాలు, గ్రహాలు తిరుగుతాయని అప్పుడు అనుకునేవారు. అయితే భూమి స్థిరంగా లేదని అది తన అక్షం చుట్టూ తిరుగుతూ ఉందని ఆర్యభట్ట చెప్పాడు. గ్రహణాలకు భౌతిక కారణాలను వివరించడం ద్వారా ఖగోళ శాస్త్రాన్ని మూఢనమ్మకాల నుండి వేరు చేశాడు. ఆర్యభట్టకు ముందు గణితం యజ్ఞవాటికల నిర్మాణానికి (సుల్వ సూత్రాలు) పరిమితమై ఉండేవి. అయితే ఆర్యభట్ట గణితానికి ఒక స్వతంత్రతను తెచ్చాడు. అంతవరకు విజ్ఞానానికి, మతానికి మధ్య పెద్దగా సరిహద్దులు లేవు. అయితే ఆర్యభట్ట విజ్ఞానాన్ని ఒక స్వతంత్ర విభాగంగా చూశాడు. ఆయన చేసిన ప్రతిపాదనలు చూస్తే కొన్ని పద్ధతుల పునాదులుగా ఆయన వైజ్ఞానిక ఆలోచనలు సాగాయని అనవచ్చు. గణితాన్ని, ఖగోళ శాస్త్రాన్ని వేరువేరుగా కాకుండా ఒకదానికొకటి అనుసంధానించిన తొలి వైజ్ఞానికుడు ఆయనే కావచ్చు.
ఖగోళ శాస్త్రంలో, గణితంలో ఆయన తీసుకువచ్చిన భావనలు ఆ తరువాత అభివృద్ధి చెందిన ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఒకవిధంగా పునాదులు అయ్యాయి అనుకోవచ్చు కూడా. ఆకాలంలో మత గ్రంథాలు, భూమి స్థిరంగా ఉందని, రాహు కేతువులు, సూర్య చంద్రులను మింగడం వల్ల గ్రహణాలు వస్తాయని చెప్పేవి. ఆర్యభట్టు అవి భూమి మరియు చంద్రుడి నీడల వల్ల వస్తాయని చెప్పాడు. ఆర్యభట్ట వాటికి భౌతిక కారణాలు ఉంటాయని ఆలోచించాడు. ఒకవిధంగా ఈ పురాణ నమ్మకాలను ధిక్కరించాడు. అప్పట్లో అదొక సాహసమే. నక్షత్రాల గమనంపై ఆధారపడి గణితాన్ని ఉపయోగించి ఆయన ఖగోళాన్ని పరిశీలించాడు. ఆవిధంగా మంత్రతంత్రాల నుండి, యజ్ఞయాగాల నుండి విజ్ఞానాన్ని వేరు చేశాడు. కేవలం ఊహలతో సరిపుచ్చ కూడదని పరిశీలనల ద్వారా ఫలితాలు రాబట్టాలని ఆయన భావన. భారతదేశంలో క్రమేణా వైజ్ఞానిక పురోగతికి అడ్డంకిగా మారుతున్న మత ఆంక్షలను ధిక్కరించిన మొదటివాడు ఆయనే కావచ్చు..
వ్యతిరేకతలు…
కానీ ఆర్యభట్ట చాలా వ్యతిరేకతలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
బ్రహ్మగుప్తుడు ఒక గొప్ప గణిత విజ్ఞాని. సున్నా యొక్క గణిత ధర్మాలను మొట్టమొదటిసారిగా నిర్వచించిన వ్యక్తి ఈయనే అంటారు. ఈయన ఋణ సంఖ్యలను గురించి కూడా వివరించాడు. అయినప్పటికీ ఆర్యభట్టను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన 7వ శతాబ్ధానికి చెందినవాడు. ఆర్యభట్ట సాంప్రదాయక అంశాలకు వ్యతిరేకంగా మాట్లాడటం బ్రహ్మగుప్తుడికి నచ్చలేదు. తన ‘బ్రహ్మస్పుట’ సిద్ధాంతంలో ఆర్యభట్టపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “ఆర్యభట్టు చెప్పేవి వేద విరుద్ధం. గ్రహణం సూర్య చంద్రాదులను రాహువు మింగడం వల్లే వస్తుంది” అని అందులో రాశాడు. బహుశా విజ్ఞాన శాస్త్రానికి మతపరమైన నమ్మకాలకు మధ్య జరిగిన తొలి చర్చగా దీన్ని భావించవచ్చేమో!
తొలి మధ్యయుగాలలో చాలా మంది విజ్ఞానులు ఆర్యభట్ట సిద్ధాంతాలను ప్రాతిపదికగా తీసుకొని గ్రంథాలను రాశారు. బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టను విమర్శించినప్పటికీ ‘సున్నా’ యొక్క ధర్మాలను గణిత సూత్రాలను చర్చించేప్పుడు ఆర్యభట్ట పద్ధతినే వాడుకొన్నాడు. బీజ గణితంలో ఆయన ప్రవేశపెట్టిన సమీకరణ సాధనాల పద్ధతి మధ్యయుగ గణితవేత్తలైన భాస్కరాచార్యుడు, మహావీరాచార్యుడు మరింతగా విస్తరించారు. భాస్కరాచార్య-II తన సిద్ధాంత శిరోమణిలో ఆర్యభట్ట కలనగణిత (calculous) భావనలను ముందుకు తీసుకుపోయాడు.
ఆకాలానికి సంబంధించిన మరో విజ్ఞాని వరాహ మిహిరుడు (క్రీ.శ.505). ఈయన ఆర్యభట్టను గౌరవించాడు. కాని పాత పద్ధతులనే అనుసరించాడు. ‘పంచ సిద్దాంతిక’ అనే గ్రంథాన్ని రాశాడు. 5 రకాల ఖగోళ సిద్ధాంతాలను క్రోఢీకరించాడు. అయితే ఈయన ఖగోళ శాస్త్రంతో పాటు జ్యోతిష్య శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. (జ్యోతిష్యం మన దేశంలోకి గ్రీకుల ద్వారా వచ్చిందంటారు.)
ఇతర శాస్త్రాలు..
తొలి మధ్యయుగాలలో వైద్యశాస్త్రం లోహ శాస్త్త్రాలలో కూడా అనేక విజ్ఞానులను చూస్తాము. వాక్ భటుడు ‘అష్టాంగ హృదయం’ అనే గ్రంథం రాశాడు. చరకుడు, సుశ్రుతుడు తరువాత ఈయనది కీలక పాత్ర, అట్లే వ్యాధులు గుర్తించే విధానంపై మాధవకరుడు ‘ఋగ్వ వినిశ్చయ/మాధవ నిదానం’ రాశాడు.
మధ్యయుగాల్లో మరో గొప్ప రసాయనిక శాస్త్రజ్ఞుడు నాగార్జుడు. ‘రస రత్నాకరం’ అనే గ్రంథం రాశాడు. లోహాలను శుద్ధి చేయడం పాదరసాన్ని ఔషదంగా మార్చడం వంటి విద్యలు ఆనాటి రసాయనిక పద్ధతులకు కొన్ని ఉదాహరణలు.
ఆ కాలంలో వైద్యులను, లోహకారులను తక్కువ చూపు చూసేవారు. శవాలను తాకడం, రక్తాన్ని, మాంసాన్ని ముట్టుకోవడం అపవిత్రమని భావించేవారు. దీనివల్ల ప్రయోగాత్మకతకు ఉండే విలువ తగ్గిపోయింది. రోగం అనేది పాపం వల్ల కాదు శారీరక మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెప్పడం సాంప్రదాయ వర్గానికి నచ్చలేదు.
పర్షియా చేరిన భారతీయ విజ్ఞానం….
మళ్ళీ ఆర్యభట్ట వద్దకు వద్దాం. ఆర్యభట్ట క్రీ.శ.550 లో మరణించాడు. ఆయన మరణం తరువాత ఆయన ప్రతిపాదించిన భూ భ్రమణం, గ్రహణాలు వెనుక వున్న ప్రతిపాదనలను భౌతిక కారణాలను అప్పటి సమాజం సులభంగా ఒప్పుకోలేకపోయింది.
క్రమేణా ఆర్యభట్టకు ప్రాధాన్యత భారతదేశంలో తగ్గిపోయింది. ఆయన గురించి ప్రస్తావనలు కూడా తగ్గిపోయాయి. కాని 8వ శతాబ్ధంలో బాగ్దాదులో భారతీయ విజ్ఞానానికి ఆహ్వానం లభించింది. క్రీ.శ.770 ప్రాంతంలో కంక అనే భారతీయ పండితుడు ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల గ్రంథాలను బాగ్దాదుకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ గ్రంథాల తర్జుమా అరబిక్‍లోకి జరిగింది. అక్కడున్న అల్ ఖ్వారిజ్మీ అనే ఒక గణిత శాస్త్రవేత్త భారతీయ విజ్ఞానాలను అధ్యయనం చేశాడు. అల్ హింద్ రాశాడు. క్రీ.శ.8వ శతాబ్దంలో ఆర్యభట్ట గ్రంథాలు అరబిక్ లోకి ‘అల్ అర్జభర్’ గా అనువదించారు. ‘0’ స్థాన విలువ పద్ధతి, త్రికోణమితి సూత్రాలను అరబ్బులు తమ సొంతం చేసుకొన్నారు. ఆవిధంగా అవి అరబిక్ అంకెలుగా మారాయి.
యూరప్ లో పునరుజ్జీవనం ప్రారంభమయినప్పుడు వారు అరబిక్ లో ఉన్న గ్రీకు, చైనా, భారతీయ గ్రంథాలను లాటిన్ లోకి అనువదించడం ప్రారంభించారు. ఈ లాటిన్ అనువాదాలు ప్రధానంగా స్పెయిన్, ఇటలీ దేశాలలో జరిగాయి. గిరార్డ్ ఆఫ్ క్రెమోనా అనే ఆయన అరబిక్ లో ఉన్న అనేక గ్రంథాలను లాటిన్ లోకి అనువదించాడు. ఆవిధంగా ఆర్యభట్ట ప్రతిపాదించిన గణిత బార్, సైన్ పట్టికలు ఐరాపాకు చేరాయి. ఆర్యభట్ట ‘జియా’ అని పిలిచిన పదాన్ని అరబ్బులు ‘జీబ్’ అన్నారు. లాటిన్ లో అది ‘సినస్’ అయింది. అదే నేటి ‘సైన్’. ఫైబొనాచి ఈ భారతీయ, అరబిక్ అంకెలను యూరప్ అంతటా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. క్లిష్టమైన రోమన్ అంకెల స్థానాల్లో సులభమైన భారతీయ గణిత పద్ధతి వచ్చి స్థిరపడింది.
భారతదేశంలో ఛాందస వాదం కారణంగా భూ భ్రమణం లాంటి ఖగోళ సిద్ధాంతాలు కొంతకాలం వెనుకపట్టు పట్టాయి. కాని అదే అరబిక్ లాటిన్ అనువాదాల ద్వారా యూరప్ లో కొత్త ఆలోచనలకు కారణం అయ్యాయి అనవచ్చు.
(వచ్చే నెల.. భారతదేశంలో మధ్యయుగా లు- టెక్నాలజీ)



