రవిరాజా పోతినేని
పరిచయం
దశాబ్దాల క్రితం, ఒక సైకిల్‌పై రాకెట్ భాగాలను మోసుకెళ్లిన రోజుల నుండి నేడు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అడుగులు వేసిన వరకు—భారత అంతరిక్ష ప్రయాణం ఒక అద్భుత గాథ. అయితే, ఇప్పటివరకు మన రాకెట్లు యంత్రాలను మాత్రమే మోసుకెళ్లాయి. కానీ ఇప్పుడు, చరిత్ర పుటల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది.
భారత గడ్డపై నుండి, భారతీయ రాకెట్ సాక్షిగా, ముగ్గురు భారతీయులు నింగిలోకి ఎగరబోతున్నారు. అదే ‘గగన్‌యాన్’. సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో, భూమి చుట్టూ తిరిగే నిమ్న కక్ష్యలో మన వ్యోమగాములు మూడు రోజుల పాటు విహరించనున్నారు. అనంతమైన విశ్వం ఒడిలో, భారతీయుడి మేధస్సుకు నిదర్శనంగా ఈ మిషన్ సాగనుంది. కేవలం ప్రయాణించడమే కాదు, అంతరిక్షంలోని ప్రతికూల పరిస్థితులను జయించి, తిరిగి సురక్షితంగా మాతృభూమి ఒడిలోకి చేరడమే ఈ సాహసయాత్ర అసలు లక్ష్యం.
ఇది కేవలం ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం కాదు; 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవం నింగికి నిచ్చెన వేస్తున్న సమయం. గగన్‌యాన్ రూపంలో భారత్ ఇప్పుడు విశ్వవీధిలో తన సొంత ముద్ర వేయడానికి సిద్ధమైంది.
ఒక దార్శనికతకు రెక్కలు: గగన్‌యాన్ ఆవిర్భావం
భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లాలనేది నిన్న మొన్నటి ఆలోచన కాదు; అది తరతరాల భారతీయుల మదిలో దాగున్న ఒక చిరకాల స్వప్నం. అయితే, ఆ కల నిజం కావడానికి కావలసిన గట్టి పునాది 2018 ఆగస్టు 15న పడింది. ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి ప్రకటించిన ఈ లక్ష్యం… ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది.
సంస్కృతంలో ‘గగన్‌యాన్’ అంటే ‘ఆకాశ వాహనం’. ఇది కేవలం రాకెట్ ద్వారా జరిగే ప్రయాణం మాత్రమే కాదు; ప్రపంచ దేశాల సరసన ‘మేము సైతం’ అని భారత్ ఎలుగెత్తి చాటుతున్న ఆత్మనిర్భర నినాదం. మన సొంత మేధస్సుతో, మన సొంత సాంకేతికతతో అనంతమైన విశ్వం వైపు వేస్తున్న ఈ అడుగు, శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల మన దేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఒక నిలువెత్తు సాక్ష్యం!
గగన్‌యాన్ లక్ష్యాలు
ముగ్గురు వ్యోమగాముల బృందాన్ని సుమారు 400 కిలోమీటర్ల ఎత్తుకు పంపి, మూడు రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. దీనితో పాటు:
- స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర సామర్థ్యాన్ని సాధించడం: ఇది అత్యంత ముఖ్యం. భవిష్యత్తులో అంతర్జాతీయ భాగస్వాములపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని సాంకేతికతలను స్వయంగా అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
- శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం: జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ మరియు భౌతిక శాస్త్రాలలో భారతీయ శాస్త్రవేత్తలు మైక్రోగ్రావిటీ ప్రయోగాలు చేయడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది.
- భవిష్యత్ తరాలకు స్ఫూర్తి: యువ భారతీయులలో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) పట్ల ఆసక్తిని పెంచి, నవతరం శాస్త్రవేత్తలను తయారు చేయడం.
- జాతీయ ప్రతిష్టను పెంచడం: ఈ విజయం అంతరిక్ష రంగంలో భారత ప్రతిష్టను ద్విగుణీకృతం చేస్తుంది.
ఒక ఇంజనీరింగ్ అద్భుతం
ఈ మిషన్‌లో రెండు ప్రధాన భాగాలు కలిగిన ‘ఆర్బిటల్ మాడ్యూల్’ ఉంటుంది:
ఒకటి క్రూ మాడ్యూల్ (CM): ఇందులో వ్యోమగాములు నివసిస్తారు మరియు పని చేస్తారు. ఇందులో అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మరియు భద్రతా ఫీచర్లు ఉంటాయి. రెండోది సర్వీస్ మాడ్యూల్ (SM): ఇది క్రూ మాడ్యూల్‌కు అవసరమైన చోదక శక్తిని (Propulsion), విద్యుత్తును మరియు ఉష్ణోగ్రత నియంత్రణను అందిస్తుంది.

గగన్‌యాన్ నౌకను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఇస్రో తన శక్తివంతమైన LVM3 (GSLV Mk-III) రాకెట్‌ను ఉపయోగిస్తోంది. మానవ ప్రయాణానికి అనుగుణంగా దీనిని మరింత సురక్షితంగా మరియు పటిష్టంగా తీర్చిదిద్దారు.
వ్యోమగాముల శిక్షణ
భారత వైమానిక దళం నుండి ఎంపికైన నలుగురు టెస్ట్ పైలట్లు ప్రస్తుతం కఠినమైన శిక్షణ పొందుతున్నారు.వీరు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ సెంటర్లో ప్రాథమిక అంతరిక్ష సూత్రాలపై శిక్షణ పూర్తిచేశారు. ఇప్పుడు ఇస్రో తన సొంత శిక్షణ కేంద్రంలో సిమ్యులేటర్లు, పారాబోలిక్ ఫ్లైట్లు మరియు నీటి అడుగున శిక్షణ ద్వారా వ్యోమగాములను సిద్ధం చేస్తోంది.

ముందస్తు పరీక్షలు
అంతరిక్ష ప్రయాణంలో అన్నింటికంటే ముఖ్యం వ్యోమగాముల ప్రాణరక్షణ. అందుకే, మనుషులను పంపే ముందే ఇస్రో అనేక కఠినమైన పరీక్షలను చేపడుతోంది. ఇందులో అత్యంత కీలకమైనది క్రూ ఎస్కేప్ సిస్టమ్ (Crew Escape System). రాకెట్ నింగిలోకి దూసుకుపోయే సమయంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే, వ్యోమగాములు ఉన్న మాడ్యూల్‌ను సెకన్ల వ్యవధిలో రాకెట్ నుండి దూరం తీసుకెళ్లి సురక్షితంగా భూమికి చేర్చే వ్యవస్థ ఇది.
అక్టోబర్ 21, 2023న నిర్వహించిన TV-D1 (Test Vehicle Abort Mission-1) ప్రయోగం ఈ దిశగా ఒక అద్భుత విజయం. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఒక చిన్న టెస్ట్ రాకెట్ ద్వారా, గాలిలో ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ‘అబార్ట్’ (మిషన్ నిలిపివేత) సిగ్నల్‌ను ఇచ్చారు. వెంటనే రక్షణ వ్యవస్థ స్పందించి, క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుండి విజయవంతంగా వేరు చేసింది. ఆ తర్వాత పారాచూట్ల సాయంతో మాడ్యూల్ బంగాళాఖాతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.ఈ విజయంతో గగన్‌యాన్ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన అడ్డంకిని భారత్ అధిగమించినట్లయింది.

గగన్‌యాన్ విజయం కేవలం మన దేశాన్ని ప్రపంచంలోని కొన్ని అగ్ర దేశాల సరసన నిలబెట్టడంతో ఆగిపోదు; అది భారత అంతరిక్ష చరిత్రలో ఒక స్వర్ణ యుగానికి నాంది పలుకుతుంది. ఈ మిషన్ ఇచ్చే ధైర్యంతో రేపు మనం అంతరిక్షంలో మన సొంత ‘భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని’ నిర్మించుకోబోతున్నాం.. జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టే అద్భుత దృశ్యానికి పునాది వేయబోతున్నాం.
నిజానికి, గగన్‌యాన్ అనేది లోహంతో చేసిన యంత్రం మాత్రమే కాదు: మన అంతరిక్ష పరిశోధనా సార్వభౌమత్వానికి నిలువెత్తు ప్రతీక. విశ్వవీధిలో భారత్ వెనుకంజలో లేదని, ప్రపంచానికే దిశానిర్దేశం చేసే నాయకత్వ స్థాయికి చేరుకుందని ఈ ప్రయోగం గర్వంగా చాటిచెబుతుంది. నాడు సైకిల్‌పై మొదలైన ప్రయాణం.. నేడు గగనవీధిలో ధ్రువతారగా వెలగబోతోంది!
రచయిత: రవి రాజా పోతినేని, డాక్టోరల్ రీసెర్చ్ కాండిడేట్, డిపార్ట్మెంట్ అఫ్ ఆస్ట్రానమీ, ఉస్మానియా యూనివర్సిటీ.
