మిఠాయి యుగంధర్ బాబు
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్….. అని పాత దేవదాసు సినిమా లో ఓ పాట ఉంది కదా. ఇది ఒక సామెత కూడా అయిపోయింది చాలా సందర్భాల్లో దీనిని వాడుతూ ఉంటారు. ఈమధ్య ఎవరో ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. ఆ గేయ రచయిత సముద్రాల సీనియర్ ఇలా రాసారట “కూడి (‘కు’ కి దీర్ఝము… అంటే కలిసి) ఎడమైతే (అంటే విడిపోతే) పొరపాటు లేదోయ్… కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పొరపాటు వల్ల “కూడి” కాస్త “కుడి” అయిపోయింది. అయినా దేవదాసు తాగుబోతు కదా “తాగుబోతు మాటలకు అర్థం ఏమి ఉంటుందిలే” అని రచయిత అలాగే వుంచేసారట.
మరి నిజంగా కుడి ఎడమైతే పొరపాటు లేదా?. పొరపాటనే అంటున్నారు సాంప్రదాయ వాదులు, ప్రవచన కారులు. ఏ సందర్భంలో అంటే….. చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక్కొకటి పరిశీలిస్తాం.
మొట్టమొదట భార్యాభర్తలు నిల్చోవడం, కూర్చోవడం లాంటి సందర్భాల్లో. ఎప్పుడు భర్తకు ఎడమవైపున భార్య కూర్చోవాలట, నిల్చోవాలట. అదే కుడివైపున కూర్చుంటే ఆమె తల్లి అవుతుందట. దేవతలు కూడా అలాగే కూర్చుంటారట !? (ఎవరు చూశారో ?..ఓ బహుశా ఫోటోలలో, గుళ్ళలో కావచ్చు). పూజలు దానధర్మాలు శాస్త్ర కార్యక్రమాలలో భార్య భర్తకు ఎడమ వైపు కూర్చోవాలట. కొన్ని సందర్భాలలో అంటే కన్యాదానం చేసేటప్పుడు విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మాత్రమే కుడివైపున ఉండాలట. ఎడమ వైపు ఎందుకంటే బ్రహ్మదేవుడు పురుషుడిని కుడివైపు నుండి, స్త్రీని ఎడమవైపు నుండి ఉద్భవింప చేశాడట. ఈ వివక్ష ఇతర మతాల్లో కూడా ఉంది.
కానీ ఇది కేవలం పురుష దురహంకారము, దురభిమానం మాత్రమే. పురుషుడు స్త్రీల కంటే గొప్పవాడు కాబట్టి, ఎడవ కంటే కుడి గొప్పది కాబట్టి పురుషుడికి కుడి స్థానం ఇచ్చారు. దానధర్మాలు, ఆశీర్వాదం చేయడం, పూజలు, ఆహారం తీసుకోవడం వంటి శుభ కార్యాలన్నీ కుడి చేత్తోనే చేయడం వల్ల అది పవిత్రమైంది. మల విసర్జన శుభ్రత వంటి పనులకు వాడడం వల్ల ఎడమ చేయి తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది. స్త్రీ కి ద్వితీయ స్థానం కాబట్టి,భర్త కంటే తక్కువ కాబట్టి భార్య ఎడమవైపున ఉండాలి అనే భావన ఏర్పడింది.
ఇంతవరకు భార్యాభర్తల సంగతి చర్చించాం కదా. ఇక కాలు, చేయి సంగతి చూద్దా. ఏదైనా పని చేయడానికి బయట వెళ్ళేటప్పుడు కుడికాలు ముందు పెట్టి వెళ్ళమంటారు. అంతేకాదు ఏదైనా యాక్సిడెంట్, చావు వార్త విన్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కుడికాలు వేసి వెళ్ళకండి,అలా వెళితే చాలా ఇక్కట్లు పాలవుతారు, కాబట్టి ఎడమ కాలు ముందు పెట్టి పోవాలని చెబుతారు. కోర్టు కేసుకు కుడికాలు వేసి బయటకు వెళ్లాలి, ఎడంకాలు వేస్తే చెడు జరుగుతుంది. కొత్త ఇంటిలోకి వెళ్ళేటప్పుడు, పెళ్లయిన జంట తొలిసారి ఇంటికి వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళాలి, కుడికాలు పెట్టి వెళితే మంచి జరుగుతుంది.
అని ప్రవచన కారులు, సనాతన వాదులు ఊదర కొడుతూ ఉంటారు. పైగా ఇలా చెబుతారు “పూర్వీకులు, సనాతన ధర్మ పెద్దలు ఈ అలవాట్లు ఊరికే పెట్టలేదు.దానికి ఎంతో అర్థం వుంది. మెదడులో ‘ఇడ’ అంటే ఎడమ అది పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం. ‘పింగళ’ అంటే కుడి అది నెగిటివ్ ఎనర్జీకి కేంద్రము. కుడి కాలు ముందు పెట్టినప్పుడు కుడి ముక్కు రంధ్రం ఆక్టివేట్ అవుతుంది, దాని ద్వారా ఎడమ మెదడు ఆక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ క్రియేటివిటీకి, పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం కదా, అలాగే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇస్తుందట. అదే గనక ఎడమ కాలు పెడితే ఎడమ ముక్కు రంధ్రం ఆక్టివేట్ అయి తద్వారా కుడివైపు మెదడు ఆక్టివేట్ అవుతుంది. అది నెగిటివ్ ఎనర్జీకి సంకేతము. కాబట్టి పని మీద వెళ్లేటప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఆక్టివేట్ కావాలంటే కుడికాలు ముందుకు వేయాలి… అదీ లాజిక్ అట.
ఇదివరకు చెప్పుకున్నట్లు ముఖ్యమైన పనులన్నీ కుడి చేతితోనే చేయాలనీ, మనం కూడా ఎవరైనా ఏదైనా ఎడమ చేతితో ఇస్తుంటే ఉరిమి చూస్తాము. చిన్నపిల్లలను కూడా ఏదైనా కుడిచేత్తోనే ఇవ్వాలని బలవంతం చేసి, ఎడమచేయి తక్కువ అన్న భావన వారిలో చిన్నప్పటినుంచి మనము ప్రోదిచేస్తున్నాము. రెండు చేతులు సమానమే అన్న భావన వారిలో కలగాలి. 85.4% మంది ప్రజలు కుడి చేతివాటం కలిగి ఉంటారు. ఇది ఒక అలవాటుగా సంస్కృతి గా మారింది. చాలామంది ఎడం చేత్తో ఇస్తే మంచినీళ్లు తీసుకోరు. మనం కూడా పిల్లలు ఏడిస్తే ఏదైనా ఇచ్చేటప్పుడు ఎడమచేతితో తీసుకుంటే, వద్దు కుడిచేత్తో తీసుకోమని చెప్తాము. కొంతమందికి ఎడం చేతి అలవాటు ఉంటుంది. వారు అన్ని పనులకు ఎడం చేతిని ఎక్కువగా వాడుతారు. కొంతమంది రెండు చేతులు సమానంగా వాడుతారు. వాళ్ళను సవ్యసాచి అని తమాషాగా అంటాం కదా.కొన్ని సమాజాలలో ఎడం చేత్తో పనిచేసే వారిని పాపులుగా చూస్తారు కూడా. వాళ్లకు ఏదో ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయనే నమ్మకం కూడా ఉంది. కొన్ని దేశాలలో ఎడమచేయి వాటం కలిగి ఉన్న వారిని అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు. అంటే ఎడమ చేతివాటంలో ఎలాంటి తప్పులేదని అర్థం కదా.
మానవ చరిత్రలో ఎక్కువగా కుడి చేతినే వాడడం వల్ల అలవాటయింది. లక్షల సంవత్సరాలుగా కుడి చేతిని వాడడం మానవులకు అలవాటయింది. “ఏ చేతిని” వాడాలో అనేది “మన చేతిలో” ఉండే విషయం కాదు. అది కొన్నిసార్లు జెనెటికల్ గా మీ పూర్వీకుల నుండి సంక్రమిస్తుంది. జెనెటిక్ విషయంలో దాదాపు జీవులన్నీ కూడా ఒక విధంగా ఉంటాయి. అయినా సరే వారి చేతి అలవాట్లలో తేడా ఉండడం అనేది చాలా ఆసక్తికర విషయం.
ఆసియా, ఆరబ్, ఆఫ్రికన్ దేశాలలో ఎడమ చేతిని అపరిశుభ్రంగా భావిస్తారు. ఎడమ చేతి అలవాటు ఉంటే పిల్లలను నియంత్రించి, బలవంతంగా కుడి చేతివాటంగా మారుస్తారు. క్రైస్తవులు కూడా ఎడమ చేతిని చెడుగా భావిస్తూ, దేవుడు రాజ్యం గురించి చెప్పేటప్పుడు పుణ్యాత్ములంతా దేవుడికి కుడివైపున… పాపం చేసిన వాళ్లంతా దేవుడికి ఎడమవైపున ఉన్నట్లుగా వర్ణిస్తారు. గ్రీకులు దుష్టశక్తులు ఎడమవైపు ఉన్నట్టు నమ్మేవారు. ఈ నమ్మకాలు అలవాట్లు అన్నీ కూడా ఆధారం లేని, వివరణ లేని, అర్థం లేని మూఢనమ్మకాలు మాత్రమే. కుడి చేయి, ఎడమ చేయి, కుడికాలు ఎడమ కాలు… అనేవాళ్ళు “కుడి కన్ను, ఎడమ కన్ను”, “కుడి చెవి, ఎడమ చెవి” అనాలి కదా. అవి కూడా శరీరానికి కుడి ఎడమ భాగాలుగా ఉన్నాయి కదా. మరి వాటికి లేదా పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ విభేదాలు. “కుడి కన్ను ముందు పోవాలి, కుడి చెవి ముందు పోవాలి” అని చెప్పలేదు కదా. ఎందుకంటే అవి శరీరానికి అంటుకుపోయి ఉన్నాయి. కాలు, చేయి మాత్రమే కదా శరీరం నుండి విడిగా దూరంగా కదులుతాయి. కాబట్టి వాటికే పాపం ఈ వివక్ష. కానీ వాటిలో వాటికి వివక్షత లేదు సుమా.
మిఠాయి యుగంధర్ బాబు, 9394782540



