డా.విరించి విరివింటి

మనిషి తాను జీవించే జీవితానికి ఒక సార్థకతను సాధించాలనుకునే జీవి. Frontal cortex ( మెదడు ముందరి భాగం.ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు ఇక్కడే జరుగుతాయి. ) అభివృద్ధి చెందిన మనిషి జ్ఞానం(cognition) లోనే ఈ “సార్థకత” భావన స్థిరపడి ఉంది‌. తన జీవితానికి సార్థకత ఉండాలనుకున్నందుకే దానిని సాధించడానికి ఒక క్రమత్వం (Pattern) కోసం అన్వేషణ మొదలవుతుంది‌. అందుకే మనిషిని క్రమత్వం కోరే జంతువు (Pattern seeking animal) అని తాత్వీకరించవచ్చు. తాత్వికంగా చూస్తే సార్థకతను ఒక సరళ రేఖ మీదుగానే సాధించగలం. కానీ వృత్తాకారంలోనో లేక త్రిభుజాకారంలో సాధించలేం. ఈ సరళరేఖగా సాగే పయనమే మనిషి చేసే అన్ని యత్నాల్లో తత్వాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది‌. మనం ఎంత దూరం నడిచి వచ్చామో చెప్పడంలో ఒక మార్పు ఇమిడి ఉంది. మనం వృత్తాకారంలో ఎంత ప్రయాణం చేసినా మార్పు ద్యోతకం కాదు . కనుక మనం సరళరేఖలో చేసే పయనం లోనే ఒక గమ్యం వైపు సాగుతామనీ, ఒక గమ్యం చేరడమే జీవితపరమావధనీ అనుకుంటాం. అందుకే మనం చెప్పే ప్రతి కథకు ఒక మొదలు ఒక ముగింపు ఉంటుంది.

ఒక గమ్యం ఒక క్రమత కోసం
సృష్టి ఆదిలో అంతా అస్తవ్యస్తంగా(chaos) ఉందని అక్కడినుంచి క్రమత (order)వైపు కదిలామనీ ఊహిస్తాం. గమనిస్తే మన మతాలూ, మన రాజకీయాలూ, మన సమాజాలూ, మన సంస్కృతి, మన విజ్ఞాన శాస్త్రాలు, చివరికి మనము కూడా ఒక “సరళ పురోగతి (linear progression)” అనే అంశం చుట్టూ వ్యవస్థలు, నమ్మకాలు, జీవితాలూ, ఏర్పరచుకున్నాం‌. ఎగుడుదిగుడులను ప్రతిచోటా ఏర్పరచుకుని నిచ్చన ఎక్కడమే పరిణామంగా అదే ఈ భూమిమీద మానవుడిగా మనం సాధించగలిగిన జీవితం సార్థకతగా అవలోకించాం‌. మొత్తానికి మనం టిలియోలాజికల్ జీవులం.

గండి కొట్టిన డార్విన్
ఐతే మనిషి తత్వంలో ఇంకిపోయిన ఈ భావనకు మొదటిసారి గండి కొట్టినవాడు చార్లెస్ డార్విన్. జీవం యొక్క సరళరేఖాయుతమైన మార్పును, పరిణామాన్ని కూల్చి, శాఖలుగా సమతలం మీద ఏ గమ్యమూ లేని, ఏ అర్థంపర్థం లేని ఒక గుబురు పొదగా జీవం విస్తరించే ఒక గతిని ఆయన మనకు అందించాడు. అదే డార్విన్ పరిణామ వాద సిద్ధాంతం‌‌. ఐతే, దాని తాత్విక లోతులు అర్థం కాని వారు తమ టిలియోలాజికల్ సరళ పురోగతి (linear progression)ని డార్విన్ సిద్ధాంతంలోకి కూరి చాలా గందరగోళం సృష్టించారు‌‌. అలాంటి గందరగోళమే “మిస్సింగ్ లింక్”.

మిస్సింగ్ లింక్ కోసం
మనిషికి కోతికీ ఒకే రకమయిన పూర్వికులు (common ancestor) ఉండవచ్చు అని ఊహించిన డార్విన్ వాదనను పక్కదారి పట్టించి, ఆ కోతికి మనిషికీ మధ్య జరిగిన పరిణామంలో మధ్య జీవి ఏదో ఉండి ఉండాలి అనే శోధన మొదలైంది ఇరవైయవ శతాబ్దం తొలి కాలంలో. మిస్సింగ్ లింక్ శోధనకీ డార్వినిజంకి ఎలాంటి సంబంధం లేదు. “రెండు జీవుల మధ్యలో మరో జీవి ఉండి ఉండాలి” అనే ఊహే డార్వినిజానికి వ్యతిరేకమైనది. ఎందుకంటే ఇది టిలియోలాజికల్ ట్రెడీషన్ నుండి వచ్చిన భావన. కాబట్టి మిస్సింగ్ లింక్ శోధన అంతా కూడా అశాస్త్రీయం అనడంలో సందేహమేమీ లేదు. ఐతే ఇరవైయవ శతాబ్దంలో పిచ్చిపట్టినట్టు ఉన్మాదం లాగా ఈ మిస్సింగ్ లింక్ ల శోధన జరిగింది. భూమి తవ్వకాల్లో దొరికిన శిలాజాలు ఏయే జంతువులకు మధ్యలో ఏర్పడిన మిస్సింగ్ లింక్ లో వెర్రిగా ఊహించడం మొదలైంది. అన్నింటికంటే ఆసక్తికలిగించే అంశం మనిషికీ కోతికీ మధ్య ఒక జంతువును ఊహించడం, ఆ జంతువు అటు కొన్ని కోతి లక్షణాలు ఇటు కొన్ని మనిషి లక్షణాలు కలిగి ఉంటుందనీ అది మెల్లిగా కోతి లక్షణాలను వదిలివేసి ఆధునిక మానవుడిలా పరిణామం చెందిందని ఊహించడం మొదలుపెట్టారు. అంటే ఆధునికి మానవుడి ఉద్భవానికి తల్లి అనతగ్గ ఒక జంతువు అన్వేషణ అన్నమాట. ఎక్కడెక్కడ మానవశాస్త్ర పరిశోధనా సంబంధిత (anthropological )తవ్వకాలు జరుగుతున్నాయో అక్కడంతా ఇదే అన్వేషణ. బయాలజిస్టులు ఆంథ్రోపాలజిస్టులు పరిణామవాదులూ సైంటిస్ట్లు అందరిదీ ఒకే లక్ష్యం ఆ మిస్సింగ్ లింక్ ని పట్టుకోవడం. పరిణామ వాదమనే శాస్త్ర విజ్ఞానాన్ని తమ సొంత కథను చెప్పుకోవడానికి అనువైన అంశంగా మార్చుకోవడంలో భాగమే ఈ అన్వేషణ. ఎప్పుడైతే ఈ లింక్ దొరుకుతుందో మానవ పరిణామ కథ సంపూర్ణమౌతుంది‌. అంటే కథ ముగుస్తుంది. అంటే మనిషికి “కథ ముగియడం” అనే భావన అలాగే “సత్యం ఎప్పటికీ సంపూర్ణం” అనే పురాతన భావన మరింత బలపడుతుంది. మనిషి తాత్వికంగా కథ ముగియడం వైపు, సత్యం సంపూర్ణంగా ఉంటుందనే నమ్మకం వైపు మళ్ళీ మళ్ళీ లాగబడుతూనే ఉంటాడు.

రాజకీయాల చొరబాటు
ఐతే మిస్సింగ్ లింక్ అన్వేషణ శాస్త్రీయం కాకపోగా అది రాజకీయ భావజాలంగా మారిపోవడం చాలా విచిత్రమయిన అంశం‌. మానవుడు ఎంతగా శాస్త్రీయ దృక్పథం తో దూసుకుపోతున్నా చివరికి సైన్స్ రాజకీయ భావజాలానికే లొంగి పని చేయడం మనకు చరిత్రంతా కనిపిస్తుంది‌. బ్రిటీష్ సామ్రాజ్యవాదం, యూరోపియన్ ఆధిపత్య వాదం, హేతుబద్ధ క్రమత, నాగరికతా నిచ్చెన వంటి భావాలన్నీ ఈ మిస్సింగ్ లింక్ అన్వేషణతో లింక్ ఐవున్నాయి. ఆ తల్లి వేరు వంటి మిస్సింగ్ లింక్ మా దేశంలోనే బయటపడాలని, తద్వారా ఈ లోకంలో ఆధునిక మానవుడిని తమ దేశమే మొదట బయటకు తెచ్చిందని నిరూపించుకోవాలి అనే ఉబలాటంతో కూడిన పిచ్చితనమూ బయలుదేరింది. చేతిలో బ్రెష్ లు పట్టుకుని గుహల్లో పాకుతూ మిస్సింగ్ లింక్ జంతువుకి సంబంధించిన ఎముక కోసం వెతకడంం మొదలెట్టారు. ఆ శిలాజాలు ఫ్రాన్స్ లో బయటపడితే మానవ పరిణామానికి ఫ్రాన్సే కేంద్రస్థానమనీ ఒకవేళ జర్మనీలో బయటపడితే జర్మనీ నే మానవ పరిణామ బంగారుగిన్నె అనీ ఒకవేళ ఇంగ్లాండ్ లో బయటపడితే ఇంగ్లాండే మానవ పరిణామ దిక్సూచి అని చెప్పుకునేందుకు సైంటిస్ట్ లు సిద్ధంగా ఉబలాట పడుతున్న తరుణం అది. తమ దేశంలోని ఆ మొదటి మానవుడిని కనుక్కుని తమ దేశ కీర్తి ప్రతిష్టలు రెపరెపలాడాలనీ, తమ అధికారం శాశ్వత సత్య మనీ, తమ దేశ మట్టి పవిత్రమైనదనీ చెప్పేందుకు తహతహలాడారు. బోలు గా, డొల్లగా పడిఉన్న మనిషి అహంకారంలోకి ఒక ఎముకను నింపి ఉబ్బిపోయేందుకు పిహెచ్డీలు చేసిన కోతుల వలె అన్వేషణ మొదలెట్టారు. దాని ఫలితమే “పిల్ట్ డౌన్ మ్యాన్ (Piltdown Man)”.

A reconstruction of “Eoanthropus dawsoni

పిల్ట్ డౌన్ మ్యాన్ కథ
1912 లో చార్లెస్ డాసన్ అనే ఆంథ్రోపాలజిస్టు తాను మనిషికీ కోతికీ మధ్య మిస్సింగ్ లింక్ ని కనుగొన్నాననీ ప్రకటించాడు. అది ఇంగ్లాండులోని పిల్ట్ డౌన్ అనే ప్రదేశం కావడం వలన – ఆ శిలాజాన్ని పిల్ట్ డౌన్ మనిషి అన్నారు. అతడి కపాలం ఆధునిక మానవుడి కపాలాన్ని పోలి ఉండటం దవడు ఎముక మాత్రం కోతి జాతికి చెందినదిలా ఉండటంతో ఈ పిల్ట్ డౌన్మనిషే మొదటి “మోడ్రన్ ఇంగ్లీష్ మ్యాన్” అని చెప్పుకోవడం మొదలెట్టారు‌. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి మాత్రమే ఆధునిక మానవుడిని తమలోనే కనుక్కోగలగడం సాధ్యమని తలంచారు. అప్పటికే ఫ్రాన్స్ లో క్రో- మాగ్నాన్ మ్యాన్ (Cro- Magnon man) కనుక్కోబడింది. జర్మనీ నేలమీద నియాన్డెర్తల్ మనిషి కనుక్కోబడ్డాడు. అలాంటిది బ్రిటీష్ నేలపై ఏమీ కనుక్కోవడం లేదా? అందుకే ఫ్రాన్స్ జర్మనీ లను తలదన్నేలా ఈ నేలమీద పిల్ట్ డౌన్ మ్యాన్ ఉదయించాడు. ఇంకేముంది, భూమి మీద సర్వోన్నత జాతి ఐన బ్రిటీష్ జాతే, బ్రిటీష్ నేలే ఈ ప్రపంచానికి ఆధునిక మానవున్ని తేగలిగిందని తమ అహంకార ముక్కు పుటాలను పెద్దవి చేసుకున్నారు. ఒక పచ్చి అబద్ధాన్ని, పుకారుని, సైంటిఫిక్ ప్రాంక్ నీ నిజమేనని నమ్మే వాతావరణం కూడా ఆనాటి బ్రిటిష్ వలసవాద పాలన సమయంలో ఉండింది. ఐతే ఆ కాలంలో సైంటిఫిక్ కమ్యూనీటీ లో ఒక నమ్మకం బలంగా ఉండింది. అదేంటంటే – మనిషి మెదడు పెద్దగవడం జరిగాకే మనిషి లేచి నిలబడటం జరిగిందని. ఈ పిల్ట్ డౌన్మనిషి ఈ వివరణలోకి సరిపోతాడు. ఈ మనిషికి కపాలం పెద్దగా ఉంది. కాబట్టి ఇతడు రెండు కాళ్ళు జీవి ఐవుంటాడని ఊహించారు. అదే సమయంలో ( 1924) ఆఫ్రికాలో చిన్న కపాలం కలిగి రెండు కాళ్ళతో నడిచిన మనిషి అస్థిపంజరం (Australopithecus africanus) దొరికినప్పటికీ అది అప్పటి “big brain before bipedal ” వివరణకి సరిపోలడం లేదని దానిని పట్టించుకోలేదు. నిజానికి జరిగినదేమంటే ఇంగ్లాండ్ లో గొప్ప గొప్ప సైంటిస్ట్ లతోనూ, ఆర్థర్ స్మిత్ అనే బ్రిటిష్ మ్యూజియం అధికారితోనూ, చార్డిన్ అనే శిలాజ శాస్త్రవేత్తతోనూ పరిచయాలు ఉన్న చార్లెస్ డాసన్ పిల్ట్ డౌన్ మనిషి ను కనుగొన్నానని చెప్పేశాడు కనుక అతడి ప్రకటన శాస్త్రీయమే అయివుంటుందని అందరూ భావించారు‌. ఎవరూ ప్రశ్నించలేదు.

శిలాజ ఫోర్జరీ
నిజానికి చార్లెస్ డాసన్ ఒక మధ్య యుగం నాటి మనిషి కపాలానికి ఓరంగూటాన్ అనే కోతి జాతికి చెందిన జంతువు దవడను అతికించాడు. దంతాల విషయంలో అనుమానం రాకుండా మనిషి, కోతి దంతాలను ఆ దవడలో ఇరికించి అతికించాడు. ఇనుము , క్రోమిక్ అమ్లాలతో ఎముకలకు పెయింటింగ్ వేసి అవి పురాతనమైనవిగా కనబడేలా చేశారు. ఒక మహాద్భుతం జరిగిందని పత్రికల్లో ప్రకటించారు. బ్రిటీష్ మ్యూజియం గర్వంగా ఈ శిలాజాన్ని దాచుకుంది.

ఫోర్జరీ చేసిన పిల్ట్ డౌన్ మ్యాన్ పుర్రె పక్కన అసలయిన పుర్రె

ఈ శిలాజ ఫోర్జరీ నలభై సంవత్సరాల పాటు ప్రపంచ శాస్త్రవేత్తలను ఫూల్స్ ని చేసింది. మనుషులుగా మనం దేనిని నమ్మడానికి సిద్ధంగా ఉంటామో అది అబద్ధంలాగా మనముందుకు వచ్చినపుడు అది అబద్ధమని మనం గుర్తించడం కష్టమౌతుంది. ఈ కథ పాతుకుపోయిన కథనం (established narrative) కి మానవులు చూడాలనుకున్న నమూనాకి సరిగ్గా సరిపోవడం తో దీనిని సాధికారికతను కూడా ఎవరూ ప్రశ్నించలేదు‌. ఆర్థర్ స్మిత్ దీనికి శాస్త్రీయ నామం కూడా తగిలించాడు. Eoanthropus dawsoni అని. ఇప్పుడు ఈ నామాన్ని సరదాగా నిర్ధారించడంలో పక్షపాతం (confirmation bias) కి పర్యాయపదంగా వాడటం మొదలెట్టారు. ఎవరైతే తమ సొంత అభిప్రాయాలను రుజువు ఉందని బొంకుతుంటారో దానిని పిల్ట్ డౌన్ థింకింగ్ (Piltdown thinking అని అనాలని సైంటిస్ట్ లు ఈ మధ్య ఈ పదబంధాన్ని వాడుతున్నారు. అసలు ఇదంతా డాసన్ సృష్టించిన కట్టుకథ అని 1953 లో కనుగొన్నారు. ఫ్లోరిన్ డేటింగ్ పద్ధతి ద్వారా పిల్ట్ డౌన్ మనిషి కపాలమూ, దవడ రెండూ వేరు వేరు కాలానికి చెందినవని కనుగొన్నారు. ఓరంగూటాన్ దవడలో దంతాలను ఇరికించారనీ తెలుసుకున్నారు‌. దీనిలో మరో విచిత్రమైన కోణం ఏంటంటే షెర్లాక్ హోమ్స్ రాసిన ఆర్థర్ కోనన్ డోయిల్ ఈ బూటకాన్ని (hoax) తెరవెనుక ఉండి సైంటిస్ట్ లను ఫూల్స్ చేశాడని. మానవ జీవితానికి అర్థాన్ని ఆధ్యాత్మికతనూ వెతికే డోయిల్, సైంటిస్ట్ ల ఆధ్యాత్మిక అనాసక్తిపై ప్రాక్టికల్ జోక్ చేశాడనీ అంటారు. అతడు గొప్ప కథకుడు, నవలాకారుడు, కావడం, పిల్ట్ డౌన్ లో నివసించడమూ, చార్లెస్ డాసన్ కి ఆప్త మిత్రుడు ఐవుండటంతో ఈ పుకారు తెరమీదకు వచ్చింది. ఏదేమైనప్పటికీ ఈ ఉదంతం శాస్త్ర సమాజానికి (Scientific community)కి ఒక హెచ్చరిక వంటిది. సంశయవాదం (Skepticism )అనేది ప్రతి చోటా అవసరమే సైంటిఫిక్ రంగంలో మరింత అవసరం అని తెలియజేస్తుంది.

తస్మాత్ జాగ్రత్త!
సంశయవాదం (Skepticism)కూడా మరో సిద్ధాంతం(Dogma) గా మారకుండా చూసుకోవడమూ అవసరమే. తాత్విక పునాదులు లేని సైన్స్ పట్ల, సైన్స్ పాపులిజం పట్ల, సైంటిస్ట్ ల అత్యుత్సాహ ప్రకటనల పట్ల, మీడియాలో వాటిని గొప్ప విషయాలుగా ఊదరగొట్టడం పట్ల, సైంటిఫిక్ ఆవిష్కరణలలో దాగి ఉన్న పవర్ స్ట్రక్చర్ పట్ల, మనలో ఉండే ఆలోచనా భ్రమల(Thinking fallacies) పట్ల, మానవ నైజం పట్ల, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. పై వాటన్నింటి ప్రభావం వలన సైన్స్ తనకు తానుగా సరైనది కాకపోవచ్చు, కానీ సంశయం (Skepticism) వల్లనే అది తనను తాను సరి చేసుకోగలదు. ఈ సందర్భంగా కార్ల్ పాప్పర్ చెప్పిన Philosophy of error /ఫాల్సిఫైయబిలిటీని గుర్తించుకోవాలి. సైన్స్ అభివృద్ధి చెందేది విషయాలను సరైనవిగా నిరూపించడం ద్వారా కాదు, విషయాలను తప్పుగా నిరూపించడం ద్వారా(Science progresses not by proving things right, but by proving things wrong )అనే పాప్పర్ ఫిలాసఫీకి సరైన ఉదాహరణగా పిల్ట్ డౌన్ మ్యాన్ పుకారుని గుర్తాంచుకోవాలి. సమాచార విప్లవాన్ని దాటుకుని ప్రస్తుతం AI విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సైంటిఫిక్ ఫిలాసఫీ యొక్క స్థానాన్ని పునర్ ప్రతిష్టించుకోకపోతే పిల్ట్ డౌన్ మ్యాన్ వంటి పాప్పరియన్ వైఫల్యాలు పునరావృతం ఔతూనే ఉంటాయి.

One thought on “మనిషికి కోతికీ మధ్య ‘మిస్సింగ్ లింకు’ కోసం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *