సంపాదకీయం

ఈ మాట నమ్మశక్యం గానిది.  కారణం పరిశోధన లేని వైజ్ఞానిక పురోగతి లేదు. వైజ్ఞానిక అభివృద్ధిలేని  సమాజ పురోగమనమూ లేదు. ఈ రంగంలో పోటీపడి ముందు నిలబడలేని దేశాలు ఎంత సంపదా, ఎంత సంస్కృతీ, ఎంత చరిత్రా వున్నా ముందుకు పోలేవు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పైనే ఆధునిక ప్రపంచం నడుస్తోంది. అమెరికా  ప్రపంచాధిపత్యం కూడా దీని వల్లనే సాగుతోంది.

కానీ ఆశ్చర్యంగా అమెరికా తన పరిశోధనా కార్యక్రమాలకు కత్తెర వేస్తోందట. ఫెడరల్  సైంటిస్టులను ఇంటికి పంపుతున్నారట. జాతీయ ఆరోగ్య సంస్థకు (NHI) ఏకంగా  ఈ సంవత్సరం $8 బిలియన్లు, వచ్చే ఏడు $18 బిలియన్లు కోత పెడుతున్నారట. జాతీయ సైన్సు ఫెడరేషన్ బడ్జెట్లో $5 బిలియన్లు తగ్గించేశారట. నాసాకు సైతం 25% నిధుల కోతపడిందట. ఇక విశ్వవిద్యాలయాల సంగతి సరేసరి. “మీ నిధులు మీరు సమకూర్చుకోండి. దాతల్ని వెతుక్కోండి. మీ పరిశోధనలు సాగించుకోండి” అని ఫెడరల్ ప్రభుత్వం తేల్చి చెప్పేస్తోందట. ఒక్క ఆయుధాల పరిశోధనే దీనికి మినహాయింపు!

దీంతో శాస్త్రవేత్తలు అమెరికా నుంచి వలస కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘నేచర్ కెరీర్స్’ కథనం ప్రకారం ఏకంగా 32 శాతం యూరపు బాట పడతామంటున్నారు. ‘నేచర్ పోల్’ లో పాల్గొన్న వారిలో 72% అగ్రరాజ్యానికి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక యూరపులో చూస్తే అక్కడా నిధులు లేవు. ఎప్పుడూ ఒడిదుడుకులు. జీతాలు తక్కువ. శాస్త్రవేత్తలు తమ పరిశోధనను   వదిలేసుకుని ఉన్న ఫళాన ఎక్కడికో వెళ్లిపోలేరు. ఎంత చెడ్డా ఇప్పటికీ అమెరికాదే విజ్ఞానాధిపత్యం గాబట్టి సీనియర్లు అక్కడే ఎలాగో సర్దుకుపోదామనుకుంటున్నారు!

ఒకప్పుడు సింగపూర్ మంచి జీతాలిచ్చి, ఉత్తమ వసతులు కల్పించి, గొప్ప దార్శనికతతో శాస్త్రవేత్తల్ని ఆకర్షించింది. అక్కడి మంచిస్కూళ్లు, ఆరోగ్య వ్యవస్థలు, భద్రత, రవాణా, స్వచ్ఛ వాతావరణం కూడా దీనికి తోడ్పడ్డాయి. జర్మనీ నుంచి 1930లలో వందలాది వైజ్ఞానికులు అమెరికా వచ్చారు. కానీ అప్పటి కారణం వేరు. అప్పుడక్కడ వారికి భద్రత లేదు.

ప్రస్తుతం కృత్రిమమేధ, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్స్, అంతరిక్షం, క్వాంటం రంగాల్లో ఎవరిది ఆధిక్యమో వారిదే ప్రపంచాధిపత్యం. దీన్ని”గ్లోబల్ టెక్ పోటీ” అంటున్నారు ఈ పరుగులో  84.3. పాయింట్లతో అమెరికా అగ్రభాగాన వుంది. చైనా 65 .6 పాయింట్లతో దాని వెంట పరుగిడుతోంది. యూరపు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మిగిలినవి వాటి దరిదాపుల్లో లేవు. మన దేశం 15.2.పాయింట్లతో పదో స్థానంలో వుంటే మనకన్నా రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, స్పెయిన్లు వెనకబడ్డం విశేషం.

“అలాంటప్పుడు అమెరికా యూరపుల నుంచి శాస్త్రవేత్తలు మన దేశానికి వలస వస్తారా” అంటే అలా ఏమీ కనపడ్డం లేదంటారు నోబుల్ అవార్డు గ్రహీత రామకృష్ణన్ గారు. కారణం అంతర్జాతీయ ప్రమాణాల పరిశోధనా సంస్థలు మనకు తక్కువ. మన IISC, NCBS, TIFR, IISER, IITలు లాంటివి ఒక్కొక్కటి ఒకటి రెండు రంగాల్లో అగ్రభాగాన వుంటే వుండొచ్చు గానీ మొత్తంగా సంస్థలుగా చూస్తే వాటి నాణ్యత ప్రపంచంతో పోటీ పడగలది కాదు. దీర్ఘకాలిక బేసిక్ రీసెర్చ్ కి అవకాశాలు వుంటేనే అమెరికా నుంచి శాస్త్రవేత్తలు తరలివస్తారు. ఇందులో మనం అమెరికా చైనా, యూరపులతో  తూగలేకున్నాం. ఇక మొదటి 100 అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో మనది ఒక్కటీ లేదు.

ఇక నిధుల దగ్గరకు వస్తే పరిశోధనారంగానికి మనం వెచ్చిస్తున్నది జీడీపీలో కేవలం 0.7శాతం. చైనా వ్యయంతో పోలిస్తే ఇది మూడోవంతు కూడా లేదు. సివిల్ పరిశోధనల్లో ఇజ్రాయిల్ 6.30 శాతం, దక్షిణ కొరియా 4.9 శాతం, జపాన్ 3.3 శాతం, అమెరికా 3.46 శాతం తమ జిడిపిల్లో ఖర్చు చేస్తుంటే మనం ఎక్కడో వుండిపొయ్యాం! 

రామకృష్ణన్ గారు అంతటితో ఆగక మన దేశపరిశోధనారంగానికి మౌలిక సదుపాయాలు, నిధులు లేకపోవడంతో పాటు దీర్ఘకాలిక దృక్పథం కూడా లేదంటాడు. “ఇచ్చే నిధులు సకాలంలో ఇవ్వరని, స్కాలర్షిప్ లు ఎంత కాలానికీ రావని, ఎప్పుడు ఏ విధానాలు వస్తాయో తెలియవని, ప్రోత్సాహాలు ఇచ్చే సంప్రదాయం తక్కువని, రాజకీయాలు ఎక్కువ” ని ఆయన చెప్పుకొస్తారు.

జతీయ పరిశోధనా ఫౌండేషన్ కు (NRF) ఆర్భాటంగా 2011లో 50 వేల కోట్లు కేటాయించి, ఐదేళ్లలో కేవలం 14 వేల కోట్లిచ్చి, మిగిలినవి దాతల నుంచి సమీకరించుకోవాలన్న చరిత్ర మనది! ప్రైవేట్ పారిశ్రామికులకు తక్షణ లాభాలపై ఉన్న మోజు దీర్ఘకాలిక పరిశోధనా రంగంపై ఎప్పుడూ లేని దేశం మనది! అమెరికా పరిస్థితి దీనికి భిన్నం అంటారాయన.

కానీ మన దేశ శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి  సైన్సు పత్రాల ప్రచరణలో మనం 2029 నాటికి అమెరికాను అధిగమిస్తున్నామంటున్నారు. ఆయన లెక్క ప్రకారం ప్రస్తుతం (2024 ) చైనా 8,98,949, అమెరికా 4,57,335 భారత్ 2,07,390 లతో మొదటి మూడు వరసల్లో వున్నాయి. ప్రపంచ అత్యున్నత శాస్త్రవేత్తల్లో మనవారు 5321 మంది. (జపాన్ వారు 5608, జర్మనీ వారు 10,420)

కానీ సమస్య ఎక్కడ వస్తోదంటే మన పత్రాలు, పి హెచ్ డిలు  నాసిరకమైనవి. హైదరాబాదులోని OMICS  గ్రూపుకు అమెరికా నైన్త్ సర్క్యూట్ కోర్టు $50 మిలియన్లు అపరాధం విధించింది. కారణం ఈ గ్రూపు ఏకాఎకి 69,000 పత్రాలు ప్రచురించింది. అన్నీ బోగస్ వి, దండగ మారివి. ప్రపంచంలోని  ఫేక్  జర్నల్సులో 62% ఇండియాలోనే వున్నాయంటున్నారు. కనీసం 10 శాతం పి హెచ్ డిల సంగతీ ఇంతే!

“దీర్ఘకాలిక విధానాలు లేకపోడం, సైన్సును రాజకీయం చేయడం, అధికారుల పెత్తనం, కాలుష్యభరిత నగరాలూ  ఇలా ఎన్ని లోపాలున్నా భారతీయ సైంటిస్టుల, మరీ మన యువ వైజ్ఞానికుల కృషి చాలా గొప్పది! ఉష్ణ మండల వ్యాధుల మీదా, జీవావరణం మీదా మనవాళ్ల కృషి ప్రపంచంలో ఎవ్వరికి తీసి పోదు” అంటారు రామకృష్ణన్ గారు.

దీన్ని మారుతున్న కాలంలోనూ మన దేశం  నిలబెట్టుకోగలదా?
అగ్రరాజ్యం పరిశోధనా రంగంలోనూ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తుందా?
పరిశోధనలు మందగించాక ప్రపంచ గమనం ఎలా వుంటుంది ?
ఇవన్నీ ప్రశ్నలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *