ఇప్పుడు మనం చకచకా అనుకున్నది రాసేస్తున్నాం. అలవోకగా దాన్ని చదివేస్తున్నాం. మరి ఈ రాత ఎలా మొదలైంది? ఎలాగో మొదలైంది అనుకుందాం. మరి ఈ ప్రాచీన లిపిని ఇప్పుడు చదివిన వాళ్ళు ఎవరైనా వున్నారా? వుంటే వాళ్ళు ఎలా చదివారు ?
దీనికో పెద్ద కథ ఉంది మనిషికి భాష వచ్చీ రాకముందే రాయడం వచ్చు. ఎప్పుడో 25 వేల ఏళ్ల నాటి రాతలకీ, గీతలకీ సైతం ఓ అర్థం వుందని ఇప్పుడిప్పుడే మన పరిశోధకులు కూపీ లాగుతున్నారు.

1 ఈ బొమ్మను చూడండి. ఈ ఎముక మీద గీసిన గీతల్ని చూడండి. ఈ గీతల అర్థం ఏమిటి? ఓ ఏబై ఏళ్ల క్రితం ‘మార్ శైక్’ అనే పరిశోధకుడు ఏళ్ళ తరబడి తంటాలు పడి, ఎక్కడెక్కడి ఎముకలు పోగుచేసుకుని, పరీక్షించి పరీక్షించి ఈ ‘గీతా రహస్యం’ బయటకు తీసాడు.
ఈ గీతలు చంద్రుడి పెరుగుదలనీ, తరుగుదలనీ సూచిస్తూ గీసుకొన్నవి ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు నెలల తరబడి గీసుకొన్నవి. మానవుడు ఎందుకు ఇలా గీసుకొని వుంటాడు ? ఎన్ని నిండు చంద్రుళ్ళ తర్వాత మంచు కాలం వచ్చి కష్టాలు మోసుకొస్తుందో తెలుసుకోవడానికి కావచ్చు. ఓ గర్భవతి ఎంత కాలానికి తనకు ప్రసవం అవుతుందో లెక్కించి చూసుకోవడానికి కావచ్చు. ఆనాటి మానవుడు ఎప్పుడూ దీన్ని తన వెంట పెట్టుకుని పోతూ కేలండర్ లా వాడుకున్నాడన్నమాట. ‘మారశైక్’ ఈ గుట్టు విప్పగానే ప్రపంచమంతా విస్తు పోయింది. అప్పటిదాకా ఆదిమానవుడు చిత్రకారుడిగా లోకానికి తెలుసే గాని సంకేతాలు రూపొందించుకోగలడని ఎవరి ఊహలకు అందలేదు. ప్రాచీన చిత్రకారుడు ఓ రకంగా లిపికారుడు కూడానని, చిత్రాలే సంకేతకాలుగా మారి ప్రాచీనలిపి పుట్టిందని దీంతో తేలిపోయింది!

Pic 2 – ఈ బొమ్మ ఓ అడవి మేకకు సంకేతం. మొదట మేకనంతా గీసేవారు. తర్వాత తల మాత్రమే మిగిలి, అందులోని కొమ్ములే మేకకు ముఖ్య సంకేతాలుగా మారాయి.

Pic 3 – ఈ సంకేతాలు చూడండి. మొదటిది అవుది రెండోది ఎద్దుది. విచిత్రమేమంటే ఈ మేకకి ఎద్దుకి మధ్య 10 -15 వేల సంవత్సరాల చరిత్ర వ్యవధి ఉంది !

Pic 4 – కాలం దొర్లేకొద్దీ ఈ గుండ్రటి సంకేతాలు రాయడం కంటే వంకర సంకేతాలు రాయడం సులభమని ప్రాచీన మానవుడు గుర్తించాడు. చివరికి పై ఆవు ఇలా పరిణామం చెందింది. ఇంతవరకు బాగానే ఉంది ఓ వస్తువుకి ఓ గుర్తు లేదా బొమ్మ అని ఎలాగో తంటాలు పడి తెలుసుకున్నాం. మరి పదాలు వాక్యాలు ఎలా రాసేవారు? వాటిని చదవడం మనకెలా సాధ్యమైంది ?

Pic 5 – మొదట పదాలు పై రకంగా వుండేవి. ఒక్కో బొమ్మ ఒక్కో ధ్వనికి సంకేతం. అంటే సంకేతాలు మొత్తం వస్తువుకి గాక అందులోని ధ్వనులకు వచ్చేసాయి. ఇప్పుడో సమస్య ఎదురయింది అన్నీ బొమ్మల వరుసలే అయితే ఎటు నుండి ఎటు చదవాలి అనేది. దీనికి ప్రాచీన మానవుడు పెట్టుకున్న నియమం ఏమంటే ఇందులో పక్షులు జంతువులు ఏ వైపు తిరిగి వుంటే ఆ వైపుకు చదువుతూ పోవాలి. ఈ రహస్యం తెలియడానికి, వీటిని చదివి అర్థం చేసుకోవడానికి మనకు ఏళ్ళు పూళ్ళు పట్టిందంటే నమ్మండి!
దీన్ని మొదట ఫ్రాన్స్ లోని ‘పోలియోలు’ సాధించారు. “రోజెటా” లోని ఒక బండ మీద మూడు లిపుల్లో ఒకే ‘సందేశం’ రాసి వుండడం వారు గుర్తించారు అందులో “అయనాని” లిపి ఒకటి. ఇది వారికి బాగా తెలుసు. మరొకటి ప్రాచీన ఈజిప్టు లిపి. ఇది వారికి ఏమాత్రం తెలియదు.
చివరకు 14 ఏళ్ల పరిశోధన అనంతరం వీళ్ళు కనిపెట్టినది ఏమంటే ప్రాచీన ఈజిప్టు లిపిలో ఏదైనా పేరు రాయాలంటే దాని చుట్టూ ఒక ఫ్రేమ్ (బాక్సు) వుండేది. టాలెమీ, క్లియోపాట్రా, అలెగ్జాండ్రస్ లకు ఈ ఫ్రేమ్ లను మనం చిత్రంలో చూడొచ్చు.
‘యునాని’ భాషను బట్టి ఈ ప్రాచీన ఈజిప్టు లిపిలోని వ్యక్తుల పేర్లు ఈ ఫ్రేమ్ ల ఆధారంగా గుర్తించి, అందులోని సంకేతాలను ఒక పేరులోనివి మరొకదానితో పోల్చుకొని, ఏ సంకేతం ఏ ధ్వనికి ఉద్దేశింపబడిందో పసిగట్టేశారు! మైకేల్ వెంట్రిస్ అనే బాలుడు క్రోట్ ద్వీపంలోని పురాతన లిపి రహస్యాలను సైతం 17 ఏళ్లు పరిశోధించి 1952లో ఇలానే బయటపెట్టాడు. ప్రాచీన లిపి గుట్టు రట్టు కావడం వెనక ఇంత కథ వుంది మరి!