డా. విరించి విరివింటి 

“Rank is not a property of the world. It is an imposition of our culture.”
-Stephen Jay Gould

Introduction: 
మన ఆలోచనలు, మన ప్రవర్తనలే కాక, మనం “విజ్ఞానం” లేదా “సైన్స్”గా భావించే విషయాల పట్ల మన దృక్పథం కూడా పూర్తిగా నిష్పాక్షికమై, తటస్థంగా ఉండదని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. నిరూపిస్తున్నది కూడా. మన విజ్ఞానపు అవగాహన, దానికి అనుసంధానమైన విలువలు, అభిప్రాయాలు ఇత్యాదివన్నీ చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, నైతిక, సామాజిక–ఆర్థిక అంశాల ప్రభావానికి లోనై ఉంటాయి. అంటే, సైన్స్ అనేది కేవలం పరిశీలన, ప్రయోగం, ఆధారాల సమాహారం మాత్రమే కాదు, దాన్ని మనం ఎలా స్వీకరిస్తామో, ఎలా ప్రయోగిస్తామో అనేది కూడా మన సమాజపు నిర్మాణంతో గాఢంగా ముడిపడి ఉంటుంది. 

ఈ విషయానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమైన ఉదాహరణగా ఈ కాలానికి అవసరమైన ఉదాహరణగా “IQ పరీక్షలను” తీసుకోవచ్చు. ఈరోజు భారతదేశంలో సామాన్య ప్రజల నుండి మొదలుకొని విద్యావేత్తల వరకూ IQ అనేది ఒక విద్యార్థి లేదా వ్యక్తి యొక్క మేథావిత్వాన్ని పట్టి ఇచ్చేస్తుందని భావిస్తారు. జనసామాన్యంలో మాటల సందర్భంలో తక్కువ IQ కలిగి ఉండటాన్ని ఒక వ్యక్తిని విమర్శించడానికి లేదా గేలి చేయడానికి కూడా ఉపయోగిస్తుండటం తరచూ చూస్తూనే ఉంటాం. ఐతే IQ పట్ల మన సమాజంలో కనిపించే ధోరణులను అర్థం చేసుకోవడానికి ముందు స్టీఫెన్ జే గౌల్డ్ గురించీ, IQ వంటి ఇంటెలిజెన్స్ థియరీల చరిత్ర గురించీ తెలుసుకోవాలి.

స్టీఫెన్ జే గౌల్డ్: 
స్టీఫెన్ జే గౌల్డ్ పేరెన్నికగన్న సైన్స్ పాపులరైజర్. డార్వినిస్టు. ఐతే స్టీఫెన్ గౌల్డ్ గురించి మార్క్సిస్టు సర్కిల్స్ లో తప్ప బయటివారికి పెద్దగా తెలియకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. రిచర్డ్ డాకిన్స్ కీ గౌల్డ్ కీ సైద్ధాంతిక వ్యతిరేకత ఉంది. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఏకంగా పుస్తకాలే రాసుకున్నారు. అది కాసేపు పక్కన పెడితే, స్టీఫెన్ జే గౌల్డ్ ఆధునిక శాస్త్రచరిత్రలో ఓ విలక్షణమైన మేధావి‌. ఆయన జీవితాన్ని రచనలను పరిశీలిస్తే ఆయనలో రెండు కోణాలు స్పష్టంగా కనబడతాయి. ఒకవైపు బహుళ శాస్త్రశాఖల మధ్య సమన్వయాన్ని తీసుకువచ్చిన డార్వీనియన్ బయాలజిస్టుగానూ, ఇంకోవైపు విజ్ఞాన శాస్త్రాన్ని సామాజిక, తాత్విక దృష్టితో విమర్శించే మార్క్సిస్టు మేధావిగానూ, ఈ రెండు కోణాలూ ఆయనలో మనకు కనిపిస్తాయి. ఈ రెండో కోణం సామాజిక కోణం. ఇదే చాలా మందికి అతనిలో నచ్చని కోణం‌‌. ఆయన రచనలు, ముఖ్యంగా The Mismeasure of Man, Wonderful Life, Rocks of Ages వంటి గ్రంథాలు, ఇతర రచనలూ, విజ్ఞాన శాస్త్రాన్ని కేవలం ఒక శాస్త్రం గానే కాకుండా ఒక నైతిక, చారిత్రక, రాజకీయ క్షేత్రంగా కూడా చూడమని పాఠకులను ఆహ్వానించాయి. ఒక రకంగా గౌల్డ్, విజ్ఞానం అనే అంశాన్ని “వికాసశాస్త్రం”, “మానవశాస్త్రం” మరియు “సామాజిక సిద్ధాంతం” ముడిపడే మల్టీడైమెన్షనల్ దృక్కోణంలో విశ్లేషించి మనుముందు ఉంచుతారు.

స్టీఫెన్ గౌల్డ్ ని విమర్శించే వారిలో రైటిస్టులు లేదా సైన్స్ ముసుగు వేసుకున్న న్యూయేజ్ మతస్థులు ఉండటం తరచూ చూస్తుంటాం. ఎందుకంటే ఇతడు సైన్స్ ను తమ భావజాలాలకు అనుగుణంగా మలచుకునే సకల సైంటిఫిక్ డిటర్మినిజం లను ముక్కు బద్దలు కొడతాడు కాబట్టి. అలాగే స్టీఫెన్ గౌల్డ్ ని కావాలని విస్మరించడం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్టీఫెన్ గౌల్డ్ వాదనతో ఏకీభవించడం అంటే సైన్స్ ను రైట్ వింగ్ భావజాలం ప్రోది చేసే సైంటిఫిక్ డిటర్మినిజంను సంపూర్ణంగా వ్యతిరేకించడమే. ఇది చాలామందికి నచ్చని అంశం. రిచర్డ్ డాకిన్స్ వంటి వారు జె గౌల్డ్ శాస్త్రీయ ప్రతిపాదనలను విమర్శించినప్పుడు ప్రధాన స్రవంతి రైట్ వింగ్ పత్రికలన్ని దానిని ప్రముఖంగా హైలైట్ చేసి ప్రచురించడం, ఆ అత్యుత్సాహం కూడా మనకు కనిపిస్తుంది. వారిరువురి భిన్న అభిప్రాయాలకూ, శాస్త్రీయ దృక్పథాలలోని వ్యతిరేకతలకు కూడా రాజకీయ రంగు పులమడంలో ఎవరి ప్రాధాన్యాలు ఉంటాయో చెప్పనవసరం లేదనుకుంటాను‌.

డార్విన్ జీవ పరిణామ వాదానికి గౌల్డ్ అదనంగా జత చేసిన మరొక ముఖ్యమైన అంశం- “punctuated equilibrium”. డార్విన్ తను ప్రతిపాదించిన పరిణామ వాదం పై స్మిత్ & మాల్థస్ ల classical political economy యొక్క ప్రభావం ఉందని‌‌ ఎలా ఐతే చెప్పుకున్నాడో, స్టీఫెన్ గౌల్డ్ తన కమ్యూనిస్ట్ నేపథ్యం, సివిల్ రైట్ మూమెంట్స్ తో తనకున్న అనుబంధం కూడా తన punctuated equilibrium సిద్ధాంతంపై ప్రభావం చూపిందని చెప్పుకున్నాడు. అంటే ఈ సైంటిఫిక్ థియరీ లకు ఆనాటి సామాజిక ఆర్థిక వివరణలు ఒకరకంగా ఊతమిచ్చాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. డార్వినిజం వచ్చిన కాలం తర్వాత ప్రబలిన బ్రిటిష్ కొలోనియలిజం ఏ విధంగా సోషల్ డార్వినిజంని, యుజెనిక్స్ ని తీసుకువచ్చిందో అది ఎంత అమానవీయంగా మారిందో నా గత వ్యాసంలో చూశాం. 

ఐతే స్టీఫెన్ గౌల్డ్ ఏమంటాడంటే, క్రేనియోమెట్రీ, అంటే మనుషుల పుర్రెలు సైజుల ను బేరీజు చేస్తూ ఒక జాతి తెలివైన జాతి అని ఒక జాతి తక్కువ జాతి అనీ తేల్చి చెప్పిన శాస్త్రం కూడా బ్రిటిష్ కొలోనియలిజం తో ప్రభావం చెందినదే అని. అప్పటి ఆంథ్రోపాలజిస్టులు క్రేనియోమెట్రీ ద్వారా కపాలం సైజు పెద్దగా ఉండే Caucasians ఉన్నత జాతి అని, వారికి ఎక్కువ తెలివి ఉంటుందనీ, కపాలం సైజు చిన్నగా వున్నతూర్పు ఆసియా, నీగ్రో వంటి జాతులు తక్కువ స్థాయ జాతులనీ, వారికి తెలివి పెద్దగా ఉండదనీ, అందుకే సైన్స్ లో ఇండస్ట్రియల్ రివొల్యూషన్ లో యూరోప్ పురోగమించిందనీ నమ్మడం మొదలుపెట్టారు. ఐతే, పంతొమ్మిదవ శతాబ్దానికి క్రేనియోమెట్రీ ఎలాగో ఇరవయ్యవ శతాబ్దానికి IQ అలాగా అంటూ, ఇవి రెండూ జాతుల మధ్య ఎక్కువ తక్కువలు ఏర్పర్చడానికి సైన్స్ పేరుతో ముందుకు వచ్చిన అంశాలనీ అంటాడు స్టీఫెన్ గౌల్డ్. 

ఐతే, సోషల్ డార్వినిజం కావొచ్చు, యుజెనిక్సే కావొచ్చు అలాంటి రేసియల్ బయాస్ ని కలిగి ఉండే బయోలాజికల్ డిటర్మినిజం కావొచ్చు ఇవి ఎప్పటికీ మనతో పాటే ఉండిపోతాయని స్టీఫెన్ గౌల్డ్ అంటాడు. ఇది ఆయన చేసిన ముఖ్యమైన సూచన. దీనికి తగ్గట్టుగానే మనం గమనిస్తే ఈ రోజు మన దేశంలో కావొచ్చు ఇతర దేశాల్లో కావొచ్చు రాజకీయాలూ, సైంటిఫిక్ డిస్కోర్సులూ, ఈ జాత్యాహంకారాలు ఆధిపత్యాల చుట్టూనే తిరుగుతుండటం మామూలు విషయం ఏమీ కాదు. జాతి వివక్ష మనలో అంతర్లీనంగా అలాగే ఉండిపోతుందని మన లోపల ఇంకిపోయినవాటిని మనం ఎన్నటికీ వదిలించుకోలేమనే సూచన చేశాడు గౌల్డ్‌. ఐతే ఈనాడు సైన్స్ పేరుతో వాటిని మరింత బలోపేతం చేసుకుంటున్నాం‌. అదీ అసలు సమస్య.

ఇంటెలిజెన్స్ థియరీల చరిత్ర :
మనిషి మేధను కొలిచేందుకు కాలానుగుణంగా ఎన్నో థియరీ లు పుట్టుకొచ్చాయి. మొదట ఫ్రాన్సిస్ గాల్టన్ మనిషి ఇంటెలిజెన్స్ అనేది జన్యుక్రమంగా సంక్రమించే లక్షణం అన్న భావన ప్రవేశ పెట్టాడు (1869). అదే సమయంలో వలస దేశాలకు పరిశోధనల కోసం యూరోప్ నుండి బయలుదేరిన ఎందరో ఆంథ్రోపాలజిస్టులు, డాక్టర్లు, మేథ అనేది యూరోపియన్ జాతికి మాత్రమే చెందినదిగా (euro centric) చెప్పేందుకు శాయశక్తులా కృషి చేశారు. అందులో భాగంగానే పంతొమ్మిదవ శతాబ్దంలో క్రేనియోమెట్రీ, ఇరవైయవ శతాబ్దంలో IQ లు వచ్చాయి. ఇవి తమ జాతి ఆధిపత్యాన్ని (racial supremacy) సైన్స్ పేరుతో ప్రామాణికం (standardize) చేసే ప్రయత్నం చేశాయి. IQ పరీక్షల ఆధారంగా కొన్ని జాతులు, వర్గాలు, భాషలున్న సమూహాలు తక్కువ మెరుగైనవిగా తేల్చబడడ్డాయి. చరిత్రలో ఇది మనం చూడవచ్చు. ఈ ధోరణిని IQ test సూత్రధారి ఆర్ఫ్రెడ్ బినెట్ సైతం వ్యతిరేకించాడు. ఐనాగానీ చివరికి అవి జాతి వాదాన్ని బలపరిచే దిశవైపే పయనించాయి. IQ tests యుజెనిక్స్ ని జస్టిఫై చేశాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో సైనికులను రిక్రూట్ చేసుకోవడానికని IQ TESTS, సంస్థాగతీకరించబడ్డాయి. 

ఐతే యుద్ధం తరువాత యుజెనిక్స్ శకం ముగిసింది. కానీ ఎప్పుడైతే రష్యా స్పుత్నిక్ వ్యోమనౌక ని ప్రయోగించిందో అమెరికా రష్యాలమధ్య కోల్డ్ వార్ మొదలైంది. అపుడు మళ్ళీ IQ testing తెరమీదకు వచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో Cognitive excellence ని గుర్తించాలి అంటే IQ test మాత్రమే మార్గమనే పరిస్థితి వచ్చింది‌. STEM సబ్జెక్టు లపై పరిశోధనలు పెరిగాయి. ఈ ధోరణి పోస్ట్ మోడర్న్ నిర్మిత సత్యాల విచ్ఛిత్తి జరిగే వరకూ(1980s) కొనసాగింది‌. కానీ గ్లోబలైజేషన్ డిజిటల్ శకం వచ్చాక IQ test ప్రాబల్యం తగ్గింది‌. వ్యక్తి యొక్క విస్తృత మేథను కేవలం ఒక స్కోరింగ్ సిస్టం కి దిగజార్చి లేదా కుదించి అంచనా వేయలేమనే అవగాహన పెరగడం మొదలైంది. 

IQ కేవలం శాస్త్రీయ పరిశీలన కాదు, దీనిలో శాస్త్రీయత ఎంత అనే ప్రశ్న తర్వాత వేసుకున్నా మొదట ఇది నైతిక, రాజకీయ సాంస్కృతిక జాత్యాహంకార ధోరణులకు ప్రతిరూపం. అంటే Intelligence అనే భావనను కొలవాలనుకోవడమే ఒక అహంకారపూరిత ఆధిపత్యానికి నిదర్శనం‌. ఒకడు కొలిచేవాడు ఒకడు కొలువబడే వాడూ ఉంటాడు. Intelligence లో ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో చెప్పబడతారు. మనుషులు కొలతలు వేయబడి బేరీజు చేయబడతారు. ఈ కొలిచే పద్ధతులు కొంతమంది నిర్మించిన సామాజిక అర్ధాల వలన సైన్స్ పేరుతో నిర్మించిన సత్యాల వలన నిర్దేశింపబడ్డాయి. ఇవి కొన్ని ఆధిపత్య సమాజాలకు నిచ్చెన మెట్ల ఎగుడుదిగుడు సమాజాలకు తమ ఆధిపత్యాన్ని యథాతథంగా status quo లో కొనసాగించడానికి సులభంగా అంది వచ్చిన విషయం. అందుకే ఇటువంటి శాస్త్రీయ విషయాలు అని చెప్పబడుతున్నవి ఆ సమాజపు విలువలతో విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. 

ఐతే కోల్డ్ వార్ వాతావరణం IQ testing వంటి వాటిని తిరిగి తెరమీదకు తెచ్చినా IQ testing లోని క్రెడిబిలిటీని ప్రశ్నించడం మొదలుపెట్టింది‌‌. మనిషి మేధను అంచనా వేయడానికి IQ testing అసలు సరిపోదని ఒక అంచనాకు వచ్చింది‌. అదే సమయంలో పోస్ట్ మోడర్నిజం చేసిన నిర్మిత సత్యాల ఛేదనంకూడా అందివచ్చింది‌. ప్రస్తుతం డిజిటల్ యుగంలో IQ భ్రమలు పూర్తిగా తొలిగి ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ (EQ), వివిధ సంస్కృతుల మధ్యన సమాచార బదిలీ, టీం వర్క్ వంటి భావనలు వ్యక్తుల విజయానికి తోడ్పడతాయి తప్ప వ్యక్తులవారీగా వ్యక్తుల మేధను కొలిచేందుకు IQ అనేది ఔట్ డేటెడ్ అంశం అని రూఢీ అయింది. అందుకే ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు సైన్స్ IQ test ల్లాంటి మేధో లెక్కల స్టాండర్డైజేషన్ స్థానంలో మేథో డైవర్సిటీ ని తెచ్చింది. మనుషులలో వివిధ రకాల రంగులున్నట్లు, మెదడులో కూడా మేధో డైవర్సిటీ ఉంటుందని తేల్చింది. మేధోపరమైన హెచ్చుతగ్గుల స్థానంలో మేథో సమానత్వాన్ని తిరిగి నిలిపింది. దీనిలో స్టీఫెన్ జే గౌల్డ్ పాత్ర ఎనలేనిది. ఒకరకంగా, The Mismeasure of Man పుస్తకంలో మొదటిసారిగా IQ విధానం మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన మొదటివాడు గౌల్డ్ అని చెప్పకతప్పదు. He dismantled the myth of single measurable tool of intelligence. విజ్ఞాన శాస్త్రాన్ని సత్యం అనే ముసుగులో తమ భావజాలపు మద్దతుదారిగా వాడుకునే డిటర్మినిస్టిక్ దృష్టికోణాలకు చరిత్రాత్మక, తాత్విక ప్రతిఘటనగా బలంగా నిలబడినవాడు గౌల్డ్.

భారతదేశ పరిస్థితి : 
ఐతే విచిత్రమైన విషయం ఏమిటంటే, మన దేశంలో ఈరోజుకీ మనిషి మేథను IQ tests రూపంలో లెక్కించడం జరుగుతూనే ఉంది. ఈ హెచ్చుతగ్గుల సమాజానికి ఇది చాలా అప్పీలింగా ఉండటం దీనికి కారణం. కొందరికి కుల పరంగా అధిక మేధ ఉంటుందని బాగా చదువుకున్నవారు కూడా నమ్ముతుంటారు. ఈరోజుకీ IQ testing మన దేశంలో మేథను లెక్కించడానికి gold standard test గా భావించబడుతోందంటే అందుకు వలసవాదమూ( colonial hangover), అది అందించిన “సైంటీజమే” కారణం. అంతేకాకుండా మనకు ఇంటెలిజెన్స్ థియరీ ల అసలు రంగు తెలియకపోవడం, మన విద్యా వ్యవస్థ ఆధునికీకరణ చెందక పోవడం. వైజ్ఞానిక ప్రపంచం దీనిని వదిలివేసుకున్నా మన దేశంలో ఈ టెస్టులకు నేటికీ విలువ ఉండటం మన సమాజపు ఛాందసవాద బ్రాహ్మణ వాద భావజాల వాతావరణానికి కొనసాగింపు మాత్రమే. నిచ్చెన మెట్ల మన సమాజంలో దీనికి నైతిక విలువనూ, సామాజిక విలువనూ ఇచ్చి మరీ విద్యారంగంలో కొనసాగించడం జరుగుతుంది. 

ఉన్నత వర్గాల ఫాంటసీ లైన ఇంజనీరింగ్, మెడిసిన్, సివిల్ సర్వీసులలో విజయం సాధించే విషయమై IQ పరిక్షల చక్రభ్రమణం, ఫెటిషిజం విపరీతంగా పెరిగింది. ప్రైవేటు విద్యా సంస్థల విద్యా మార్కెట్( commodidication of education )వచ్చాక, మా స్కూల్ లో చదివితే మీ పిల్లవాడి IQ పెరుగుతుంది అని బాహాటంగా ప్రకటనలు ఈయడమూ చూస్తుంటాం‌‌. విద్య మొత్తం ర్యాంకుల చుట్టూ, మార్కుల చుట్టూ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చుట్టూ తిరిగేలా చేయడంలో మన విద్యావ్యవస్థ సఫలీకృతం అయ్యాక, “ఉన్నతమైన” “అల్పమైన “అని చాలా సులువుగా లెక్కించ దగిన ఒక tool గా నేటికీ IQ కొనసాగుతోంది. గౌల్డ్ చెప్పినట్టుగా ఇది ఈ సమాజపు నిర్మాణం రీత్యా ఇంకా కొనసాగే ప్రమాదం నూటికి నూరు శాతం ఉంది. అందుకే మనదేశం వైజ్ఞానికంగా ముందుకు పోవాలని అనుకుంటే ఇటువంటి కాలం చెల్లిన పద్ధతులకు స్వస్తి పలకాలి. Exclusive, hierarchical education ని వదిలి Inclusive education వైపు కదలాలి అనుకుంటే సైంటిఫిక్ పేరుతో వచ్చే, IQ tests వంటి వాటి స్థానాన్ని శాశ్వతంగా తొలగించాలి. ఆ దిశగా మేధావులు కృషి చేయవలసిన అవసరం ఉంది.

One thought on “సైన్సు సమాజం బుద్దికొలతలు

  1. విరించి గారు చాలా కూలంకషంగా ఒక పద్ధతి ప్రకారం అర్థం అయ్యేట్టు విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు విరించి గారు.

Leave a Reply to Rajasekhar Settipalli Cancel reply

Your email address will not be published. Required fields are marked *