విఠపు బాల సుబ్రహ్మణ్యం

అది ఒక పేద కుటుంబం. దానికి రెండు గేదెలు తప్ప ఏమీ వుండవు. అయినా అది ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. ఒకరోజు పిల్లలు తిండి లేక మాడుతుండడంతో భార్య తమ గేదెను అమ్మాల్సిందిగా భర్తకు చెబుతుంది. దీనికి కుటుంబం అంతా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇంటి యజమాని గేదెను మార్కెట్టుకు తీసుకెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాడు. పిల్లలు తండ్రి చుట్టూ మూగుతారు. ‘గేదెను అమ్మి గుర్రాన్ని తీసుకున్నాను’ అని తండ్రి అనగానే పిల్లలందరూ ఎగిరి గంతేసారు. ‘మేం రేపటి నుంచి గుర్రం మీద స్వారీ చేస్తాం’ అన్నారు. ‘ఆ గుర్రం గుడ్డిది. అందుకని దాన్ని అమ్మి మేకను కొన్నాను’ అన్నాడు తండ్రి. ‘భలే! భలే! రేపటి నుంచి మేము మేకపాలు తాగొచ్చు’ అని ముచ్చట పడ్డారు పిల్లలిద్దరూ. ‘లేదు ఆ మేక బక్కది అందుకని దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకున్నాను’ అన్నాడు తండ్రి. దానికి పిల్లలు ఇంకా సంతోషపడ్డారు. ‘అట్లయితే ఈరోజు మేము మంచి భోజనం తింటాం’ అని కేరింతలు కొట్టారు. అప్పుడు తండ్రి ‘దారిలో ఒక బిచ్చగత్తె కనిపించింది. ఆమె రెండు రోజులనుంచి తిండి లేక మలమల మాడుతోంది పాపం. చూడలేక ఆ డబ్బును ఆమెకిచ్చేశాను’ అన్నాడు. ‘అవునా ఎంత మంచి పని చేశావు’ అంటూ భార్య, పిల్లలు మహా సంతోషపడ్డారు. ఆ రాత్రికి రాగిజావ తాగి ఆనందంగా నిద్రపోయారు.

నూతన విద్యా విధానం చట్టంగా మారి అమల్లోకి వచ్చాక దీనికి తగ్గ సిలబసును, పాఠ్యగ్రంథాలను రూపొందించడం కోసం విద్యాశాఖ “నూతన పాఠ్య ప్రణాళికా చట్రం – 2023″ను ఈ మధ్య తీసుకొచ్చింది. అందులో నాల్గవ తరగతి పిల్లలకు ఎలాంటి కథ చెప్పాలో, ఎలాంటి విలువలు రాబట్టాలో వివరిస్తూ నమూనాగా చెప్పిన కథ ఇది.

“ఇలాంటి కథల వల్ల పసిపిల్లలకు చిన్నతనంలోనే ‘నిష్కామ కర్మ’ అలవడుతుంది (ఇదొక గొప్ప భారతీయ విలువ!) పిల్లల్లో ఊహాశక్తి, తార్కికత, ఉత్సుకత పెంపొందుతాయి. నిత్య జీవితంతో విద్యకు ఒక అన్వయం కుదురుతుంది అన్నిటికంటే మించి జీవితాన్ని గురించి వారికి చిన్న నాడే గొప్ప స్పృహ కలుగుతుంది”. ఇదీ ఈ కథ నుంచి ఈ “నూతన పాఠ్య ప్రణాళిక” ఆశిస్తున్నది.

తొమ్మిదేళ్ల పిల్లలు- మరీ ఈ తరం పేదపిల్లలు ఈ కథను ఎలా స్వీకరిస్తారు? దీనిపై ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వారి జీవిత అనుభవానికి ఇది ఎంత ఉపయోగపడుతుంది? అనే ప్రశ్నలేవీ ఈ విధానకర్తలకు ఎదురు కాలేదు కాబోలు.

ఏదైనా ఒక మారుమూల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి, పిల్లలకీ కథ చెప్పి వుంటే వాస్తవం తెలిసి వచ్చేది. పేదవాళ్లంతా ఆనందమయ ప్రపంచంలో తేలియాడుతుంటారా? వాళ్ల పిల్లలు తండ్రి ఏం చేసినా, ఏం పోగొట్టుకొని వచ్చినా కేరింతలే కొడతారా? అయినా బిచ్చగాడి ఆకలి తీర్చడానికి పూట గడవని పేదలే లోకంలో మిగిలారా? ఈ ప్రశ్నలు కూడా మన పండితులకు ఎదురు కాలేదు. పేదలంతా చేసేది నిష్కామకర్మనీ, వారంతా సంతోష డోలికల్లో విహరిస్తున్నారనీ దీని రచయితలు గాఢంగా నమ్ముతున్నారు మరి!

ఆధునిక విద్యాతత్వం ఏం చెబుతోంది?
ఇంతకూ చెప్పొచ్చేదేమంటే ఈ కథ ఎంత కృతకమో, ఎంత దుర్మార్గమో ఈ పాఠ్యప్రణాళికా అంతే కృతకం అంతే దుర్మార్గం! నూతన జాతీయ పాఠ్య ప్రణాళిక 630 పేజీల మహాగ్రంథం. ఇందులో దాదాపు 100 పేజీలు నర్సరీ, ప్రాథమిక స్థాయి చిన్న పిల్లల చదువులకే కేటాయించబడ్డాయి. అసలు నూతన విద్యా విధానమే పసి పిల్లల చదువులకు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది.

మరి ఈ స్థాయి పిల్లల శారీరక మానసిక ఎదుగుదల ఎలా వుంటుంది? వీరు నేర్చుకునే తీరు ఎలాంటిది? వీరితో వ్యవహరించాల్సిన పద్ధతి ఏమిటి? అన్నిటిని మించి ఈ దశలోని పిల్లల ప్రపంచం ఎలాంటిది? వీటిపై జరిగిన ఆధునిక ప్రయోగాలు ఏమిటి? నిర్ధారణలు ఏమిటి? అనుభవాలు ఏమిటి? పిల్లల చదువుల్లోనే కాదు వారి హక్కుల్లో కూడా ముందున్న ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఏం జరుగుతోంది? వీటి వైపు ఒక్క క్షణం కూడా ఈ పాఠ్య ప్రణాళిక ఆలోచించడానికి ఏమాత్రం సిద్ధపడలేదు. పైగా వీటన్నిటినీ తిరస్కరిస్తోంది.

ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం, శరీరశాస్త్రం పిల్లల వికాసం పై చేసిన మహత్తర పరిశోధనలు, వాటి నిర్ధారణలు అద్భుతమైనవి మన ముందున్నాయి శిశువు జ్ఞాన సంపాదనపై వైగోట్ స్కీ ప్రతిపాదించిన “సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని” నేడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. నేర్చుకోవడం స్వతంత్రం, వ్యక్తిగతం కాదనీ అదొక సామాజిక చర్య అనీ వైగోట్ స్కీ అంటాడు పిల్లలకు సొంత ప్రపంచం వుంటుంది పరిసర సామాజిక అంశాలన్నీ అందులో పొరలు పొరలుగా వుంటాయి . శిశువు వాటితో నిరంతరం జరిపే చర్యనే ‘నేర్చుకోవడం’ అంటారు. తొలి దశలో ఇది అత్యంత సహజంగా జరిగిపోతుంది. క్రమంగా బిడ్డ ప్రపంచం విస్తృతం కావడం మొదలవుతుంది. బడిలో జరిగే నియత విద్య కూడా దీనికి కొనసాగింపుగా వుండాలి. ఈ శిశువిద్యాదశలో మన పెద్దల ప్రపంచపు కృతకనీతులకు, తెచ్చిపెట్టుకున్న ఆకాంక్షలకు చోటుండ రాదు. అలాగే నేర్పడం, నేర్చుకోవడం కూడా విడివిడిగా వుండవు. అదొక పరస్పర చర్య. ఈ మొత్తం ప్రక్రియలో శిశువు ప్రధానం. శిశువే కేంద్రం. దీన్నొక ప్రజాస్వామిక విద్యాతాత్వికతగా విద్యావేత్తలందరూ నేడు నమ్ముతున్నారు.

పిల్లల వికాసాన్ని, బోధనాభ్యసనాల్ని అర్థం చేసుకోవాలంటే గొప్ప ప్రజాస్వామిక దృక్పథం కూడా మనకుండాలి. దీని ప్రకారమైతే “శిశుర్ఫ్రహ్మా, శిశుర్విష్ణుః” అని మొత్తం తిరగరాయాల్సి వుంటుంది. అయితే ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. అందుకే దీని కోసం మహా మహా విద్యాతత్వవేత్తలు జీవితాలకు జీవితాల్నే వెచ్చించాల్సి వచ్చింది. డేవిడ్ హాస్పిరో, సుహోమ్లోన్ స్కీ, మాంటిస్సోరి, గిజూబాయి, జాన్ హోల్డ్, సెల్వియా లాంటి ఈ కోవలోని వారిని మనం ఎందరినైనా ఉట్టంకించవచ్చు. ఈ తాత్వికతను ప్రాణప్రదంగా భావించే వారికి మన దేశంలో ఇప్పటికీ కొదవేమీ లేదు. ఇంత దూరం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నూతన పాఠ్యప్రణాళిక ఈ ఆధునిక విద్యాతత్వాన్ని మొత్తాన్ని తిరస్కరిస్తుంది. లేదా ఆ వైపుకు మళ్ల కుండా జాగ్రత్త పడుతుంది “అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష” లోకి మనల్ని తీసుకెళుతుంది.

ఇవండీ బిడ్డ ఎదుగుదల దశలు! అభ్యసన దశలూ!!
‘బిడ్డ ఎలా దశలవారీగా అభివృద్ధి చెందుతుంది?’ అనేందుకు ఆధారాలుగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే మన ప్రాచీన పంచ కోశ వికాసాలను నూతన విద్యావిధానం ముందుకు తెస్తుంది. శరీరం, మెదడు, నాడీమండలాల అభివృద్ధికి సంబంధించి అద్భుతమైన శాస్త్రజ్ఞానం అందుబాటులో వున్న కాలంలో ఈ పంచ కోశాల్ని ఎలా నిరూపణకు నిలబెట్టగలం ? వీటినాధారంగా చేసుకుని పిల్లల అభివృద్ధిని ఎలా అంచనా వెయ్యగలం? ఇప్పటిదాకా మనం కనీసం వీటిని ఎరగనైనా ఎరుగుదుమా? ఈ మాత్రం బుద్ధి దీని రూపకర్తలకు లేకపోయింది.

నూతన పాఠ్యప్రణాళిక ఇంతటిదో ఆగదు. పసిపిల్లల అభ్యసన దశల క్రమాన్ని అర్థం చేసుకునేందుకు మన “పంచాది” అద్భుతంగా పనికొస్తుందని చెప్పుకొస్తుంది. అదితి, బోధ, అభ్యాస, ప్రయోగ, ప్రసారాలనే ఈ ఐదింటిని ఉపాధ్యాయులు వొంట పట్టించుకోవాలట. (దీని రూపకర్తలు ఒకసారి జాన్ హోల్డ్ రచించిన “పిల్లలు ఎలా నేర్చుకుంటారు” అనే గ్రంథం చదివి వుంటే బాగుండేది! అప్పుడు మనకీ కష్టాలు వుండేవి కాదు.)

వల్లెవేతనే స్మృతి అంటారట!
ఇందులో పిల్లలు కంఠస్థం చేయడం సరైనదా కాదా అనే చర్చ ఒకచోట వుంది. గుడ్డి కంఠస్థాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. అంతవరకు బాగానే వుంది. కానీ ‘జ్ఞాపకమూ, వల్లవేతా ఒకటేనా ? ‘అనే చర్చను అనవసరంగా లేవదీసి, మనకు వేల ఏళ్ల నాటి ధారణా సాంప్రదాయం వుందనీ, దాన్నే మనం గొప్పగా “స్మృతి” అంటున్నామని చెప్పుకొస్తుంది. మన వల్లెవేత చదువుల్ని చూసి ఒకప్పుడు మన్రో లాంటివారే ముక్కునవేలేసుకున్నారు. వేలెడంత లేని పిల్లలు వందలాది పద్యాలు ఏకధారగా చెప్పడం చూసి విస్తు పోయారు. కానీ పరిశీలించిన తర్వాత ఇందులో పసేమీ లేదని, ఇదంతా శుద్ధ దండగ వ్యవహారమనీ తేల్చుకున్నారు.ఇప్పుడు కార్పొరేట్ చదువులు వచ్చాక చిలక పలుకుల చదువులకు సర్వామోదం లభించాక ఎంత నష్టం వచ్చిందో ఈ పాఠ్య ప్రణాళిక గుర్తించి వుంటే బాగుండేది. ఈ ధోరణి పట్ల నిర్ధాక్షణ్యంగా వ్యవహరించాల్సింది పోయి ప్రాచీన స్మృతి సంప్రదాయాన్ని వత్తాసు తెచ్చుకోవడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడతో ఆగక పసి పిల్లలకు డ్రిల్లింగ్ ఎంత అవసరమో నొక్కనొక్కి చెప్పడం మరీ దారుణం!

చదువులన్నీ ఉపనిషత్తుల్లోనే వున్నాయిష
‘పిల్లలు ప్రశ్నించాలి’ అంటూ ఈ వారసత్వం మనకు ఉపనిషత్తుల కాలం నుంచే వుందనీ, కంఠోపనిషత్తులో చిన్నారి నచికేతుడు “మరణం తర్వాత జీవితం ఉందా? చావే అంతిమమా?” అని శివుణ్ణి నిలదీస్తాడని ఈ పాఠ్యప్రణాళిక మరోచోట చెబుతుంది. ఇక ఆదిశంకర మండనమిశ్రుల వాగ్వాదాన్ని ఉదాహరణగా చూపుతూ విశ్వాసాన్ని పరీక్షకు పెట్టే ధైర్యం మనకు వారసత్వంగా అబ్బిందనీ, ఈ ప్రశ్నలతోనే మనకు భావనలు (concepts) తెలిసేవని కూడా పేర్కొంది.

పసిపిల్లలు ప్రతి దాన్నీ ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నిస్తూనే వాళ్ళు నేర్చుకుంటారు. ఈ మాత్రం చెప్పడానికి కంఠోపనిషత్ దాకా పోవాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రస్తుత చదువులు ఈ ప్రశ్నల్ని మొగ్గలోనే తుంచేయడం కదా జరుగుతున్నది. గలగల వసవోసినట్లు మాట్లాడే పిల్లల్ని, సవాలక్ష సందేహాలతో బడికొచ్చే బుడతల్ని మన చదువులే కదా మూగ మొద్దుల్నిగా మారుస్తున్నది? ఏ వారసత్వం మన చదువుల్లోకి దూరి వీటినిలా మార్చింది? ఇంత పెద్ద మహా గ్రంథంలో ఇంత చిన్న విషయానికి చోటే లేకపోయింది! ఈ పాఠ్యప్రణాళిక ఆధునిక బోధనా శాస్త్రపు మూలాలన్నీ తైత్తరీయోపనిషత్తులోనే వున్నాయంటుంది. “ఉపాధ్యాయుడు మొదటి అక్షరం, విద్యార్థి చివరి అక్షరం, జ్ఞానం సంగమ స్థలం, బోధన అనుసంధానం” ఇదట సదరు ఉపనిషత్తు చెప్పిన బోధనా తత్వ సారం! ఇంతకూ ఈ ఉపనిషత్తు ప్రకారం కూడా విద్యార్థి చివరివాడే అన్న మాట!

గురు కేంద్రక విద్యా విధానాన్ని వెనక్కు నెట్టి, ఆధునిక ప్రపంచం ఎంతో ముందుకెళ్లి దశాబ్దాలు కావస్తోంది మన జాతీయ పాఠ్య ప్రణాళిక మాత్రం తైత్తరీయోపనిషత్తు దగ్గరే చతికిలబడిపోయింది. విచిత్రం ఏమంటే 2005లోవచ్చిన జాతీయ పాఠ్య ప్రణాళిక ఆధునిక శిశు కేంద్రక విద్యా విధానాన్ని నొక్కి మరీ చెపుతూ ఇప్పటికీ దీన్ని అంగీకరించలేకపోతున్నామని ఎంతో విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడేమో 2023 వచ్చేప్పటికి మళ్లీ మనం మొదటి కొచ్చాం.

భాషా ఛాందసంపై మౌనం
భాషల ఆవశ్యకత మీదా, మన బహుభాషా సంపద మీదా, నర్సరీ స్థాయిలోనే మూడు భాషలు నేర్చుకోవాలన్న లక్ష్యం మీదా, ఏకకాలంలోనే భాషా త్రయాన్ని నేర్చుకోగల పిల్లల శక్తి సామర్థ్యాల మీదా ఈ పత్రంలో బోలెడు చర్చ వుంది. మాటిమాటికి మనదేశంలో 19,500 భాషలు, మాండలికాలు వున్నాయని వాటిని కాపాడుకోవాలని కూడా ఈ పాఠ్యప్రణాళిక చెప్పుకొస్తుంది. కానీ చెప్పకుండా దాటేసింది ఏమంటే మన భాషా చాందసవాదం గురించి. భాషా బోధనలోని మన మొరటు ధోరణుల గురించి. మన ముస్లిం పిల్లలు బడికొచ్చేటప్పటికి ధారాళంగా ఉర్దూ, తెలుగు మాట్లాడతారు. ఇంటి పరిసర వాతావరణాన్ని బట్టి మూడు భాషలు మాట్లాడ గలిగే పిల్లలు కూడా వున్నారు. మరి మన బడిలో ఏళ్ల తరబడి నేర్పినా ఇంగ్లీషు మాట్లాడడం ఎందుకు రావడం లేదు? మాతృభాషలోనూ నాలుగు ముక్కలు మన పిల్లలు ఎందుకు రాయలేకపోతున్నారు? దీనివల్ల స్వీయ అభ్యసనం కొరవడుతోందనీ, తార్కిక, విశ్లేషణా, సృజన శీలతలు అడుగంటి సేవా ధర్మానికి (సేవా రంగానికి) పరిమితం అవుతున్నామని, ఏ నూతన ఆవిష్కరణలూ చెయ్యలేకపోతున్నామని సాక్షాత్తూ ప్రధాన మంత్రులే సైన్సు కాంగ్రెస్ లలో పలుమార్లు వాపోయారు. పాఠశాల దశలో బోధనాభ్యసనాల్లోని బలహీనత అంతా ఇక్కడే దాగి వుంది. మరి ఈ పాఠ్య ప్రణాళిక దీనికి చెబుతున్న పరిష్కారం ఏమిటి?

‘భాషా, గణితం ఎంతో ముఖ్యమైనవని మన తిరువళ్ళువరు ఎప్పుడో చెప్పారు’. ‘భాష కేవలం సమాచార ప్రసారానికే కాదని రసాస్వాదన కోసం కూడానని భారతీయులు నమ్ముతారు’. ‘భారతీయ సాహిత్యం సుసంపన్నమైనది. ఇది బహుళతలకు ప్రతీక భారతీయ వ్యాకరణంతో పోల్చగలిగింది ప్రపంచంలో మరెక్కడా లేదు’. ఇలాంటి స్వోతోత్కర్షలు తప్ప భాషాతత్వాన్ని గురించి, భాషా బోధనా విధానాల గురించి ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిందో, మనం వ్యాకరణాల దగ్గర, గ్రాంధికాల దగ్గర తచ్చాడుతూ భాషల్ని ఎంత కృతకంగా, భారంగా మార్చేసామో మాత్రం ఈ పాఠ్యప్రణాళిక ఒప్పుకోదు. దీనికంటే 2005 నాటి పాఠ్య ప్రణాళికే ఎంతో నయం. అందులో మన భాషా బోధనా చాందసం గురించి, భేషజం గురించి చాలా చర్చ వుంది. ఆరు నెలల్లో ఏ భాష నైనా ధారాళంగా మాట్లాడే లాగా చేయవచ్చునని, దానికి ఆధునిక పద్ధతీ, పరికరాలు వున్నాయని అది పేర్కొంది.

“భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అనేవి విజ్ఞానాలు. మరి వీటికి సాక్ష్యం ఏమిటి? ఇలాంటి సందిగ్ధత వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి, విశ్వాసాలు నమ్మకాలు ఎంత నిజమైనవో, ఎంత అబద్ధమైనవో తేల్చుకోవడానికి మన ప్రాచీన వారసత్వంలో కొన్ని ప్రమాణాలు వున్నాయి. అవి ప్రత్యక్ష అనుమాన, ఉపమాన, అనుపలబ్ధి, శబ్ద అనేవి. వీటిని సందర్భానుసారం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఎలాంటి చిక్కు సమస్యల నుంచైనా సులభంగా బయటపడవచ్చు” అని మరో చోట ఈ పాఠ్యప్రణాళిక చెప్పుకొస్తుంది. గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర పోషించారో తెలుసుకోవడానికి బోలెడు చారిత్రక ఆధారాలున్నాయి. వాటన్నిటిని గాలికి వదిలేసి ఈ ప్రమాణాల మీద ఆధారపడాలనడం పిల్లల్ని ఎక్కడికి తీసుకొని పోవడం కోసం? అయినా గాంధీ గారి మీద అనుమానం నూతన విద్యావిధాన పాఠ్య ప్రణాళికకు ఎందుకు వచ్చిందో మొదట తేలాల్సి వుంది. అది వేరే చర్చ అనుకోండి!

ఇక మనబడి ఏమవుతుంది? మన పిల్లలు ఏమవుతారు..
ఈ పాఠ్యప్రణాళికలో భారతీయ మూలాల గురించి, దానిపై ఆధారపడ్డ విద్య గురించి, విద్యను భారతీయీకరణ చేయడం గురించి, ప్రతి సబ్జెక్టులో ప్రాచీన వారసత్వ విలువల్ని ఎలా మిళితం చేయాలో పేజీలకు పేజీలే కనిపిస్తాయి. వీటిని శిశు ప్రాయం నుంచే అందించాలని, నూతన విద్యా విధానపు మౌలిక లక్ష్యాలలో ఇదొకటనీ మాటిమాటికి ఇది పేర్కొంటుంది. దీనికి తగ్గట్టు పాఠ్యాంశాలకు బోధనా రీతులకు నూతన రూపం ఇవ్వాలని ప్రతిపాదిస్తుంది. దీనికోసం అవసరమైతే సమూల మార్పులు తప్పవని కూడా స్పష్టం చేస్తుంది. “అయితే కేవలం పాఠాలు చెప్పడం వల్ల భారతీయవిలువలు పిల్లలకు వొంట బట్టవు. మనం అనుకున్నఫలితాలు సిద్ధించవు. దీనికి పాఠశాల సంస్కృతిలోనే పెద్ద మార్పు రావాలి. బడి పని విధానమే పూర్తిగామారిపోవాలి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఉత్సవాలు, కథలు, గాథలు,సంగీతం, క్రీడలు మన చదువుల్లో అవిభాజ్యం కావాలి. ఉపాధ్యాయుల వైఖరిలో, వారి పనితీరులో పెద్ద మార్పు రావాలి. తరగతి గది స్వరూపం దీనికి అనుగుణంగా మారాలి. ఇవన్నీ జరగాలంటే ప్రస్తుత బడి వనరులు సరిపోవు. సమాజం నుంచి, స్థానికుల నుంచి, ఔత్సాహికుల నుంచి, ఈ రంగాల్లో పనిచేసే సంస్థల నుంచి సహకారం తీసుకోవాలి. మొత్తం సమాజానికి బడి ఒక సాంస్కృతిక కేంద్రంగా మారాలి” ఇలా ఈ పాఠ్యప్రణాళిక మన పాఠశాలలను అధికార వ్యవస్థ నుంచి తప్పించి సమాజానికి అప్పజెవుతుంది. దీనివల్ల బడి లోకి ఏ సంస్థలైనా ప్రవేశించవచ్చు ఎలాంటి కార్యక్రమాలనైనా నిర్వహించవచ్చు. ప్రస్తుత రాజకీయ సందర్భంలో ఇది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పనక్కర్లేదు. ఇదంతా కేవలం పసిపిల్లల చదువుల గురించి! అయిదో తరగతి లోపు పిల్లలు చదువుల గురించి. ఇక పెద్ద పిల్లల సైన్సు, గణితం, చరిత్ర, పరిసర ప్రపంచం లాంటి సబ్జెక్టుల్లో ఇదే తరహా భారతీయీకరణను సాధించడం కోసం ఈ పాఠ్యప్రణాళిక ఏం చెప్పిందో చూస్తే భయమేస్తుంది. ఈ చదువులతో మన పిల్లలు ఏమైపోతారోనని, ఇదంతా ఎక్కడికి దారితీస్తుందోనని చెప్పలేని ఆందోళన కలుగుతుంది. దీన్ని మరో సందర్భంలో చర్చించుకుందాం!

(కొద్ది మార్పులతో “దారిదీపం ” విద్యావిషయిక ప్రత్యేక సంచికలో ముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *