సంపాదకీయం
“ఆనందమె జీవిత మకరందం” అంటాడు సినీ కవి సముద్రాల. ఇంతకూ సదరు ఆనందానికి మూలకందం ఏది? అంతులేని సంపదలా? అఖండ జ్ఞాన విజ్ఞానాలా? శాంతి సామరస్యాలా? స్నేహమయ సామాజిక సంబంధాలా? జనచైతన్యమా? ప్రజానుకూల పాలనా విధానాలా? ఇటీవల విడుదలైన “ప్రపంచ సంతోష నివేదిక” (2025) వీటన్నిటిని తనదైన శైలిలో విశ్లేషించి దేశాలకు ర్యాంకులిస్తుంది. వీటిల్లో కొన్ని మన కళ్ళు తెరిపిస్తాయి. కొన్ని నివ్వెర పరుస్తాయి. కొన్ని ఉసూరుమనిపిస్తాయి.
ఈ నివేదిక ప్రపంచదేశాల్ని మూడు గ్రూపులుగా విడదీస్తుంది. మొదటి 48 దేశాలు ఆనందంలో ముందున్నవి. వీటిలోనూ అగ్రభాగాన వున్న 20 దేశాల్లో 14 పారిశ్రామిక యూరపు దేశాలు. ఫిన్ లాండుది ప్రథమస్థానం. డెన్మార్కు, ఐస్లాండు నార్వే, స్వీడన్లవి తర్వాతి స్థానాలు. ఆశ్చర్యం ఏమంటే కోస్టారికా, మెక్సికోలకు మొదటి పది ర్యాంకుల్లో చోటు దక్కడం. ఎల్ సాల్వడార్, నికరాగువా, వియత్నాంలు మొదటి గ్రూపులోకి దూసుకురావడం. ఇక అమెరికా 11 స్థానాలు పోగొట్టుకొని 24వ స్థానానికి దిగజారి పోగా, బ్రిటన్ 2017 తర్వాత ఎప్పుడూ లేనట్టుగా 23వ స్థానంతో సరిపెట్టుకుంది! ఇజ్రాయిల్ 8వ స్థానంలో నిలిచి నివ్వెరపరిచింది. రెండో గ్రూపులోని 49 దేశాల్లో జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, రష్యా, చైనా, వెనిజులాలున్నాయి. నేపాల్ 92వ స్థానంలో నిలిచి ఈ గ్రూపులో చోటుదక్కించుకోడం విశేషం. మూడవ గ్రూపులోని 51 దేశాల్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు క్యూ గట్టగా ఆఫ్గనిస్తాన్ అట్టడుగుకు చేరింది. ఆశ్చర్యం ఏమంటే మానవాభివృద్ధిలో ఎదురులేని క్యూబా, సంపద (GDP) స్థానే ఆనందాన్ని (GHP) అభివృద్ధికి గీటురాయిగా లెక్కించుకొనే భూటాన్ తో సహా 48 దేశాలకు ఈ నివేదికలో చోటే చిక్కలేదు. వాటి డేటా అందుబాటులో లేదట!

సహజంగానే తలసరి సంపద, ఆయుస్సు, స్వేచ్ఛ,శాంతి, అవినీతి రాహిత్యం, ప్రభుత్వాల మీద నమ్మకం, భవిష్యత్తు మీద భరోసా ఇవన్నీ సంతోషానికి తూకపురాళ్ళుగా ఈ నివేదిక తీసుకుంది. దీనికోసం ప్రపంచ బ్యాంకు సుస్థిరాభివృద్ధి గణాంకాలను వాడుకుంది. మరోవైపు “సంతోషం అంటే జీవితంలోని తృప్తే” అంటుందీ నివేదిక. స్నేహ హస్తమందించడం, కలిసి మెలిసి జీవించడం, స్నేహితులను సమకూర్చుకోడం, ప్రేమగా పలకరించుకోడం, ఇతరుల్ని నమ్మడం, జీవితాన్ని ప్రేమించడం, నిస్పృహకు లోను గాకుండడం, పరస్పరం పంచుకోవడం, ఉమ్మడితనం లాంటివన్నీ సంతోష హేతువులుగా లెక్కిస్తుంది. సామాజిక జీవితానికి పెద్ద పీట వేస్తుంది. శరణార్థుల్ని ఆదుకోమంటుంది. మరీ చిన్న కుటుంబాల్లో సంతోషం వుండదంటుంది. ఇంట్లో నలుగురైదుగురుండే లాటిన్ అమెరికా దేశాల్ని సంతోష ధామాలంటుంది. కోవిడ్ తర్వాత మనుషుల్లో మంచి మార్పు వచ్చిదంటుంది. స్థిమితపడ్డాక మళ్ళీ వెనక్కి పోతున్నామన్న శంకనూ లేవనెత్తుతుంది. ఇలాంటి గీటురాళ్ళ కోసం “గాలప్ వరల్డ్ పోల్” డేటాను ప్రమాణంగా తీసుకుంటుంది.
మన యువత ఒంటరిదై పోవడాన్ని అన్నిటికంటే ప్రధాన సమస్యగా ఈ నివేదిక పేర్కొంటుంది. మన యువకులు స్నేహం చేయడం మరిచిపోతున్నారట. సమాజానికి దూరంగా వుండిపోతున్నారట. వీరిలో నిస్పహ పెరుగుతోందట.వ్యవస్థల పట్ల విశ్వాసం క్రమంగా సడలుతోందట. ఈ ధోరణి అమెరికాలోనూ, దక్షిణ కొరియాలోనూ మరీ తీవ్రంగా వుందట.
ఇంత చెప్పిన “ప్రపంచ సంతోష నివేదిక” సైన్సూ, సంపద వున్నంత మాత్రాన సంతోషంగా వున్నట్టు చెప్పలేమంటోంది. పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా ఎంతో ముందున్న అమెరికా, యూరపు దేశాలు సంతోషపరంగా వెనక్కి వెళుతున్నాయని హెచ్చరిస్తోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయనీ అక్కడి లక్ష మరణాల్లో 23 ఆత్మహత్యలేననీ లెక్కేసి మరీ చెపుతోంది. ఈ దేశాల పురుషుల్లో, మధ్య వయస్కుల్లో నిస్పృహా, అభద్రతా పెరగడం ప్రమాదకరమంటోంది.
ఇక్కడితో ఈ నివేదిక ఆగలేదు. పారిశ్రామిక దేశాల్లో వస్తున్న రాజకీయ మార్పుల్ని, ఓటింగు సరళిని కూడా ఇది సంతోషంతో ముడిబెట్టింది. అక్కడ శరణార్థుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ప్రపంచీకరణ అంటే ఏవగింపు వచ్చేసిందట. ఎన్నికల్లో సంప్రదాయ వ్యవస్థల పట్ల, పార్టీల పట్ల, సిద్ధాంతాల పట్ల నమ్మకం సడలిపోతోందట. కొత్త పార్టీలు వున్నట్టుండి పుట్టుకొస్తున్నాయట. తీవ్రవామపక్షం వైపో, పచ్చి మితవాదం వైపో ఓటర్లు వొరిగిపోతున్నారట. బ్రెక్సిట్, ట్రంప్ విజయం, ఇటీవల జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్, డెన్మార్కు, ఫిన్లాండుల్లో వచ్చిన రాజకీయ మార్పులు ఈ అభద్రత వల్లా, ఈ అపనమ్మకం వల్లా వచ్చినవేనట!
ప్రపంచీకరణ, ఆటోమేషన్, వ్యాపారాల్లో అవినీతి సంప్రదాయ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయట. జీవితంలో తృప్తి లేకపోవడమంటే ప్రజాస్వామ్యంలో నమ్మకం లేకపోవడమేనని ఈ నివేదిక విశ్లేషించడం పెద్ద హెచ్చరిక! ఈ ధోరణి ఒక సంస్కృతిగా మారడంతో ఇచ్చిపుచ్చుకోడాల్లో కూడా అభివృద్ధి చెందిన దేశాలు వెనకబడి పోతున్నాయనడం పెద్ద ప్రమాదసూచిక!
ఈ రిపోర్టు కొన్ని”భయాల్ని” కూడా ముందుకు తెచ్చింది. సంప్రదాయ విలువలు నానాటికి పలచబడిపోవడం, వ్యవస్థల మీద నమ్మకం సడలిపోవడం, ప్రపంచీకరణను జనం ఈసడించుకోవడం, వర్గ పోరాటాలు విస్తరించడం ఇవన్నీ ఈ “భయాల” కిందికి వస్తాయి! రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఇంకా ఈ ధోరణి ఏమిటని ఈ నివేదిక నిర్వేదపడుతుంది! బెర్లిన్ గోడ పతనమయ్యాక కూడా ఇలా జరగడమేమిటని దిగాలుపడిపోతుంది. మరీ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ వాతారణం కనిపించడమా అని హైరానా పడుతుంది.

అదే సమయంలో ఇంకో కోణం నుంచి చూస్తే మానవ చరిత్రలో మనం ఎప్పుడూ ఎరగనంత సంపన్నులం. విద్యావంతులం. ప్రపంచ జ్ఞానం వున్నవాళ్లం. ఏడాదికి 500 డాలర్ల సాయం ఆపన్నులకు అందిస్తున్న వాళ్ళం. ఎంత సంతోషాన్నైనా సంపాదించుకోగల స్తోమత వున్నవాళ్లం. దీన్నీ మరిచిపోరాదంటుందీ నివేదిక. కానీ విచిత్రమేమంటే నలుగురు కూర్చుని భోంచేయడం, పోగొట్టుకున్న పర్సును తిరిగి తెచ్చివ్వడం లాంటి వాటిని కూడా సంతోష సూచికలో చేర్చిన “ప్రపంచ సంతోష నివేదిక” జాతులకు జాతుల్నే నిర్మూలన చేస్తున్న యుద్ధాల గురించి మాట్లాడదు. జాతి విద్వేషాల గురించి ప్రస్తావించదు. అసమానతల్ని పట్టించుకోదు. సకల మానవ విలువల్నీహరిస్తున్న కార్పొరేట్ సంస్కృతిని గురించి పెదవి విప్పదు. నానాటికి హరించకపోతున్న ఉపాధి గురించి నోరెత్తదు. చివరగా చెప్పుకోవలసింది మన దేశం గురించి! భారతదేశం 128వ స్థానం నుంచి 11 స్థానాలు ఎగబాక గల్గిగింది. అయితే ఎంత విశ్వ గురుస్థానంలో వున్నా నేపాల్, పాకిస్తాన్లతో సహా 117 దేశాల కంటే దిగువ స్థానంలోనే వుండిపోయింది! కాకుంటే శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ లు మనకంటే మరీ వెనుకబడి వున్నాయి. దీంతో తృప్తిపడి సరిపెట్టుకుందామా? కొంచెం లోతుగా ఆత్మావలోకనం చేసుకుందామా? కనీసం ఆ నిజాయితీ అయినా మనకుందా? ఇవీ ప్రశ్నలు!