సంపాదకీయం

“ఒక్క మానవజాతిని మాత్రమే గుర్తుంచుకోండి ! మిగిలినవన్నీ మరిచిపోండి” అంటుంది 1955 నాటి రస్సెల్- ఐన్ స్టీన్ మేనిఫెస్టో. విజ్ఞానశాస్త్రం ఊహాతీత హననానికి రాచబాట వేస్తున్నవేళ సూటిగా గుండెలకు గుచ్చుకునే ఈ రెండు మాటలు వాళ్ళు చెప్పి డెబ్బై ఏళ్ళు ముగుస్తున్నాయి.

దాదాపు రెండు లక్షల మందిని క్షణాల్లో భస్మీపటలం చేసిన 1945 నాటి నాగసాకి, హిరోషిమా అణువిధ్వంసాన్ని చూచిన ‘మ్యాన్ హట్టన్’ ప్రాజెక్టు డైరెక్టర్ ఓపెన్ హైమర్ కు భగవద్గీత లోని కోటి సూర్య ప్రభాయమాన విశ్వరూపం, ప్రళయ భీకరమృత్యుహేళ గుర్తుకొస్తాయి. మెదడు మొద్దు వారి పోతుంది. ఇది జరిగి ఎనభై ఏళ్ళు కావస్తున్నాయి.

సరిగ్గా ఇదే సంవత్సరం “మనిషికి మారడమో, మరణమో తప్ప మార్గాంతరం కనబడ్డం లేదని” హైడ్రోజన్ బాంబుల పోటీపై ఆవడి కాంగ్రెస్ ప్లీనరీలో జవహర్లాల్ నెహ్రూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇది ప్రపంచశాంతికే గాదు మానవాళి మనుగడకే ముప్పుగా మారిందంటాడు. రస్సెల్ – ఐన్ స్టీన్ ల మేనిఫెస్టోని గుర్తుకు తెస్తాడు. దీనికీ ఎనభై ఏళ్ళు నిండుతున్నాయి.

ఇప్పుడు మనకు రస్సెల్ లు లేరు. ఐన్ స్టీన్ లు లేరు. నెహ్రూలూ లేరు. ఉన్నదల్లా భూగోళం తమ కనుసన్నల్లోనే పరిభ్రమించాలనే అధికార బధిరాంధాహంకారులూ, ప్రపంచం పుట్టింది తన లాభాల కోసమేననుకునే అంతర్జాతీయ బేహార్లూ, విద్వేషమే మానవ స్వభావమని నిర్వచించే జాత్యున్మాదులూ మాత్రమే .

క్రమంగా మానవత్వం పట్ల, మానవ మనుగడ పట్ల నమ్మకాన్నే మనం కోల్పోతున్నాం. ఇప్పుడు మనకు భవిష్యత్తు గురించి ఆశలు లేవు, భయాలు కూడా లేవు. ఉన్నదంతా విషాద బీభత్స వర్తమానం మాత్రమే. అనంత శూన్యత్వం మాత్రమే! “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” అన్న కవి వాక్యం మాత్రమే.

సర్వనాశనం జరిగాక తాపీగా కుదిరిన పాలస్తీనా ఒప్పందాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? దేశానికి దేశమే శిథిలాల మధ్య జీవచ్ఛవంగా మారాక ఉక్రేయిన్ పాఠాలు చెప్పే “కొత్త శాంతి దూతలు” తీరిగ్గా పుట్టుక రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సిరియా అంతర్యుద్ధం వున్నటుండి తెల్లారేప్పటికల్లా ఎలా ముగిసిపోయింది?

ఇదంతా చూస్తే అసలేం జరుగుతుందో మనకర్థం కాదు. ఎవరు ముద్దాయిలో, ఎవరు న్యాయమూర్తులో మనకేమీ అంతు పట్టదు. తెర వెనుక ఏం జరుగుతుందో మనకు బోధపడదు. అంతా భ్రాంతిగా, బ్రహ్మపదార్థంగా మాత్రమే కనిపిస్తుంది.  జరిగేది చూస్తుండడమే మన పని అన్పిస్తుంది.

ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలల్లా రస్సెల్, ఐన్ స్టీన్ లకూ, నెహ్రూలకూ కాలం చెల్లిందా అని. ఇంత నాగరికతా, ఇంత విజ్ఞానం మనల్ని ఈ ఎడారిలోకి తీసుకొచ్చి వదిలేసాయా అని. వర్తమాన చరిత్ర ఇంత నిస్సారమా అని.

కానీ ఎక్కడో గుండె పొరల్లో ఒక మూల నుంచి “అదేం కాదు” అని సన్నగానే అయినా ఒక్కోసారి వినిపిస్తుంటది. అదే మానవాళి అసలు సిసలు జీవధర్మం కాబోలు! అదే భవిష్యత్తుకు అంతిమ నిర్ణాయకం కూడా కాబోలు!!

One thought on “ఇప్పుడు మనకు ఐన్ స్టీన్లు లేరు, నెహ్రూలూ లేరు!

  1. A moving editorial.yes a ray of hope is remaining in this darkness.Long live the spirit of love and delighted human thinking,to be spread by us,volunteers of JVV…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *